Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

క్రీడల్లో క్రీనీడలు

* శాపమవుతున్న రాజకీయాలు

ప్రపంచ పరుగుల దిగ్గజం ఉసెన్‌ బోల్ట్‌, తాను కోచ్‌లు తీర్చిదిద్దిన క్రీడాకారుడినని అథ్లెటిక్స్‌కు వీడ్కోలు చెబుతూ వ్యాఖ్యానించాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనలోని పరుగుల ప్రతిభను గుర్తించింది వారేనన్న బోల్ట్‌ మాటల్లో క్రీడావ్యవస్థలకు గల ప్రాధాన్యం ఏమిటో తేటతెల్లం అవుతోంది. సానపడితేనే రాయి వజ్రమవుతుంది. ప్రతిభాసామర్థ్యాలున్నా సరైన మార్గనిర్దేశం, ప్రోత్సాహం కల్పిస్తేనే క్రీడా ప్రపంచంలో రాణించగలరనడానికి బోల్ట్‌ సహా ఎందరో క్రీడాకారుల గాథలే నిదర్శనాలు. మనదేశంలో పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధం. అడుగడుగునా రాజకీయాలు తిష్ఠ వేసుకుని సమర్థులైన ఆటగాళ్లను నిరాశపరుస్తున్నాయి. ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా పేరొందిన అంబటి రాయుడు ప్రపంచకప్పు క్రికెట్‌కు జట్టు ఎంపికలో సెలక్టర్ల ధోరణులకు నిరసనగా అర్ధాంతరంగా ఆటకు వీడ్కోలు పలకడం అందుకు తాజా దృష్టాంతం.

ప్రపంచంలో 40 క్రీడాంశాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరుగుతుంటాయి. ఒలింపిక్స్‌లో 26 క్రీడాంశాలపై పోటీలు నిర్వహిస్తారు. 2016 వరకు 24 సార్లు ఒలింపిక్స్‌ పోటీలు జరగ్గా, భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 28 మాత్రమే. బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, టెన్నిస్‌లలో భారత్‌ ఒలింపిక్‌ పతకాలు సాధించింది. క్రికెట్‌, హాకీ, కబడ్డీలలో ప్రపంచ కప్పులు గెలుచుకుంది. చైనా వంటి పొరుగు దేశంతో పోల్చుకుంటే ఆటల్లో భారత్‌ ఎంతో వెనకంజలో ఉందన్నది సుస్పష్టం. మన దేశ జనాభా 135 కోట్లు. ఈ విషయంలో ప్రపంచంలో మనది రెండో స్థానం. ఆటలో మాత్రం అట్టడుగు స్థానాల్లోనే ఉంటోంది. 2016 ఒలింపిక్స్‌లో మనకు వచ్చిన పతకాలు రెండు. ఒకటి రజతం. మరొకటి కాంస్యం. ప్రభుత్వాల వైఖరి, అధ్వాన అపసవ్య విధానాలు, మౌలిక సదుపాయాల లేమి క్రీడారంగంలో దేశం వెనకబాటుకు ప్రధాన కారణాలు. ఇప్పటివరకు దేశానికి పకడ్బందీ క్రీడా విధానం లేదు. అంతర్జాతీయ స్థాయిగల కోచ్‌లు ఎక్కువ మంది లేరు. చైనా, జపాన్‌ వంటి దేశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి క్రీడాశిక్షణ ప్రారంభమవుతుంది. మన దేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆటలకు చోటే ఉండదు. 22 శాతం ఉన్నత పాఠశాలల్లో, 11 శాతం కళాశాలల్లో, ఏడు శాతం విశ్వవిద్యాలయాల్లో మాత్రమే శిక్షకులున్నారు. 95 శాతం పాఠశాలలు, 99 శాతం కళాశాలల్లో మైదానాల జాడ లేదు. క్రీడారంగానికి నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2019-20లో క్రీడలకు కేటాయించిన బడ్జెట్‌ రూ.2,216 కోట్లు మాత్రమే. బ్రిటన్‌ క్రీడారంగానికి ఏటా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.

క్రీడా పోటీలకు సన్నద్ధత సైతం దారుణంగా ఉంటోంది. విద్యార్థులకు నాసిరకం సామగ్రితో శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యం అందుబాటులో లేదు. ప్రతిభను గుర్తించి ఎంపిక చేసి, ప్రోత్సహించాల్సి ఉండగా క్రీడాశిక్షకులు, సమాఖ్య, సంఘాల ప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్నవారినే పోటీలకు ఎంపిక చేస్తున్నారు. సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రోయింగ్‌ సమాఖ్య వంటి కొన్ని వ్యవస్థలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా క్రీడా సమాఖ్యలు, సంఘాల్లోని పిల్లలు, బంధువులకే క్రీడాపోటీల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. క్రీడారంగంలో అవినీతి వేళ్లూనుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇచ్చే నిధులు దుర్వినియోగమవుతున్నాయి. కామన్వెల్త్‌ కుంభకోణం దేశాన్ని నివ్వెరపరచింది. జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) పోటీల కోసం విడుదల చేసే నిధులు సద్వినియోగం కావడం లేదు. క్రీడా పురస్కారాలకు ఆటగాళ్ల ఎంపిక విధానంలోనూ దుర్విచక్షణ కనిపిస్తోంది.

భారతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యంత లాభదాయక సంస్థగా పేరొందింది. రాష్ట్రస్థాయిలో క్రికెట్‌ సంఘాలు పనిచేస్తున్నాయి. క్లబ్‌ క్రికెట్‌ ఆధారంగా వివిధ వయో విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. రంజీ పోటీలకు ఎంపికైతే జాతీయ స్థాయి జట్టు ఎంపికకు దోహదపడుతుంది. కొందరు క్రీడాకారులపై ఎంపిక మండలి అవ్యాజానురాగం కనబరుస్తోంది. ప్రపంచ క్రికెట్‌ పోటీలకు ఎంపిక చేసిన జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం లోటే. నిలకడగా రాణించడంతో పాటు ప్రత్యర్థి దేశాల బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉన్నప్పటికీ, ఎంపిక కమిటీ అంబటికి అవకాశం కల్పించలేదు. పలువురు క్రీడాకారులు గాయపడినా, బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠత కోసం రాయుడిని ఎంపిక చేయాల్సి ఉన్నా పరిగణనలోనికి తీసుకోలేదు. ప్రతిభకు దక్కే గౌరవం ఇలాఉంటే భారత క్రీడారంగం గాడిలో పడేదెన్నడు?

దేశంలోని అన్ని రకాల క్రీడల్లో ప్రతిభకే పట్టం కట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అందుకు తగిన క్రీడా విధానాలు రావాలి. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ అంశాన్ని సైతం ప్రస్తావించారు. ‘ఖేలో ఇండియా’లో భాగంగా అన్ని స్థాయుల్లో క్రీడలకు ఆదరణ పెంచడానికి జాతీయ క్రీడావిద్యా బోర్డు’ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలోనే కాదు, రాష్ట్రాల్లోనూ క్రీడాపాలన విషయంలో అనేక మార్పులు రావాలి. ప్రాథమిక స్థాయి నుంచి పారదర్శకంగా ఎంపిక జరగాలి. క్రీడాసమాఖ్యలు, సంఘాల్లో రాజకీయ జోక్యాన్ని తొలగించాలి. చైనా, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకులు ఉండరు. మాజీ అంతర్జాతీయ క్రీడాకారుల ఆధ్వర్యంలో అవి నడుస్తున్నాయి. సచిన్‌ తెందూల్కర్‌ను భారతరత్న పురస్కారంతో గౌరవించిన దేశంలో ప్రతీ క్రీడాకారుడిని ఓ రత్నంలా మలిచేందుకు ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం కంకణబద్ధం కావాలి. క్రీడల విస్తరణ దేశాన్ని ఆరోగ్య భారత్‌గా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.

 

- ఆకారపు మల్లేశం
Posted on 06.07.2019