Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

సామర్థ్యం అంకితభావాల కలబోత

* ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవం నేడు

జాతి సేవకే జీవితాన్ని అంకితం చేసిన నరేంద్ర మోదీ బాల్యం ఒడుదొడుకులమయం. నిరుపేద కుటుంబంలో జన్మించి, బతుకు బాటలో తీవ్రమైన కష్టనష్టాలు కాచుకొంటూ పెరిగారాయన. చిన్ననాటినుంచీ కష్టాలను ఓర్చుకుంటూ పెరిగిన నరేంద్ర మోదీ తనను తాను పేదల పక్షపాతిగా మలచుకున్నారు. బాల్యంనుంచి పేదరికం అనుభవించడంతో బడుగుల సమస్యలపట్ల ఆయనకు అద్భుత అవగాహన ఏర్పడింది. పేదజనం సమస్యలపట్ల సానుభూతి, సహానుభూతి ఆయన సొంతమయ్యాయి. అందుకే ఆయన బీదజనం బాగోగులకోసం పరితపించారు. పేదరికం సంకెళ్లు తెగతెంచి అట్టడుగు వర్గాల ప్రజలకు సరికొత్త భవిష్యత్తును ప్రసాదించాలని పరితపించిన నరేంద్ర మోదీ 69వ జన్మదినోత్సవం నేడు!

తరతమ భేదాలకు అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేయడం లక్షణంగా మార్చుకున్న నరేంద్ర మోదీలో సంస్థాగత నైపుణ్యాలకు, రాజకీయపరమైన చొరవకు కొదవలేదు. 1987లో గుజరాత్‌ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విభాగానికి ఆయనను కార్యదర్శిగా నియమించినప్పుడు అసెంబ్లీలో భాజపాకు 12 స్థానాలే ఉన్నాయి. మోదీ రాజకీయ చతురత, నిర్వహణ సామర్థ్యాల కారణంగా 1990నాటి ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపా 67స్థానాలు కైవసం చేసుకోగలిగింది. ఆ తరవాత 1995 ఎన్నికల్లో 121 సీట్లతో గుజరాత్‌ పీఠం చేజిక్కించుకుని భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నాటినుంచి ఎదురన్నదే లేకుండా గుజరాత్‌లో ప్రతి ఎన్నికలోనూ భారతీయ జనతా పార్టీ గెలుపు బావుటా ఎగరేస్తోంది. గుజరాత్‌లో భాజపాకు నరేంద్ర మోదీ సంస్థాగతంగా బలమైన పునాదులు నిర్మించారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా పట్టాలకెక్కించి, పాలన దక్షుడిగా గుజరాతీలపై మోదీ చెరిగిపోని ముద్ర వేశారు. గుజరాత్‌లో పార్టీ అప్రతిహత విజయాలకు దోహదపడిన అంశాలివి. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ మోదీ కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీని దేశంలోని మూలమూలకూ తీసుకువెళ్ళడంలో ఆయన అవిరళ కృషి సాగించారు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భాజపా అవతరించిందంటే నరేంద్ర మోదీ దార్శనికతే అందుకు కారణమని చెప్పకతప్పదు.

నిర్మాణాత్మక పంథా
మోదీ సారథ్యంలో గుజరాత్‌లో పార్టీ తరఫున బాధ్యతలు నిర్వహించే అపురూప అవకాశం 1990ల్లో నాకు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అప్పట్లో పెద్దయెత్తున నిర్వహించాం. క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలను ప్రజాబాహుళ్యానికి ఓపికగా విపులపరచి, సభ్యత్వాలు నమోదు చేయించడంలో ఆనాడు మోదీ కనబరచిన ప్రజ్ఞాపాటవాలు పార్టీ కార్యకర్తలందరికీ విలువైన పాఠాలు నేర్పాయి. ఆయన నేతృత్వంలో పనిచేసిన అనుభవం వ్యక్తిగతంగా నాకూ ఎన్నో నూతన దృక్కోణాలను పరిచయం చేసింది. 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక ప్రజా ప్రయోజన పథంలో నరేంద్ర మోదీ ఎన్నో కొత్త పుంతలు తొక్కారు. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి నమూనానే ఆయన నిర్మాణాత్మకంగా మార్చేశారు. అసాధ్యమనుకున్న ఎన్నో కార్యక్రమాలను అనితర సాధ్య ప్రతిభతో ఆయన సాకారం చేయగలిగారు. గుజరాత్‌లోని ప్రతి ఇంటికీ 24 గంటలూ విద్యుత్‌ సరఫరా చేయాలని మోదీ ప్రభుత్వం సంకల్పం ప్రకటించినప్పుడు చాలా మంది విశ్వసించలేదు. అది ఆచరణ సాధ్యంకాని పని అని కొట్టిపారేశారు. జనశ్రేయంపట్ల తిరుగులేని నిబద్ధత, విస్తృత ప్రజాప్రయోజన సాధనలో వెన్నుచూపని రాజకీయ చొరవ కలగలిస్తే ఎంతటి లక్ష్యమైనా అందిరావాల్సిందేనని మోదీ నిరూపించారు. ప్రజలకు మంచి చేయాలన్న మనసు ఉంటే... మార్గాలు వాటంతట అవే ఆవిష్కారమవుతాయి. ప్రజావళికి అక్కరకొచ్చేదనుకుంటే దాన్ని సాధించడంకోసం ఎంత దూరమైనా వెళ్ళగల చొరవ, చురుకుదనం మోదీ బలాలు! దేశాభివృద్ధి ముఖచిత్రంలో గుజరాత్‌ స్థానాన్ని గుణాత్మకంగా మార్చివేసింది కూడా ఆ బలాలే! మోదీ నాయకత్వంలో ప్రగతి బాటపట్టిన గుజరాత్‌ నమూనా దేశ ప్రజలను ఆకర్షించింది. దాంతో దేశమంతటా చాపకింద నీరులా భాజపా పట్ల సానుకూల అభిప్రాయం విస్తరించింది. నాయకుడికి సంకల్పబలం ఉంటే సంక్షేమ రాజ్యం సాధ్యమే అన్న నమ్మకం దేశవ్యాప్తమవడానికి గుజరాత్‌లో మోదీ ప్రదర్శించిన పాలన దక్షత, చొరవ కారణమైంది. దాంతో ప్రజా సమస్యలు పట్టని నాయకులను, అవినీతిలో నిండా మునిగితేలే రాజకీయ పక్షాలను, అసమర్థ నేతలను జనం క్రమంగా ఏవగించుకోవడం మొదలుపెట్టారు. 2014 ఎన్నికల్లో ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ)కి ఉద్వాసన, మోదీకి బ్రహ్మరథం.... ఆ పరిణామాల ఫలితమే!

‘అందరితో కలిసి...ప్రజలందరి పురోభివృద్ధి’ (సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌) అంటూ ప్రధానిగా నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం దేశం నలుమూలలా ప్రతిధ్వనించింది. మాటలను చేతల్లో పెట్టడం ఎలాగో కచ్చితంగా తెలిసిన నాయకుడు ఆయన. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పెద్దయెత్తున అమలులోకి తెచ్చారు. పేదల జీవితాల్లో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరవాతే తమ అవసరాలను అర్థం చేసుకొని, తమ ఆకాంక్షలకోసం పనిచేసే నాయకుడు పైయెత్తున ఒకరు ఉన్నారన్న నిజమైన భరోసా ప్రజలకు లభించినట్లయింది. అభివృద్ధి పథకాల అమలు కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిధులను వినియోగిస్తోంది. ఈ కార్యక్రమాలకు విస్తారంగా డబ్బు ఖర్చుపెట్టినప్పటికీ- ఏ ఒక్క చోటా అవినీతి పొడ సోకకపోవడమే అసలైన విశేషం. అయిదేళ్ల కాలావధిలో మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. మోదీ ఆగమనంతో దీర్ఘకాలంగా కులతత్వం, బంధుప్రీతి, బుజ్జగింపు ధోరణుల సంకెళ్లలో చిక్కి బిక్కుబిక్కుమంటున్న భారత రాజకీయాల్లో కొత్త ఉషోదయం వెల్లివిరిసింది. సాధారణంగా దేశంలో అగ్రకులాలకు చెందినవారికే అత్యున్నత పదవీ పీఠాలు దఖలుపడతాయన్న అభిప్రాయాలనూ మోదీ ఉత్థానం తుత్తునియలు చేసింది. గుజరాత్‌ జనాభాలో మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గం సంఖ్యాపరంగా ఒక శాతానికి మించి లేదు. గుజరాత్‌తోపాటు, దేశవ్యాప్తంగానూ మోదీ సాధించిన అఖండ విజయాలకు ఆయన నమ్మిన అభివృద్ధి సూత్రం, బలహీనవర్గాల అభ్యున్నతిపట్ల మొక్కవోని చిత్తశుద్ధి ఇంధనంగా మారాయిగానీ- ఆయన సామాజిక వర్గమో, మరొకటో అందుకు కారణాలు కాలేదు!

నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో దేశ అభివృద్ధి రథం సరైన పథంలోనే ముందుకు దూసుకుపోతోంది. మోదీ పగ్గాలు చేపట్టిన వెన్వెంటనే ఒక దేశంగా భారతావని విలువ అంతర్జాతీయ వేదికపై అమాంతం ఇనుమడించింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికరణ-370ని ఉభయ సభల ఆమోదంతో మోదీ ప్రభుత్వం తొలగిస్తే- దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ ఆ చర్యను సమర్థించాయి. మరోవంక పాకిస్థాన్‌ వైఖరిని అంతర్జాతీయ సమాజం ఈసడించుకుంది. అంతర్జాతీయంగా భారత్‌ పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు పాకిస్థాన్‌ నానా రకాల కుప్పిగంతులు వేసింది. కానీ, దాని ప్రయత్నాలను ఇంచుమించు అన్ని దేశాలూ తిప్పికొట్టాయి. మానసిక, శారీరక వికాసం దిశగా మానవాళిని నడిపించే యోగా దినోత్సవానికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలన్న మోదీ ప్రతిపాదనపట్ల ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏమాత్రం జాగు చేయకుండా సానుకూలంగా స్పందించడం ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ప్రాభవం పెరుగుతోందనడానికే నిదర్శనం. లక్ష్యాలను నిర్దేశించుకుని ఇక అంతటితో పనైపోయిందని రికామీగా కూర్చునే రకం కాదు- మోదీ! వాటి సాధనకోసం ఆయన పట్టువదలకుండా ప్రయత్నిస్తారు. దేశ రాజకీయాలు అనేక దశాబ్దాలపాటు ఓటు బ్యాంకు రాజకీయాల సుడిలో కొట్టుమిట్టాడాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే, దేశంలోని ఏ వర్గం ఓట్లు దూరమవుతాయోనన్న భయం రాజకీయ పక్షాలను ఇన్నాళ్లూ నిష్క్రియలోకి నెట్టేసింది. నరేంద్ర మోదీ ఆగమనంతో రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఆరంభమైంది. ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రాతిపదిక అయితే ముస్లిం మహిళలకు స్వేచ్ఛ, సాధికారతలు ప్రసాదించే ‘ముమ్మార్లు తలాక్‌’ నిషేధ చట్టం సాకారమయ్యేదేనా? జమ్ము కశ్మీర్‌ను భారత ప్రధాన జీవన స్రవంతిలో అంతర్భాగంగా మారుస్తూ అధికరణ-370ని రద్దు చేయడం కుదిరేదేనా?

ఉక్కు సంకల్పంతో ముందడుగు
పౌరులందరి క్రియాశీల భాగస్వామ్యంతోనే సుదృఢ భారతం సాధ్యమవుతుందన్నది మోదీ నమ్మిక. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన తక్షణమే దుమ్మూ ధూళీ ధూసరితమైన దేశ వీధులను శుభ్రం చేసేందుకు, ‘స్వచ్ఛ భారత్‌’ స్వప్నాన్ని నిజం చేసేందుకు చీపురు పట్టుకుని ఆయన బయటికొచ్చారు. ఆయనతోపాటు యావద్దేశమూ కదిలింది. ఇవాళ ‘స్వచ్ఛ భారత్‌’ ఒక జాతీయోద్యమంగా వికసించింది. దేశాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దాలని మోదీ తాజాగా పిలుపిచ్చారు. ప్రధాని పిలుపునందుకొని దేశ ప్రజ సానుకూల దృక్పథంతో ముందుకు కదిలి, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని త్వరలోనే సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. ప్రజాబాహుళ్యాన్ని కట్టిపడేసి, తనతో పాటు నడిపించే విలక్షణ పాలన దక్షత మోదీ సొంతం! ఆయన మాటలను దేశ ప్రజావళి నిస్సందేహంగా చెవులు రిక్కించి వింటుంది! వినడంతోనే సరిపెట్టకుండా ఆ మాటలపట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటించి జనం ఆయన వెంట నడుస్తున్నారు. జనం తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతికోసం మోదీ అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. తన చుట్టూ ఉన్న బృంద సభ్యుల్లో ఎవరెవరి బలాబలాలేమిటన్న విషయంలో మోదీకి అపారమైన స్పష్టత ఉంది. బృంద సభ్యుల సమర్థత గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించడంలో ఆయనకు మరొకరు సాటిరారు! వ్యక్తుల బలాబలాలను అర్థం చేసుకోవడంలో ఆయన నిపుణత అనేక అభివృద్ధి పథకాలు సమర్థంగా అమలుకావడానికి ఉపయోగపడుతోంది. లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో, అభేద్యమైన సహనంతో ముందడుగు వేయడం మోదీ విలక్షణత! విభిన్న ఆలోచనల కలబోతగా, ఏకాభిప్రాయ సాధన ద్వారా పనులు చక్కబెట్టుకోవడం ఆయన విశిష్టత! భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పునఃప్రతిస్థాపించి, సమ్మిళిత సమాజాన్ని ఆవిష్కరించి, దేశాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు అనవరతం కృషి చేస్తున్న గొప్ప నాయకుడితో కలిసి పనిచేయడం మాలాంటివారికి గర్వకారణం. దేశ పునర్నిర్మాణంకోసం, మానవాళి సంక్షేమంకోసం నిర్నిరోధంగా కృషి చేస్తున్న మోదీకి జన్మదినోత్సవ తరుణంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్దేశిత లక్ష్య సాధనలో ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.


Posted on 17.09.2019