Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

సామాజిక న్యాయ రాజకీయం

* కీలకం కానున్న బీసీల వర్గీకరణ

మండల్‌ కమిషన్‌ సిఫార్సులు దేశ రాజకీయాలను కీలక మలుపుతిప్పాయి. వెనకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేయడం, దాన్ని అమలు చేయడానికి 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం నడుంకట్టడం, ఆ సందర్భంలోనే భారతీయ జనతాపార్టీ రామజన్మభూమి నినాదాన్ని ఎత్తుకుని ఉద్యమించడం- దేశ చరిత్రను అసాధారణంగా ప్రభావితం చేశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయాలు, ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ రెండు అంశాల చుట్టూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తిరుగుతున్నాయి. మండల్‌-మందిర్‌ ఆందోళనల నేపథ్యంలోనే వెనకబడిన వర్గాలకు వేదికగా ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఆ పార్టీల వల్లే కాంగ్రెస్‌ పార్టీ ఆ రెండు రాష్ట్రాల్లో కోలుకోలేని విధంగా కుంగిపోయింది. మండల్‌ సిఫార్సులను ఆలంబనగా చేసుకుని రాజకీయంగా ఎదిగిన పార్టీల నుంచే భాజపాకు ఒకప్పుడు గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. సామాజిక న్యాయం నినాదంతో రాజకీయంగా ఎదిగిన పార్టీలు కాలక్రమంలో కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. వెనకబడిన తరగతుల్లో కొన్నింటికే ప్రాబల్య కేంద్రాలుగా తయారయ్యాయి. ప్రస్తుతం మనముందున్న చరిత్ర ఇది. చరిత్ర పునరావృతం అవుతుందంటే మనం ఒక పట్టాన నమ్మలేం! ఒకసారి దిగిన నదిలో రెండోసారి దిగలేమని గ్రీకు తత్వవేత్త హెరక్లైటస్‌ ఎప్పుడో చెప్పారు. వెనకబడిన వర్గాల రిజర్వేషన్ల అంశం 30 ఏళ్లనాడు రాజకీయాలను ఏ మలుపు తిప్పిందో తిరిగి అలాంటి మలుపునే మళ్ళీ అదే అంశం తీసుకురానుందా, అది కొత్త రాజకీయపార్టీల పుట్టుకకు దారితీస్తుందా లేక ప్రస్తుతం ఉన్న పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందా? ఏది జరిగినా చరిత్ర పునరావృతం అయినట్లే అనుకోవచ్చు!

త్వరలోనే నివేదిక
వెనకబడిన వర్గాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలవుతున్న 27 శాతం రిజర్వేషన్లను వర్గీకరించడానికి జస్టిస్‌ రోహిణి సారథ్యంలో ఏర్పాటైన కమిషన్‌ తన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. కమిటీ ఇచ్చే వర్గీకరణ సిఫార్సులను కేంద్రం ఆమోదించడం దాదాపుగా ఖాయంగా కనబడుతోంది. ఆర్థికంగా ఎదిగి, వ్యవసాయరంగంపై పట్టు సాధించిన కొన్ని కులాలు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో సమాజ్‌వాది, రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలకు వెన్నుదన్నుగా ఉన్నాయి. వీటికి తోడు ముస్లిముల అండదండలూ చాలా సందర్భాల్లో ఈ పార్టీలవైపే ఉన్నాయి. ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ కులాలకే అన్నింటా ప్రాధాన్యం లభించిందన్న విమర్శలను అంత తేలిగ్గా కొట్టేయలేం. ఇక ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో అమలవుతున్న 27 శాతం రిజర్వేషన్లను ఎక్కువగా పొందింది యూపీ, బిహార్‌లలో ఈ పార్టీల వెంటనున్న కులాలే.

మండల్‌ సిఫార్సుల నేపథ్యంలో మందిర్‌ నినాదంతో బాగా బలపడిన భాజపాకూ వెనకబడిన వర్గాల్లో పెరిగిన రాజకీయ అధికార ఆకాంక్షను కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాదిలో 1996నాటికి ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 25 శాతం వెనకబడిన వర్గాలవారున్నారు. 1984లో ఇది 11 శాతమే. మండల్‌ నేపథ్యంలో మొలకలెత్తిన రాజకీయ చైతన్యానికి ప్రతీకగానే దాన్ని సామాజిక శాస్త్రవేత్తలు భావించారు. భాజపాకూ ఈ చైతన్యం తాలూకు వేడి తాకింది. వెనకబడిన వర్గాల ప్రాతినిధ్యం ఆ పార్టీలో క్రమేపీ పెరిగింది. కల్యాణ్‌సింగ్‌ లాంటి బీసీ నేతను యూపీ ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది.

రాజకీయాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఎప్పటినుంచో నలుగుతూనే ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్గీకరణ చాలాకాలం నుంచే అమలులో ఉంది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో వర్గీకరణను అమలుచేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్గీకరణను చేపట్టాలనే వాదన బలంగా వినిపించినా పెద్దగా పట్టించుకోలేదు. జస్టిస్‌ రోహిణి కమిషన్‌ ఏర్పాటుతో వర్గీకరణ వాస్తవరూపం దాల్చబోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిదానికీ రాజకీయ ప్రతిఫలం ఉంటుంది. వర్గీకరణ దీనికి మినహాయింపు కాదు. ఉత్తరాదిలో భాజపా తన బలాన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. యూపీ, బిహార్‌లలో రాజకీయంగా ప్రాతినిధ్యంలేని కులాలపై గత పదేళ్ల నుంచి భాజపా బాగా దృష్టి సారించింది. 2014 తరవాత దీన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఎస్సీ ఎస్టీ కమిషన్‌ తరహాలో బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ సవరణను ముందుకు తీసుకువచ్చింది. పార్టీ టికెట్ల కేటాయింపులోనూ యాదవేతర కులాలపైనే దృష్టి పెట్టింది. అమిత్‌ షా సోషల్‌ ఇంజినీరింగ్‌ వ్యూహానికి యూపీ, బిహార్‌లే ప్రయోగశాలలయ్యాయి. ఈ పరిణామాలన్నీ ఉత్తరాదిన భాజపాకు యాదవేతర కులాల్లో గట్టి పట్టు దొరికేందుకు దోహదపడేవే. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే మండల్‌ కమిషన్‌ సిఫార్సులను ఆధారంగా చేసుకుని రాజకీయంగా బలపడిన పార్టీలకు ఆ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టి పెనుసవాలు విసరనుంది. దీనివల్ల ఆ పార్టీలకు రాజకీయ అస్తిత్వ సమస్య ఎదురయ్యే ప్రమాదమూ లేకపోలేదు.

ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం భాజపా చేపట్టబోయే అతి కీలకమైన సామాజిక అంశంగా వర్గీకరణనే చెప్పుకోవచ్చు. వర్గీకరణ కేంద్రస్థాయిలో అమలైతే అన్ని రాష్ట్రాల్లో దాన్ని అమలుచేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రాల స్థాయిలో రాజకీయ పార్టీలకు మరోమార్గం ఉండకపోవచ్చు. ఇది అంతటితో ఆగుతుందనీ చెప్పలేం. ఎన్నాళ్లనుంచో షెడ్యూలు కులాల రిజర్వేషన్లలోనూ వర్గీకరణను చేపట్టాలన్న డిమాండు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 20 ఏళ్ల నుంచి ఇందుకోసం ఆందోళనలు నడుస్తూనే ఉన్నాయి. బీసీల్లో కొన్ని కులాలే రిజర్వేషన్ల ఫలాలను చేజిక్కించుకున్నాయన్న వాస్తవాన్ని గ్రహించి వర్గీకరణకు పూనుకొంటే ఎస్సీల్లో ఆ పరిస్థితిని ఎందుకు చక్కదిద్దరన్న ప్రశ్న తలెత్తక మానదు.

ప్రతిపాదన పాతదే
నిజానికి 1953లో కలేల్కర్‌ నేతృత్వంలో ఏర్పాటైన తొలి బీసీ కమిషనే 1955 నాటి తన నివేదికలో వర్గీకరణను ప్రతిపాదించింది. వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులుగా బీసీలను విభజించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. 2,399 కులాలను వెనకబడిన కులాలుగా పరిగణించి, జనాభాలో వీరి సంఖ్య 32 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. స్వాతంత్య్రానంతరం కులాల జనాభాపై నిర్దిష్ట సమాచారం లేనందువల్ల 1931 జనాభా లెక్కల ఆధారంగా ఆ నిర్ధారణకు వచ్చింది. అయితే కలేల్కర్‌ సిఫార్సులను ఆనాటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీలకు కాకుండా ఇతర కులాలకూ రిజర్వేషన్లు కల్పిస్తే సమాజంలో కుల విభజనలు పెరుగుతాయని, పంచవర్ష ప్రణాళికల ద్వారా జరిగే అభివృద్ధితో అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయని భావించింది. మౌలికంగా ఈ ఆలోచన నెహ్రూది. దాన్ని కాంగ్రెస్‌లో ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. కమ్యూనిస్టులూ ఆర్థికాభివృద్ధి జరిగితే అన్నీ సర్దుకుంటాయనే భావించేవారు. రామ్‌మనోహర్‌ లోహియా మాత్రం కులం ఆధారంగానే వెనకబాటుతనం ఉందని గట్టిగా వాదించి రిజర్వేషన్లు అవసరమని చెప్పేవారు. లోహియా శిష్యులే 1977లో జనతా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించి బి.పి.మండల్‌ ఆధ్వర్యంలో వెనకబడిన కులాలకు రిజర్వేషన్ల కోసం కమిషన్‌ని ఏర్పాటు చేయించారు. 1979 జనవరి ఒకటిన మండల్‌ కమిషన్‌ ఏర్పాటైంది. అది 1980 డిసెంబర్‌ 31న నివేదికను ఇచ్చింది. మొత్తంగా 3,743 కులాలను వెనకబడిన కులాలుగా గుర్తించి 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. జనాభాలో బీసీల సంఖ్య 52 శాతమని చెప్పింది. అందుబాటులో ఉన్న గణాంకాలను అధ్యయనం చేసి కేంద్ర ఉద్యోగాల్లో 12.55 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పింది. ఇక క్లాస్‌-1 ఉద్యోగాల్లో అయిదు శాతమే ఉన్నారనీ తెలిపింది. రిజర్వేషన్ల సౌకర్యం వల్ల ఎస్సీ, ఎస్టీలు బీసీల కంటే ఎక్కువగా ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పింది. ఈ రెండు వర్గాలకు ఉద్యోగాల్లో ఆ నాటికి 18.72 శాతం ప్రాతినిధ్యం ఉంది. బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు అవసరమో పేర్కొంటూ మండల్‌ కమిషన్‌ ఇచ్చిన గణాంకాలను పరిగణనలోకి తీసుకునే 27 శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. వెనకబాటుతనానికి దేశంలో కులం ఆధారంగా ఉందన్న మండల్‌ కమిషన్‌ వాదనతో ఏకీభవించింది.

అసలైన ఆసక్తికరాంశం
వర్గీకరణ అధ్యయనంలో భాగంగా జస్టిస్‌ రోహిణి కమిషన్‌ అయిదేళ్లలో ఓబీసీ కోటా కింద భర్తీ అయిన ఉద్యోగాలను పరిశీలించింది. మూడేళ్ల కాలంలో విద్యాసంస్థల్లో ప్రవేశాలనూ విశ్లేషించింది. సంఖ్యాపరంగా 25 శాతం లోపున్న కులాలు 97శాతం ‘ఉద్యోగాలు/ ప్రవేశాలు’ దక్కించుకున్నాయి. ఇంకా సూక్ష్మంగా వెళ్ళి పరిశీలిస్తే 10 కులాలు 24.95 శాతం ‘ఉద్యోగాలు/ ప్రవేశాలు’ పొందాయి. 983 కులాలు ఏ ఫలితాన్నీ పొందలేదు. 994 కులాలకు 2.8 శాతం ప్రాతినిధ్యమే లభించింది. 2015 మార్చి 31నాటికి కేంద్ర ఓబీసీ జాబితాలో 2,418 కులాలు ఉన్నాయి. ఈ సంఖ్య ప్రస్తుతానికి 2,633కు చేరింది. అంటే దాదాపు రెండువేల కులాలకు దక్కిన ప్రాతినిధ్యం ఎంత నామమాత్రమో ఈ లెక్కల్నిబట్టే అర్థమవుతుంది. రిజర్వేషన్ల ఫలితాలను అందుకోవడంలో నెలకొన్న ఇంతటి అసమానత్వాన్ని ఎలా తొలగించబోతున్నారన్నదే ఇప్పుడున్న ప్రశ్న. ఇప్పటిదాకా ఎటువంటి లబ్ధి పొందని కులాలు, ఎంతో కొంత లబ్ధి పొందినవి, గరిష్ఠంగా లబ్ధి పొందినవిగా విభాగించి వర్గీకరణ శాతాలను ప్రతిపాదించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందేలా చూడటం లక్ష్యం కాబట్టి ఇప్పటివరకూ గరిష్ఠంగా లబ్ధి పొందిన కులాలకు కోతపడటం ఖాయం. జస్టిస్‌ ఈశ్వరయ్య నేతృత్వంలోని బీసీ కమిషన్‌ ఏ, బీ, సీలుగా వెనకబడిన వర్గాలను వర్గీకరించాలని అభిప్రాయపడింది. ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఆ వర్గీకరణను సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్గీకరణకు రాజకీయ వ్యతిరేకత పెద్దగా రాకపోవచ్చు. న్యాయపరీక్షకూ వర్గీకరణ నిలబడే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఎత్తులకు పైఎత్తులకు ఏ అంశం ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో లెక్కల్లాగా కచ్చితత్వంతో చెప్పలేం. రిజర్వేషన్లను మాత్రం దీనికి కొంత మినహాయింపుగానే చెప్పుకోవాలి. అనూహ్యరీతిలో ఆర్థికంగా పేదవర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ కారణంగా ఇటీవలి ఎన్నికల్లో భాజపాకు ఉత్తరాదిన లాభం చేకూరలేదనగలమా!

 

- ఎన్‌.రాహుల్‌ కుమార్‌
Posted on 30.06.2019