Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

పాఠాలు చెప్పిన ఫలితాలు!

* పార్టీలకు పథనిర్దేశం
రాజకీయ వాతావరణం క్రమంగా తేటపడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఒక్క పుదుచ్చేరిలో మినహా మిగిలినచోట్ల మూకుమ్మడిగా తిప్పికొట్టడం భారతీయ జనతాపార్టీ స్కంధావారాలను ఆనందంలో ముంచెత్తింది. మరోవంక తమిళనాడులో జయలలిత, పశ్చిమ్‌ బంగలో మమతా బెనర్జీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించడం ఆయా రాష్ట్రాల్లో వారు రెట్టించిన ఉత్సాహంతో, మరింత అర్థవంతమైన పాలనను అందించడానికి వూతమిస్తుంది. పాలన సంస్కరణల అమలుకు సంబంధించి ఎలాంటి గందరగోళానికి, తత్తరపాటుకు లోనుకాకుండా సూటిగా, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మోదీ సర్కారుకు ఆలంబనగా నిలిచే ఫలితాలివి. కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల పొత్తు మట్టికరచిన నేపథ్యంలో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) వంటి కీలక బిల్లులకు మార్గం సుగమమయ్యే అవకాశాలున్నాయి. తమిళనాడు, పశ్చిమ్‌ బంగల్లో సాధించిన విజయాలు జయలలిత, మమతా బెనర్జీల ఆత్మవిశ్వాసాన్ని కొండంతలు చేశాయనడంలో సందేహం లేదు. ఎవరి రాష్ట్రంలో వారు రాజకీయంగా బలంగా వేళ్లూనుకున్నారు. ఈ తరుణంలో భాజపాతో జట్టుకట్టాల్సిన అవసరం వారికి కనిపించడం లేదు. అయితే అంశాలవారీగా కేంద్రానికి మద్దతు ఇస్తూ, సయోధ్య కొనసాగించడంవల్ల రాష్ట్రాలకే మేలు జరుగుతుంది. ఇటీవలి ఫలితాలు కేంద్రంలో, కొన్ని రాష్ట్రాల్లో పరిపాలనను మరింత గాడిన పెట్టేందుకే ఉపకరిస్తాయని చెప్పవచ్చు.

కాంగ్రెస్‌ ఘోరాపరాధాలు
మోదీ వ్యతిరేకతే ఏకైక అజెండాగా కాంగ్రెస్‌ నాయకులు గుడ్డిగా ముందుకుపోవడమే వారు ఈ ఎన్నికల్లో బోర్లాపడటానికి కారణమైంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు లేకుండా దిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని, కొందరి సూచనల మేరకు వ్యూహాలు రూపొందించి, అవే తమను గట్టెక్కిస్తాయనుకోవడమే కాంగ్రెస్‌కు అతిపెద్ద ప్రతికూలాంశం. కాలు కదిపితే చాలు ఆహా, ఓహో అంటూ పొగడ్తల్లో ముంచెత్తే వందిమాగధుల మాయలో పడి కాంగ్రెస్‌ అధినాయకత్వం- నిజమైన కార్యకర్తలను దూరం చేసుకుంది. అసోమ్‌లో బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉన్న హిమంత బిస్వ శర్మను రాహుల్‌ గాంధీ తీవ్రంగా అవమానించారు. దాంతో ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి భాజపా శిబిరానికి మారారు. నికార్సయిన ప్రజానాయకుడు బిస్వ శర్మను కాదని తరుణ్‌ గొగోయ్‌ కుమారుడు గౌరవ్‌ను రాహుల్‌ గాంధీ అక్కున చేర్చుకోవడం అసోమ్‌ కాంగ్రెస్‌లో చాలామందికి మింగుడు పడలేదు. రాహుల్‌ గనుక ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నట్లయితే- కాంగ్రెస్‌ అసోమ్‌లో మరీ ఇంత హీనంగా ఓడిపోయి ఉండేది కాదు.
పశ్చిమ్‌ బంగలో మమత బెనర్జీ విలక్షణ వ్యూహం అనుసరించారు. కాంగ్రెస్‌, భాజపా, కమ్యూనిస్టులు మూకుమ్మడిగా ‘ఒంటరి మహిళ’నైన తనపై దాడి చేస్తున్నాయన్న భావన కలిగించడంలో మమత విజయవంతమయ్యారు. తద్వారా పార్టీలన్నింటినీ మమత ఒంటిచేత్తో ఎదుర్కొంటున్నారన్న భావన విస్తరించింది. ఫలితంగా ఆమెపట్ల ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. ఆ వెల్లువలో నారద, శారద కుంభకోణాలు; తృణమూల్‌ కార్యకర్తల గూండాయిజం వంటివన్నీ కొట్టుకుపోయాయి! జనం కళ్లుచెదిరే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మమతా బెనర్జీ బంగాలీలకు సుపరిపాలన అందించడంపై దృష్టి సారించాలి. హింసను ప్రేరేపించే పార్టీ కార్యకర్తలను కట్టడి చేయాలి. బంగాల్‌ను పారిశ్రామికీకరణ బాట పట్టించడంతోపాటు- ఉపాధి అవకాశాలను ఇబ్బడిముబ్బడిగా పెంచడమే ఇప్పుడు మమత ముందున్న సిసలైన సవాలు.
తాము అధికారంలోకి వస్తే చొరబాటుదారులను అసోమ్‌ నుంచి పంపించి వేస్తామని భాజపా ప్రజలకు వాగ్దానం చేసింది. ఆ హామీని నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆ పార్టీ ముందున్న సవాలు. అసోమ్‌లో ఉన్న చొరబాటుదారుల జాబితాను రూపొందించి, వారిని బయటకు తరలించడం అంత సులభం కాదు. కనీసం ఇకనైనా అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టాలి. కేరళలో అందరూ వూహించినట్లుగానే జరిగింది. నిండా అవినీతిలో మునిగిన కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ను విసిరికొట్టి- మలయాళీలు వామపక్షాలను అక్కున చేర్చుకున్నారు. తమిళనాట పరిస్థితి పూర్తిగా విభిన్నం. ఆరోగ్య పరిస్థితుల రీత్యా డీఎంకే రథ సారథి కరుణానిధి తాను రాజకీయాలనుంచి వైదొలగే లోపే కుమారుడు స్టాలిన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని తాపత్రయపడ్డారు. ఆయన ఆశలపై తమిళ ప్రజ నీళ్లు చల్లింది. ఈ ఓటమి నేపథ్యంలో తమిళనాట డీఎంకేలో వారసత్వ పోరు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి కూడా ఏమీ అంత గొప్పగా లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంవల్లే ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారాన్నీ పరిమితంగా నిర్వహించారని అంటున్నారు. ఇరు పార్టీలూ ఎన్నికల్లో ‘ఉచిత’ ప్రచారం జోరుగానే సాగించాయి. డీఎంకేతో పోలిస్తే ఏఐఏడీఎంకే వాగ్దానాలే ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలంటే జయలలిత ప్రభుత్వం భారీగా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటువడకుండా ఒకవైపు జాగ్రత్తపడుతూనే- మరోవంక సంక్షేమ చర్యలకు పెద్దయెత్తున నిధులు విడుదల చేయడం జయలలితకు సిసలైన సవాలు.

ఆచితూచి అడుగులు
దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక సంకీర్ణం ఏర్పాటు చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చక్రం తిప్పుదామని భావించిన బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు తీవ్ర నిరాశ కలిగించిన ఫలితాలివి. మమతా బెనర్జీకాని, జయలలితకాని నితీశ్‌కుమార్‌తో జట్టు కట్టే అవకాశాలు లేవు. కాంగ్రెస్‌ పార్టీ ముందు పెద్దగా ప్రత్యామ్నాయాలేమీ కనిపించడం లేదు. సీతారాం ఏచూరి, నితీశ్‌ కుమార్‌లు మాత్రం భాజపా వ్యతిరేక అజెండాను బలంగా ముందుకు తీసుకువెళ్ళాలని తలపోస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలు ఏచూరి, నితీశ్‌ల నమ్మకాలను పరీక్షకు పెట్టనున్నాయి. మూడో ప్రత్యామ్నాయం ప్రాతిపదికన ప్రధాని అభ్యర్థిగా నితీశ్‌ కుమార్‌ ప్రచారం చేసుకోవడాన్ని ములాయంసింగ్‌ యాదవ్‌, మాయావతిలు అసలు పట్టించుకోవడమే లేదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పక్షాలతో భాజపా వ్యవహరించే విధానం ఇకమీదట కీలకం కానుంది. ములాయం, మాయావతి మొదలు నవీన్‌ పట్నాయక్‌, కేసీఆర్‌ల వరకు వివిధ రాష్ట్రాల్లోని బలమైన నాయకులతో భాజపా ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోనుందన్నది ప్రశ్న.
కాంగ్రెస్‌ పూర్తిగా కుంగిపోయిన నేపథ్యంలో- వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పక్షాలతో పరస్పర లాభదాయకమైన సహకారం కుదుర్చుకోవడం భాజపాకు సులువవుతుంది. సహకారాత్మక సమాఖ్య విధానం ఆవశ్యకతను మోదీ తరచూ ప్రస్తావిస్తుంటారు. ఆచరణాత్మకంగా కదిలి ఆయన అందుకు తెరతీయగలిగితే దేశానికి అంతకు మించి కావలసింది లేదు. ఒకరకంగా ఈ తీర్పు దేశంలోని పార్టీలన్నింటికీ ఏదో ఒక గుణపాఠం నేర్పిందనే చెప్పాలి. వారసత్వ రాజకీయచట్రం నుంచి బయటపడని పక్షంలో పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్న విషయాన్ని ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు తేల్చిచెప్పాయి. మరోవంక గెలుపును ఒడిసిపట్టిన నేపథ్యంలో అతిశయానికి పోకుండా మరింత అణకువగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు భాజపాకు గుర్తుచేశాయి.

- వీరేంద్ర క‌పూర్‌
Posted on 28.05.2016