Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

అంతుపట్టని ఓటరు నాడి

* ప్రజలు నేర్పిన పాఠాలు

మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీకి కొత్త పాఠాలు నేర్పాయి. దేశ రాజకీయాల్లో తమకు ఎదురులేదన్న మితిమీరిన ఆత్మవిశ్వాసానికి, నిర్లక్ష్యానికి ఈ ఫలితాలు జవాబుగా నిలిచాయి. ఒడుదొడుకుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, సామాన్యులకు ఇక్కట్లు దూరం చేయడానికి బదులు- ఎంతసేపటికీ జాతీయవాద నినాదాలు వినిపించడంపైనే శ్రద్ధపెట్టడం ప్రజలకు అంతగా రుచించినట్లు లేదు. ఈ ఫలితాలను విపక్షాల విజయంగా అభివర్ణించలేంగాని- అధికార పార్టీకి మాత్రం ఇవి ఏదో స్థాయిలో ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. రెండుచోట్లా మునుపటితో పోలిస్తే భాజపా తక్కువ స్థానాల్లోనే నెగ్గింది. అత్యధిక స్థానాలు చేజిక్కించుకుని రెండు రాష్ట్రాల్లోనూ రికార్డులు బద్దలు కొడతామని ప్రకటనలు ఇచ్చిన భాజపా నాయకులకు ఈ ఫలితాలు మింగుడుపడవనే చెప్పాలి. ఓటింగ్‌ ముగిసిన వెన్వెంటనే వెలువడిన ‘ఎగ్జిట్‌పోల్స్‌’ భాజపాకు ఎదురే లేదని చెప్పాయి. కానీ, వచ్చిన ఫలితాలు ఆ పార్టీ ఆశలపై నీళ్లు చల్లాయి. రెండు రాష్ట్రాల్లోనూ భాజపాయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అయితే అందుకోసం అది చాలా విషయాల్లో మిత్రపక్షాలతోనూ, స్వతంత్ర ఎమ్మెల్యేలతోనూ రాజీపడాల్సి వస్తోంది.

మహారాష్ట్రలో అధికారాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని; మొదటి దఫా ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు అప్పగించాలని భాజపాపై శివసేన ఒత్తిడి పెంచుతోంది. ఈ డిమాండ్ల నేపథ్యంలో భాజపా అధిష్ఠానమూ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అధికారాన్ని అంత సులభంగా శివసేనతో పంచుకోవడానికి భాజపా అంగీకరించకపోవచ్చు. ఒకవేళ ఆ పార్టీ మితిమీరిన ఒత్తిడి తీసుకువస్తే ప్రభుత్వ ఏర్పాటుకోసం కూటమికి ఆవల ఉన్న ప్రత్యామ్నాయాలనూ భాజపా అన్వేషించే అవకాశాలు కొట్టిపారేయలేనివి. దేవేంద్ర ఫడణవీస్‌ ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా 2014లో మహారాష్ట్రలో జరిగిందదే. ‘ఆయారాం గయారాం’ సంస్కృతికి పురిటిగడ్డ అయిన హరియాణాలో ప్రభుత్వ స్థాపనకు భాజపా పెద్ద కసరత్తే జరిగింది. పదిస్థానాలు గెలిచిన జేజేపీతో భాజపా చర్చలు సఫలం కావడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి ఖట్టర్‌ నేడు రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. ఒకప్పుడు కులం, ప్రాంతం వంటివాటిని ప్రాతిపదికలుగా చేసుకొని హరియాణా ప్రజలు ఓట్లు వేసేవారు. ప్రస్తుత ఫలితాలు వారు తిరిగి పాత పంథాను నెత్తికెత్తుకున్నారా అన్న సందేహాలకు తావిస్తున్నాయి. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా సారథ్యంలో అయిదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దురవస్థనుంచి తేరుకుని భాజపాకు దీటుగా నిలిచి చెప్పుకోదగిన అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగల స్థాయికి కాంగ్రెస్‌ చేరిందంటే- అది ఆ పార్టీకి బ్రహ్మాండంగా ఊరట కలిగించే పరిణామమనే చెప్పాలి. రాహుల్‌ గాంధీ ఆగమనం తరవాత కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులను పక్కనపెట్టారు. కానీ, ఇటీవల పార్టీ పగ్గాలు తిరిగి సోనియా గాంధీ చేతికి వచ్చాక హరియాణా కాంగ్రెస్‌లో హుడాకు పునర్వైభవం దక్కింది. స్వయంగా రాహుల్‌గాంధీ ఎంపిక చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించిన అశోక్‌ తన్వర్‌ను ఆ పదవినుంచి తొలగించడంతోపాటు, ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని హుడా విధించిన రెండు షరతులకూ సోనియా అంగీకరించారు. ఆ నేపథ్యంలోనే ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి పార్టీ తరఫున ప్రచారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చేజిక్కిన స్థానాలు ఆయన కృషికి అద్దం పట్టాయి. దేవీలాల్‌ కుటుంబంలో తలెత్తిన ఆధిపత్య పోరాటానికీ ఈ ఫలితాలు తెరదించాయి. తిరుగుబాటు చేసి ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) నుంచి బయటకు వచ్చి దుష్యంత్‌ చౌతాలా ఏర్పాటు చేసిన జేజేపీ చక్కటి ఫలితాలు సాధించింది. లోక్‌దళ్‌ను దాదాపుగా వెనక్కి నెట్టింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోనూ సీట్లు గెలుచుకోకపోయినా ఐఎన్‌ఎల్‌డీతో పోలిస్తే జేజేపీ చెప్పుకోదగిన ఓట్లను చేజిక్కించుకుంది.

రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీలనుంచి బయటకువచ్చి భాజపా తరఫున పోటీపడిన అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు. గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇరువురు మాజీ యువజన కాంగ్రెస్‌ నాయకులకు టికెట్లు కట్టబెట్టి భాజపా వారిని బరిలో నిలిపింది. వారిని ఓటర్లు చిత్తుగా ఓడించారు. మహారాష్ట్రలో ఎన్‌సీపీ-కాంగ్రెస్‌ అభ్యర్థులు పెద్ద మెజారిటీలతో గెలిచారు. అధికార పార్టీకి అనుకూల పవనాలు లేవనే విషయాన్ని ఈ పరిణామం తేటతెల్లం చేస్తోంది. దేవేంద్ర ఫడణవీస్‌కు పాలనదక్షుడిగా మంచిపేరు ఉన్నప్పటికీ- ఎప్పటినుంచో పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్‌ నాయకులను కాదని, ఇతర పక్షాలనుంచి వచ్చినవారికి పెద్దపీట వేయడం భాజపాకు శరాఘాతంగా మారింది. మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడైన శరద్‌ పవార్‌కు ఈ ఎన్నికలు అద్భుతమైన ఊరట కలిగించాయనే చెప్పాలి. ప్రజలను తేలిగ్గా తీసుకుంటే ఫలితాలెలా ఉంటాయో ఈ ఎన్నికలు నిరూపించాయి. తమిళనాడులో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని గెలుపు నమోదు చేసుకున్న డీఎమ్‌కే- తాజాగా అక్కడ జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఓడిపోవడం జయలలిత మరణంతో కకావికలైన ఏఐఏడీఎమ్‌కేకు కొత్త ఊపిరి పోసింది. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన విపక్షాల్లో ఈ ఫలితాలు కొత్త ఆశలు నింపాయి. మరోవంక కేవలం జాతీయవాద నినాదాలను, ఉద్వేగపరమైన అంశాలను మాత్రమే నమ్ముకుంటే కుదరదని; క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై దృష్టిపెడితే తప్ప ప్రయోజనం లేదన్న సంకేతాలను ఈ ఎన్నికలు భాజపాకు ఇచ్చాయి.


- వీరేంద్ర కపూర్‌
Posted on 26.10.2019