Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

బ్రోచేవారెవరురా...?

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమరంలో ఘోర పరాభవం దరిమిలా కాంగ్రెస్‌ పార్టీ పోనుపోను మరింత అనిశ్చితిలో కూరుకుపోతోంది. అత్తెసరు ఫలితాలకు నైతిక బాధ్యత వహించి అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)లో రాహుల్‌ గాంధీ ప్రకటించి దాదాపు ఆరువారాలు కావస్తోంది. అస్త్రసన్యాసం చేసిన దళపతిని రాజీనామా ఉపసంహరించుకొమ్మంటూ పార్టీశ్రేణులు అదేపనిగా దేబిరించడం, మునుగుతున్న నౌక దుస్థితిని కళ్లకు కడుతోంది. దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులు, పార్టీలోని వివిధ సంస్థాగత పదవుల్లో ఉన్న నేతల మూకుమ్మడి రాజీనామా బెదిరింపుల్ని వెన్నంటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల తాజా విజ్ఞప్తుల సారాంశం ఒకటే. సారథ్య బాధ్యతల్ని రాహుల్‌ తిరిగి భుజాలకెత్తుకుని తమను, పార్టీని కాచి గట్టెక్కించాలనే! ‘మీలో కొందరు భావిస్తున్నట్లు నేనేమీ రక్షకురాలిని కాదు’ అని గతంలో సోనియా, ‘ఉన్నట్టుండి అద్భుతాలు సృష్టించడానికి నా చేతిలో మంత్రదండమేమీ లేదు’ అని రాహుల్‌ పలుమార్లు స్పష్టీకరించినా- ఆనువంశిక పాలనపై కాంగ్రెస్‌ నమ్మకం చెక్కుచెదరనిది! మునుపు సోనియా ఎదుట సాష్టాంగపడినట్లే ఇప్పుడు రాహుల్‌ తప్ప దిక్కు లేదనేంత అంధభక్తి ప్రదర్శన, పార్టీకి చీడపురుగులా పట్టిన విషసంస్కృతిని దిసమొలతో సాక్షాత్కరింపజేస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదంటూనే గతవారం భూపేశ్‌ బఘేల్‌ స్థానే ఛత్తీస్‌గఢ్‌ విభాగ పార్టీ సారథిగా మోహన్‌ మర్కమ్‌ని నియమించింది రాహుల్‌ గాంధీయే కావడం విశేషం. పార్టీ సాకల్య ప్రక్షాళనే ధ్యేయమైతే రాహుల్‌ గాంధీ తన స్థిరనిశ్చయం ప్రస్ఫుటమయ్యేలా సీడబ్ల్యూసీనీ రద్దు చేసి అంతర్గత ఎన్నికలకు వడివడిగా రంగం సిద్ధం చేసి ఉండాల్సింది. అందుకు విరుద్ధంగా వారాల తరబడి ‘తీవ్ర నిర్ణయం’పై ప్రతిష్టంభన, పార్టీ రాష్ట్రాల విభాగాల్లో పొటమరిస్తున్న విభేదాలు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అలవిమాలిన అయోమయం- విడ్డూరమైన ‘ఫార్సు’ను ఆవిష్కరిస్తున్నాయి.

భారత రాజకీయాలకు మూలపుటమ్మగా వెలుగొందిన కాంగ్రెస్‌ పార్టీయేనా ఇది? స్వాతంత్య్రోద్యమ సైన్యాధ్యక్షత కొండంత బలిమై జనం తలలో నాలుకలా మసలిన పక్షానికి ఛాయాబింబ ప్రతిబింబంగా మిగిలిన పార్టీ, ఏళ్ల తరబడి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుంటోంది. అలనాడు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ, మహ్మదాలీ జిన్నా, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, బాల గంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలే... ప్రభృత దిగ్దంతులు సైద్ధాంతికంగా భిన్న దృక్పథాలు కలిగినవారైనా జనం ఆత్మగా కాంగ్రెస్‌ను తీర్చిదిద్దడంలో కృతకృత్యులయ్యారు. వ్యక్తిగత అజెండాతో ఇందిర ఖాతాలో కాంగ్రెస్‌ ‘ఐ’క్యమైంది లగాయతు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమన్నది ఎండమావిగా మారింది. ఆశ్రిత పక్షపాతం, వ్యక్తిపూజ, అవినీతి, బంధుప్రీతి పార్టీలో ఊడలు దిగి అధిష్ఠానం చెప్పిందే శిలాక్షరమయ్యాక- సర్వంసహాధికారాలు గుండుగుత్తగా మూలవిరాట్టుకే దఖలుపడే దుష్ట సంప్రదాయం స్థిరపడింది. ఇందిర వారసుడిగా తెరపైకి వచ్చిన తొలినాళ్లలో రాజీవ్‌- నిస్వార్థ కార్యకర్తలపై నిక్షేపరాయుళ్ల ఇష్టారాజ్య స్వారీ పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నదని నిప్పులు కక్కినా, ఆ సంస్కరణాభిలాష మూన్నాళ్ల ముచ్చటే అయింది. వ్యక్తిపూజను అంతమొందించాలని పార్టీ అధ్యక్షురాలిగా పిలుపిచ్చిన సోనియా పందొమ్మిదేళ్ల జమానాలోనూ ముఖస్తుతులకు, ముఠాల సంస్కృతికే పెద్దపీట దక్కింది. ‘కాంగ్రెస్‌ సంస్కృతి’లో మార్పుల ఆవశ్యకతను పదేపదే ప్రస్తావించిన రాహుల్‌ సారథ్యంలో సైతం అదే ముద్ర! 1984లో 415 లోక్‌సభాస్థానాలు గెలుపొందిన కాంగ్రెస్‌, 2014లో 44కు, ఇటీవల 52 సీట్లకు పరిమితం కావడం ప్రధానంగా స్వయంకృతాపరాధాల పర్యవసానమే. ప్రజలకు కాంగ్రెస్‌ దూరమవుతోందని సరిగ్గానే గుర్తించిన తల్లీకొడుకులు, పార్టీ ఓటు పునాది బీటలు వారకుండా కాచుకోవడంలో ఘోరంగా విఫలం కావడమే- నేడింతగా పుట్టి ముంచింది!

పునరుజ్జీవానికి అవకాశాలు తలుపు తట్టినప్పుడు అందిపుచ్చుకోని పక్షాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టుకుపోతుందన్న యథార్థానికి కాంగ్రెస్‌ దుర్గతే దాఖలా. 1999నాటి ఎన్నికల్లో ఓటమితో తల బొప్పి కట్టినప్పుడు సంస్థాగత ప్రక్షాళనను లక్షించి ఏకే ఆంటొనీ కమిటీని నియమించి సిఫార్సులు రాబట్టినా ఏం ఒరిగింది గనక? పార్టీలో ‘అంతా అధిష్ఠానం దయ’ అనే ధోరణులు రూపుమాసిపోవాలని, అన్ని అంచెల్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని అప్పట్లో ఆంటొనీ విప్లవాత్మక సిఫార్సులు క్రోడీకరించారు. వాటి అమలు అటకెక్కింది. రాహుల్‌ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంవల్లే పార్టీ ఇక్కట్ల పాలవుతోందన్న ఇచ్చకాల రాయుళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా 2017 డిసెంబరులో వంశాంకుర పట్టాభిషేకం జరిగిపోయింది. గుజరాత్‌ శాసనసభలో భాజపాను వందలోపు స్థానాలకు కట్టడిచేసి- మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్లలో కాంగ్రెస్‌ గెలవడాన్ని రాహుల్‌ ఖాతాలో వేసి చంకలు గుద్దుకొన్న పెద్దలకు, మొన్నటి ఫలితాలతో తల తిరిగి ముద్ద నోట్లోకి వచ్చింది. ఏ పార్టీ అయినా ప్రజాశ్రేయమే పరమావధిగా సైద్ధాంతిక ప్రాతిపదికల్ని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. సమకాలీన సమస్యలకు, భావి సవాళ్లకు సమర్థ పరిష్కారాలు ప్రతిపాదించే చేవ, చొరవలతో పార్టీ సంస్థాగత నిర్మాణం చురుకందుకోవాలి. అడుగడుగునా జవసత్వాలు ఉట్టిపడుతూ జనంతో మమేకమయ్యేలా తననుతాను పరిపుష్టీకరించుకోలేని కాంగ్రెస్‌- నేటికీ మారనితీరుతో దివాలాకోరుతనాన్ని ఎండగట్టుకుంటోంది. నూటముప్ఫై నాలుగేళ్ల సుదీర్ఘ చరిత తమ ఘనవారసత్వమంటూ కితాబులిచ్చుకునే పార్టీ ఇప్పుడు కాలూ చేయీ కూడదీసుకోలేని దుర్దశకు చేరుకోవడం దిగ్భ్రాంతపరుస్తోంది. సైద్ధాంతిక నిబద్ధతకు కట్టుబడి, సంస్థాగత సంస్కరణలతో పార్టీని ప్రజలకు చేరువ చేయగలిగితేనే- రాహుల్‌ కొనసాగినా, వేరెవరో పగ్గాలందుకున్నా- కాంగ్రెస్‌ ఉనికి నిలవగలిగేది!

 

Posted on 03.07.2019