Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ప్రతిపక్షాల సత్తాకు పరీక్ష

* మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్ర, హరియాణా విధానసభ ఎన్నికలు ప్రతిపక్షాల సత్తాకు పరీక్ష పెట్టనున్నాయి. అనూహ్య పరిణామం సంభవిస్తే తప్ప రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత భాజపా ముఖ్యమంత్రులు మళ్లీ గెలిచే అవకాశాలే ఉన్నాయి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్‌, హరియాణాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మరోమారు ముఖ్యమంత్రులయితే ఆశ్చర్యపోవలసిన పని లేదు. నరేంద్ర మోదీ వారిని ముఖ్యమంత్రులుగా

నియమించినప్పుడు అనామకులైన ఈ ఇద్దరూ, నేడు స్వయంప్రకాశంతో మళ్లీ గెలిచే సత్తా ప్రదర్శిస్తన్నారు. ముఖ్యంగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఎదుగుదల అసాధారణం. అయిదేళ్ల క్రితం అతి సామాన్యుడైన ఆయనకు నేడు రాష్ట్రంలో పోటీ వచ్చేవారే లేరు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో జీవితకాల కార్యకర్తగా ఉన్న ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక కూడా టక్కుటమార విద్యలేమీ నేర్చుకోలేదు. దీనితో ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనీ, అధికార అధికార యంత్రాంగంపై పట్టు తసాధించలేకపోయారనీ మొదట్లో విమర్శలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల తరవాత అవన్నీ పటాపంచలైపోయాయి. ఆ ఎన్నికల్లో ఆయన భాజపాకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టి పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాలపై తనకు తిరుగులేని పట్టు ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన్ను రాజకీయాల్లో అనుభవశూన్యుడనీ, అర్భకుడని అనడానికి ఎవరూ సాహసించలేకున్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రులే మళ్లీ పదవులు చేపట్టే అవకాశాలు దండిగా ఉన్నాయంటే అందుకు కారణం- ప్రతిపక్షాల వైఫల్యమేనని చెప్పకతప్పదు.

కాంగ్రెస్‌లో కలహాల కుంపట్లు
ఒకప్పుడు ఆసేతు హిమాచలం ఏకఛత్రంగా ఏలిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో దిక్కుతోచని స్థితిలో ఉంది. కాంగ్రెస్‌ నుంచి కీలక నాయకుల నిష్కమ్రణను చూస్తే పార్టీ శ్రేణులను ఎంతటి నిరాశానిస్పృహలు ఆవహించాయో అర్థమవుతుంది. పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులకు సైతం ఎన్నికల్లో గెలిచి విధానసభలో అడుగుపెడతామనే ధీమా లేదు. సొంత నియోజకవర్గాల్లోనే వారికి ఆదరణ కరవైంది. పార్టీ ఇంత అధ్వానంగా ఉన్నా అంతఃకలహాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ముంబయి నగర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ ఉదంతం దీనికి ఉదాహరణ. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన్ను పార్టీ పదవి నుంచి తొలగించింది. తనపై పార్టీలో ఒక వర్గం కుట్ర పన్నిందని నిరుపమ్‌ విరుచుకుపడ్డారు. నిరుపమ్‌ మీద ఇలాంటి ఆరోపణలే చేస్తూ నటి ఊర్మిళా మాటోండ్కర్‌ పార్టీ నుంచి వైదొలగడం గమనార్హం. శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) పరిస్థితి సైతం ఏమాత్రం ఆశావహంగా లేదు. భాజపా-శివసేన కూటమిని ఎదుర్కొనే మాట ఏమో కానీ, సొంత పార్టీలో రగిలిన చిచ్చునూ పవార్‌ చల్లార్చలేకపోతున్నారు. ఆయన అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ పార్టీని గుప్పెట్లోకి తీసుకుని శరద్‌పవార్‌నూ, ఆయన కుమార్తె సుప్రియా సులేనీ పక్కకు నెట్టేస్తున్నారు. సోనియా పెత్తందారీ పోకడలను ధిక్కరిస్తూ పవార్‌ స్థాపించిన ఎన్సీపీ పగ్గాలు రేపు ఆయన కుమార్తె సుప్రియ చేతికి వస్తాయనే భరోసా లేకుండా పోయింది. పోనీ అజిత్‌ పవారైనా పార్టీని నడిపించగలరనే హామీ ఏదీ లేదు. కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన అజిత్‌ సహకార చక్కెర మిల్లులు, బ్యాంకులపై తనకున్న పట్టుతో నాయకుడిగా చలామణి అవుతున్నారు. అయినప్పటికీ ఆయన నాయకత్వంలో ఎన్సీపీకి భవిష్యత్తు ఉంటుందని ఎవరూ భావించడం లేదు.

శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే మనవడైన ఆదిత్య ఠాక్రే ఈసారి ఎన్నికల రాజకీయాల్లోకి దూకుతున్నా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను ఇప్పట్లో సవాలు చేయగల స్థాయి ఆయనకు లేదు. రాష్ట్ర రాజకీయాల్లో భాజపాకున్న ఆధిక్యాన్ని ఆదిత్య సైతం తక్కువ అంచనా వేయలేరు. నాలుగున్నరేళ్ల పాటు భాజపా మీద కారాలు మిరియాలు నూరిన శివసేన, తీరా ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ కాషాయ పార్టీ పంచన చేరక తప్పలేదు. అయిదేళ్ల క్రితం ఒంటరిగా పోటీ చేసి దెబ్బతిన్న శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే పాత తప్పు మళ్లీ చేయదలచుకోలేదు.

హరియాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపిందర్‌ సింగ్‌ హూడా అనుచర గణంతో కాంగ్రెస్‌ను వీడాలనుకున్నా, రాహుల్‌గాంధీ చేతి నుంచి సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరవాత మనసు మార్చుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తన బద్ధవైరి అశోక్‌ తన్వర్‌కు ఉద్వాసన పలకాలనే షరతుపై హూడా పార్టీలో కొనసాగారు. తనకు జరిగిన అవమానానికి ఆగ్రహోదగ్రుడైన తన్వర్‌, ఎన్నికల్లో కాంగ్రెస్‌ అవకాశాలను దెబ్బతీయకమానరు. హూడా మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు.

విపక్షాల్లో చీలికలే వరం
రాష్ట్రంలో సుదీర్ఘకాలం చక్రం తిప్పిన, లాల్‌త్రయంగా పేరున్న దేవీలాల్‌, బన్సీలాల్‌, భజన్‌లాల్‌ వారసుల ప్రభ క్షీణించిపోతోంది. చౌతాలా కుటుంబం, హూడా నాయకత్వంలోని కాంగ్రెస్‌ మధ్య జాట్‌ ఓట్లు చీలిపోవచ్చు. రాష్ట్రంలో పెద్ద ఓటు బ్యాంకు అయిన జాట్లలో కొందరు భాజపా వైపు మొగ్గు చూపవచ్చు. అవినీతి రహితుడని ముఖ్యమంత్రి ఖట్టర్‌కున్న మంచి పేరు, కుల భేదాలు లేకుండా అందరికీ సేవలు అందించిన చరిత్ర ఆయన బలాలు. జాటేతరుడైన ఖట్టర్‌ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశారు. తన నిజాయితీతోపాటు ప్రతిపక్షాల చీలికలు రేపటి ఎన్నికల్లో ఆయనకు పెద్దవరం కావచ్చు. ఇటీవలి లోక్‌ సభ ఎన్నికల్లో భాజపాకు ప్రతిపక్షాలు గట్టిపోటీ ఇచ్చినా, చివరకు ఓటమి చవిచూడవలసి వచ్చింది. మొత్తం పదికి పది స్థానాలను భాజపా గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల తరవాత రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని వదలుకోవడంతో, ఆయన తల్లి సోనియాగాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టకతప్పలేదు. దీనివల్ల పార్టీలో రావలసిన మార్పు ఆలస్యమైపోయి, మరింత నష్టం జరిగింది. మారిన పరిస్థితుల్లో నవతరాన్ని ప్రోత్సహించడం ద్వారా మాత్రమే కాంగ్రెస్‌ బలపడగలదు. రాహుల్‌ ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసినా, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి వల్ల ఆయన కాడి కిందపడేశారు. సోనియా పునరాగమనంతో మళ్లీ పాత తరం చేతికే పార్టీ పగ్గాలు వెళ్లిపోయి, పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించే పని ఆగిపోయింది. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో సొంత బలంతో నెగ్గగల నాయకులెవరూ లేరు. డీఎంకే అండ లేనిదే తమిళనాడులో పార్టీ ఒక్క సీటూ గెలవగలిగేది కాదు. కేరళలో యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌లోని చిన్నాచితకా పార్టీలు భుజాన మోయబట్టి కాంగ్రెస్‌కు చెప్పుకోదగినన్ని సీట్లు వచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌కున్న యాభైకి పైగా స్థానాల్లో అధిక భాగం తమిళనాడు, కేరళలలో గెలిచినవే కావడం గమనార్హం. గతంలో కాంగ్రెస్‌ నాయకులపై అవినీతి, నేర మరకలున్నా ఓటర్లు ఆ పార్టీకి అధికారం కట్టబెట్టేవారు. ఇప్పుడు వారు అలా చేయడానికి సిద్ధంగా లేరు. స్పష్టమైన వైఖరితో ముందుకొచ్చి ఓటర్ల ఆదరణను తిరిగి చూరగొనడానికి కాంగ్రెస్‌ కృషి చేయకపోతే, పార్టీకి మనుగడ కష్టమైపోతుంది!

Posted on 07.10.2019