Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

గుప్పిటపట్టే కుయత్నం

* సహచట్టంపై క్రీనీడలు

అయిదేళ్లకోసారి సామాన్యుడు వేసే ఓటు ఎంత బలమైనదో, సమాచార హక్కు చట్టం మేరకు ప్రజలకు దఖలుపడిన ఆయుధమూ అంతే శక్తిమంతమైనది. రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారాలు దేశభద్రతకు సంబంధించినవి కాబట్టి వివరాలను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. విమానాల కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంచడం సమాచార హక్కు నిబంధన ప్రకారం ప్రభుత్వ బాధ్యతని స్పష్టీకరించింది. దీనివల్ల పాలనకు సంబంధించిన ఎటువంటి సమాచారమైనా ప్రభుత్వం నుంచి పొందగలిగే హక్కు ప్రజలకు లభించింది.

కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి రిజర్వు బ్యాంకు అంగీకారం తెలిపిందా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. దీనిపై సహ చట్టం కింద వ్యాజ్యం దాఖలైంది. దానికి సమాధానమిస్తూ పెద్దనోట్ల రద్దుకు అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయానికి అసమ్మతినీ తెలియజేశామని రిజర్వు బ్యాంకు 2019 ఫిబ్రవరిలో తెలిపింది.

ఆధార్‌ కార్డు ఆధారంగా నాలుగు కోట్ల నకిలీ రేషన్‌కార్డులను గుర్తించి, వాటిని ప్రభుత్వం తొలగించిందని 2017 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటించారు. దీనిపై సహచట్టం కింద వ్యాజ్యం దాఖలైంది. తొలగించిన నకిలీ రేషన్‌ కార్డుల సంఖ్య నాలుగు కోట్లు కాదని, అది 2.30 కోట్లని నిర్ధారణైంది. 2015 ఫిబ్రవరిలో అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నరు డాక్టర్‌ రఘురాం రాజన్‌ ప్రధాన మంత్రి కార్యాలయానికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణాల ఎగవేతదారులుగా అనుమానితులైన రాజకీయ నేతల పూర్తి వివరాలు అందజేశారు. ఆ వివరాలను బహిరంగపరచాలని సహ చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి 2018 నవంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలవద్ద ఉన్న పాలనాపరమైన సమాచారాన్ని ఆధారాలతో సహా రాబట్టే అవకాశం సహ చట్టం వల్ల ప్రజలకు ఏర్పడింది. రాజకీయకోణంలో ప్రభుత్వాలు చేసే ప్రచారాల్లోని నిజానిజాలు ప్రజలు తెలుసుకోవడానికి ఈ చట్టం ఆయుధంగా ఉపయోగపడుతుంది. వీటివల్ల ప్రభుత్వాల్లో జవాబుదారీతనం పెరిగి బాధ్యతాయుతంగా నడచుకొనే పరిస్థితులు వస్తాయి. రాజకీయ నాయకులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించే వ్యక్తిగత (ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, నేరచరిత్ర తదితర)వివరాల్లో లొసుగులుంటే, వాస్తవాలను ధ్రువీకరించుకోవడానికీ ఈ చట్టం ప్రజలకు ఉపకరిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులతో పాటు ప్రధాన మంత్రి పైనా ఈ విషయంలో (ముఖ్యంగా వారి విద్యార్హతలకు సంబంధించి) సహ చట్టం కింద వ్యాజ్యం దాఖలు కావడం, వీటిపై మళ్ళీ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేయడం గమనార్హం.

రాజకీయ పార్టీలు తాము సేకరించిన పార్టీ విరాళాల వివరాలు తెలియజేయాలనే వాదన తలెత్తడంతో, ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడటానికి 2018 బడ్జెట్‌లో ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టారు. వాటి ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే దాతల వివరాలు గోప్యంగా ఉంచుతారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాయి. రాజకీయ పార్టీలూ సహ చట్టం పరిధిలోకి వస్తాయని 2013 జూన్‌లో సమాచార కమిషనర్‌ తీర్మానించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఈ వాదనను తోసిపుచ్చింది. 2018 మార్చిలో పార్లమెంటులో చట్టాలను సవరించి, పార్టీలు తమకు వచ్చిన విరాళాల వివరాలను గోప్యంగా ఉంచవచ్చని, పైగా 1976 నుంచి విదేశాల్లో పార్టీలు సేకరించిన విరాళాల వివరాలూ రహస్యంగా ఉంచవచ్చని తీర్మానించారు. రాజకీయ పార్టీల నేతలంతా కుమ్మక్కై సహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవడానికి చేసిన ఈ చట్ట సవరణలను నిరసిస్తూ ప్రజాసంఘాలు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాయి.

ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు సహ చట్టం వల్ల జవాబుదారీతనం పెరగడం, ప్రజల్లో అవగాహన ఏర్పడి ప్రజలు, ప్రజాసంఘాలు వ్యాజ్యాలు వేస్తున్నాయి. ఈ పరిణామం ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా మారిందనడంలో సందేహం లేదు. సహ చట్టంలో చేసిన సవరణలను 2019 జులై 26న పార్లమెంటులో ఆమోదించారు. ఈ సవరణల వల్ల చట్టాన్ని అమలు చేసే ప్రధాన సమాచార కమిషనర్‌, కేంద్ర, రాష్ట్రాల సమాచార కమిషనర్ల నియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వెసులుబాటు పొందింది. 2005లో తొలిసారి చట్టం ఏర్పడినప్పుడు ప్రధాన సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్ల నియామకాలు, వారి పదవీకాలం, వేతనాలు వీటన్నింటినీ ఎలక్షన్‌ కమిషనర్ల పదవులతో సమానంగా నిర్ణయించారు. దీనివల్ల వారు స్వతంత్రంగా రాజకీయ, ప్రభుత్వపరమైన ఒత్తిళ్లకు గురికాకుండా నిర్భయంగా తమ విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని తొలుత చట్టసభలో భావించారు. ఏకు మేకైనట్లు ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు ఈ చట్టం ఇబ్బందికరంగా మారడంతో వారి నియామకాల నిబంధనలను సడలించారు. దీంతో ప్రధాన సమాచార కమిషనర్‌, కేంద్ర, రాష్ట్రాల సమాచార కమిషనర్ల నియామకాలు, పదవీకాలం, వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వెసులుబాటు పొందింది. దీనివల్ల సమాచార కమిషనర్లు తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయి ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రభుత్వాలకు అనుగుణంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. తద్వారా సహ చట్టం కోరలు తీసిన పాములా మారే అవకాశం ఉంది. న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో ఈ చట్టం ప్రజల ప్రాథమిక హక్కు కిందికి వస్తుందని పేర్కొన్నాయి. దీన్ని సవరించడంవల్ల ఆ హక్కుకు భంగం వాటిల్లుతుందన్న వాదన ముమ్మాటికీ నిజం. సమాచార కమిషనర్ల పదవుల ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం వల్లఅవి రాజ్యాంగ పదవుల కిందికి రావని, చట్టపరమైనవి కాబట్టి చట్ట సవరణ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. న్యాయస్థానం ఈ సవరణలను ఆమోదిస్తుందా, తిరస్కరించి పౌరుల హక్కులను పరిరక్షిస్తుందా అన్నది వేచిచూడాలి!


- బీఎన్‌వీ పార్థసారథి
Posted on 21.08.2019