Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

పాక్‌ కపట నాటకం

* ఆఫ్గాన్‌లో నాడు చిచ్చుపెట్టి నేడు శాంతి వ‌చ‌నాలు

అఫ్గానిస్థాన్‌ విషయంలో పాకిస్ధాన్‌ సరికొత్త నాటకానికి తెరతీసింది. ఇప్పటివరకు ఈ సరిహద్దు దేశంలో తాలిబన్ల రూపంలో చిచ్చు పెట్టిన ఇస్లామాబాద్‌ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతోంది. అఫ్గాన్‌ అభివృద్ధే ధ్యేయమని, అక్కడ శాంతి, సుస్థిరత నెలకొనాలన్నదే లక్ష్యమని గంభీర వచనాలు వల్లె వేస్తోంది. తాజాగా ‘లాహార్‌ ప్రక్రియ’ పేరుతో ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ‘భూర్బన్‌’ పట్టణంలో జరిగిన ఈ సదస్సులో అఫ్గాన్‌కు చెందిన 57 మంది నాయకులు పాల్గొన్నారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న ఆ దేశంలో శాంతిస్థాపనే సదస్సు ఉద్దేశమని పైకి అదేపనిగా పాక్‌ నమ్మబలుకుతోంది. కానీ, అసలు ఉద్దేశం మాత్రం వేరే ఉంది. అఫ్గానిస్థాన్‌లో భారత్‌ పాత్రను, ప్రభావాన్ని పరిమితం చేయడం, లేదా పూర్తిగా తగ్గించడం దాని లక్ష్యమన్న అభిప్రాయం దౌత్యవర్గాల్లో ఉంది.

‘భూర్బన్‌’ సదస్సులో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ అఫ్గాన్‌ పట్ల ఎక్కడ లేని ప్రేమను ఒలకబోశారు. ఆ దేశ సమైక్యత, సమగ్రత, శాంతి, సుస్థిరతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. రెండు దేశాల మధ్య అపోహలు, అప నమ్మకాలు తొలగించడమే సదస్సు లక్ష్యమని ఉద్ఘాటించారు. ఖురేషీ వ్యాఖ్యల్లో నిజాయతీ లోపించిందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నిజానికి అఫ్గాన్‌పై అంత అభిమానం, ప్రేమ ఉన్నట్లయితే పాకిస్థాన్‌ ప్రధాని కానీ, కీలకమంత్రులు కానీ సదస్సుకు హాజరయ్యేవారు. వారెవరూ సదస్సు వైపు కన్నెత్తి చూడలేదు. అఫ్గాన్‌ నుంచి సదస్సుకు హాజరైన వారిలో మాజీ ప్రధాని గుల్‌బుద్దీన్‌ హెక్మత్యార్‌, అఫ్గాన్‌ ఉన్నతస్థాయి శాంతి మండలి అధ్యక్షుడు కరీం ఖలిలి, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలని భావిస్తున్న హనీఫ్‌ అత్మర్‌ తప్ప ముఖ్య నాయకులు లేరు. హనీఫ్‌ జాతీయ భద్రతా మాజీ సలహాదారుగా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ను ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. గుల్‌బుద్దీన్‌ హెక్మత్యార్‌కు పాక్‌ అనుకూలవాదిగా పేరుంది. కీలకమైన తాలిబన్ల ప్రతినిధులను ఆహ్వానించకపోవడం గమనార్హం. అఫ్గాన్‌ వ్యవహారాలన్నీ తాలిబన్ల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాంటప్పుడు వారు లేకుండా జరిగిన సదస్సుకు ఏపాటి ప్రాధాన్యం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అఫ్గానిస్థాన్‌లో అంతర్యుద్ధం ఆరంభం అయినప్పటి నుంచి ఆ దేశం పట్ల పాకిస్థాన్‌ కపట నాటకాన్నే ప్రదర్శిస్తోంది. తాలిబన్ల రూపంలో అక్కడ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. పైకి శాంతి వచనాలు వల్లిస్తూనే తెరవెనక చేయాల్సినదంతా చేస్తూనే ఉంది. 2015 ఆగస్టులో జరిగిన దాడులకు పాకిస్థానే కారణమని అప్పట్లో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఆరోపించారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ కవల పిల్లలని అభివర్ణించిన మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ సైతం దాడులకు పాక్‌ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌) కారణమని ధ్వజమెత్తారు. పాక్‌ ప్రభుత్వ మద్దతు లేకుండా తాలిబన్లు నెలరోజులు కూడా మనగడ సాగించలేరని ఆయన తరచూ చెప్పేవారు. తాలిబన్ల అరాచకాలకు అంతేలేదు. 2016లో ఏకంగా పార్లమెంట్‌ భవనంపైనే రాకెట్లతో దాడులు చేశారు. 2017 సెప్టెంబరులో కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై విధ్వంసానికి తెగబడ్డారు. కాబూల్‌ నుంచి న్యూదిల్లీకి వెళుతున్న విమానంపై రాకెట్లతో విధ్వంసానికి దిగారు. అప్పటి అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ ఎన్‌ మ్యాటిస్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ తాలిబన్ల ఆధీనంలో ఉన్నాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో తలదాచుకుంటూ వారు దాడులకు తెగబడుతున్నారు.

అఫ్గానిస్థాన్‌- పాకిస్థాన్‌ మధ్య సుమారు 2,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీనినే డ్యూరండ్‌ రేఖ అని వ్యవహరిస్తారు. సరిహద్దులో దాదాపు 900 కిలోమీటర్ల మేర కంచె నిర్మించారు. వాస్తవానికి అఫ్గాన్‌-పాక్‌ మధ్య ప్రత్యేక వైరం అంటూ ఏమీ లేదు. ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వేషభాషల్లో సారూప్యత ఉంది. కానీ అఫ్గాన్‌ వ్యవహారాల్లో భారత్‌ పాత్ర దానికి రుచించడం లేదు. ముఖ్యంగా ఆ దేశ పునర్మిర్మాణంలో న్యూదిల్లీ క్రియాశీలకంగా వ్యవహరించడం మింగుడు పడటం లేదు. అఫ్గాన్‌ నేతలు సైతం పొరుగున్న ఉన్న తనను కాదని భారత నాయకులతో సాన్నిహిత్యం కలిగి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అఫ్గాన్‌ శాంతి చర్చల్లో భారత్‌ భాగస్వామ్యం ఉండాలన్న అమెరికా సూచన పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. పునర్నిర్మాణం పేరుతో అఫ్గాన్‌పై భారత్‌ పట్టు సాధిస్తోందని, ప్రాబల్యం కోసం పాకులాడుతోందని అదేపనిగా అనుమానించడం ఇస్లామాబాద్‌కు అలవాటుగా మారింది. భారతీయ దౌత్య కార్యాలయం, కాన్సులేట్‌ కార్యాలయాలపై దాడులకు తెగబడుతోంది. జలాలాబాద్‌, కాందహార్‌, మజారే-ఈ-షరీఫ్‌, హీరత్‌లో భారత కాన్సులేట్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ముఖ్యంగా పాక్‌ సరిహద్దుల్లోని జలాలాబాద్‌, కాందహార్‌ కార్యాలయాలపై తాలిబన్లు పలుమార్లు దాడులకు తెగబడ్డారు. జలాలాబాద్‌ కార్యాలయంపై 2007, 2013, 2015, 2016ల్లో దాడులకు తెగబడ్డారు. 2009లో కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయంపైనా దాడికి దిగారు. భారత్‌ సంస్థలు చేపడుతున్న పునర్నిర్మాణ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారు. పాక్‌ దన్నుతోనే వారు ఈ ఆగడాలకు పాల్పడుతున్నారన్నది వాస్తవం. పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతం తాలిబన్లకు స్వర్గధామం వంటిది. అక్కడ వారు స్వేచ్ఛగా సంచరిస్తుంటారు. వారిని అడ్డుకునేవారే ఉండరు.

అఫ్గానిస్థాన్‌కు సంబంధించి భారత్‌ పాత్రపై పాకిస్థాన్‌కు అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఇక్కడ భారత్‌ ప్రాబల్యం, పట్టు సాధించడం తనకు ఇబ్బందికరమన్నది ఇస్లామాబాద్‌ అభిప్రాయం. కానీ, ఇవి వాస్తవాలు కావు. అంతర్యుద్ధంతో దెబ్బతిన్న మిత్రదేశానికి ఇతోధిక సాయం అందించడమే భారత్‌ లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఆ ఉద్దేశంతోనే ఆ దేశానికి సకల హంగులతో పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. పశ్చిమ అఫ్గాన్‌లోని హేరత్‌ ప్రావిన్స్‌లో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టును 2016 జూన్‌లో మోదీ జాతికి అంకితం చేశారు. ఇంకా రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక రంగాల్లో అనేక పనులను చేపట్టింది. అఫ్గాన్‌లో ఉగ్రవాదానికి ఊతమివ్వడం మాని, పునర్నిర్మాణానికి చేతనైన సాయం చేయడం ద్వారా మాత్రమే కాబూల్‌కు ఇస్లామాబాద్‌ దగ్గర కాగలదు. అంతేతప్ప సదస్సులు, ప్రకటనలు, ప్రసంగాలతో అఫ్గాన్‌ ప్రజలకు చేరువ కాలేదు!

 

- గోపరాజు మల్లపరాజు
Posted on 29.06.2019