Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

వేర్పాటువాద రాజకీయాలకు చెల్లు

* ఇరకాటంలో కశ్మీరీ పార్టీలు

కేంద్ర ప్రభుత్వం ‘జమ్మూకశ్మీర్‌’పై తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రకంపనలు సృష్టించింది. ఉభయ సభల వేదికగా అధికరణ-370ని బుట్టదాఖలు చేస్తూ వెలువరించిన తీర్మానం కశ్మీరీ రాజకీయ పక్షాలతోపాటు దేశంలోని ప్రధాన పార్టీలు తమ విధానాలు మార్చుకోక తప్పని పరిస్థితిని సృష్టించింది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి- స్వీయపాలన అంటూ ఇన్నేళ్లూ వినిపించిన వాదనలన్నీ 370-అధికరణ రద్దు కారణంగా న్యాయ ప్రాతిపదికను కోల్పోయి గాలిలో కలిసిపోయాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ కశ్మీర్‌కు అంతర్గత స్వతంత్ర ప్రతిపత్తికోసం దశాబ్దాలుగా వాదనలు వినిపించింది. ఆ పార్టీకి సంబంధించిన పెద్ద తలకాయలన్నింటినీ ఇప్పుడు అరెస్టు చేయడమో లేక గృహ నిర్బంధంలో ఉంచడమో చేశారు. పీడీపీ నాయకులు స్వీయ పాలనకోసం ఉద్యమించారు. ఆ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని ప్రస్తుతం హరి నివాస్‌లోని గెస్ట్‌ హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉంచారు. జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీల ప్రభుత్వాలు కొనసాగిన కాలంలో వేర్పాటువాదులను ఈ గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించేవారు.

కశ్మీరీ నాయకుల నిర్బంధాలు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు, కానీ ప్రజలను ప్రభావితం చేసి ఓట్లు సంపాదించేందుకు ఇన్నాళ్లూ వారు ప్రయోగించిన నినాదాలు ఇకపై అక్కరకు రానివిగానే మిగిలిపోతాయి. జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రేఖామాత్ర సంకేతాలిచ్చింది. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదం ప్రస్తావనకు కూడా రాని వాతావరణాన్ని కేంద్రం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో వేర్పాటువాద భావజాలాన్ని తిరిగి నెత్తికెత్తుకోవడమంటే అది ఒకరకంగా ప్రధాన స్రవంతి ఆలోచన ధోరణిని ధిక్కరించడమే అవుతుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఇప్పుడు లేదు. అసెంబ్లీ వేదికగా ప్రత్యేక వాదాన్ని వినిపించేందుకు అక్కడి రాజకీయ పక్షాలకు దారులు మూసుకుపోయాయి. వేర్పాటువాదం ప్రాతిపదికగా కొనసాగుతున్న కొన్ని స్థానిక రాజకీయ పక్షాలు అదే పంథా కొనసాగించవచ్చు.అధికరణ-370 రద్దుతో ఇప్పుడవి ఏ అజెండా ప్రాతిపదికన ఓట్లు అడుగుతాయో చూడాలి. జాతీయ పార్టీలతో పోలిస్తే గతంలో కశ్మీరీ పార్టీలు బాగా దూకుడుగా వ్యవహరించేవి. అధికరణ-370 పాదుకొనడానికి గతంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తీసుకున్న చొరవే కారణం. తాజా పరిణామం నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ! ‘పీడీపీ’ ఇటీవల పుట్టిన పార్టీ కాబట్టి దానికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఏదో ఒక నినాదం, విధానంతో ఆ పార్టీ అస్తిత్వ ప్రకటన చేసుకొనే అవకాశాలున్నాయి. సివిల్‌ సర్వీసులకు రాజీనామా చేసిమరీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన షా ఫైజల్‌ వంటివాళ్లకూ పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. ‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి’ పునాదిగా రాజకీయం నెరపిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఇకమీదట కొత్త పంథా ఎంచుకోవాల్సి ఉంటుంది. వేర్పాటువాదాన్ని బలంగా ముందుకు తెచ్చి తనను తాను పునరుజ్జీవింపజేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించవచ్చు. దాని అడుగులు ఆ దిశగా పడుతున్న సూచనలు ఇప్పటికే స్పష్టమవుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ శ్రీనగర్‌లో ఆగస్టు నాలుగున అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ మేరకు ‘గుప్కర్‌ తీర్మానం’ వెలువడింది. అధికరణ-370 రద్దును ఊహించి అందుకు వ్యతిరేకంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వేసిన తొలి అడుగుగా దాన్ని భావించవచ్చు. ఏడో దశకంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా భారత ప్రభుత్వానికి హెచ్చరిక సందేశాలు పంపేందుకు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్ళారు. మక్బూల్‌ భట్‌తో, అతడి మద్దతుదారులతో కలిసి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సైనిక దళాల నియామక ర్యాలీలో ఫరూఖ్‌ అబ్దుల్లా పాల్పంచుకున్నారు. అందుకు శిక్షగా మక్బూల్‌ భట్‌ను ఆ తరవాత తిహార్‌ జైలుకు తరలించారు. మరోవంక పీడీపీ మాత్రం లోగొంతుకతో వినిపించీ వినిపించనట్లు ‘వేర్పాటువాదాన్ని’ ప్రవచించింది. ఆ పార్టీ ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి విశ్వసనీయ విపక్షంగా వ్యవహరించిందనే చెప్పాలి. కానీ, తాజా చర్యలతో మోదీ సర్కారు వేర్పాటువాదులకు, ప్రధాన స్రవంతి ఆలోచన ధోరణికి మధ్య విస్పష్టమైన లక్ష్మణ రేఖలు గీసింది. ‘నయా కశ్మీర్‌’ నినాదంతో ప్రధాని మోదీ కొత్త తరహా రాజకీయానికి తెరలేపారు.

కర్ఫ్యూ సడలించిన నేపథ్యంలో కశ్మీర్‌లో నిరసనకారుల ర్యాలీలు జరిగాయి. అధికరణ-370 రద్దును వ్యతిరేకంగా నినదించిన నిరసనకారులు ‘ఆజాదీ’ (కశ్మీర్‌కు స్వేచ్ఛ) కావాలంటూ రోడ్డెక్కారు. వేర్పాటువాదుల పంథా ఎలా ఉండబోతోందన్న దానికి ఆ నిరసన ప్రదర్శనలు సంకేతంగా నిలిచాయి. మారిన పరిస్థితుల్లో వేర్పాటువాదం వినిపించడం ఇక ఎంత మాత్రం చట్టసమ్మతం కాదు. జన్మస్థలం ఆధారంగా ప్రత్యేక హక్కులన్న వాదనలకు కాలంచెల్లింది. వేర్పాటువాదులు సమకాలీనతను కోల్పోయారు. ‘దిల్లీ’తో బేరసారాలు ఆడటానికి వారి వద్ద ఇప్పుడే రకమైన సాధన సంపత్తీ లేదు. నిజానికి కొన్ని రకాల చట్టబద్ధ రక్షణలు తప్ప వారు కోల్పోయింది కూడా పెద్దగా ఏమీ లేదు. వేర్పాటువాదం గతి తప్పితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారిని జైళ్లలో పెట్టేది. ఇకమీదట ‘కేంద్రపాలిత ప్రాంతం’ ప్రాతిపదికన ఆ పని జరుగుతుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తే పాకిస్థాన్‌ విరుచుకుపడుతుందని, ఎంతకైనా తెగిస్తుందని వేర్పాటువాదులు ఆశలు పెట్టుకున్నారు. ఆచితూచి, మెత్తమెత్తగా మాట్లాడుతూ పాకిస్థాన్‌ స్పందించిన విధానంతో కశ్మీరీ వేర్పాటువాదులు నీరుగారిపోయారు. కశ్మీర్‌ను దిగ్బంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొందరి మనసులను గాయపరచాయనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కశ్మీర్‌’ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఒక గంభీర వాతావరణం, నిశ్శబ్దం నెలకొంది. అధికరణ-370 రద్దు ద్వారా తలపెట్టిన లక్ష్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 75శాతం సాధించేసింది. ఇంకో పాతిక శాతం పని మిగిలిఉంది. కశ్మీర్‌ భవిష్యత్తు గమనాన్ని, దానిపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఇదే!

‌- బిలాల్‌ భట్‌
(రచయిత- కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)
Posted on 12.08 .2019