Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

కాలానుగుణంగా మారక...

* వామపక్షాలు - వైఫల్యాలు

దేశంలో కమ్యూనిస్టు పార్టీల పతనం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణ ఓటమి గురించే సర్వత్రా చర్చ జరిగిందిగాని- ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎదురైన దారుణ ఫలితాలపై ఎక్కడా పెద్దగా విశ్లేషణలు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. స్వాతంత్య్రానంతర తొలినాళ్లలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలోనే అస్తిత్వం చాటుకోగలిగింది. 1951-52లో జరిగిన మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ- 1962నాటికి సుమారు తొమ్మిది శాతం ఓట్లతో 29 స్థానాలు సొంతం చేసుకొంది. కమ్యూనిస్టులు రెండుగా విడిపోయిన తరవాత సీపీఐ, సీపీఐ(ఎం)లు 42 స్థానాల్లో విజయబావుటా ఎగరవేసినా- ఓట్లపరంగా అవి మొత్తంగా తొమ్మిది శాతం దగ్గరే ఆగిపోవడం గమనార్హం. ఆ తరవాత మూడు దశాబ్దాలపాటు అదే ధోరణి కొనసాగింది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇరు పార్టీలు గతంలో ఎన్నడూలేని స్థాయిలో 54 లోక్‌సభ స్థానాల్లో పాగా వేయగలిగాయి. ఓట్ల పరంగా మాత్రం ఏడు శాతానికే పరిమితం కావడం గమనించాల్సిన విషయం. ఆ తరవాత పరిస్థితి మరింత దిగజారింది. 2014లో ఇరు పార్టీలూ పదిసీట్లు మాత్రమే గెలుచుకొని- జాతీయ స్థాయిలో నాలుగుశాతం ఓట్లకు పడిపోయాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వాటి పరిస్థితి ఇంకా క్షీణించింది. దేశవ్యాప్తంగా కేవలం అయిదు స్థానాలకు పరిమితమైన వామపక్షాలు, మొత్తంగా రెండు శాతం ఓట్లకు పరిమితమయ్యాయి. వామపక్షాల బలం కోసుకుపోవడానికి ప్రధానంగా పశ్చిమ్‌ బంగ, త్రిపురల్లో వాటి అస్తిత్వం కరిగిపోవడమే కారణం. కేరళలో కమ్యూనిస్టుల అస్తిత్వం తడవకో రకంగా మారుతోంది. పశ్చిమ్‌ బంగలో 2004 లోక్‌సభ ఎన్నికల్లో 32 సీట్లు 50 శాతం ఓట్లుగా ఉన్న వామపక్షాల శక్తి- తాజా ఎన్నికల్లో 6.28 ఓట్లు సున్నా సీట్లకు దిగజారింది.

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులతో సహా అనేక రాజకీయ పార్టీలు తమను తాము పునరావిష్కరించుకొని ప్రజాక్షేత్రంలో బలం చాటుతున్నాయి. భారత్‌లో వామపక్షాల పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది. దశాబ్దాలనాటి సూత్రాలను, నినాదాలనే పట్టుకు వేలాడుతూ; పరిస్థితులకు అనుగుణంగా తమను తాము నవీకరించుకోకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీలకు ప్రాధాన్యం తగ్గుతోంది. విపణి శక్తులు పుంజాలు తెంచుకున్న గుర్రాల్లా దౌడుతీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఇంకా పాత నినాదాలు, సూత్రావళికే కట్టుబాటు చాటుతూ వామపక్షాలు ముందుకు సాగడం ఎంతకూ అంతుపట్టని విధానం. ప్రధాన్‌ మంత్రి ముద్ర యోజన, ప్రధాన్‌ మంత్రి ఉజ్జ్వల యోజన, జన్‌ ధన్‌ యోజన, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి కార్యక్రమాలవల్ల దేశంలో పేదలకు నేరుగా ఫలాలు అందుతున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మేలు చేకూరుస్తున్న ఈ పథకాలను గుర్తించడానికే ఆయా పార్టీలు నిరాకరించడం అతిపెద్ద సమస్య. పేద వర్గాల్లోని వ్యాపార దృక్పథాన్ని, ఔత్సాహికతను వెలికితీసి సామాజికంగా, ఆర్థికంగా వారి జీవన గతిని మార్చేందుకు ఉద్దేశించిన సృజనాత్మక కార్యక్రమం ముద్ర యోజన. పెట్టుబడి సాయంకోసం అంగలార్చే పేద వర్గాలకు యాభై వేలనుంచి పదిలక్షల రూపాయల దాకా రుణం సమకూర్చి- ఆధునిక వ్యాపారవేత్తలుగా ఎదిగే క్రమంలో వారికి దన్నుగా నిలవడమన్నది విశిష్టమైన కార్యక్రమం. ముద్ర యోజన ద్వారా ఏదో ఒక స్థాయిలో ప్రయోజనం పొందినవారు దేశవ్యాప్తంగా అడుగడుగునా కనిపిస్తారు. దారిద్య్రరేఖ దిగువన జీవిస్తున్న అనేకమందిలో ఈ కార్యక్రమం గుణాత్మక మార్పు తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారిలో 70శాతం మహిళలే ఉండటం గమనించాల్సిన మరో కీలకాంశం. ముద్ర యోజన కింద రూ.7.23 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఈ ఏడాది మొదట్లో ప్రభుత్వం ప్రకటించింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్‌ను సరఫరా చేసే మరో విశిష్ట కార్యక్రమం ఉజ్జ్వల యోజన. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ ఏడు కోట్ల కుటుంబాలు లబ్ధి పొందినట్లు అంచనా. దేశవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమమూ గణనీయమైన ఫలితాలు ఇచ్చింది. ఈ పథకాల్లో కొన్నింటిని అంతకుముందున్న ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ- వాటి అమలు మోదీ జమానాలో వేగం సంతరించుకొన్న మాట వాస్తవం.

దేశంలోని మహిళలు, పిల్లల జీవన భద్రత, నాణ్యతకు భరోసా పలికి వారి గౌరవాన్ని ఇనుమడింపజేసిన కార్యక్రమాలివి. పేదలపాలిట పెన్నిధులైన ఈ తరహా కార్యక్రమాలను నిజానికి కమ్యూనిస్టులు స్వాగతించి, వాటి అమలుకు సహకారం అందించాలి. కానీ ఈ పథకాలపై వారు విమర్శలు ఎక్కుపెట్టడమే బాధాకరం. వామపక్షాల వైఖరి సరైనదా కాదా అన్నదానికి ఎన్నికల ఫలితాలే ప్రాతిపదిక. లౌకికవాదానికి సంబంధించి వామపక్షాల దృక్పథమూ క్రమంగా మారుతోంది. రాజీవ్‌ జమానాలో షాబానో కేసులో ముస్లిం మహిళల సాధికారతకోసం గట్టిగా నిలబడి, వారి తరఫున గళం విప్పిన వామపక్షాలు, ఇప్పుడు కనిపించడం లేదు. హిందూ వ్యతిరేకతే లౌకికవాదంగా పరిగణిస్తున్న పరిస్థితుల్లో ఆ పార్టీలు ఉన్నాయనిపిస్తోంది. ఇదే వైఖరిని కొనసాగిస్తే మున్ముందు ఆ పార్టీల బలం మరింత కొడిగట్టే అవకాశాలు కొట్టిపారేయలేనివి!

- ఎ.సూర్యప్రకాశ్‌
(రచయిత- ప్రసార భారతి ఛైర్మన్‌)
Posted on 20.06.2019