Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

కశ్మీర్లో భిన్నధ్రువాల సయోధ్య

అధికారం ఉప్పూ నిప్పును సైతం ఒక్కటి చేయగలదు. భారతీయ జనతాపార్టీని కశ్మీర్‌ లోయలో అడుగుపెట్టనివ్వనంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసి ఎన్నికల్లో విజయం సాధించిన ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌, నేడు అదే భాజపాతో కలిసి జమ్మూకశ్మీర్‌లో అధికార పగ్గాలు చేపట్టారు. ఆడిన మాట తప్పడం రాజకీయవాదులకు అలవాటేగా! ముఫ్తీ, భాజపాల మధ్య అధికారం కోసం ముందే ఒప్పందం కుదిరిందని మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించినా, సంకీర్ణం ఏర్పాటు ఆయన్ను ఆశ్చర్యపరచిందనడంలో సందేహం లేదు. రాజకీయ బేరసారాలు ఎలా జరుగుతాయో తెలియని అమాయకులు మాత్రమే ఇలా ఆశ్చర్యపోతారు. ముఫ్తీ ప్రతిజ్ఞ గాలికి కొట్టుకుపోయినా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. భాజపా ప్రప్రథమంగా పాలక పక్ష హోదాలో కశ్మీర్‌ లోయలో కాలు మోపింది- అదీ అక్కడ కనీసం ఒక్క సీటైనా గెలవకుండా! కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరు కావడాన్ని చూస్తే, భాజపా ఎంత విజయోత్సాహంలో ఉందో అర్థమవుతుంది. కానీ, ఈ ఉత్సాహం నిరాధారమని మున్ముందు తేలిపోవచ్చు. జనాభాలో 95శాతం ముస్లిములే అయిన కశ్మీర్‌ లోయలో హిందుత్వ అజెండా కలిగిన భారతీయ జనతాపార్టీ వేళ్లూనుకునే అవకాశం లేదు.

ఆదిలోనే హంసపాదు

భాజపా వ్యతిరేక పంథాను అనుసరించి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా మద్దతు పొందగలిగానని ముఫ్తీ వాదించవచ్చు. కానీ, ఈ పొత్తు ముస్లిం జనాధిక్యం గల కశ్మీర్‌కూ, హిందూ జనాధిక్యం కలిగిన జమ్మూకూ మధ్య చిరకాల విభేదాలను మళ్ళీ వెలుగులోకి తెచ్చింది. ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తొందరలో ముఫ్తీ ఈ రెండు ప్రాంతాల మధ్య అఖాతాన్ని మరింత తీవ్రం చేసినట్లుంది. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగాయంటే అది వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, పాకిస్థాన్‌ల చలవేనని ముఫ్తీ వ్యాఖ్యానించడం వివాదం రేపింది. జమ్మూకశ్మీర్‌ ఎన్నికలు నిరాటంకంగా జరిగాయంటే, దానికి కారణాలు వేరే ఉన్నాయి. వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరించారంటే కారణం- ముఫ్తీకి తోడ్పడాలని కాదు, భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగే ఎన్నికలు వట్టి బూటకమని అని చాటడానికే. ఎన్నికలను భగ్నం చేయడానికి ప్రయత్నించే దుష్టశక్తులను అణచివేయడానికి కేంద్రం భారీగా భద్రతా దళాలను మోహరించడంతో తీవ్రవాదులు గప్‌ చుప్‌ అయిపోయారు. అదీకాకుండా కొంతకాలం నుంచి భద్రతా దళాలతో పోరులో తీవ్రవాదులు పెద్దసంఖ్యలో హతమారిపోయారు. ఇలా బలం తరిగిపోవడం వల్ల కూడా తీవ్రవాదులు గమ్మున ఉండిపోయారు.

పాకిస్థాన్‌ విషయానికి వస్తే, అది కశ్మీర్‌లో దీర్ఘకాల క్రీడ ఆడుతోంది. భారత్‌ నుంచి కశ్మీర్‌ను బలప్రయోగంతో లాక్కోలేనని పాక్‌కు ఎన్నడో తెలిసివచ్చింది. 1965 యుద్ధంలో ఓడిపోయిన తరవాత నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జుల్ఫికర్‌ అలీ భుట్టో, చరిత్ర నుంచి తాము పాఠం నేర్చుకున్నామని, ఇకపై కశ్మీర్‌ సమస్యపై భారత్‌ను యుద్ధరంగంలో సవాలు చేయబోమని చెప్పారు. 1971లో భారత్‌-పాక్‌ యుద్ధం బంగ్లాదేశ్‌కే పరిమితమైంది. భారత్‌ దృష్టి మరల్చడానికి కశ్మీర్‌లో రెండో యుద్ధరంగాన్ని ప్రారంభించే అవకాశం ఉండి కూడా పాకిస్థాన్‌ ఆ పని చేయలేదు. ప్రస్తుతం రెండు దేశాలూ అణ్వస్త్ర శక్తులు కాబట్టి దుందుడుకుగా యుద్ధానికి దిగే అవకాశం లేదు.
అయినా, ముఫ్తీ సరిహద్దు అవతల ఉన్న తీవ్రవాదులను స్మరించారంటే కారణం- కశ్మీర్‌ లోయలోని పాక్‌ అనుకూల శక్తులను బుజ్జగించడం కోసమే. అఫ్జల్‌ గురు అవశేషాలను కశ్మీర్‌కు పంపాలని కోరినది కూడా ముస్లిములను సంతృప్తిపరచడానికే. ముఫ్తీ ఎన్నికల ప్రచారంలో సైతం ఇస్లామిక్‌ అస్తిత్వ ఛాయలు కనిపించాయి. కొన్ని సంవత్సరాల నుంచి కశ్మీరీ ముస్లిములు వివిధ కారణాల వల్ల భారత్‌కు దూరమవుతున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కోసం తాము చేస్తున్న డిమాండ్‌ నెరవేరకపోవడంతో వారు నిస్సహాయ భావనకు లోనవుతున్నారు. దీన్ని ఇస్లామిక్‌ శక్తులు బాగా ఉపయోగించుకొంటున్నాయి. మరోవైపు కశ్మీర్‌లో ఉదారవాదుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

కశ్మీరీలు స్వాతంత్య్రం కోసం డిమాండ్‌ చేయడం కేవలం ఒక ఎత్తుగడ అని, తరవాత పాకిస్థాన్‌లో విలీనం కావడం కోసం వేసిన ఎత్తు అనీ ఒక అభిప్రాయం ఉంది. వేర్పాటువాదులు పాకిస్థాన్‌కు సన్నిహితులవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది. కొంతకాలం క్రితం భారత్‌, పాక్‌ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడంపై రకరకాల భాష్యాలు వినవచ్చాయి. అయితే, పాకిస్థాన్‌ వేర్పాటువాదులకు ఎంత దగ్గరైతే, న్యూదిల్లీకి అంత దూరమవుతుందని స్పష్టం చేయడం కోసమే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తీసుకుంది.

జమ్మూకశ్మీర్‌ విమోచన సంఘటన(జేకేఎల్‌ఎఫ్‌) నుంచి విడిపోయి సొంత వర్గాన్ని ఏర్పరచుకున్న యాసిన్‌ మాలిక్‌కు ఒకప్పుడు ఆదరణ ఉండేది. కానీ, సమర్థ ప్రతిపక్షంగా వ్యవహరించే బదులు భారత ప్రభుత్వం పట్ల శత్రుత్వం వహించడంవల్ల మాలిక్‌ వర్గం ప్రాబల్యం కోల్పోయింది. ఈ నేపథ్యంలో పీడీపీ-భాజపా సంకీర్ణం చరిత్రాత్మకమైనదని ముఫ్తీ వర్ణించడం అన్నివిధాలా సబబే. అయితే, ఈ సంకీర్ణం కేవలం అధికారాన్ని పంచుకోవడం కోసం కుదిరిన అవకాశవాద పొత్తుగా మిగిలిపోకూడదు. కశ్మీర్‌లో శాంతి సుస్థిరతలను నెలకొల్పాలన్న దీర్ఘకాలిక లక్ష్యాన్ని విస్మరించకూడదు.

ప్రజాశ్రేయమే ప్రధానం

అన్నింటినీమించి షేక్‌ అబ్దుల్లా రోజుల్లో మాదిరిగా జమ్మూకశ్మీర్‌ మళ్ళీ లౌకికత్వాన్ని నెలకొల్పడం ఎంతో ముఖ్యం. జమాతే ఇస్లామీతో చేతులు కలపడం ద్వారా హురియత్‌ గాడి తప్పింది. హురియత్‌ తన తప్పులను తెలుసుకోకుండా మతాన్ని, రాజకీయాలను ముడిపెడుతూనే ఉండటం దురదృష్టకరం. హురియత్‌ పంథా మారకపోతే రేపు భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సామరస్యం కోసం జరిగే ప్రయత్నాల్లో అది భాగస్వామి కాజాలదు. పరిస్థితుల్నిబట్టి విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేయవలసి వచ్చిందే తప్ప, పాక్‌తో చర్చలకు భారత్‌ విముఖం కాదు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌.జయశంకర్‌ పాకిస్థాన్‌ సందర్శన ఇదే సందేశాన్ని ఇస్తోంది. రెండు దేశాలూ తమ భేషజాలను, అనుమానాలను, సంకోచాలను పక్కనపెట్టి కలిసి కూర్చుని సంభాషించుకోవాలి. ఉభయులూ పేదరికంపై జిహాద్‌ ప్రకటించాలి. భారత్‌, పాక్‌ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడం కన్నా ప్రధాన సమస్య మరొకటి లేదు.

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలవుతున్నా భారత్‌, పాక్‌లు తమ చేతిలోని పరిమిత వనరులను జనసంక్షేమం కోసం కాకుండా ఆయుధాల కొనుగోలుకు వెచ్చించడం శోచనీయం. ప్రజాశ్రేయం కోసం మోదీతో కలసి ముఫ్తీ పనిచేయాలి. జమ్మూకశ్మీర్‌ ప్రజల మధ్య భావోద్వేగ బంధం ఏర్పడితే అది అభివృద్ధికే కాకుండా లౌకికత్వం బలపడటానికీ ఎంతగానే తోడ్పడుతుంది.

(రచయిత - ఎస్‌.దీపాంకర్‌)
Posted on 07.03.2015