Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

కష్టకాలంలో అస్త్రసన్యాసమా?

* రాహుల్‌ నేర్వాల్సిన రాజకీయ పాఠాలు

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై కకావికలైన కాంగ్రెస్‌ పార్టీకి ‘నేనున్నాను’ అని భరోసా ఇవ్వాల్సిన రాహుల్‌ గాంధీ, ఎవరికీ చెప్పాపెట్టకుండా విదేశాలకు ఉడాయించడం పార్టీ శ్రేణులను నిర్ఘాంతపరచింది. కాంగ్రెస్‌కు ఆపత్కాలంలో కొండంత అండగా నిలవాల్సిన రాహుల్‌ నాయకత్వ కాడి కిందపడేయడం బాధ్యతారాహిత్యం కాక మరేమిటి? కష్టాలు ఎదురైనప్పుడు చెక్కుచెదరని మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని తనను నమ్ముకున్నవారికి దిశానిర్దేశం చేయడం నాయకుడికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం. కానీ, నెహ్రూ-గాంధీ నామధారి ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన ఈ లక్షణాన్ని ఇంతవరకు ప్రదర్శించలేకపోయారు. అసలు క్రియాశీల రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ మొదటి నుంచీ ముళ్లకంప మీద కూర్చున్నట్లే ప్రవర్తించేవారు. పార్టీ నాయకత్వ భారాన్ని తాను మోయలేనన్నట్లే వ్యవహరించేవారు. ఎప్పుడు ఈ ముళ్ల కిరీటాన్ని వదిలించుకుందామా అన్నట్లు ఉండేది ఆయన వాలకం. ఓటమిలోనూ చెక్కుచెదరకుండా, ఎంత కాలమైనా సరే కష్టనష్టాలను ఓర్చుకుంటూ వాటిని ఎదిరిస్తూ దీర్ఘకాల పోరాటం చేయగలవారు మాత్రమే రాజకీయాల్లో నిలబడి రాణించగలుగుతారు. ఈ గుణం రాహుల్‌లో ఇంతవరకు కనిపించలేదు. పార్లమెంటుకు, పార్టీ వ్యవహారాలకు పదేపదే గైర్హాజరు కావడం, విదేశాలకు గుట్టుగా విహార యాత్రలు జరపడం, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గంభీరంగా నిర్వహించకపోవడం ఆయన నైజమైపోయింది. ఇదంతా చూశాక కార్యకర్తల్లో, నాయకుల్లో రాహుల్‌ మీద ఏమాత్రం నమ్మకం కలగడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా, రాజకీయ నాయకుడిగా పూర్తికాలం పనిచేయాల్సిందిపోయి, అరకొరగా, అర్ధ మనస్కంగా, పరిమిత కాల నాయకుడిగా వ్యవహరిస్తే ఎలా రాణించగలరు?

సమాధానం లేని ప్రశ్నలు
ఇందిర వంశాంకురానికి ఇవేమీ పట్టవు. రాహుల్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారా లేక వైదొలగుతారా అనే ప్రశ్నలు వెల్లువెత్తి, వాటికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ సతమతమవుతున్న సమయంలో ఆయన ఎంచక్కా విమానమెక్కి విదేశాలకు పయనమవడం ఏమైనా బాగుందా? దీన్ని అహంకారమనాలా, నిర్లక్ష్యమనాలా? ఇప్పుడూ ఎప్పుడూ రాహుల్‌ గాంధీయే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడని అధికార ప్రతినిధులు చెప్పుకొస్తున్నా, ఆ ముక్క రాహుల్‌ నోటి నుంచే వినాలని జనం ఆశిస్తున్నారు. ఆయన ఇలా డోలాయమాన స్థితిలో ఉండటం చూసి పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు వేరే దారి చూసుకోవడంలో ఆశ్చర్యమేముంది? మునిగిపోతున్న నౌక నుంచి ఎలుకలు బిరబిర బయటికొచ్చేసే దృశ్యం గుర్తుకొస్తే తప్పు లేదు.

నాయకుడిగా ఉండాలో వద్దో రాహుల్‌ తేల్చుకునేలోపు పార్టీలో కుమ్ములాటలు శ్రుతిమించుతున్నాయి. కాంగ్రెస్‌లో కాకలు తీరిన నాయకులు సైతం రాహుల్‌, ప్రియాంక గాంధీల దర్శన భాగ్యం కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటిది పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ మీద తిరుగుబాటు బావుటా ఎగరేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు తక్షణం దర్శనమిచ్చి ఫొటో దిగడం విడ్డూరం. తద్వారా జనంలో నిజంగా పట్టు ఉన్న ఏకైక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ మీద మరింత జోరుగా విమర్శనాస్త్రాలు సంధించడానికి సిద్దూకు తామే అవకాశమిచ్చారు. రాజస్థాన్‌లో నాయకత్వ వ్యవహారాన్ని నానబెట్టడం వల్ల సచిన్‌ పైలట్‌, అశోక్‌ గెహ్లాత్‌లు ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణం ఎప్పుడు కూలుతుందో తెలియదు. అయినా రాహుల్‌ జాడ లేదు. ఏదిఏమైనా తన తదుపరి కార్యాచరణను వెల్లడించడానికి రాహుల్‌ నెల రోజుల వ్యవధి అడిగినందువల్ల, ఈ నెల 23 వరకు వేచి ఉండకతప్పదు. కనీసం అప్పటికైనా స్పష్టత ఇస్తారని ఆశిద్దాం. కాంగ్రెస్‌ గద్దెను వదులుకోవడానికి సోనియా, ప్రియాంకలు సిద్ధంగా లేరని అందరికీ తెలుసు. రాహుల్‌ గాంధీ దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి జవజీవాలు తీసుకురావాలంటే తాను తప్పుకుని వేరేవారికి నాయకత్వ బాధ్యత అప్పగించాలని రాహుల్‌ తలపోస్తూ ఉంటే, తక్షణం ఆ పని చేయాలి. ఆ తెగువ ప్రదర్శించాలి. పంచాయతీ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో సరికొత్త నాయకత్వ శ్రేణులను ఎదగనివ్వాలి. దారీ తెన్నూ తెలియకుండా కొట్టుకుపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహం, కొత్త నాయకత్వం మాత్రమే కాంగ్రెస్‌ను పునరుత్తేజితం చేయగలవు. లేదంటే మోదీ-అమిత్‌ షా ద్వయం ముందు నిలవడం కష్టం. కాంగ్రెస్‌ పునరుత్థానానికి శ్రేయోభిలాషులు చాలానే సూచనలు చేశారు. వాటిలో ఆచరణీయమైనది ఒకటుంది. దాని ప్రకారం కాంగ్రెస్‌ నుంచి వేరుపడి సొంత కుంపట్లు పెట్టుకున్నవారిని మళ్ళీ పార్టీ ఛత్రం కిందకు తీసుకురావాలి. ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు చిత్తుగా ఓడిపోయిన తరవాత రాహుల్‌, శరద్‌ పవార్‌ను కలిసి ఐక్యతా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆ తరవాత రెండు పార్టీలూ కలిసి నిర్దిష్టంగా ముందడుగు వేయలేకపోయాయి. మహారాష్ట్రలో పవార్‌ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చిన బలమైన నాయకులు మరికొందరు ఉండవచ్చు. వారందరినీ కలుపుకొని వెళ్లాలి. ఇక్కడ పశ్చిమ్‌ బంగ అధినేత మమతా బెనర్జీ గురించి చెప్పుకోవాలి. కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చాక ఒంటి చేత్తో ఎన్నికల్లో గెలిచే సత్తా తనకుందని నిరూపించుకున్న నాయకురాలు ఆమె.

భేషజాలకు సమయం కాదు
నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. కాషాయ సేనను ఎదుర్కోవడానికి పశ్చిమ్‌ బంగలో మమత, మహారాష్ట్రలో శరద్‌ పవార్‌, కర్ణాటకలో దేవెగౌడ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు హోరాహోరీ పోరు జరపక తప్పదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గిపోయిన దృష్ట్యా ఈ నాయకులందరూ ఒకే వేదిక మీదకు వచ్చి పోరాటం జరపడం అనివార్యమవుతుంది. వారితో చేతులు కలపడం వినా కాంగ్రెస్‌కు గత్యంతరం లేకపోవచ్చు. అందరి మనుగడ ప్రమాదంలో పడినప్పుడు ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అనే భేషజాలకు పోతే లాభం లేదు. వీరంతా ఎన్నికల కోసం మాత్రమే చేతులు కలపడం కాకుండా రాబోయే అయిదేళ్లూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై ఉద్యమించి, వారి ఆదరణ చూరగొనాలి.

ప్రస్తుత సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వమే ఐక్యత కోసం చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్‌కు క్షీణదశ సంప్రాప్తించిందని గ్రహించి, వెంటనే మేల్కొని పార్టీకి కొత్త జవసత్వాలు సంతరింపజేయడానికి పట్టుదలగా కృషి చేయాలి. అలా చేయని రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాలు అనేకం కుప్పకూలిన అధ్యాయాలు చరిత్రలో చాలా ఉన్నాయి. నెహ్రూ-గాంధీ వంశనామం విజయ సాధక బ్రాండ్‌గా తనకున్న ఖ్యాతిని కోల్పోయింది. ఇక్కడ డాల్డా అనే బ్రాండ్‌ గురించి చెప్పుకోవాలి. హిందుస్థాన్‌ లీవర్‌ సంస్థ తయారుచేసిన ఈ వనస్పతి ఒకప్పుడు అత్యధికంగా విక్రయమయ్యేది. తరవాత కొత్త కొత్త వంట నూనెలు వచ్చాక డాల్డా కనుమరుగైపోయింది. కాబట్టి కాలానుగుణంగా మారకపోతే అంతరించిపోతామని కాంగ్రెస్‌ గ్రహించి, తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి!

Posted on 17.06.2019