Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

అవినీతి అడుసులో జుగల్బందీ

‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన లోకమాన్య తిలక్‌- తెల్లదొరతనం శృంఖలాలు తెగిపడి స్వాతంత్య్రం సిద్ధిస్తే సురాజ్యం సంస్థాపనకు బాటలుపడతాయని బలంగా విశ్వసించారు. దేశానికి స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు దాటిపోయినా, దోపిడి పీడనలకు తావులేని సురాజ్యం కోసం నూటముప్ఫై కోట్ల మందికిపైగా భారతీయులు చకోరాలై ఎదురుచూడాల్సి వస్తోందిప్పుడు! తన ఆశీస్సుల కోసం వచ్చిన బెంగాల్‌ మంత్రులకు- ‘సేవాపరాయణులై నిజాయతీగా పౌరులపట్ల ధర్మం నిర్వర్తించడమే మీ కర్తవ్య’మని ఏడు దశాబ్దాల క్రితం మహాత్మాగాంధీ దిశానిర్దేశం చేశారు. జాతిపిత మాటకు ఏపాటి మన్నన దక్కుతుందో పశ్చిమ్‌బంగ పరిణామాలే తాజా రుజువులవుతున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య బిగిసిన అక్రమ బాంధవ్యం- ‘కట్‌మనీ’ దురాగతంగా వ్యవస్థీకృతమైన వైనం నిశ్చేష్టపరుస్తోంది. ఆ విధంబెట్టిదనిన...

ప్రభుత్వోద్యోగి ఎవరైనా లంచాలు మరిగి అక్రమ సంపాదనకు తెగబడటం చట్టరీత్యా నేరం. అధికార వర్గాల ఇష్టారాజ్యాన్ని అదుపు చేసి సంక్షేమ పథకాల తాలూకు ప్రయోజనాల్ని అసలైన లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు చొరవ చూపడం ప్రజాప్రతినిధుల విహిత కర్తవ్యం. ఈ రాజకీయ నేతలు, ఆ అధికార శ్రేణులు ‘నీకిది నాకది’ చందంగా అవినీతి అడుసులో ఈదులాడుతూ లబ్ధిదారుల నోటి దగ్గర ముద్దను గద్దల్లా లాగేసుకొంటుంటే- దాన్నేమనాలి? ఆ చీకటి వ్యవహారానికి ముద్దుపేరే ‘కట్‌మనీ’! పేద ప్రజల జీవన ప్రమాణాల్ని, పోషకాహార స్థాయుల్ని మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత అని రాజ్యాంగంలోని 47వ అధికరణ స్పష్టీకరించింది. కూడు, గూడు, గుడ్డ వంటి కనీసావసరాలకూ నోచని కోట్లాది బడుగు జీవులతో లుకలుకలాడే భాగ్యాన్ని భారతావనికి కల్పించిన ఏడు దశాబ్దాల రాక్షస గణతంత్ర పాలన మనది. మాకిది కావాలని నోరెత్తి అడగలేకపోతేనేం- బడుగు జనం చూపుడు వేళ్లపై సిరా చుక్కకు నేతల తలరాతల్ని తిరగరాసే అమేయశక్తి ఉంది. అందుకే కేంద్ర స్థాయిలోను, రాష్ట్రాలపరంగానూ ఏటా కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాల హోరు మిన్నంటుతుంది. ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలో అర్హులుగా వాళ్లను చేర్చాలన్నా, ఇళ్లనో, తోపుడు బళ్లనో కేటాయించాలన్నా పాతిక శాతం కమిషన్‌ కక్కితీరాలంటోంది కట్‌మనీ! ఆ దారుణాన్ని మరే మాత్రం సహించేది లేదన్న మమతా దీదీ హెచ్చరిక పశ్చిమ్‌ బంగలో రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తోంది.

పార్టీ శ్రేణుల భేటీలో పది రోజుల క్రితం మమత అక్షరాలా బాంబు పేల్చారు. మొన్నటి ఎన్నికల్లో ఎకాయెకి 18 సీట్లను భాజపాకు కోల్పోవడం, జూనియర్‌ వైద్యుల సమ్మెతో తల తిరిగి ముద్ద నోట్లోకి రావడంతో- తన పట్టునుంచి రాష్ట్రం చేజారకుండా కాచుకొనేందుకు, పాలక పక్షీయులకు ఏ మాత్రం రుచించని వ్యాఖ్యలు చేశారు. ‘లబ్ధిదారుల నుంచి కమిషన్లు తీసుకొని ఉంటే తిరిగి ఇచ్చేయండి... నేను చర్యలు తీసుకోవడం మొదలుపెడితే మీరు పార్టీ మారక తప్పదు’ అని దీదీ గర్జించారు. ఇప్పటికే తృణమూల్‌ను వదిలి భాజపా తీర్థం పుచ్చుకొన్న నేతల్ని అవినీతిపరులుగా తూలనాడిన మమత అక్షరాలా అధికార పార్టీ నేతలకు ముందు నుయ్యి- వెనక గొయ్యి లాంటి పరీక్ష పెట్టారు. అంతకుమించి ‘కట్‌మనీ’ నేరాల్ని భారత శిక్షాస్మృతిలోని 409 విభాగం కింద విచారించి దోషులకు జీవితఖైదు లేదా పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలనీ ప్రతిపాదించారు. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో- బీర్‌భుమ్‌ జిల్లాకు చెందిన ఓ చిన్నస్థాయి ‘పెద్ద మనిషి’, ఉపాధిహామీ పథకం కింద లబ్ధి చేకూరుస్తానంటూ వసూలు చేసిన మొత్తాన్ని 141 మందికి తిరిగి ఇచ్చేశాడు. ఇంకేముంది? తమకు రావాల్సిన మొత్తంలో పాతిక శాతం మొత్తాన్ని ‘కట్‌మనీ’గా సమర్పించుకొన్న చిరు లబ్ధిదారులంతా ఎక్కడికక్కడ నేతాగణాల్ని నిలదీయడం మొదలుపెట్టారు. పార్టీ పేర్లు లేకుండా పలుచోట్ల ప్రజల పక్షాన వెలుస్తున్న పోస్టర్లు ప్రజాప్రతినిధులకు కంటి మీద కునుకు రానీయడం లేదు. కంటికి కనిపించే వసూల్‌రాజా ఒక్కడే అయినా, తెరచాటు అవినీతి బంతిలో ఎవరికి వారుగా తమ వాటా మెక్కిన వాళ్ల చిట్టా చాలా పెద్దదని, అదే గొలుసుకట్టు వరసలో డబ్బులు తిరిగి వస్తేనే స్థానిక నేతలు తిరిగి చెల్లించడం వీలవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అవినీతి అష్టపాది ఏటికేడు మరింత బలిష్ఠంగా ఎదిగి మొత్తం వ్యవస్థనే గుల్లబార్చేస్తోంది.

అన్ని రకాల అవినీతికీ తల్లివేరు రాజకీయ అవినీతి. రాజకీయాల్లో మునిగి తేలుతున్నవారు నీతి నిజాయతీ నిరూపించుకోవాలంటూ ఎదిరి పక్షాన్ని నిగ్గదీయవచ్చుగాని, ఆ నిప్పుతో తమ కొప్పు కాల్చుకోవడం తగదన్నది నయా రాజనీతి. తానే పెట్టిన అగ్ని పరీక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతాగణాల్ని కకావికలం చేస్తోందని తెలియగానే మమత మాట మార్చారు. 99.99 శాతం పార్టీ నేతలు నీతిమంతులేనని తేల్చేశారు. ‘కట్‌మనీ’ సొమ్ముకోసం గ్రామాల్లో ప్రజాందోళనలు పెరుగుతున్నాయన్న పోలీసు వర్గాల హెచ్చరికల నేపథ్యంలో- తనవంతుగా ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు మమత నానాపాట్లు పడుతున్నారు. ఈ ‘కట్‌మనీ’ జాడ్యం ఒక్క బెంగాల్‌కే పరిమితమా? ‘నీకిది- నాకది’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికార గణాల జుగల్బందీ- దేశ ప్రజానీకాన్ని ఎంతగా దోచుకుతింటోందో లెక్కాపత్రం ఏదైనా ఉందా? 1980-2010 మధ్యకాలంలో భారతీయులు విదేశాలకు తరలించిన నల్లధనం 15,12,000-34,30,000 కోట్ల రూపాయల దాకా ఉండి ఉంటుందని పార్లమెంటరీ స్థాయీసంఘం మొన్నీమధ్య నిగ్గుతేల్చింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ నిరుడు అక్టోబరులో వెల్లడించిన అధ్యయనాంశాల ప్రకారం అవినీతి విక్రమంలో ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడు వరసగా తొలి మూడు స్థానాలు ఆక్రమించాయి. ప్రభుత్వాల నుంచి తమకు రావాల్సిన లబ్ధిని పొందాలంటే లంచం ఇవ్వకతప్పని పరిస్థితి ఒక తీరు. ప్రభుత్వంలోని పెద్దల నుంచి తమకు చెరుపు జరగకుండా చూసుకోవడానికీ ఆమ్యామ్యాలు ముట్టజెప్పక తప్పని దుస్థితి- మన సంక్షేమ రాజ్యం మూలగనే పీల్చేస్తోంది. పశ్చిమ్‌ బంగలో నీతి అనే కొరివితో తలగోక్కున్న మమతా దీదీ పితలాటకాన్ని పక్కన పెడితే, ‘కట్‌మనీ’ పైకాన్ని కక్కించేందుకు బెంగాలీ సోదరులు ముందుకు ఉరికిన వైనం నుంచి మనం గుణపాఠాలు నేర్వలేమా? రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పినట్లు- జాతి నైతిక దిక్సూచిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఈ దేశపౌరులుగా మనమీద లేదా!

 

- పర్వతం మూర్తి
Posted on 30.06.2019