Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

జనస్వామ్యానికి రాజీ‘నామాలు’

పచ్చగా ఉన్న చోట తిని వెచ్చగా ఉన్న చోట పడుకొనే శీలహీన రాజకీయం కర్ణాటకలో మళ్ళీ శిరసెత్తింది. పద్నాలుగుమంది పాలక సంకీర్ణ శాసన సభ్యుల రాజీనామాలతో జేడీ (ఎస్‌)- కాంగ్రెస్‌ సర్కారు నడిసంద్రంలో మునిగే నావను తలపిస్తోంది. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే, అధికార కూటమి బలం ప్రధాన విపక్షం భాజపా కన్నా ఒకటి తరుగుపడి 104కు చేరనుందని రాజకీయ అంకగణితం వెల్లడిస్తోంది. తమ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి భాజపా ‘ఆపరేషన్‌ కమలం’ చేపట్టిందని కాంగ్రెస్‌ జేడీ(ఎస్‌)లు గుడ్లురుముతుంటే, రాజీనామాల్ని వారి అంతర్గత గొడవగా కమలనాథులు పేర్కొంటున్నా- వడ్లగింజలోనిది బియ్యపు గింజ అన్న వాస్తవం కళ్లకు కడుతూనే ఉంది. ఫిరాయింపు రాజకీయాల్లో కొత్త కోణం- రాజీనామాల పర్వం! పాలకపక్షం ఎమ్మెల్యేలతో రాజీనామాల ద్వారా అధికార కూటమిని మైనారిటీగా మార్చి, విశ్వాస పరీక్షలో ఓడించి తాము అందలం ఎక్కిన దరిమిలా, తమకోసం రాజీనామాల ‘త్యాగం’ చేసిన వాళ్లను తిరిగి చట్టసభకు నెగ్గించే ధోరణి- ప్రజాస్వామ్య మౌలిక స్ఫూర్తికే శరాఘాతం! 2008లో సాధారణ మెజారిటీకి స్వల్పంగా తరుగుపడిన యెడ్డీ ప్రభుత్వం ఆ తరహా ‘ఆపరేషన్‌’తోనే అనంతరకాలంలో సుస్థిరత సాధించగలిగింది. ‘అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం, అనైతిక పద్ధతులూ అవలంబించం’ అంటూ ప్రధాని పీఠాన్నే తోసిరాజన్న వాజ్‌పేయీ సచ్ఛీల విలువల ఆదర్శం కమలం పార్టీ శ్రేణుల్లో నేడు కొల్లబోయింది. ఒకనాడు యూపీలో ఫిరాయింపుదారులకు అంబారీలు కట్టి రాత్రికి రాత్రి కల్యాణ్‌సింగ్‌ సర్కారును కూల్చి జగదంబికాపాల్‌కు కిరీట ధారణ చేసినప్పుడు వాజ్‌పేయీ చేసిన సత్యాగ్రహ దీక్ష- ప్రజాస్వామ్య హతకుల మెడలు వంచి భాజపా ప్రభుత్వ పునరుద్ధరణకు బాటలుపరచింది. నేడు తరతమ భేదాలతో అంతా ఆ తాను ముక్కలే అయిన నేపథ్యంలో- ప్రజాతీర్పునకు చట్టసభల్లోనే నిష్ఠగా గోరీకట్టే అవకాశవాద నికృష్ట రాజకీయం దేశవ్యాప్తంగా ప్రస్ఫుటమవుతోంది!

ఫిరాయింపుల చీడ దేశ ప్రజాస్వామ్యాన్ని నలుచుకు తింటోందన్నది నిజమే అయినా, దానికదే ప్రధాన రోగం కాదు, అది రోగ లక్షణమే. ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అంటున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో- విశాల జనహిత పటిష్ఠ సైద్ధాంతిక పునాదులతో పుట్టుకొచ్చి, చెరువులో చేపల్లా ప్రజలతో మమేకమైన కార్యవర్గ శ్రేణులతో పరిపుష్టమై, అంతర్గత ప్రజాస్వామ్యమే శ్వాసగా పనిచేస్తున్న పార్టీలు ఏవంటే- కలిగేది నిర్వేదమే! అట్టడుగు స్థాయినుంచి పార్టీని నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న భాజపాను మినహాయిస్తే- అధినేతల ఆకర్షణ శక్తే ఆలంబనగా నెట్టుకొస్తున్న పార్టీలదే మెజారిటీ. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ శక్తులూ ఏక వ్యక్తి కేంద్రకంగా మారడం, వామపక్షాల ప్రభ మసకేసిపోవడం, స్వయంకృతాపరాధాలతో కాంగ్రెస్‌ అస్తిత్వమే ప్రమాదంలో పడటంతో దివాలాకోరు రాజకీయమే ఎల్లెడలా గజ్జెకట్టి ఆడుతోంది. ధనశక్తి యావత్‌ ప్రజాతంత్ర వ్యవస్థనూ కబళించక ముందే సరైన సంస్కరణలు చేపట్టాలన్న హితోక్తులకు మన్నన దక్కకపోవడంవల్ల- ఎన్నికల వేళ ధనస్వామ్య దాదాగిరీని, దరిమిలా గోడ దూకుడుగాళ్ల అవకాశవాద రాజకీయాన్నీ ప్రజలు విస్తుపోయి చూడాల్సి వస్తోంది! ఎన్నికలప్పుడు పార్టీలు టిక్కెట్లు అనుగ్రహిస్తోంది- పార్టీ సిద్ధాంతాలపట్ల నిబద్ధత, ప్రజాసేవానురక్తి, నాయకత్వ లక్షణాలున్న క్రియాశీల కార్యకర్తలకు కానే కాదు! కడ నిమిషంలో పార్టీ ఫిరాయించి వచ్చినా, కుల సమీకరణలు సరిపోయి ధనబల సంపన్నులైతే చాలు- గెలుపు గుర్రాలుగా పార్టీలు వారికే తగిలిస్తున్నాయి అభ్యర్థిత్వాల జీను! పదుల కోట్ల రూపాయలు వెదజల్లి నెగ్గుకొచ్చిన వాళ్లు ప్రతిపక్షంలో ఉండి గోళ్లు గిల్లుకొనే కన్నా పాలక పార్టీలో చేరి ‘జాక్‌పాట్‌’ కొట్టాలనుకోవడం ఫిరాయింపులకు ఊతమవుతోంది. ‘ఆయారామ్‌’లను సాదరంగా స్వాగతించే పక్షాలు, ‘గయారామ్‌’లపట్ల గుస్సాపడటమే కుటిల రాజకీయ వైచిత్రి!

‘రాజకీయ ఫిరాయింపుల జాడ్యాన్ని రూపుమాపకపోతే, అది దేశ ప్రజాస్వామ్య పునాదుల్నే కాదు, మౌలిక సూత్రాల్నీ దెబ్బతీస్తుంది’ అని 1985నాటి ఫిరాయింపుల నిషేధ చట్టం ప్రకటించింది. 1967లో కాంగ్రెస్‌ క్షీణ దశ ఆరంభమైనప్పుడు మొదలైన ఫిరాయింపులు- ప్రత్యేక చట్టం అమలులో ఉన్నా ప్రజా తీర్పును అపహసించేలా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వాల్ని కూల్చడానికి ఫిరాయింపుల్ని ఎగదోసే దుర్వినీత ధోరణులన ుంచి, విపక్షమన్నదే లేకుండా చేసే అప్రజాస్వామ్య పోకడల దాకా బహువిధ లక్ష్యాల సాధనే అజెండాగా ఆ జాడ్యం అన్ని చోట్లా కొత్త పిలకలు వేస్తూనే ఉంది. నిరుడు కర్ణాటకకు సంబంధించిన వ్యాజ్యంలోనే- అక్కడి శాసనసభ్యులు ఇంకా (అప్పటికి) ప్రమాణ స్వీకారం చెయ్యనందున వారికి ఫిరాయింపుల నిషేధ చట్ట అనర్హత నిబంధనలు వర్తించబోవంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులోనే వాదనలు వినిపించింది. చట్టం స్ఫూర్తికి నిలువునా తూట్లు పొడిచే దుర్రాజకీయ ధోరణుల్లో అన్ని పార్టీలదీ తిలాపాపం తలాపిడికెడు! బ్రిటన్‌లో జాన్‌ మేజర్‌ ప్రభుత్వం ఒక్క ఓటు మెజారిటీతో దీర్ఘకాలం మనగలిగిందంటే- ప్రజాస్వామ్య సంస్కృతి పార్టీల్లో వ్యవస్థీకృతమైనందువల్లనే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఫిరాయింపు రాజకీయాల రంకుల రాట్నం యథేచ్ఛగా తిరుగుతున్న తీరు ఆలోచనాపరులకు హృదయశల్యమే! అవినీతి, అవకాశవాదాలతో పుచ్చిన వ్యవస్థను భూస్థాపితం చేసి, ఆరోగ్యకర రాజకీయానికి మళ్ళీ నారూ నీరూ పోయాల్సిన తరుణమిది. అతి పెద్ద పార్టీగానే కాదు. అసలైన జాతీయపక్షంగానూ భాజపాయే అందుకు చొరవ చూపాలి. వ్యవస్థాగత ప్రక్షాళనకు తక్కిన పక్షాలూ కూడివస్తేనే ప్రజాస్వామ్యం కోలుకొంటుంది.

 

Posted on 08.07.2019