Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

విలువల హననం

* ఫిరాయింపులకు ప్రోత్సాహం

భారత రాజకీయాలను అవకాశవాద చెద పట్టి గుల్లబారుస్తోంది. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు దేశంలో తరచూ అపహాస్యానికి గురవుతున్నాయి. ప్రజా ప్రతినిధులను గుండుగుత్తగా కొనడం, అమ్మడం అనే దుస్సంస్కృతి కాలంతోపాటుగా రూపం మార్చుకుని కొనసాగుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టం అమల్లోకిరాని కాలంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి యథేచ్ఛగా ప్రజాప్రతినిధుల గోడదూకుళ్లు సాగాయి.

చట్టంలోని లొసుగుల ఆసరాగా ఆ కార్యక్రమం నిర్నిరోధంగా కొనసాగుతోంది. చట్టం లోపాలమయంగా మారడంతో అది ఉన్నా ఉపయోగం లేనట్లుగా తయారైంది. ఫలితంగా రాజకీయ వ్యవస్థల మీద ప్రజా విశ్వాసం రోజురోజుకూ తరిగిపోతోంది.

కర్ణాటక రాజకీయ ముఖచిత్రం నెల రోజుల వ్యవధిలో పూర్తిగా మారిపోయింది. శాసనసభ్యుల రాజీనామాలు, వారిని ముంబయి హోటళ్లలో ‘దాచి ఉంచడాలు’, స్పీకర్‌పై ఒత్తిళ్లు, చివరకు ప్రభుత్వం పతనం కావడం అంతా ముందే నిర్దేశించిన నాటకంలా జరిగిపోయింది. దేశ రాజకీయాల్లో ఈ తరహా పరిణామాలు సర్వసాధారణంగా మారిపోయాయి. మూడింట రెండొంతులమంది సభ్యులు బయటికొస్తే వారిపై వేటువేయరాదన్న ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్న దాఖలాలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఈ తరహా వలసలను పెద్దయెత్తున ప్రోత్సహించింది. విపక్ష శిబిరాలను కకావికలం చేసో, ఆశపెట్టో, భయపెట్టో ప్రజా ప్రతినిధులను గీత దాటించిన ఘనమైన చరిత్ర ఆ పార్టీ సొంతం. ఫిరాయింపులను ప్రోత్సహించి ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడంలో కాంగ్రెస్‌ రికార్డులను బద్దలు కొట్టడం సాధ్యం కాకపోయినా- కొంతకాలంగా భాజపా సైతం ఇంచుమించు అదే పంథాలో సాగుతోంది. కర్ణాటకలో శాసనసభ్యుల రాజీనామాలు మొదలు యెడియూరప్ప ప్రభుత్వ ఏర్పాటు వరకూ విజయవంతమైన ‘ఆపరేషన్‌ కమల్‌’ ఇదే విషయాన్ని చెబుతోంది. వలసలను పురిగొల్పడం, వేర్పాటు బృంద సభ్యులకు విలాస హోటళ్లలో వసతులు కల్పించడం, గవర్నర్‌ను ప్రభావితం చేసి అనుకూల ఆదేశాలు ఇప్పించుకోవడం వంటివన్నీ అధికారాన్ని దక్కించుకొనే క్రమంలో ఏ స్థాయికైనా వెళ్ళేందుకు భాజపా వెనకాడలేదన్నది కాదనలేని సత్యం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ్‌బంగలలో కొంతకాలంగా ప్రజా ప్రతినిధుల పార్టీ మార్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. కేంద్రంలో అధికారం తన చేతిలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ- విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాకీయ సమీకరణలను తలకిందులు చేసిన ఉదాహరణలు చరిత్రనిండా పోగుబడి ఉన్నాయి.

అయిదేళ్ల క్రితం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ-2 అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి స్పందించారు. కాంగ్రెస్‌ పాలన పట్ల భ్రమలు తొలగిపోవడంతో నాడు ప్రజా తీర్పు ఏకపక్షంగా వచ్చింది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని భాజపా విజయకేతనం ఎగరవేయడానికి మరో ప్రత్యామ్నాయమేదీ ప్రజావళికి కనుచూపు మేరలో కనిపించకపోవడమే కారణం. గడచిన అయిదేళ్ల అనుభవాలను విశ్లేషిస్తే- రాజకీయావసరాల మేరకు వ్యవస్థలను ఉపయోగించుకోవడంలో భాజపా తీరు కాంగ్రెస్‌కు భిన్నంగా ఏమీ లేదన్న అభిప్రాయమే తేటపడుతోంది. రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా పనిచేయడం లేదనుకుంటే వారిని నిర్దాక్షిణ్యంగా మరో చోటికి మర్చేయడమో లేక వారిపై వేటు వేయడమో గడచిన కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలే. కాంగ్రెస్‌, భాజపాలు సిద్ధాంతపరంగా రెండు భిన్నమైన భావజాలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ పార్టీలు బలంగా నమ్మిన రాజకీయ సిద్ధాంతాలను మినహాయిస్తే- కార్యాచరణలో, ప్రాథమ్యాల విషయంలో వాటి మధ్య పెద్ద తేడా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఒకరకంగా కులాల విభజనపై ఆధారపడితే, భాజపా మతోద్వేగాల ఆధారంగా ప్రస్థానిస్తోంది. ఒకప్పుడు ఫిరాయింపులను భాజపా వ్యతిరేకించింది. ప్రజా ప్రతినిధులను కొనడం, అమ్మడం తరహా అవ్యవస్థను బలంగా నిరసించింది. కాంగ్రెస్‌ సారథ్యంలో సాగిన విలువల హననాన్ని ఎత్తిచూపి విలక్షణ శైలిని ప్రదర్శించింది. ఒకప్పుడు తాను విమర్శించిన విధానాలనే ఇప్పుడు ఆ పార్టీ నెత్తికెత్తుకుంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం. వేర్పాట్లను ప్రోత్సహించి, పార్టీలను చీల్చి, ప్రభుత్వాలను కూల్చడం అన్నది ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు ఇతర పార్టీలనుంచి సభ్యులను స్వీకరించడానికి ఇచ్ఛగించనివారు- ఇప్పుడు యథేచ్ఛగా ఆ పని చేస్తున్నారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎలాంటి మార్గాలను అనుసరించినా ఫరవాలేదన్న ధోరణిలో ఉన్నారా అన్న అనుమానాలకు ఆస్కారం కలుగుతుంది!

- సత్యపాల్‌ మేనన్‌
Posted on 02.08 .2019