Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

మళ్ళీ ఎన్నికల సందడి

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల రణభేరి మోగింది. ఈ సంవత్సరాంతానికి గడువు ముగియనున్న ఝార్ఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీకీ వీటితోపాటే జమిలిగా ఎన్నికల ముహూర్త నిర్ణయం జరుగుతుందన్న అంచనాల్ని తోసిపుచ్చి ఆ కీలక రాష్ట్రాలు రెండింటికీ నిర్వాచన్‌ సదన్‌ షెడ్యూలు ప్రకటించింది. మహారాష్ట్ర (288), హరియాణా (90) అసెంబ్లీలకు ఒకే దశలో అక్టోబరు 21న జరగనున్న బ్యాలెట్‌ పోరులో ఎకాయెకి 10 కోట్ల 76 లక్షల మంది ఓటర్లు తమ తీర్పు ప్రకటించనున్నారు. వాటితోపాటు బిహార్‌లోని సమస్తిపూర్‌ లోక్‌సభా స్థానం సహా 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ సీట్లకూ జరగనున్న ఉప ఎన్నికలు మినీ సార్వత్రిక సమరాన్నే కళ్లకు కట్టనున్నాయి. కర్ణాటక (15), ఉత్తర్‌ ప్రదేశ్‌ (11), బిహార్‌ కేరళల్లో చెరో అయిదు, గుజరాత్‌, అసోమ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో తలో నాలుగు, సిక్కిమ్‌లో మూడు, తమిళనాడు రాజస్థాన్లలో చెరో రెండు, తెలంగాణతోపాటు తక్కినచోట్ల ఒక్కో స్థానం వంతున నిర్వహిస్తున్న ఎన్నికల ఫలితాలన్నీ అక్టోబరు 24న వెలువడనున్నాయి. ఇనుమడించిన మెజారిటీతో దిగ్విజయ బావుటా ఎగరేసి కేంద్రంలో రెండోసారి మోదీ పాలన పగ్గాలు చేపట్టాక వచ్చిన ఈ తొలి ఎన్నికల్లో- కుదేలైన శక్తుల్ని కూడగట్టుకొని గట్టిపోటీ ఇవ్వడం కాంగ్రెస్‌ సహా విపక్షాలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిపోయిన భాజపా అధినాయకత్వం మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఝార్ఖండ్‌లోనూ తొలివిడత ప్రచారాన్ని పూర్తి చేసేసింది. ముమ్మారు వరస విజయాలతో మహారాష్ట్రలో మంచి జోరుమీద ఉన్న కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమిని, హ్యాట్రిక్‌ కోసం హరియాణాలో తపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్నీ ఓడగొట్టి క్రితంసారి రెండుచోట్లా అధికారానికి వచ్చిన కమలం పార్టీ- తనకు ప్రత్యామ్నాయమే లేదన్న ధీమాతో పావులు కదుపుతోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లోనూ విపక్షానికి చుక్కలు చూపించిన మోదీ హవా ఈసారీ అద్వితీయ విజయం అందిస్తుందని భాజపా తలపోస్తుంటే, ఫిరాయింపుల తలనొప్పులతో కాంగ్రెస్‌ సతమతమవుతోంది!

సిద్ధాంత రాద్ధాంతాలతో నిమిత్తం లేకుండా గాలివాటుకు తెరచాపలెత్తడమే నయా రాజకీయమైతే మహారాష్ట్ర నేతలంతా మాయల మరాఠీలే. ‘ఆయారాం-గయారాం’ సంస్కృతి పుట్టింది హరియాణాలోనైనా, రెండు మూడు నెలలుగా మహారాష్ట్రలో పోటెత్తిన ఫిరాయింపుల ధాటికి కాంగ్రెస్‌, ఎన్‌సీపీల గుండె బేజారైంది. కాంగ్రెస్‌ ఎన్‌సీపీలను మునిగే నావలుగా తీర్మానిస్తూ పాతిక మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మరీ భాజపా శివసేనల్లోకి జారుకోవడం- మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందమైంది. రాష్ట్ర కాంగ్రెసుకు చుక్కాని కాగల నేత ఎవరూ మహారాష్ట్రలో లేకపోవడం, శరద్‌ పవార్‌ వంటి దిగ్గజమూ సొంత పార్టీని కాపాడుకోవడానికే శక్తియుక్తులు కేంద్రీకరించాల్సి రావడంతో- విపక్ష కూటమి నామమాత్రావశిష్టంగా గోచరిస్తోంది. తనలాంటి మిత్రుడుంటే, వేరే శత్రువు అవసరం లేదని పదేపదే నిరూపించే శివసేనతో భాజపా నెయ్యం ఏం కానుందన్నది ఇవాల్టి సీట్ల పంపకాల్లో తేలిపోనుంది! క్రితంసారి ఎన్నికల్లో శివసేన ఆభిజాత్యం భాజపాతో కూటమికి చెల్లుకొట్టగా, హస్తం పార్టీ హ్రస్వదృష్టి పవార్‌ పార్టీని కూటమికి దూరం పెట్టింది. కీలక పక్షాలు నాలుగూ వేటికవిగా పోటీపడిన ఎన్నికల్లో 27.8 శాతం ఓట్లు, 122 సీట్లు సొంతంగా గెలుచుకొన్న భాజపా కనీస మెజారిటీకి 23 సీట్ల ఆవల ఆగిపోయింది. పీక సన్నం ఆశ లావుగా నిర్వాకం వెలగబెట్టిన శివసేన 19.8 శాతం ఓట్లు, 63 సీట్లు గెలుచుకొని 129 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. నాటి ఎన్నికల గుణపాఠం విడిపోతే ఓడిపోవడమేనని తెలుసుకొన్న కాంగ్రెస్‌, ఎన్‌సీపీ తాజాగా చెరో 125 స్థానాల్లో పోటీకి ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి ఉద్ధవ్‌ ఠాక్రే పుత్రరత్నం ఆదిత్య ఠాక్రే తహతహ లాడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి చుట్టూ పరిభ్రమించే రాజకీయాలు ఎన్‌డీఏకూ తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయి!

మహారాష్ట్ర, హరియాణాల్లో కమలం పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే. ఇటీవలి సార్వత్రిక సమరంలో ఎక్కడికక్కడ ఓటర్ల ముష్ఠిఘాతాలకు సొమ్మసిల్లి, రెండోసారీ కనీసం ప్రతిపక్ష హోదా సైతం రాని పరిస్థితుల్లో సారథ్య బాధ్యతల కాడీమేడీ వదిలేసి రాహుల్‌గాంధీ నిష్క్రమించడంతో ‘ఆపద్ధర్మ పెద్దదిక్కు’తో నెట్టుకొస్తున్న హస్తం పార్టీకి ఈ ఎన్నికలు గడ్డు సవాలే! హరియాణా రాష్ట్ర శాఖలో విభేదాల కుంపట్లను చల్లార్చడానికి ఈ నెల తొలివారంలోనే కుమారి సెల్జాను రాష్ట్ర అధ్యక్షురాలిగా, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ హుడాను ఎన్నికల కమిటీ సారథిగా నియమించారు. జాట్‌ రిజర్వేషన్ల ఉద్యమ సమయంలోను, బాబా రామ్‌ రహీమ్‌ను నిర్బంధించిన సందర్భంలోనూ భాజపా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పాలనానుభవ శూన్యత రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టుతప్పడానికి కారణమైంది. ఎన్నికల్లో చేసిన ఏ వాగ్దానాన్నీ ఖట్టర్‌ సర్కారు నిలబెట్టుకోలేకపోయిందని విపక్షాలు విమర్శలు రువ్వుతున్నా లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది సీట్లనూ భాజపా ఊడ్చేయడంతో కమలనాథుల్లో నైతిక ధృతి ఇనుమడించింది. జన్‌ ఆశ్వీరాద్‌ యాత్రతో జనంలోకి వెళ్ళివచ్చాక ఖట్టర్‌, రైతులు తీసుకొన్న రుణాలపై అపరాధ రుసుము వడ్డీలను మాత్రమే రద్దుచేయడం- రుణాల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతల్లో ఆక్రోశం పెంచుతోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా మారి సవాలు రువ్వుతున్నా, ఓటు బ్యాంకు రాజకీయాలకు కొత్త ఒరవడి దిద్ది 90 స్థానాల అసెంబ్లీలో ‘75+’ సాధించేందుకు భాజపా ప్రణాళికలు అల్లింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కూటమి పరిస్థితి దింపుడు కళ్ళెం ఆశే అనుకున్నా హరియాణాలో లేశమాత్రంగా అవకాశం ఊరిస్తోంది. హరియాణాలో కూడా జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ) క్రతువు మొదలుపెడతామంటున్న భాజపా దూకుడును కాంగ్రెస్‌ ఎలా కాచుకొంటుందో చూడాలి!


Posted on 22.09.2019