Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

విజ్ఞాన స్ఫూర్తి... చైతన్య దీప్తి

ఆత్మీయుల మరణం మనలో అలజడి రేపుతుంది... నిశ్శబ్దం నింపుతుంది. గడచిన పది రోజుల వ్యవధిలో ఇరువురు విఖ్యాత నాయకులు, మరీ ముఖ్యంగా నాకు అత్యంత ప్రీతిపాత్రులైన జైపాల్‌రెడ్డి, సుష్మా స్వరాజ్‌లు కన్నుమూయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారిద్దరూ నాకు తోబుట్టువులతో సమానం. జైపాల్‌ పెద్దన్న వంటివారు. సుష్మా సోదరి సమానురాలు. అపార ప్రతిభావంతులైన వారు విజ్ఞాన ఖనులుగా నూతన శాఖలతో విస్తరించి విలక్షణ పార్లమెంటేరియన్లుగా విరాజిల్లారు. సమర్థ పాలకులుగా రాణించడంతోపాటు తిరుగులేని వాక్పటిమతో దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఈ నాయకుల మధ్య గణనీయ సారూప్యతలతోపాటు కొన్ని వ్యత్యాసాలూ లేకపోలేదు.

రాజకీయ సృజనశీలి
పోలియో కారణంగా శారీరక వైకల్యం వెంటాడినా జైపాల్‌రెడ్డి ఏనాడూ దాన్ని ఒక సమస్యగా భావించలేదు. ప్రజాజీవనంలో మమేకమై ఆయన అనుక్షణం క్రియాశీలంగా వ్యవహరించారు. ఆయనలో తొణికిసలాడే స్ఫూర్తిని వైకల్యం నీరుగార్చలేకపోయింది. ఎదుటివారిని కట్టిపడేసే ప్రభావమంతమైన మాటతీరు, క్రియాశీల చొరవ, రాజకీయ జీవన యానంలో సాధించిన అపూర్వ విజయాలు ఆయనను సమున్నత నేతగా నిలిపాయి. నిరుపమానమైన స్ఫూర్తి ముందు శారీరక వైకల్యం చాలా చిన్న విషయమని ఆయన స్పష్టం చేసేవారు. జీవనయానంలో తారసపడిన అవరోధాలను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ, సృజనాత్మకతే ఆలంబనగా అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారాయన. ఎస్‌.జైపాల్‌ రెడ్డి అద్భుతమైన వక్త. ఏ విషయాన్నయినా లోతుగా విశ్లేషించగలిగిన మేధా సామర్థ్యం ఆయన సొంతం. సునిశిత హాస్య చతురత, శక్తిమంతమైన వాక్ప్రవాహం మేళవింపుగా తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీలో ఆయన ఉన్నతంగా ఎదిగారు. ఆంగ్ల, తెలుగు భాషల్లో అపారమైన ప్రజ్ఞ, ఎదుటివారిని సమ్మోహితులను చేస్తూ మాట్లాడగలిగిన విద్వత్తు ఆయన సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆయన, నేను పక్కపక్క సీట్లలో కూర్చునేవాళ్లం. అనేక అంశాలపై ఒకరి అభిప్రాయాలను మరొకరం సరదాగా కాగితాలపై రాసి ఇచ్చిపుచ్చుకొనేవాళ్లం. అప్పట్లో అధికార పార్టీ సభ్యులు మమ్మల్ని విఖ్యాత తిరుపతి వేంకట కవుల (కవిత్వాంశాలపై ఉమ్మడిగా కలం దూసిన తెలుగు సాహితీవేత్తలు)తో పోల్చి సంబోధించేవారు. ‘నీ సిద్ధాంతాలతో అన్ని సమయాల్లో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ సిద్ధాంతాన్ని వ్యక్తీకరించే నీ హక్కు కోసం ప్రాణాలైనా ఒడ్డి పోరాడుతాను’- మొదటినుంచీ జైపాల్‌, నేను ఇదే సిద్ధాంతంతో ముందుకు సాగాం. ఇరువురం సిద్ధాంతపరంగా కొన్ని విషయాల్లో విభేదించుకున్నప్పటికీ, స్నేహపూరిత వాతావరణంలో ప్రతి విషయాన్నీ తర్కించుకునేవాళ్లం. సిద్ధాంతాల విషయంలో జైపాల్‌ది రాజీలేని ధోరణి. ఆత్యయిక స్థితి సమయంలో కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించి పెద్దయెత్తున విమర్శలు గుప్పించి పార్టీకి రాజీనామా చేశారాయన. ఆ తరవాత బోఫోర్స్‌ విషయంలోనూ ఆ పార్టీపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు. అనంతరం దేశంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. దేశంలో భాజపా బలపడుతున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో ఆయన చెప్పిన ఓ మాట ఎప్పటికీ మర్చిపోయేది కాదు. ‘నేను కాంగ్రెస్‌ను అంతగా విమర్శించి మళ్ళీ అదే పార్టీలో తిరిగి చేరడం నీకు గాని, చాలామందికి గాని ఇష్టం లేని అంశమే. అయితే ఈ వయసులో సిద్ధాంతపరంగా కొన్ని విశ్వాసాల విషయంలో నేను రాజీపడలేను. భవిష్యత్తులో భాజపా ముందుకు వెళ్తుంది, బాగా బలపడుతుందని నాకు తెలుసు. అయితే సైద్ధాంతికంగా భాజపాతో రాజీ పడలేను. అందుకే కాంగ్రెస్‌లో చేరడమే ఉత్తమం. ఎందుకంటే నేను మూలతః కాంగ్రెస్‌వాదిని కాబట్టి’... ఆయన చెప్పిన ఈ మాటలు రాజకీయ విలువలపరంగా ఎన్నటికీ నిలిచిపోయేవి. నేను ఎప్పుడూ జైపాల్‌ను సరదాగా ‘బాస్‌’ అనేవాణ్ని. ఆయన ‘మా వెంకయ్య’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. పార్టీలు వేరైనా సందర్భం వచ్చినప్పుడల్లా నేను ఆయన పేరును ఉటంకించి వివిధ విషయాలు ప్రస్తావించేవాణ్ని. ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడు నా గురించి సానుకూలంగా మాట్లాడేవారు. అవన్నీ ఆనాడు మా మా పార్టీల్లో ఉన్న కొందరికి రుచించేవి కాదు. అయినా మేము అదే పంథాలో ముందుకు సాగాం. రాజకీయ విశ్వాసాలకు అతీతంగా ప్రతిభను, పనితనాన్ని, చిత్తశుద్ధిని గుర్తించి గౌరవించాలన్న దృక్పథంతోనే నడిచాం.

భారతీయతకు ప్రతీక
దేశ సామాజిక, రాజకీయ ప్రస్థానంలో లింగపరమైన దుర్విచక్షణ ఇప్పటికీ ఆందోళనకర సమస్యగానే కొనసాగుతోంది. విభిన్న రంగాల్లో తమ వాటా పొందేందుకు మహిళలు అనేక అడ్డంకులు అధిగమించాల్సిన పరిస్థితులున్నాయి. సామాజిక వ్యవస్థలోని ఈ ప్రతికూలతను సుష్మా స్వరాజ్‌ ధైర్యంగా ఎదిరించి నిలిచారు. విలక్షణ వ్యక్తిత్వం, ఆకట్టుకునే ప్రసంగాలతో జైపాల్‌ రెడ్డి తరహాలోనే సుష్మా స్వరాజ్‌ సైతం అనూహ్య విజయాలు సాధించారు. హరియాణాలోని సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆమె ఆ రాష్ట్రంలో అత్యంత పిన్నవయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ పూర్తిస్థాయి విదేశాంగ మంత్రిగా ఎదిగి విశిష్ట గౌరవం అందుకున్నారు. ఏ ప్రాతిపదికన చూసినా సుష్మా స్వరాజ్‌ సాధించిన విజయాలు వేనోళ్ల కొనియాడదగినవే. సిద్ధాంతపరంగా జైపాల్‌ రెడ్డి, సుష్మా స్వరాజ్‌లు రెండు భిన్నమైన పాయలకు ప్రాతినిధ్యం వహించారు. ఆత్యయిక పరిస్థితి తరవాత వారిరువురూ జనతా పార్టీతో కలిసి ప్రస్థానించారు. భిన్న రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహించిన వీరు- సశక్త భారతావని ఆవిష్కరణే సంకల్పంగా తమ పరిధుల్లో విశేష కృషి గావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జైపాల్‌, నేను చాలాకాలం పాటు సహ ప్రయాణికులుగా ప్రస్థానించాం. ప్రజా ప్రయోజన అంశాలపై, ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల్లోని లోటుపాట్లపై దృష్టిపెట్టి రాష్ట్ర అసెంబ్లీలో బలంగా గళం వినిపించేవాళ్లం. అసెంబ్లీలో 1978లో నేను కాలిడేసరికి జైపాల్‌ నాకన్నా అయిదేళ్లు సీనియర్‌. నా తొలి రోజుల్లో శాసనసభలో ఆయన నాకు స్నేహపూర్వక మార్గనిర్దేశిగా వ్యవహరించారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా రోజూ ఉదయాన్నే మేం ఎవరో ఒకరి ఇంట్లో కలిసి అల్పాహారం తీసుకునేవాళ్లం. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానంపై, ప్రస్తావించాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చించుకునేవాళ్లం. భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆధునిక భావజాలానికి ప్రతినిధిగా, హక్కుల సాధన దృక్పథంతో వ్యవహరించే నాయకుడిగా జైపాల్‌ తన రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు. నైతిక, రాజకీయ విలువలపరంగా ఆయన ఏ దశలోనూ రాజీపడలేదు. నమ్మిన సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని, దాని నాయకత్వాన్ని సైతం సూటిగా ప్రశ్నించేందుకు ఆయన వెనకాడలేదు.

మార్గదర్శకులు
రాజకీయాల్లో సుష్మా స్వరాజ్‌ నా ఆత్మ బంధువు. రక్త సంబంధీకులం కాకపోయినా మా ఇరువురి మధ్య అవ్యాజమైన ఆత్మీయాభిమానాలు పెనవేసుకున్నాయి. కాలం గడిచేకొద్దీ ఆ ఆత్మీయానుబంధం మరింత బలపడింది. సుష్మా స్వరాజ్‌కు నివాళులు అర్పించేందుకు ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు కన్నీటి పర్యంతమై, గద్గద స్వరంతో ఆమె తనయ బాన్సురి నాతో చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ‘వెంకయ్య గారిని కలిసిన ప్రతిసారీ మానసికంగా నాకు ఎంతో ఊరట, సాంత్వన కలిగేవి. ఒక అన్నకు చెల్లెలు చెప్పుకొన్నట్లుగా అరమరికల్లేకుండా స్వేచ్ఛగా అన్ని విషయాలూ చెప్పుకోగలగడం మనసును తేలికపరచేది’ అని సుష్మా స్వరాజ్‌ తన కుమార్తెతో అనేవారట! నిజంగా విధి చాలా క్రూరమైనది. అమూల్యమైన అప్యాయత, అనురాగం పంచిన సోదరిని విధి నా నుంచి దూరం చేసింది. సుష్మా రాజకీయ ప్రస్థానంలోని ప్రతి మలుపూ నాకు తెలుసు. 1998లో నేను కర్ణాటక పార్టీ వ్యవహారాల బాధ్యుడిగా ఉన్నప్పుడు బళ్ళారినుంచి పోటీ చేయమని ఆమెకు సలహా ఇచ్చాను. క్షణ మాత్రమైనా ఆలస్యం చేయకుండా ఆమె నా సూచనకు అంగీకారం తెలిపారు. ఆ తరవాత నేను పార్టీ దిల్లీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆమె అంగీకరించారు. ఏమాత్రం తొణకకుండా విజయాలూ వైఫల్యాలను ఎంతో హుందాగా స్వీకరించిన విశిష్ట వ్యక్తిత్వం ఆమెది. భారతీయ సంప్రదాయానికి, విలువలకు సుష్మా స్వరాజ్‌ మేలిమి ప్రతీకలా నిలిచారు. ఆమె ఆహార్యం, హావభావాలు, ఆచితూచి మాట్లాడే పద్ధతి, తోటివారిపట్ల కరుణ, మర్యాదకు మారుపేరుగా వ్యవహరించే తీరు, సీనియర్లు-పెద్దలతో వినయంగా వ్యవహరించే వ్యక్తిత్వం, నమ్మిన విషయాలను సూటిగా వ్యక్తపరచే ధోరణి, మాటల్లో తొణికిసలాడే తర్కం, ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడే శైలి ఆధునిక రాజకీయాల్లో ఆమెను విశిష్టమైన నేతగా నిలిపాయి. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా నాయకులందరూ సుష్మా స్వరాజ్‌ను ఎంతో అభిమానించేవారు. ప్రజలవైపునుంచీ ఆమె అపార గౌరవాభిమానాలు దక్కించుకున్నారు.

జైపాల్‌, సుష్మా ఇరువురూ గొప్ప వక్తలు. అనేక విషయాలపై విస్తృత అవగాహన, ఆంగ్ల భాషపై అపూర్వమైన పట్టు జైపాల్‌ సొంతం. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, సరళంగా వ్యక్తీకరించే శక్తి సుష్మా స్వరాజ్‌ది. హిందీలో అపార పాండితీ గరిమతోపాటు సంస్కృతంపైనా భారతీయ సంస్కృతిపైనా ఆమెకు గొప్ప అవగాహన ఉంది. పార్లమెంటులో ఏదైనా అంశంపై మాట్లాడేందుకు ఆ నాయకులు లేచి నిలుచుంటే యావత్‌ సభ వారి మాటలు ఆలకించడంకోసం శ్రద్ధగా చెవులు రిక్కించేది! సుష్మా రాజకీయ జీవితం స్థిరంగా, ఊర్ధ్వముఖంలో సాగింది. ఎత్తుపల్లాల సమశ్రుతిగా జైపాల్‌ రాజకీయ జీవితం ముందుకురికింది. దేశ రాజకీయాల్లో వీరిరువురికీ గొప్ప గౌరవం దక్కిందనడంలో మరో మాట లేదు. పట్టుసడలని విలువలు, బలమైన నమ్మకాల పునాదులపై ఆ నాయకుల రాజకీయ జీవనం నిర్మితమైంది. జాతి హితమై, తర్కబద్ధమై, విలువలమయమై సాగిన వారి పార్లమెంటరీ ప్రసంగాలు యువ రాజకీయ నాయకులకు గొప్ప పాఠాలుగా ఉపయోగపడతాయి. ఆ మహోన్నత నాయకులిప్పుడు భౌతికంగా మన మధ్య లేరు. దేశాభ్యున్నతితో ముడివడిన అనేక అంశాలపై వారి ధారాళ ప్రసంగాలు, వెలయించిన రచనలు ఆ నేతలను జాతి జనుల హృదయాలకు సదా సన్నిహితంగా ఉంచుతాయి, వారి అస్తిత్వాన్ని అనునిత్యం మనకు సన్నిహితంగా గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆ నేతలు అందించిన స్ఫూర్తి భవిష్యత్‌ భారతాన అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది.

అరుదైన ఆహ్వానం
ఆగస్టు సంక్షోభం (1984) సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు నేను, జైపాల్‌ నిర్వర్తించిన పాత్రను, చేసిన కృషిని గమనించిన ఆయన- మా ఇద్దరిని తమ మంత్రి వర్గంలో చేరమని, మా ఇరువురి సలహాలతో మరింతగా ప్రజలకు సేవ చేయవచ్చు అని ఆహ్వానించారు. ఆ విషయంపై మేమిరువురం కూలంకషంగా చర్చించుకున్నాం. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశాం. దానిపై స్పందించిన ఎన్టీఆర్‌- మీ పార్టీలో ఉంటూనే మంత్రులుగా కొనసాగండి అని స్పష్టం చేశారు. దానిపైనా మేమిద్దరం చర్చించుకున్నాం. ఆలోచనలపరంగా రామారావు చాలా మొండివారు. అలాగే సిద్ధాంతాల విషయంలో మా ఇద్దరిదీ రాజీపడే వ్యక్తిత్వం కాదు. అందుకే పదవులు ఆశించకుండా, బయటనుంచి సహకరించడంవల్ల అవసరమైనప్పుడు పరిస్థితిని సరిదిద్దే అవకాశం ఉంటుందని భావించి ఆయన రమ్మని ఒత్తిడి చేస్తున్నా, ప్రేమపూర్వకంగానే తిరస్కరించాం.

Posted on 10.08 .2019