Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ప్రజాస్వామ్య ఫలం... ఎవరి పరం?

* గాడి తప్పుతున్న వ్యవస్థలు
స్వాతంత్య్ర సమర సేనానుల త్యాగఫలం స్వేచ్ఛా భారతం! స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలచుకునే క్రమంలో ఎంతమేరకు పురోగతి సాధించామని తరచిచూస్తే జాతి పురోగమనంలో ఎన్నో ఒడుదొడుకులు కనిపిస్తాయి. ఆర్థిక పురోగతి, పారిశ్రామికీకరణ, ఆహార ఉత్పత్తిలో వూర్ధ్వగమనం, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, అక్షరాస్యత, విద్య, స్వతంత్ర మీడియా, ఐటీ విప్లవం వంటివి ఈ 69ఏళ్లలో స్వతంత్ర భారతం సాధించిన గణనీయ విజయాలుగా చెప్పుకోవచ్చు. కానీ, ఇంకా ఎక్కడో ఏదో అలజడి! రాజకీయ వ్యవస్థ రోజురోజుకూ దారితప్పుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పరస్పరం విమర్శలు రువ్వుకోవడమే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్న తీరు నిర్వేదం మిగులుస్తోంది. స్వార్థమే పరమార్థంగా పార్టీలు ప్రదర్శిస్తున్న విన్యాసాలు ప్రజాస్వామ్య వ్యవస్థ నవనాడులనూ కుంగదీస్తున్నాయి. ప్రపంచంలోనే భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా గర్వంగా ప్రకటించుకుంటాం. కానీ, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశానికి తలవంపులు తీసుకువస్తున్నాయి. 2014 ఏప్రిల్‌-మే మధ్యకాలంలో భారత ఎన్నికల సంఘం బృహత్తర కార్యక్రమానికి తెరలేపింది. పార్లమెంటుకు 543సభ్యులను ఎంపిక చేసే క్రమంలో 81.40కోట్ల ఓటర్లను భాగస్వాములుగా మార్చే బృహత్తర ఎన్నికల ప్రక్రియకు ఎలెక్షన్‌ కమిషన్‌ శ్రీకారం చుట్టింది. వివిధ దశల్లో పోలింగ్‌ నిర్వహించి, చెప్పుకోదగ్గ సమస్యలు లేకుండానే మహత్తర కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం దిగ్విజయంగా పరిపూర్తి చేసింది. ఎన్నికలు ముగిశాయి. పార్లమెంటులో 543మంది సభ్యులు అడుగుమోపారు. ఆ తరవాత ఏం జరిగింది?

సభాసమయం వృథా

ఏ ఒక్క అంశంపైనా సరైన చర్చ లేకుండానే వర్షకాల సమావేశాలు ముగిసిపోయాయి. సమావేశాలు జరిగిన తీరు దేశ ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలను ఏ స్థాయిలో చీడ చెండుకు తింటుందో కళ్లకు కట్టింది. గడచిన పాతికేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ పట్టుతప్పాయి. స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల వరకూ పార్లమెంటుతోపాటు రాష్ట్రాల శాసనసభలు ఏటా సగటున 120నుంచి 140రోజుల వరకు సమావేశమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. గడచిన కొన్నేళ్లుగా పార్లమెంటు ఉభయసభలు సంవత్సరానికి సగటున 70రోజులపాటు సమావేశమవుతున్నాయి. రాష్ట్రాల్లో పరిస్థితి మరీ నాసిరకం. అక్కడ శాసనసభలు 25నుంచి 30రోజుల వరకే సమావేశమవుతున్నాయి. ఆ కొద్దిరోజులపాటైన ప్రజలకు అక్కరకొచ్చే విషయాలు మాట్లాడుకుంటున్నారా అంటే అదీ లేదు! ప్రజా సమస్యలపై చర్చించేందుకు చట్టసభల సభ్యులకు సమయమే దొరకడం లేదు. అయినదానికీ కానిదానికీ పూనుకొని విపక్షాలు సభలను స్తంభింపజేస్తున్నాయి. ఒకప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను తాము నిజమైన ప్రజా సేవకులుగా నమ్మేవారు. కానీ ఇప్పుడు ఆ భావన తిరగబడింది. ప్రజలను తమ బానిసలుగా నాయకమ్మన్యులు జమకడుతున్నారు. అయిదో దశకంలో ఎంపీల జీతాల బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు అనేకమంది సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. ఒకవేళ సభలో బిల్లు నెగ్గినప్పటికీ తాము పెరిగిన జీతాలను స్వీకరించబోమని వారు విస్పష్టంగా తేల్చిచెప్పారు. నేడు పరిస్థితి చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బోలెడన్ని రాయితీలు, 'అలవెన్సు'లను మినహాయిస్తే ఎంపీల జీతం ఇప్పుడు లక్ష రూపాయలకు పైమాటే! ఎప్పటికప్పుడు జీతాలు, రాయితీలు పెరుగుతున్నా వారికి మాత్రం సంతృప్తి ఉన్నట్లు లేదు. అధికారికంగా తమ కార్లపై ఎర్రబుగ్గ పెట్టుకోవడానికి అనుమతించాలని కోరుతూ రెండేళ్ల క్రితం వందమంది ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇంతకీ 'ఎందుకయ్యా మీకందరికీ కార్లమీద ఎర్రబుగ్గలు?' అని అడిగితే- దిల్లీ రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు నిబంధనలు ఉల్లంఘించినా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానం విధించకుండా ఉండేందుకని కొంతమంది జవాబు చెప్పారు... హవ్వ! పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లో ఈ తరహా సంస్కృతి వెదికినా కనిపించదు. బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఎంపీలు సాధారణంగా సంపన్న నేపథ్యాలకు చెందినవారు. కానీ, ఏనాడూ వారు తమ డబ్బును, హోదాను ప్రజల ముందు ప్రదర్శించాలని భావించరు. చాలామంది బ్రిటిష్‌, జర్మన్‌ ఎంపీలు పార్లమెంటుకు సైకిల్‌పై వెళుతుంటారు. వారికి వ్యక్తిగత భద్రతకు సంబంధించిన భయాలూ ఉండవు. బ్రిటన్‌, జర్మనీ, స్వీడన్‌, నార్వే దేశాల్లో ఎందరో ఎంపీలు, మంత్రులు స్థానిక మెట్రో రైల్లోనో లేదా బస్‌లోనో ప్రయాణం చేసి పార్లమెంటుకు వెళుతుంటారు. ఈ దేశాల్లో చివరికి ప్రధాని సైతం 'మెట్రో'లోనే కార్యాలయానికి చేరుకుంటుంటారు. కూరగాయలు, ఇంటికి అవసరమైన ఇతర సరకులు కొనేందుకు చాలామంది ఎంపీలు ఆదివారం ఉదయం వేళల్లో మార్కెట్లకు స్వయంగా వెళుతుంటారక్కడ. కానీ మనదేశంలో వ్యవహారం మరీ విడ్డూరం. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్ళడం తమ హోదాకు తగదని ఇక్కడి ఎంపీలు భావిస్తారు. ఖరీదైన పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించకపోతే ప్రజల్లో తమకు గౌరవం దక్కదన్నది వాళ్ల భావన. సాధ్యమైనంతవరకూ ఇక్కడి ప్రజాప్రతినిధులు జనానికి దూరంగా మెలగుతుంటారు. ప్రజలకూ, నాయకులకు మధ్య అగాధం పెరిగిపోతుంటే మరోవంక- దేశ ఎన్నికల వ్యవస్థను శాసిస్తున్న అంగ, అర్థబలాలు ప్రజాస్వామ్యానికి పెనుసవాలు విసురుతున్నాయి. ఏటికేడు ఎన్నికల బరిలో నేరచరితుల సంఖ్య పెరిగిపోతోంది. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నిరుడు సమర్పించిన వివరాల ప్రకారం సగటున ఒక్కో ఎంపీ ఆస్తి మూడు కోట్ల రూపాయలుగా వెల్లడైంది. రెండు మూడు కోట్ల రూపాయల ఆస్తిపరులుగా చట్టసభల్లో ప్రవేశించిన కొందరు కొన్నేళ్ల వ్యవధిలోనే వందలకోట్ల శ్రీమంతులుగా మారిపోవడం సాధారణమైపోయింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సైతం అంత తక్కువకాలంలో ఇంత డబ్బు సంపాదించలేరు. రాజకీయాల్లో చేరినవారు మాత్రం కళ్లు మూసి తెరిచేలోగా కుబేరులైపోతున్నారు. దేశంలో రాజకీయాలు అవినీతితో అంటకాగుతుండటం ఈ సందర్భంగా గమనార్హం. స్వాతంత్య్రానంతరం తొలి దశాబ్దాల్లో జాతీయ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న నాయకులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవారు. వారిది తిరుగులేని నైతికధృతి! దురదృష్టవశాత్తూ చాలామంది నేతలు రాజకీయాలను కుంభకోణాలకు సమానార్థకంగా మార్చేశారు. పాశ్చాత్యదేశాల తరహాలోనే భారత్‌లోనూ మీడియా చురుకుగా వ్యవహరిస్తోంది. నేతల బండారాలను, కుంభకోణాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. కానీ, అవినీతికి శాశ్వతంగా చరమగీతం పాడాలంటే మాత్రం చట్టాలు పదునుగా ఉండాలి. వాటి అమలు సక్రమంగా జరగాలి. అక్రమాస్తులను కాపాడుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో పార్టీలకు అతీతంగా నాయకులంతా ఏకమవుతున్నారు. అందరూ కుమ్మక్కై పరిశోధన, విచారణ ప్రక్రియలకు మోకాలడ్డుతున్నారు. నిరుటి ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా టికెట్లు కేటాయించిన వారిలో 30శాతం అభ్యర్థులు నేర చరితులేనని; వారిలో 12శాతంమందిపై హత్య, అత్యాచార యత్నం వంటి తీవ్ర నేరాలకుగాను నమోదైన కేసులు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయని నివేదిక తేటతెల్లం చేసింది. ఇతర పార్టీల్లోనూ పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది.

కొడిగడుతున్న విశ్వాసం

స్వాతంత్య్రానంతరం తొలినాళ్లలో పార్లమెంటును మద్గల్‌ కేసు కుదిపేసింది. పార్లమెంటు సభ్యుడు ముద్గల్‌ బాంబే స్వర్ణవర్తకుల అంశాన్ని సభలో ప్రస్తావించేందుకుగాను ఆ సంఘంనుంచి రూ.2700 లంచం తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పదేళ్లక్రితం పార్లమెంటును ఇదే తరహా కుంభకోణం స్తంభింపజేసింది. పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి సంబంధించిన వ్యవహారం ఓ మీడియా శూలశోధన ద్వారా బయటపెట్టింది. ఒక ప్రశ్నకుగాను ఓ ఎంపీ రూ.30వేలు డిమాండ్‌ చేయగా మరో ఎంపీ లక్షాపదివేల రూపాయలు కావాలని కోరాడు. టెలివిజన్‌ ఛానల్‌లో ఆ దృశ్యాలను చూసి జాతిజనం ముక్కున వేలేసుకొంది. ఆ వ్యవహారంలోని నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓ కమిటీని నియమించారు. లోక్‌సభకు చెందిన పదిమంది సభ్యులపై ఆ కమిటీ విచారణ జరిపింది. ఓ రాజ్యసభ సభ్యుడిపై ఎథిక్స్‌ కమిటీ విచారణ నిర్వహించింది. ఉభయసభలు ఏర్పాటు చేసిన కమిటీలు సభ్యులు తప్పుచేసినట్లుగా నిర్ధారించాయి. వారిని సభనుంచి బహిష్కరించాలని సిఫారసు చేశాయి. 'ఎన్నికైన ప్రతినిధులపై ప్రజలకు క్రమంగా విశ్వాసం కొడిగడుతోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే తప్పుచేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవడమే మార్గం' అని లోక్‌సభ కమిటీ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆ నేపథ్యంలో తప్పుచేసిన సభ్యులను పార్లమెంటునుంచి బహిష్కరించారు. ఆ కుంభకోణం ప్రజల స్మృతిపథంనుంచి తొలగిపోకమునుపే 'ఎంపీలాడ్స్‌' స్కాము బయటపడింది. నియోజకవర్గాల అభివృద్ధికోసం ఒక్కో ఎంపీకి కేటాయించిన కోట్ల రూపాయల డబ్బును ఇతరేతర ప్రలోభాలకు లొంగి సభ్యులు వినియోగిస్తున్నట్లు ఒక టెలివిజన్‌ ఛానల్‌ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. దానిపై లోక్‌సభ కమిటీని నియమించారు. ఎంపీలు తప్పుచేసినట్లుగా నిర్ధారించిన ఆ కమిటీ వారిని నిర్దిష్టకాలానికి సభనుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. మరో కేసులో గుజరాత్‌కు చెందిన ఎంపీ ఒకరు ఓ మహిళను తన భార్యగా చెప్పుకొని, ఆ మేరకు పత్రాలు సృష్టించి, పాస్‌పోర్టు సంపాదించి, కెనడాలో ఆమెను వదిలి వచ్చిన ఘటన మన వ్యవస్థలు ఏ స్థాయికి భ్రష్టుపట్టాయో తేల్చిచెప్పింది. ఎంపీలపై ఫిర్యాదులు అన్నీ ఇన్నీ కావు. అధికారికంగా తమకు కేటాయించిన నివాసాన్ని మరొకరికి లీజుకు ఇవ్వడం, గ్యాస్‌ కనెక్షన్‌ కూపన్లను మరొకరికి 'విక్రయించడం'; రైళ్లలో తమకు కల్పించిన మొదటి తరగతి ఏసీ కోచ్‌ల సదుపాయాన్ని దుర్వినియోగించడం... ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. వీటన్నింటికీ అంతం పలకాలంటే తప్పుచేసినవారిపట్ల కఠినంగా వ్యవహరించడమే మార్గం. యాభయ్యేళ్ల స్వాతంత్య్రోత్సవాలను పురస్కరించుకొని 1997, సెప్టెంబరు 1న లోక్‌సభ చేసిన ఓ తీర్మానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సి ఉంది. నిరంతరం సానుకూల చర్యలతో ముందుకు కదిలితే తప్ప 'ప్రజా జీవనంలో పారదర్శకతను, నిబద్ధతను, జవాబుదారీతనాన్ని నెలకొల్పడం సాధ్యం కాదు' అని ఆ తీర్మానం విస్పష్టంగా పేర్కొంది. పార్లమెంటు ఉభయసభలూ ఆ తీర్మానాన్ని తుచ తప్పకుండా అమలు చేయడంపై మరింత దృష్టి సారించాల్సిన సమయమిది.

ఎ. సూర్యప్రకాశ్‌
(ర‌చ‌యిత - ప్ర‌సార భార‌తి ఛైర్మన్‌)
Posted on 22.08.2015