Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ప్రేరక్‌లతో పునరుజ్జీవం!

* కాంగ్రెస్‌ కొత్త ఆలోచన

దశాబ్దాల తరబడి ఎదురు లేకుండా దేశాన్ని పరిపాలించిన అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ నేడు పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొత్తగా జవజీవాలు నింపడానికి పార్టీ పెద్దలు ప్రతిపాదిస్తున్న పథకం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. తాను సైతం ఆర్‌ఎస్‌ఎస్‌-భారతీయ జనతాపార్టీ తరహాలో సంస్థాగత నిర్మాణాన్ని అనుసరిస్తే తప్ప తిరిగి కోలుకోలేనని హస్తం పార్టీ భావిస్తోంది. అధినాయకత్వానికి సామాన్య జనంలో ఉన్న ఆదరణే పునాదిగా, సామ్యవాద సందేశంతో ఇంతకాలం మనుగడ సాగించిన ఈ 134 సంవత్సరాల పార్టీ, ఇప్పుడు అమాంతం తన స్వరూప స్వభావాలను మార్చేసుకుని, భారతీయ జనతా పార్టీ మాదిరిగా కార్యకర్తల బలగంతో నడిచే పార్టీగా మారిపోవాలని అనుకొంటోంది. ఇలాంటి కార్యకర్తలను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌లుగా భాజపా పిలుస్తుంది. ఇదే పంథాలో కాంగ్రెస్‌ పార్టీ ప్రేరక్‌లను తయారుచేయాలని తలపోస్తోంది. వారు అంకిత భావంతో ఉదాత్త ఆశయం కోసం దృఢ సంకల్పంతో కష్టించి పనిచేస్తారని అంచనా వేసుకుంటోంది. మరి అలాంటి కార్యకర్తలు ఎక్కడ దొరుకుతారు?

నాయకత్వ పటిమే గీటురాయి
నరేంద్ర మోదీ చిన్న వయసు నుంచి స్వయంసేవక్‌గా పనిచేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌లో వివిధ స్థాయుల్లో రాణించి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఏకంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులను చేపట్టారు. అంతటి సమర్థులు కాంగ్రెస్‌లో ఉన్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పార్టీలో నెహ్రూ కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు అలాంటి మహదవకాశం లభిస్తుందా? హిందుత్వ పట్ల మొక్కవోని విధేయత, భారతమాత అంటే అపార అభిమానం, సాటిలేని దేశభక్తి, గత వైభవంపై తిరుగులేని నమ్మకం- ఈ లక్షణాలన్నింటి కలబోతగా ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌) భావజాలం రూపుదిద్దుకొంది. ఈ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ వారిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపాలు ముందుకుసాగాయి. ఈ భావజాలమే సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచింది. మరి కార్యకర్తలను అలా ఏకతాటిపై నడిపించే సిద్ధాంతాలు, కార్యాచరణలు కాంగ్రెస్‌కు ఉన్నాయా? భారతీయ సంస్కృతి, చారిత్రక వైభవాలను కీర్తిస్తూ సంఘ్‌ పరివార్‌ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఏ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళుతుంది- నెహ్రూ కుటుంబ ఘనతనా? 370 అధికరణ, తలాక్‌ వంటి కీలక అంశాలపై ప్రజల నాడి పసిగట్టలేక, దారీతెన్నూలేనట్లు వ్యవహరించింది. జనాన్ని ఆకట్టుకునే నినాదంకాని, అజెండా కాని దాని వద్ద ఉందా... ఉంటే దాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకువెళ్లగలదా అన్న సందేహం వస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది ఒక ఉద్యమం మాత్రమే కాదు- ఒక ఆలోచనా విధానం కూడా! దాని సిద్ధాంతాల గురించి పూర్తిగా తెలియనివారు, తెలిసినా పట్టించుకోనివారూ ఇటీవల కాలంలో ఆకర్షితులు కావడం ఉత్తర, పశ్చిమ భారతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటివారు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో వ్యాయామాలు చేయకపోవచ్చు. భేటీల్లో పాల్గొనకపోవచ్చు. అయినప్పటికీ వారు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయులుగా మారుతున్నారు. ఇప్పుడొక చిత్రమైన పరిణామం చోటుచేసుకుంటోంది. మొదటి నుంచీ భారతీయ జనతా పార్టీ కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల విస్తరణ మందగిస్తోంది. అదే సమయంలో భాజపా బలం నానాటికీ పెరుగుతోంది. సంఘ్‌ పరివార్‌ బలహీనంగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల్లో మాత్రం కొంతకాలం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాబల్యం బాగానే విస్తరిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థ విస్తరించడం, విస్తరించకపోవడమన్నది చుట్టూ ఉన్న సాంఘిక, రాజకీయ పరిస్థితులపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను పోలిన యంత్రాంగాన్ని నిర్మించడానికి ప్రస్తుత వాతావరణం దోహదం చేస్తుందా అన్నది కీలక ప్రశ్న. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం మరొకటి ఉంది. అది- భారతీయ జనతాపార్టీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఆర్‌ఎస్‌ఎస్‌ అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ తరహా యంత్రాంగంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ వాస్తవాన్ని గుర్తించాలి.

యువతే ఆశాకిరణం
ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా కొత్తగా రూపుదిద్దదలచిన యంత్రాంగం సడలని ఉత్సాహంతో, పట్టుదలతో ముందుకు సాగుతుందా? ఏ సంస్థ అయినా అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం కావాలంటే కార్యకర్తల నుంచి అగ్ర నాయకత్వం వరకు అంకిత భావం, క్రమశిక్షణ ఉండాలి. ప్రస్తుత నెహ్రూ కుటుంబ వారసుల చేతిలోని పార్టీలో ఈ లక్షణాలు ఉన్నాయా అంటే సందేహమే. తమ అంతేవాసులతో నిండిన కాంగ్రెస్‌ కార్యనిర్వాహకవర్గ సభ్యులు దిగువ స్థాయి కార్యకర్తల్ని ఉత్తేజితుల్ని చేయలేకపోతున్నారు. ఈ కార్యవర్గ సభ్యులు తమంతట తాము పార్లమెంటరీ నియోజకవర్గాల్లో గెలవడానికీ ఆపసోపాలు పడతారనడంలో అతిశయోక్తి లేదు. అయినా వీరు అత్యున్నత విధాన నిర్ణాయక సంఘ సభ్యులుగా కొనసాగుతూ కొత్త రక్తానికి తావివ్వడం లేదు. ఇలాంటి నిర్వాకాల వల్లనే దేశంలోని అతి ప్రాచీన పార్టీ నేడు కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ అగ్ర నాయకుల్లో పలువురు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కొందరు బెయిలుపై విడుదలయ్యారు, కొందరు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు కావలసింది కేవలం యువ కార్యకర్తలు మాత్రమే కాదు- యువ నాయకత్వం కూడా. ఎన్నికల్లో విజయం కోసం పాకులాడకుండా ఏళ్ల తరబడి రాజకీయ ఉద్యమాలు, పోరాటాలు చేయగల చురుకైన యువ నాయకత్వం పార్టీలో అవతరించాలి. కాంగ్రెస్‌ పతనానికి దారితీసిన అవలక్షణాలు నేడు భాజపాలోనూ చొరబడుతున్నాయి. ఆ పార్టీ నాయకులు కొందరు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన పదవిని కాపాడుకోవడానికి అరడజను ఉప ముఖ్యమంత్రులను నియమించాలని చూస్తున్న నాయకుడు భాజపాలో ప్రత్యక్షమయ్యారు. ఈ నేపథ్యంలో భాజపా లోపాలను జనంలో ఎండగడుతూ ఓర్పుగా, దీక్షగా, చిరకాలం పోరాడగల యంత్రాంగాన్ని కాంగ్రెస్‌ సమకూర్చుకోవాలి. అధికారం రానురానూ భాజపాను కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా మార్చేయవచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపా పంథాను కాంగ్రెస్‌ అనుసరించేలోపు భారతీయ జనతా పార్టీయే క్షీణదశకు చేరిన కాంగ్రెస్‌లా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అవలక్షణాలకు అచ్చమైన వారసురాలిగా భాజపా అవతరించే ప్రమాదం లేకపోలేదు. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. కాంగ్రెస్‌, భాజపాలు సావాసం చేయకుండానే పరస్పరం అనుకరించుకొంటున్నాయి!


Posted on 15.09.2019