Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

వాస్తవాలకు వక్ర భాష్యం

* కశ్మీర్‌పై పాక్‌ కట్టుకథలు

గత కొద్దిరోజులుగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అసహనంగా ఉన్నారు. నోటి దురుసుతనం చూపిస్తున్నారు. జరగరానిది ఏదో జరిగినట్లు, ప్రపంచం మొత్తం భారత్‌ చర్యల్ని ఖండించాలని అదేపనిగా కోరుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. త్వరలో ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ముందు పాకిస్థాన్‌ తన నిర్దోషిత్వం నిరూపించుకోలేకపోతే దానిని ‘బ్లాక్‌లిస్ట్‌’లో చేర్చడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా జమ్ము-కశ్మీర్‌కు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న సంస్థాగత, పాలన మార్పులపై ఇమ్రాన్‌ గగ్గోలు పెడుతున్నారు. చైనా, పరిమిత స్థాయిలో బ్రిటన్‌ తప్ప అంతర్జాతీయ సమాజం దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇరుదేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవలసిన అంశమని దాదాపుగా అన్ని దేశాలూ తేల్చిచెప్పాయి. కశ్మీర్‌కు సంబంధించి పాక్‌ వాదనలో సహేతుకత లోపించింది. అర్థరహిత వాదనలతో అది అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించాలని చూస్తోంది. చరిత్రను పరికిస్తే పాక్‌ వాదనలోని డొల్లతనం బయట పడుతుంది.

అదను చూసి దాడి
భారత్‌, పాకిస్థాన్‌ విభజన జరిగిన 1947 నాటికి జమ్ము-కశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ ఏ దేశంలో చేరకుండా స్వతంత్ర దేశంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆదివాసులను, వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోని పఠాన్లను రెచ్చగొట్టి శ్రీనగర్‌పై దాడికి దిగింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో హరిసింగ్‌ భారత్‌తో విలీన ఒప్పందంపై సంతకం చేశారు. ఆ ప్రతిపై మౌంట్‌ బాటన్‌ ఆమోదముద్ర వేసిన తరవాతనే భారత సైన్యం శ్రీనగర్‌కి వెళ్లింది. కానీ ఒప్పందంలో లేకపోయినా మరుసటిరోజు మౌంట్‌బాటన్‌ మహారాజుకి ఉత్తరం రాస్తూ పరిస్థితులు కుదుటబడిన తరవాత ప్రజల అభిప్రాయాన్ని కోరతామని చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉంది. పాకిస్థాన్‌ అధీనంలో కొంత భూభాగం ఉండటం, దానిపై భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి విన్నవించడం, జమ్ము-కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కావాలని మనమే అడగటం అందరికి తెలిసిందే. ఆ తరవాత ఐక్యరాజ్యసమితి దానిపై తీర్మానం చేసింది. అందులో మొదటి షరతు పాకిస్థాన్‌ తన సైన్యాన్ని, తాను మద్దతిచ్చిన ఆదివాసులను ఉపసంహరించాలని చెప్పింది. ఆ తరవాత భారత సైన్యాన్ని రక్షణ అవసరాల వరకు ఉంచి దఫాల వారీగా ఉపసంహరించాలని పేర్కొంది. పరిస్థితులు కుదుటపడిన అనంతరం ప్రజాభిప్రాయసేకరణ జరగాలని సూచించింది. దీన్ని పాకిస్థాన్‌ తిరస్కరించింది. ఆ తరవాత అందుకు భారత్‌ సైతం ఒప్పుకోలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఐక్యరాజ్య సమితి తీర్మానంలోగాని, 1947 భారత ప్రభుత్వ చట్టంలోగానీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండాలని చెప్పలేదు. అవి ఏదో ఒక దేశంతో ఒప్పందం చేసుకోవాలని మాత్రమే ఉంది. 1947 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ సవరణ చట్టంలోగానీ ప్రజాభిప్రాయం జరపడానికి ఏ నిబంధన లేదు. మహారాజు చేసే ఒప్పందమే అంతిమం. న్యాయపరంగా చూస్తే ఆ ఒప్పందం స్పష్టమైన హక్కు కలిగిన దస్తావేజు.

పాకిస్థాన్‌ ఆక్రమించుకున్న ప్రాంతానికి వారు ‘ఆజాద్‌ కశ్మీర్‌’ అని పేరు పెట్టారు. ఆజాద్‌ అంటే స్వేచ్ఛ. ప్రస్తుతం అక్కడ అదే కరువయ్యింది. ఆజాద్‌ కశ్మీర్‌కు అసెంబ్లీతో పాటు ‘మండలి’ కూడా ఉంది. దీనికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అందులో ఎనిమిది మంది సభ్యులు కశ్మీర్‌ నుంచి, ఆరుగురు పాక్‌ ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా ఉంటారు. దీనికి ఛైర్మన్‌గా పాక్‌ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. దీన్నిబట్టే ‘ఆజాద్‌ కశ్మీర్‌’ కు ఏపాటి స్వేచ్ఛ ఉందో అర్థమవుతుంది. ‘ఆజాద్‌ కశ్మీర్‌’లోనైనా, గిల్గిట్‌ బాల్టిస్తాన్‌లోనైనా రాజకీయ కార్యకలాపాలు సాగించాలంటే ముందుగా పాకిస్థాన్‌కు విధేయుడినని ప్రకటించాలి. లేనట్లయితే ఇంతే సంగతులు. అటువంటిది భారత్‌ ఆధీనంలోని జమ్ము-కశ్మీర్‌కు సంబంధించిన అధికరణలు 370, 35ఏ గురించి మాట్లాడే హక్కు పాక్‌కు లేనేలేదు. ఈ విషయమై పాక్‌ అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తోంది. భద్రతామండలి జోక్యానికి అర్థించి భంగపడింది. ఇటీవల తమ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌కి మేలు చేయడం కోసం ముజఫరాబాద్‌ మీదుగా ప్రవహించే నీలం నది నీటిని టన్నెల్‌ ద్వారా జీలం నదికి మళ్లించింది. దీనితో ముజఫరాబాద్‌ నగరం నీళ్లు లేక అల్లాడుతోంది. ఇది ‘ఆజాద్‌ కశ్మీర్‌’ రాజధాని. అక్కడ స్థానికులకు బదులుగా క్రమంగా పాక్‌ పంజాబీల ఆధిపత్యం మొదలయ్యింది. కశ్మీరీలకు అక్కడ ఎటువంటి స్వయం పాలన లేదు.

రహస్యంగా ఆక్సాయిచిన్‌ ప్రాంతంలో టిబెట్‌- సింకియాంగ్‌ రహదారిని చైనా 1950లలో నిర్మించి భారత్‌తో స్నేహానికి తూట్లు పొడిచింది. నెహ్రూ మొదట్నుంచీ చైనా అంటే అభిమానంగా ఉండేవారు. భారత్‌ పట్ల ఆ కమ్యూనిస్ట్‌ దేశం ఉదారంగా వ్యవహరిస్తుందని భావించారు. కానీ భారత్‌పై దాడి చేస్తుందని ఆయన కలలో సైతం ఊహించలేదు. 1962 యుద్ధంతో చైనాపై భ్రమలన్నీ తొలగిపోయాయి. తాజాగా వివాదాస్పద భూభాగం నుంచి చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా నిర్మాణానికి పూనుకోవడం ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీసింది.

మౌంట్‌బాటన్‌ మోసం
భారత్‌ విభజనకు సూత్రధారి బ్రిటన్‌. ఇందులో మహమ్మదాలీ జిన్నా పాత్రధారి మాత్రమే. ఇటీవల వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అప్పట్లో బ్రిటన్‌, నాటి సోవియట్‌ యూనియన్‌ మధ్య ఆధిపత్యపోరు నడిచేది. ఇందులో భాగంగా తమకు భారత నైరుతి సరిహద్దులోని కరాచీ నుంచి కశ్మీర్‌ దాకా ఓ సురక్షిత స్థావరం కావాలని బ్రిటన్‌ భావించి విభజనకు కుట్ర పన్నింది. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులను విస్మరించి ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌కి కట్టబెట్టింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు సాధించింది. మౌంట్‌బాటన్‌ శ్రీనగర్‌ వెళ్లి కశ్మీర్‌ మహారాజుకు పాకిస్థాన్‌లో చేరమని సలహా ఇచ్చారు. అది కుదరకపోవటంతో గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతంలో మేజర్‌ బ్రౌన్‌ నాయకత్వాన తన సైన్యాధికారులతో తిరుగుబాటు చేయించి పాకిస్థాన్‌కు ఆ భాగాన్ని అప్పజెప్పారు. ఆ తరవాత చెప్పిన పని సక్రమంగా చేసినందుకు మేజర్‌ బ్రౌన్‌కి యోధుడుగా మహారాణి బిరుదు ఇచ్చి సన్మానం చేసింది.

దెయ్యాలు వేదాలు వల్లించడమే...
మానవ హక్కుల గురించి పాకిస్థాన్‌, చైనా మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) లో పాకిస్థాన్‌ పూర్తిగా మానవ హక్కులను మంటగలిపింది. ఒక్క జింజెర్‌ జిల్లాలోనే 300కు పైగా యువకులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పత్రికలు ఇటీవల బయటపెట్టాయి. 2016 మార్చి 14న బలవరిస్థాన్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌ గిల్గిట్‌-బాల్టిస్తాన్‌లో రాజకీయ, మతపరమైన వేధింపులు ఎక్కువయ్యాయని అప్పటి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్‌కి విన్నవించారు. న్యాయ, రాజ్యాంగ పరమైన హక్కులను పాలకులు హరించివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బలూచిస్థాన్‌లో ఏ విధంగా మానవ హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయో తెలిసిందే. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ ముస్లిములు అక్కడ రెండో తరగతి పౌరులుగా దుర్భర జీవనం సాగిస్తున్నారు. వాళ్లనే ముజాహిర్లని పిలుస్తారు.

ఇక చైనా విషయం సరే సరి! 1950లో టిబెట్‌ని బలవంతంగా ఆక్రమించింది మొదలుకొని టిబెటన్లు వేధింపులకు గురి చేస్తోంది. ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకోలేక దలైలామా నాయకత్వాన 1959లో టిబెటన్లు భారత్‌ పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. బౌద్ధ బిక్షువులను ఏ విధంగా హింసిస్తుందీ చూస్తున్నాం. ఇటీవల కాలంలో జింజియాంగ్‌ ప్రావిన్స్‌లో వీగర్‌ ముస్లిములపై చైనా ఉక్కుపాదం మోపింది. వారిని వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తోంది. దాదాపు 10 లక్షల మంది వీగర్లను పునర్విద్య పేరుతొ నిర్బంధ శిబిరాల్లో ఉంచారు. రెండో ప్రపంచయుద్ధంలో యూదులను హిట్లర్‌ ఏ విధంగా శిబిరాల్లో నిర్బంధించారో ఇప్పుడు చైనా అధినేత షి జిన్‌పింగ్‌ సైతం జింజియాంగ్‌ ప్రావిన్స్‌లో వీగర్‌ ముస్లిముల పట్ల అదే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చివరకు వీగర్‌ ముస్లిములు ఏ పేరు పెట్టుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ రకమైన ప్రార్థనలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తోంది. ‘మొహమ్మద్‌’ లాంటి పేర్లు పెట్టుకుంటే అంగీకరించడం లేదు. అలాంటి చైనా మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం! దురుద్దేశంతో పాక్‌, చైనా చేసే వ్యాఖ్యలను భారత్‌ పట్టించుకోవలసిన పని లేదు. దారి తప్పిన కశ్మీర్‌ యువతను ఎంత త్వరగా ప్రధాన స్రవంతిలోకి తీసుకురాగలమా అన్న విషయంపైనే దృష్టి పెట్టాలి. ఈ దిశగా వేగంగా అడుగులు వేయడం ఇప్పుడు న్యూదిల్లీ ముందున్న కర్తవ్యం!Posted on 22.08.2019