Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ఫిరాయింపుల తొండాట!

‘ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ ప్రత్యర్థి పక్షం పనికిమాలినదని రుజువు చెయ్యడానికే తమ శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో అవన్నీ సహజంగానే సఫలమవుతా’యని హెచ్‌ఎల్‌ మెంకెన్‌ అనే అమెరికన్‌ పాత్రికేయుడు చేసిన వ్యాఖ్య అర్థవంతమే కాదు, అక్షర సత్యం కూడా! ఆయారామ్‌లకు అంబారీలు కట్టి గయారామ్‌లపై గుస్సాపడే నయా రాజకీయ దందా- ఫిరాయింపు నిషేధ చట్టానికి ఎలా చాపచుట్టేస్తోందో ఎక్కడికక్కడ కళ్లకు కడుతూనే ఉంది కదా! ‘దశాబ్దాలుగా నిబంధనలకు లోబడే రాజకీయ క్రీడ ఆడుతున్నాం... ప్రత్యర్థి పక్షాలు తొండాట ఆడుతుంటే మేమేం చెయ్యాలి?’ అని ఒకనాడు వాజ్‌పేయీ వాపోయారు. సమకాలీన పక్షాల్లో తనకుగల ‘విలక్షణత’ను వదిలేస్తే, కమలనాథులు సృష్టించగల రాజకీయ భూకంపాలకు దేశవ్యాప్తంగా ఎన్నెన్నో రుజువులు పోగుపడ్డాయిప్పుడు. అందులో ‘సుప్రీం’ తీర్పుతో తాజాగా తెరిపినపడ్డ కర్ణాటకం లేవనెత్తుతున్న మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?

‘రాజకీయ ఫిరాయింపుల జాడ్యం జాతికి తీవ్రాందోళనకర అంశం. దాన్ని మట్టుబెట్టకపోతే, అది దేశ ప్రజాస్వామ్య పునాదుల్నే కాదు, మౌలిక సూత్రాల్నీ దెబ్బతీస్తుంది’- అని 1985 నాటి ఫిరాయింపుల నిషేధ చట్టం మౌలిక లక్ష్య ప్రకటన ఎలుగెత్తి చాటుతోంది. ఇందిర హత్యానంతరం జరిగిన సార్వత్రికంలో స్వతంత్ర భారతావని చరిత్రలోనే అత్యధిక సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టిన రాజీవ్‌ సర్కారు వండివార్చిన చట్టమది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో కొలువుతీరిన చట్టం పదిలంగా పరిఢవిల్లుతున్న దేశంలోనే- ఫిరాయింపుల సంస్కృతి దశదిశలా వ్యాపించింది. ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నైతికతను పాలక ప్రతిపక్షాలు రెండూ నిష్ఠగా ఔదలదాల్చాలి. దానికి కట్టుబడటంలో- ఇండియాలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టే రాజకీయ వ్యవస్థ నైతికంగా భ్రష్టుపట్టిందన్న అభిప్రాయం జనమనంలో పాతుకుపోయింది’ అంటూ ‘సుప్రీం’ ధర్మాసనం రాసిన తీర్పు సమస్య మూలాల్ని సరిగ్గానే గుర్తించింది. ఎన్నికలంటే అధికారం కోసం ఆట, సర్కారు ఏర్పాటులో సంఖ్యాధిక్యం కోసం వేటగా దిగజారిపోయిన వాతావరణంలో- ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు అంటున్న ప్రజాస్వామ్య సూత్రాలు దిక్కులేనివి అవుతున్నాయి. జనహితం పట్టని ఈ తొండాట రాజకీయంలో తమ పంతమే నెగ్గాలంటూ కర్ణాటకలో పార్టీలు సుప్రీంకోర్టు గుమ్మం తొక్కడంతో వెలువడిన తీర్పు- ఉభయ పక్షాలకూ సమ్మోద కారకమైంది! పదో షెడ్యూలులోని నిర్దిష్ట అంశాలను బలోపేతం చెయ్యడంపై పార్లమెంటు ఆలోచించాలన్న సుప్రీం సందేశం శాసనకర్తల చెవికెక్కకపోతే- ఫిరాయింపు నిషేధ చట్టం చిత్తు కాగితమంత విలువతో ఇకముందూ తేజరిల్లుతుంది!

ధనబల రాజకీయాల విశ్వరూపానికి కర్ణాటక పెట్టింది పేరు. గెలుపు గుర్రాలైతే చాలు- చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించి వచ్చినా అక్కున చేర్చుకొని అభ్యర్థిత్వాలు కట్టబెట్టడంలో అన్ని పార్టీలదీ తిలాపాపం తలా పిడికెడు! ఎన్నికల్లో ఎవరెన్ని హామీలు దిమ్మరించినా, ఏ ఒక్క పార్టీకీ విస్పష్ట మెజారిటీ కట్టబెట్టని కన్నడిగుల తీర్పు- అంతా ఆ తాను ముక్కలేనన్న నైరాశ్యాన్ని ప్రస్ఫుటీకరించింది. త్రిశంకు సభలో ఎలా నెగ్గుకురావాలో యడియూరప్పకు కొట్టిన పిండి. 2008నాటి ఎన్నికల్లో కనీస మెజారిటీకి కొన్ని సీట్లు తరుగుపడినా, ఆపరేషన్‌ కమల్‌ ద్వారా విపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, మళ్ళీ భాజపా టికెట్‌ మీద వారిని ఉప ఎన్నికల్లో నెగ్గించి బండి నడిపించిన చరిత్ర ఉండనే ఉంది. ఒక పార్టీ పక్షాన ఎన్నికైనవాళ్లు ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలుకుతూ గవర్నరుకు ఇచ్చే లేఖలో సంతకం చెయ్యడం కూడా ఫిరాయింపు కిందికే వస్తుందని పన్నెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు స్పష్టీకరించడం నిరుడు కమలనాథుల దూకుడుకు బ్రేకు వేసింది. (అప్పటికి) కర్ణాటకలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారమే చెయ్యనందున వారికి ఫిరాయింపు నిషేధ చట్టం వర్తించబోదంటూ కేంద్రమే సుప్రీంకోర్టులో వాదించిన వైనం- రాజ్యాంగ విలువల క్షయానికి అద్దం పట్టింది. అస్మదీయ గవర్నర్‌ చేత ఆహ్వానం అందుకొని ఏకైక పెద్దపార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసికూడా బలం నిరూపించుకోలేక రాజీనామా చేసి నిష్క్రమించిన యడియూరప్ప- విపక్ష ఎమ్మెల్యేల రాజీనామాలతో రక్తి కట్టించిన రాజకీయ డ్రామా, ఫిరాయింపు చట్టం కొరగానితనాన్నే లోకానికి చాటింపు వేసింది!

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి మూడు దశాబ్దాల్లో ఫిరాయింపుల జబ్బుసోకి 50 ప్రభుత్వాలు కుప్పకూలాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫిరాయింపు నిషేధ చట్టం వచ్చాక ప్రభుత్వాలతోపాటు రాజ్యాంగ విలువలూ తెగిపడుతున్నాయి. త్రిశంకు సభ ఆవిర్భవించినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవర్ని ఆహ్వానించాలన్న విచక్షణాధికారం రాష్ట్ర గవర్నరుకు, ఫిరాయింపు సభ్యుల అర్హతానర్హతల్ని నిర్ణయించే అధికారం సభాపతికి దఖలు పడింది. రాజ్యాంగ విలువలకు పట్టం కట్టాల్సిన ఈ కీలక వ్యవస్థలు రెండూ రాజకీయ నిర్ణయాలకే మొగ్గుతుండటంతో రాజకీయ రంకులరాట్నం ప్రజాస్వామ్య విలువలకు సిలువ వేస్తోంది. 2005లో బిహార్లో త్రిశంకు సభ ఆవిర్భవించినప్పుడు విపక్ష శిబిరం ఏకతాటిమీదకొచ్చి సర్కారు ఏర్పాటుకు సమాయత్తమవుతున్న దశలో అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసిన గవర్నర్‌ బూటాసింగ్‌ కపట నాటకాన్ని సుప్రీంకోర్టు ఉతికి ఆరేయడం తెలిసిందే. నేడు కర్ణాటకలో తమ రాజీనామాల్ని సభాపతి ఆమోదించేలా చూడాలంటూ మాన్య సభ్యులు న్యాయపాలికను ఆశ్రయించడం మున్నెన్నడూ జరగనిదే. ముఖ్యమంత్రిగా కుమారస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ‘సుప్రీం’ జారీచేసిన మధ్యంతర ఆదేశాలు- పార్టీలు జారీచేసే ‘విప్‌’ను సారహీనం చేసేలా ఉన్నాయని నిపుణులు మొత్తుకొన్నారు. సభాకార్యక్రమాల్లో పాల్గొనాలో వద్దో అసంతుష్ట ఎమ్మెల్యేల ఇష్టానికే వదిలేయాలన్న నిర్ణయం- ఫిరాయింపు నిషేధ చట్టంలోని క్లాజ్‌ 2 (బి)ని నిస్సారం చేస్తోందని, అది ప్రమాదకర ఉదాహరణగా మిగులుతుందనీ వాపోయారు. ఫిరాయింపుదారులన్న ముద్రకు ‘సుప్రీం’ నిర్ధారణతో తన నిర్ణయం సరైనదిగా రుజువైందని నాటి సభాపతి, ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమమైందని రాజీనామా ఎమ్మెల్యేలు ఖుషీగానే ఉన్నారు. రాజీనామాలతో ప్రభుత్వాల్ని పడగొట్టే ఫిరాయింపు రాజకీయాన్ని ఇక ఎవరు మాత్రం ఎలా నిలువరించగలరు?

పచ్చగా ఉన్నచోట తిని వెచ్చగా ఉన్నచోట పడుకొనే శీలహీన రాజకీయం అన్నిచోట్లా గజ్జెకట్టి నర్తిస్తోంది. ‘మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కష్టాలు తీరుస్తా’మంటూ ఆదిత్య ఠాక్రే వాగ్దానం చేసి వెళ్ళిన వారం రోజుల్లోనే మహారాష్ట్ర రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకొన్న వైనం గుండెల్ని పిండేస్తోంది. సంకుచిత రాజకీయ క్రీడలో పార్టీలు తలమునకలైపోతుంటే, సుస్థిర ప్రజానుకూల పాలన కొరవడి జనసామాన్యం చితికిపోతున్న దైన్యం గూడు కట్టుకొంటోంది. సుస్థిర పాలనకు ప్రోది చెయ్యడానికి తెచ్చిన ఫిరాయింపు నిషేధ చట్టం కొరగానిదైపోగా, అధికారం కోసం నానాగడ్డీ కరచే రాజకీయం ఏటికేడు విశృంఖలమవుతోంది. ఈ ధనస్వామ్య రాజకీయాలకు ఏదీ ముగింపు? ఫిరాయింపుల కంపును ఊడ్చేయడానికి జాగృత జనవాహిని పూనిక వహించడమే ఈ జాడ్యానికి సరైన విరుగుడు! ఏమంటారు?

- పర్వతం మూర్తి
Posted on 17.11.2019