Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ఎటుచూసినా కష్టకాలం

* తరుగుతున్న కాంగ్రెస్‌ ప్రాభవం

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. కర్ణాటకలో కాంగ్రెస్‌-జనతాదళ్‌(ఎస్‌) కూటమికి చెందిన 16 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించడంతో అక్కడ కుమారస్వామి ప్రభుత్వం మనుగడ అనుమానాస్పదంగా మారింది. తిరుగుబాటు సభ్యుల్లో 13మంది శాసనసభ్యులు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే కావడమన్నది ఆ పార్టీ క్రమంగా ప్రాభవం కోల్పోతోందనడానికే నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికల తరవాత జేడీ (ఎస్‌) నాయకుడు హెచ్‌.డి.కుమారస్వామికి మద్దతు పలికి ఆయనకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది మొదలు- కర్ణాటక కాంగ్రెస్‌ పెద్దలు ఏనాడూ ఆయనను కుదురుకోనివ్వలేదు. ఎన్నికల తరవాత ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాకు అధికారం దక్కకుండా కేవలం 37 సీట్లు దక్కించుకున్న జేడీ(ఎస్‌)కు అంతకు రెట్టింపు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ హడావుడిగా మద్దతు పలికింది. రాజకీయ వ్యూహకోణంలో ఈ సర్దుబాటు బాగానే కనిపించినా- క్షేత్రస్థాయి ఎన్నికల పోరాటంలో అప్పటివరకూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్న నాయకులంతా పైస్థాయిలో జరిగిన ఒప్పందానుసారం ఉన్నఫళంగా కలిసికట్టుగా పనిచేయడం కుదరలేదు. పైపెచ్చు కాంగ్రెస్‌ నాయకుడు సిద్దరామయ్య ఏ దశలోనూ కుమార స్వామి ప్రభుత్వానికి హృదయపూర్వక మద్దతు అందించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో మొత్తం 28 సీట్లకుగాను భాజపా 25 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయగా- జేడీ(ఎస్‌), కాంగ్రెస్‌లు కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో తమ పార్టీ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు పెంచిన ఫలితాలవి. ప్రస్తుతం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కారణమిదే!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వేగంగా బలం కోల్పోతోంది. తెలంగాణలో కిందటి నెల 12మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు ఒక్కపెట్టున పార్టీ మారి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు. అంతకు కొన్ని నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ కేవలం 19 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆ తరవాత తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 18కి పడిపోయింది. మూడింట రెండొంతుల మంది సభ్యులు వేరుకుంపటి పెడితే అది పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధి కిందకు రాదు. ఆ నిబంధనను ఉపయోగించుకుంటూ 18మందిలో సరిగ్గా పన్నెండుగురు అంటే మూడింట రెండొంతుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడటం గమనార్హం. మరోవంక గోవాలో 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో పదిమంది సభ్యులు విపక్ష నాయకుడు చంద్రకాంత్‌ కవ్లేకర్‌ సారథ్యంలో భాజపా గూటికి చేరిపోయారు. భాజపావైపు దూకిన కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో ఎనిమిదిమంది క్రైస్తవ క్యాథలిక్‌ వర్గానికి చెందినవారు కావడం గమనించాల్సిన అంశం. గోవా కాంగ్రెస్‌ సభ్యులు సైతం ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా మూడింట రెండొంతుల మంది భాజపాలోకి వెళ్ళడం ఆసక్తి కలిగించే పరిణామం. గుజరాత్‌లో ఈ ఏడాది మార్చిలో అయిదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపావైపు వెళ్ళగా- మరో ఇరువురు శాసనసభ్యులు ఏ క్షణమైనా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర పరిస్థితీ ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. సీనియర్‌ నాయకులైన రాధాకృష్ణ పాటిల్‌ వంటివారు ఇప్పటికే భాజపా గూటికి చేరగా- మరికొందరు అదే బాటలో ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ మనుగడకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా- బీఎస్పీ, ఎస్పీ సభ్యుల మద్దతుతో కమల్‌నాథ్‌ సర్కారు అక్కడ కనాకష్టంగా మనుగడ సాగిస్తున్న విషయం మరచిపోరాదు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్‌ సభ్యులు తమ పార్టీని వీడకుండా నిలువరించేందుకు కమల్‌నాథ్‌ ఎప్పటికప్పుడు అందరితోనూ సమావేశాలు నిర్వహిస్తూ సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ పార్టీ కోటలు బీటలు వారుతున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కళ్లు చెదిరే విజయం సాధించడంతో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు సహజంగానే అటువైపు దృష్టి సారిస్తున్నారు. మరోవంక పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా సమర్పించడంతో శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఇప్పటివరకూ దిశానిర్దేశం చేసే నాయకుడిని ఎంపిక చేయకపోవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం సడలుతోందన్నది కాదనలేని వాస్తవం. మరోవంక కర్ణాటక వంటిచోట్ల 80 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించి కూడా, 37మంది సభ్యులున్న జేడీ(ఎస్‌)తో పోలిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో తమ సభ్యులకు సరైన ప్రాతినిధ్యం దక్కలేదన్న ఆవేదన కాంగ్రెస్‌ నాయకుల్లో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయంతో- కాంగ్రెస్‌ సభ్యుల్లో అంతకాలం గూడుకట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబికింది. ప్రస్తుతం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందన్న దాన్నిబట్టి- వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

 

- వీరేంద్రకపూర్‌
Posted on 17.07.2019