Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

అపోహలపై అప్రమత్తత

* కశ్మీర్‌పై ఆచితూచి అడుగు

జమ్ము-కశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా, బేషరతుగా విలీనం చేయాలని ప్రతి రాజకీయ పార్టీ అంతర్లీనంగా భావించి ఉండొచ్చు. కానీ, ఆ పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు 370వ అధికరణపై ఆచితూచి అడుగులు వేశాయి. రాష్ట్రం వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండటమే ఇందుకు కారణం. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయలేని పనిని, నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పూర్తి చేసింది. నెహ్రూ హయాం నుంచి కశ్మీర్‌ విషయంలో కాంగ్రెస్‌ గుట్టుగా అడుగులు వేయగా, మోదీ సర్కారు తాను చేయదలచుకున్న పనిని చేసి చూపింది. ఎవరేమనుకున్నా బేఖాతర్‌ అన్నట్లు వ్యవహరించింది. నాడు నెహ్రూ ప్రభుత్వం పాకిస్థాన్‌ ఆటకట్టించడం కోసం 370 అధికరణ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం కట్టబెట్టింది. అప్పట్లో ఆ పని చేసి ఉండకపోతే నేడు పరిస్థితి వేరుగా ఉండేది. నాటి కశ్మీర్‌ నాయకత్వం, కశ్మీరీ ప్రజల మనోభావాలను భారత్‌కు అనుకూలంగా మలచుకోవడానికి ఆ అధికరణ ఉపకరించింది. అందుకే పాకిస్థాన్‌ ఎంతగా తీవ్రవాదాన్ని పెంచి పోషించినా, కశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు పాక్‌ ప్రేరేపిత శక్తుల ఆటలను సాగనివ్వలేదు. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలతో, సాధారణ ప్రజానీకంతో ఉదారంగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వేర్పాటువాద శక్తులకు అడ్డుకట్ట వేసేవి. పాకిస్థాన్‌లో కలసిపోవాలా లేక స్వతంత్ర కశ్మీర్‌గా ఉండాలా అనే అంశంపైనే వేర్పాటువాదులకు స్పష్టత ఉండేది కాదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు మాత్రం భారత్‌లోనే కొనసాగుతూనే సమర్థ, సత్పరిపాలన సాధించుకోవాలని వాదించేవి. ప్రధాన పార్టీలు, వేర్పాటువాద శక్తులు చేతులు కలపకుండా చూడటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సఫలమవుతూ వచ్చాయి. అంతేకాక వారి మధ్య విభేదాలను ఎగదోసే ఎత్తుగడలను అవలంబించేవి.

ఎన్డీయే సర్కారు 370వ అధికరణను రద్దుచేసినప్పటి నుంచి ఈ రెండు వర్గాలు కేంద్రానికి వ్యతిరేకంగా చేతులు కలిపే స్థితి ఏర్పడటం చిత్రమేనని చెప్పాలి. ముఖ్యంగా కశ్మీరీ ప్రాంతీయ పార్టీలు కేంద్రం తమను అనామకంగా మార్చేసిందని రుసరుసలాడుతున్నాయి. అందుకే అవి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా నివాసం ‘గుప్కార్‌’ లో సమావేశమై రాష్ట్రంలో భారీయెత్తున భద్రతా బలగాలను మోహరించడం, అమర్‌నాథ్‌ యాత్రను రద్దుచేయడం, కశ్మీర్‌లోయ నుంచి పర్యాటకులను బలవంతంగా పంపేయడంపై చర్చించాయి. ఈ పరిణామాల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమీక్షించాయి. ఈ భేటీకి మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాతోపాటు కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలురైన సజ్జద్‌ లోనే, లాల్‌సింగ్‌ చౌధరి ఈ సమావేశానికి హజరవలసి ఉంది. కానీ, అక్కడకు వెళ్లకుండా వారిని గృహనిర్బంధంలో ఉంచారు.

మొదటి నుంచీ రాష్ట్రంలో క్రమం తప్పకుండా ఎన్నికలు జరిపించడం ద్వారా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్న సంకేతాలను కాంగ్రెస్‌ పంపగలిగింది. 2007 ఎన్నికల్లో వేర్పాటువాదులు సైతం తమ అభ్యర్థులను పోటీచేయించాలని చూడటం బట్టి, ఎన్నికల ప్రక్రియకు అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తం అయిందని రుజువైంది. మొత్తం మీద 370 అధికరణ రద్దయినప్పటి నుంచి రాష్ట్రం అష్టదిగ్బంధనంలోకి వెళ్లింది. ఎక్కడ స్థానిక పోలీసులు తిరుగుబాటు చేస్తారోనని కేంద్రం ఆందోళన చెందింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ వంటి ప్రధాన పార్టీల నాయకులకు భద్రతగా నియమించిన పోలీసుల నుంచి ఆయుధాలు వెనక్కు తీసుకోవడానికి కారణం ఈ భయమే. వేర్పాటువాదులు, తీవ్రవాదుల వల్ల ఈ నాయకులకు హాని జరుగుతుందేమోనన్న అనుమానంతోనే ఇంతకాలం వారికి పోలీసు రక్షణ కల్పించారు. మారిన పరిస్థితుల్లో వేర్పాటువాదులు, ప్రధాన పార్టీల మధ్య విభజన రేఖలు చెరిగిపోతున్నందున, ఒకరి వల్ల మరొకరికి హాని జరిగే అవకాశం లేదు. ఉభయులకూ విభేదాలున్నా కశ్మీర్‌ ఐక్యత కోసం చేతులు కలపక తప్పదని భావించే పరిస్థితి నెలకొన్నది.

కశ్మీరీలు ఇంతకాలం భారత్‌ తరఫున గట్టిగా నిలచి, పాక్‌ ప్రేరిత తీవ్రవాదులతో, వేర్పాటువాదులతో పోరాడారు. ఇప్పుడు 370 అధికరణ రద్దుతో వారి మనోభావాలు దెబ్బతినే ప్రమాదం కనబడుతోంది. ఇకపైన బయటివారు వచ్చి రాష్ట్రంలో ఆస్తులు కొనేస్తారని, దీంతో రాష్ట్ర జనాభా, స్వరూప స్వభావాలు మారిపోతాయని స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించడానికి వేర్పాటువాదులు కృషిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని నగరం శ్రీనగర్‌లో కొన్ని చోట్ల భద్రతా దళాలను రానివ్వకుండా రహదారుల మీద కందకాలు తవ్వారు.

కేంద్రానికి కశ్మీర్‌లో కావలసింది భూములే తప్ప, ప్రజలు కాదనే భావన బలం పుంజుకోవడం ప్రమాద సంకేతం. ఈ ఆలోచన కశ్మీరీలను జాతీయ జనజీవన స్రవంతికి దూరం చేస్తుంది. 2008, 2010, 2016లలో రాష్ట్రంలో నెలల తరబడి హింస, దౌర్జన్యాలు చెలరేగాయి. వందలాదిమంది మరణించారు, గాయపడ్డారు. 370 అధికరణను రద్దు చేసిన తరవాత ఆ స్థాయి అల్లర్లు జరగని మాట నిజమే. రాష్ట్రంలో కాల్పులు, మరణాలు చోటుచేసుకోలేదని, పరిస్థితి అదుపులో ఉందని కేంద్రం చెబుతోంది. రోడ్లపైకి ఎవరైనా వచ్చి ఆందోళనకు దిగినా స్థానిక పోలీసులు, అధికారులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగేలా చేస్తున్నారు. ఆందోళనకు పూనుకొంటున్నవారు బయటివారే తప్ప, స్థానికులు కాకపోవడం గమనించాల్సిన అంశం. అల్లర్లలో స్థానికులు పాల్గొన్న ఘటనలు కొన్ని చోట్ల జరిగి ఉండవచ్చు. ఏదిఏమైనా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండరాదు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి!


- బిలాల్‌ భట్‌
Posted on 13.09.2019