Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

కాంగ్రెస్‌లో భిన్నగళాలు

* విధాన రాహిత్యంతో చిక్కులు

అధికార పక్షంతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియా, రాహుల్‌, ప్రియాంక వంటివారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా విమర్శిస్తున్నారు. మోదీ సర్కారు పాలన తీరుతెన్నులపై సందు దొరికితే చాలు విరుచుకుపడుతున్నారు. గడచిన అయిదేళ్లుగా వారు ఇదే పంథా అనుసరించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరవాతా వారి వైఖరిలో మార్పు రాలేదు. కేంద్ర ప్రభుత్వంపై తాము ఎక్కుపెడుతున్న విమర్శలకు ప్రజలనుంచి తగిన స్పందన వస్తుందా అన్న విషయంలో ఇప్పుడిప్పుడే ఆ పార్టీలో అంతర్మధనం మొదలైంది. క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా పార్టీ తన తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని కాంగ్రెస్‌లోనే కొందరు నాయకులు ఉద్బోధిస్తుండటం విశేషం.

కాంగ్రెస్‌ పార్టీలో హేతుబద్ధంగా మాట్లాడే నాయకుడిగా పేరున్న జైరామ్‌ రమేశ్‌ ఇటీవల వెలువరించిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘నరేంద్ర మోదీ పరిపాలన తీరును ప్రతిసారీ రాక్షసంగా చిత్రీకరించడం బెడిసికొడుతోంది. అయిదేళ్ల పరిపాలన పూర్తిగా ప్రతికూలతల మయం కాదు’ జైరామ్‌ రమేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచనాత్మకమైనవి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం పాలన క్రమంలో ఆర్థికాంశాలను ఒడుపుగా అంతర్భాగం చేసిన తీరు ఆకర్షణీయంగా ఉంది. దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని మహిళలకు ‘ఉజ్వల’ పథకం కింద వంట గ్యాసు కనెక్షన్లు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఎంతగానో కలసివచ్చిన అంశం. కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్‌ నాయకుడు అభిషేక్‌ సింఘ్వి సైతం ‘మోదీ ఏలుబడిపై రాక్షస ముద్ర వేయడం తప్పు’ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. మోదీ ప్రభుత్వ పనితీరును అది తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికన విశ్లేషించాలేగానీ- వ్యక్తులను బట్టి కాదు’ అంటూ ఆయన కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. ప్రజోపయోగకరమైన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏనాడూ వాటి గురించి ప్రశంసాపూర్వకంగా కాంగ్రెస్‌ అధినాయకత్వం ఒక్క మాటా చెప్పిన దాఖలాలు లేవు.

‘జమ్ము-కశ్మీర్‌’కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణ రద్దు నిర్ణయం దేశమంతటా చర్చనీయాంశమైంది. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని వివిధ వర్గాలు ప్రశంసించాయి. ఉభయసభల్లో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం, ఆ వెన్వెంటనే దానికి ఆమోదం లభించడం ఒకరకంగా కాంగ్రెస్‌ పార్టీని గందరగోళంలోకి నెట్టింది. ఆ అంశంపై కాంగ్రెస్‌ నాయకులు ఎలా స్పందించాలో తెలియని పరిస్థితిలో కూరుకుపోయారు. ఎందుకంటే ‘370 అధికరణ’ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకొని తీరాలంటూ వివిధ సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీ గట్టి సంకల్పాలు చెప్పుకొంది. ‘జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న రాజ్యాంగబద్ధ పరిస్థితిని మార్చడంగానీ, అలాంటి ప్రయత్నాలను అనుమతించడంగానీ జరగబోదు’ అని గడచిన ఏప్రిల్‌లో పార్టీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ స్పష్టంగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలోనూ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక విధానానికి కట్టుబడక తప్పలేదు. ఒకరకంగా ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు ఒకే వాదన వినిపించారు. పుల్వామా దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాలాకోట్‌పై మెరుపుదాడులు చేయడం సంచలనం సృష్టించింది. బాలాకోట్‌ ప్రాంతంలో పాక్‌ ప్రాయోజిత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ అత్యంత ధైర్య సాహసాలతో, నిబద్ధతతో భారతీయ సైన్యం నిర్వహించిన మెరుపుదాడులను దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ప్రశంసించారు. ఆ తరహా మెరుపుదాడులు తమ జమానాలో అనేకసార్లు నిర్వహించామని పేర్కొంటూ కాంగ్రెస్‌ పెద్దలు వెలువరించిన వ్యాఖ్యలు విస్తుగొలిపాయి. మరోవంక ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర నాయకుడొకరు ‘మెరుపుదాడుల’ను అబద్ధంగా తీర్మానించేశారు. దాడులకు రుజువులు చూపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు చిదంబరం డిమాండ్‌ చేయడం జాతి జనులను నిర్ఘాంతపరచింది. మెరుపుదాడుల పేరిట ప్రధాని మోదీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ శిబిరాలపై మెరుపులా విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసిన భారతీయ వైమానికదళం ధైర్యసాహసాలను శ్లాఘించకపోగా- ఆ దాడులే జరగలేదన్నట్లుగా కొందరు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటం నిర్ఘాంతపరచింది. భారతీయ వైమానిక దళాన్ని అగౌరవపరుస్తూ కాంగ్రెస్‌ నాయకులు చేసిన ప్రకటనలను జనం స్వాగతించలేదు. ‘మీరు చెట్లను కూల్చడానికి వెళ్ళారా లేక ఉగ్రవాదులనా?’ అంటూ మరో కాంగ్రెస్‌ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ హేళనపూర్వకంగా మాట్లాడారు.

దేశంలో ఆరుకోట్ల కుటుంబాలకు వంట గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజికంగా సానుకూల మార్పునకు కారణమైంది. మరో రెండు కోట్లమందికి ఇంకో ఏడాదిన్నరలోగా ‘ఉజ్వల పథకం’ కింద వంట గ్యాస్‌ కనెక్షన్లు లభించబోతున్నాయి. పేద కుటుంబాలకు ఏడాదికి అయిదు లక్షల మేర వైద్య బీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా చెప్పుకోదగిన మార్పునకు కారణమైంది. దేశవ్యాప్తంగా ‘జన్‌ధన్‌’ యోజన కింద దారిద్య్ర రేఖ దిగువన ఉన్న 36కోట్ల మందికి కొత్తగా బ్యాంక్‌ ఖాతాలు తెరవడం గణనీయమైన చర్యే. దేశ ప్రజల జీవన విధానంలో సానుకూల మార్పునకు కారణమైన పథకాలను ప్రశంసించకపోయినా ఫరవాలేదు- కాంగ్రెస్‌ పెద్దలు కనీసం వాటిని చీల్చి చెండాడకుండా అయినా ఉండాల్సింది. ప్రజల్లో విశ్వాస పునరుద్ధరణకు రొడ్డకొట్టుడు విమర్శలు పక్కనపెట్టి- కాంగ్రెస్‌ పార్టీ మరింత నిర్మాణాత్మక మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో జైరాం రమేశ్‌ వంటివారి వ్యాఖ్యలను సహేతుకంగా అర్థం చేసుకోవాల్సి ఉంది!


- వీరేంద్రకపూర్‌
Posted on 26.08.2019