Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

బహుముఖ ప్రజ్ఞా ధురీణుడు

* వాగ్ధాటి దార్శనికతల కలబోత

స్పష్టమైన ఆలోచనా సరళి, దృఢ సంకల్పం, సమర్థ భావప్రకటనా సామర్థ్యం అరుణ్‌ జైట్లీ సొంతం. నా చిరకాల ప్రియ మిత్రుడు అరుణ్‌ జైట్లీని ఈ నెల 11న దిల్లీ ఆస్పత్రిలో పరామర్శించినప్పుడు, ఆయన శీఘ్రంగా కోలుకుంటారని, కోలుకోవాలని ఆశించాను. ఆయన కూడా నా చేతిలో చేయి వేసి, త్వరలోనే మామూలు మనిషిని అవుతానని సైగల ద్వారా సూచించారు. ఆయనతో అదే చివరి కరచాలనం అవుతుందని కలలోనైనా ఊహించలేదు. ఇంత త్వరగా ఆయన శాశ్వత వీడ్కోలు పలుకుతారని అనుకోలేదు. జైట్లీ మళ్ళీ మన మధ్యకు వచ్చి కర్తవ్య నిర్వహణకు ఉపక్రమించబోరని, అవసరమైనప్పుడు ఆయన సలహాసంప్రతింపులు నాకు లభించబోవని భావించడమే దుస్సహంగా ఉంది. ఆ కఠోర వాస్తవంతో రాజీపడలేకున్నాను.

నాలుగు దశాబ్దాల స్నేహం
కళాశాల రోజుల నాటిది మా ఇద్దరి తొలి పరిచయం. అప్పటి నుంచి 40 ఏళ్లపాటు దూరదృష్టి గల వివేకవంతమైన ఆయన సలహాలు స్వీకరిస్తూ వచ్చాను. 1974లో అఖిల భారత విద్యార్థి సంఘాల సదస్సులో మేము మొదటిసారి కలుసుకున్నాం. ఆ సదస్సులో జైట్లీ దిల్లీ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తే, నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ సంఘానికి ప్రతినిధిని. అప్పటినుంచి మా రాజకీయ పయనం చెట్టపట్టాలుగా సాగింది. ఆ సుదీర్ఘ యానంలో ఎన్నో ఒడుదొడుకులను కలిసికట్టుగా ఎదుర్కొని అధిగమించాం. ఈ క్రమంలో మా మధ్య దృఢమైన సాన్నిహిత్యం, పరస్పర గౌరవం నెలకొన్నాయి. చివరకు విధి క్రూర హాసం నా నేస్తాన్ని నాకు దూరం చేసి తీరని వేదన మిగిల్చింది. బహుముఖ ప్రజ్ఞావంతుడు అనే పదానికి నిలువెత్తు నిర్వచనమే అరుణ్‌ జైట్లీ. 66 ఏళ్ల జైట్లీ సమకాలీన భారతంలో అందరి మన్ననలు చూరగొన్న రాజకీయ దిగ్ధంతుడు. ఆయన విస్పష్ట ఆలోచనా సరళి, తాను నమ్మిన ఆశయాలు, విలువల పట్ల పూర్ణ విశ్వాసం, దృఢ సంకల్పం, సమర్థ వాగ్ధాటి, సమస్యల నేపథ్యాన్ని విడమరచి చెప్పి కార్యోన్ముఖుల్ని చేసే సత్తా జైట్లీని అద్వితీయ నాయకుడిగా నిలబెట్టింది. సమకాలీన యుగంలో పార్టీకి, ప్రభుత్వానికి సమర్థ వాణిగా వెలిగిన జైట్లీ అస్తమయంతో దేశం గొప్ప దిగ్దర్శకుడిని కోల్పోయింది.

న్యాయ శాస్త్ర అధ్యయనం, సుదీర్ఘకాలం న్యాయవాద వృత్తిలో రాణించడం జైట్లీ కుశాగ్ర బుద్ధికి అద్దం పడతాయి. బుద్ధి కుశలతతో ఎదుటివారి వాదనలను దీటుగా అధిగమించేవారు. వాదప్రతివాదాల్లో తన ఆధిక్యత చాటుకునేవారు. వాదంలో ఆయన ముందుకుతెచ్చే అంశాలన్నింటితో ఎదుటివారు ఏకీభవించకపోవచ్చు కానీ, జైట్లీ తన దృక్పథాన్ని శక్తిమంతంగా ప్రకటించే తీరుకు మాత్రం ముగ్ధులవుతారు. స్వపర భేదాల్లేకుండా అన్ని పక్షాలవారిని ఒప్పించే వాదనా పటిమ జైట్లీకి గొప్ప గుర్తింపు తెచ్చింది. అనేక కీలక సమస్యలపై జైట్లీ ప్రదర్శించిన అవగాహన, దృక్కోణాలు పార్లమెంటు లోపల, వెలుపల ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలపై గాఢమైన ముద్ర వేశాయి. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలపై ఆయన క్రమం తప్పకుండా రాసిన బ్లాగులు చదివి తీరాల్సినవి. ఆ బ్లాగులు జనానికి ముఖ్యమైన సమాచారాన్ని అందించి, వారి ఆలోచనా పరిధిని విస్తరించాయి.

జైట్లీ ప్రతిభావ్యుత్పత్తులు చాలా వేగంగా ఆయన్ను ప్రఖ్యాతుడిని చేశాయి. 1974లో దిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ, ఆత్యయిక స్థితి అనంతరం 1977లో స్థాపితమైన జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గానికి అత్యంత పిన్నవయస్కుడైన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరవాత భారతదేశం రాజకీయంగా ఎన్నో మిట్టపల్లాలు చూసింది. అంత గతుకుల బాటలోనూ జైట్లీ రాజకీయ పయనం స్థిరంగా సాగింది. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ సభ్యుడిగా అవిరళ సేవలు అందించారు. నేను భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జైట్లీని, ఆయనతోపాటు సుష్మా స్వరాజ్‌ను పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంఘమైన పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా నియమించాను. వివిధ ప్రజా సమస్యలపై లోతైన అవగాహనతో పరిష్కారాలను ప్రతిపాదించిన జైట్లీ, దీర్ఘకాలంగా పార్టీ తరఫున ఎన్నో తీర్మానాలను రూపొందించారు.

ఆర్థికం, కార్పొరేట్‌ వ్యవహారాలు, రక్షణ, వాణిజ్యం, పరిశ్రమలు, నౌకా రవాణా, సమాచార- ప్రసారాలు, ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ వంటి కీలక శాఖల మంత్రిగా తనదైన ముద్ర కనబరచారు. వస్తుసేవల పన్ను చట్టం, దివాలా చట్టం, అవినీతి, అక్రమ ధన చలామణీ నిరోధ చట్టాలకు సారథ్యం వహించి దేశ ఆర్థిక రూపాంతరానికి బాట వేశారు. 2014-19 మధ్యకాలంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా మన రాజకీయార్థిక రథాన్ని లాఘవంగా నడిపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉండేట్లు చూసుకొంటూనే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. 2009లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయక పదవికి మా ఇద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అప్పుడు ఈ పదవిని మీరు తీసుకోవాలంటే మీరు తీసుకోవాలని పరస్పరం ఆత్మీయంగా వాదులాడుకున్నాం. చివరకు ఆ పదవిని చేపట్టడానికి జైట్లీ ఒప్పుకొన్నారు. ఆ హోదాలో మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడానికి కృషి చేశారు. రాజ్యసభ అధ్యక్షుడినైన నాకు, రాజ్యసభ నాయకుడి హోదాలో ఆయన అండదండలు ఇచ్చారు. గొప్ప రాజకీయ వ్యూహ దురంధరుడైన జైట్లీకి. ఎక్కడ గట్టిగా పట్టు పట్టాలో, ఎక్కడ సామరస్యంగా వ్యవహరించాలో బాగా తెలుసు.

జైట్లీ పక్కా ప్రజాస్వామ్యవాది. రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ.తప్పకుండా అనుసరిస్తూ, రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులకు అండగా నిలిచేవారు. ఆయన పౌర హక్కుల ఉద్యమంలో క్రియాశీలంగా ఉండేవారని, పౌరహక్కుల సంఘం (పీయూసీఎల్‌) బులెటిన్‌ ప్రచురణకు తోడ్పడ్డారని తెలిసినవారు చాలా తక్కువ. 1977లో లోక్‌ తాంత్రిక్‌ యువ మోర్చా కన్వీనరుగానూ వ్యవహరించారు. ఎమర్జెన్సీని ప్రతిఘటించినందుకు నాతోపాటు ఆయన కూడా 19 నెలలపాటు జైల్లో ఉన్నారు. తిరుగులేని జాతీయవాది అయిన జైట్లీ భారతదేశానికి సమున్నత శిఖరాలను అందుకునే సత్తా ఉందని విశ్వసించేవారు. ఆ సత్తాను ఆచరణలోకి తీసుకురావాలని తపించేవారు.

విశిష్ట వ్యక్తిత్వం
ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సమయంలో కొత్త రాష్ట్రానికి న్యాయం చేయడానికి జైట్లీ విశేష కృషి జరిపారు. తరవాత ఏర్పడిన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆపై ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద సాయం అందించే విషయంలో అరుణ్‌ జైట్లీ నిర్వర్తించిన పాత్ర ప్రశంసనీయం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నాబార్డు ద్వారా నిధులు జతచేయడం, ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంస్థల స్థాపనలో ఆయన అందించిన సహాయాన్ని నేను మరువలేను. ఆ ప్రాంత ప్రజలూ ఆయన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఆయనకున్న పరిజ్ఞానం, అవగాహనా విస్తృతిని వేరెవరిలోనూ చూడలేదు. సమస్య మూలాలు, వాటి సాంఘిక రాజకీయ ఆర్థిక పర్యవసానాలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారాలు కనుగొనడానికి అహరహం శ్రమించేవారు. జైట్లీ మేధాపటిమ, విశ్లేషణా సామర్థ్యం, సమస్య పూర్వాపరాలను కనిపెట్టి పరిష్కారాలు ప్రతిపాదించే శక్తి, ఆయన వాణికి అపార ప్రాధాన్యం సంతరించిపెట్టాయి. ఇక ఆ వాణి మనకు వినిపించదనే వాస్తవం ఎంతో విచారకరమైనా, ఆయన వారసత్వం మనకు గొప్ప దిక్సూచిగా నిలవబోతోందనే భావన ఎంతో ఊరట కలిగిస్తుంది. ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించినా, ఆరోగ్య కారణాల వల్ల ఏ పదవినీ స్వీకరించలేనని ఆయన స్పష్టం చేశారు. పదవికి న్యాయం చేయడానికి తన శరీరం సహకరించదు కాబట్టి అన్ని పదవులను తృణప్రాయంగా తోసిపుచ్చారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనమేముంటుంది? వ్యక్తిగతంగా మేమిద్దరం ఎంతో సన్నిహిత మిత్రులం, భోజన ప్రియులం. మేం పిన్న వయస్కులుగా ఉన్నప్పుడు అన్ని రకాల రెస్టారెంట్లకు వెళ్లి రకరకాల వంటకాలను ఆస్వాదించేవాళ్లం. అన్ని శుభ సందర్భాల్లో ఆయన్ను మా ఇంట విందుకు ఆహ్వానించేవాడిని. పండుగలు, పబ్బాలు, పలకరింపులు, విందులకు నేను తరచూ వెళ్లేది ఆయన ఇంటికే. భోజనం చేసేటప్పుడు వివిధ అంశాలపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకొనేవాళ్లం. మేము తరచూ కలుసుకునేది మృష్టాన్న భోజనాల కోసమే కాదు, మెదడుకు మేత కోసం కూడా.

ఈ ఆగస్టు నెల నాకు తీరని వేదన మిగిల్చింది. ఈ నెలలో కేవలం రోజుల తేడాతో జైపాల్‌ రెడ్డి, సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీలను కోల్పోయాం. వీరంతా అద్వితీయ పార్లమెంటేరియన్లు, ప్రజలకు ఎనలేని సేవలు అందించిన ఉద్ధండులు, విశేష ప్రతిభా సంపన్నులు. నాకెంతో ఆత్మీయుడైన అరుణ్‌ జైట్లీ అస్తమయం నన్ను కకావికలం చేసింది. ఇది నాకే కాదు, యావత్‌ దేశానికీ అపార నష్టదాయకం. ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక!

అవినీతికి బద్ధ వ్యతిరేకి
ప్రజా జీవనంలోకి ప్రవేశించిననాటి నుంచి జైట్లీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకించేవారు. అవినీతి మన దేశ జవజీవాలను హరించేస్తున్న మహమ్మారి అని మండిపడేవారు. 1973లో జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. తరవాత అన్నా హజారే జన్‌ లోక్‌పాల్‌ ఉద్యమాన్ని బలపరచారు. అవినీతికి బద్ధ విరోధి కాబట్టే జైట్లీ ఆర్థిక నేరాలకు, అవకతవకలకు వ్యతిరేకంగా పార్లమెంటులో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అద్వితీయ పార్లమెంటేరియన్‌గా, మంచి వక్తగా ఆయన ఖ్యాతికెక్కారు. 2014-19 మధ్యకాలంలో జైట్లీ అన్ని సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యలపై ప్రభుత్వ దృష్టి కోణాన్ని, వైఖరిని, విధానాలను పార్లమెంటు లోపలా వెలుపల అందరి మన్ననలు పొందే విధంగా చాటిచెప్పారు. తన పార్టీ, ప్రభుత్వాల మౌలిక విధానాలు, దృక్పథాలకు భంగం కలగని రీతిలో శక్తిమంతమైన పరిష్కారాలను ప్రతిపాదించే చాతుర్యం ఆయన సొంతం. రాజ్యసభలో ఏదైనా ప్రతిష్ఠంభన ఏర్పడినప్పుడు సభా నాయకుడిగా ఒడుపును కనబరచి అందరినీ కలుపుకొని వెళ్లడం నేను ప్రత్యక్షంగా వీక్షించాను.

Posted on 25.08.2019