Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ప్రజామోదకర ప్రస్థానం

* ఎన్డీయే 2.0 - ఆరు నెలల పాలన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తోంది. నరేంద్ర మోదీ మలి దఫా పాలన 2019, నవంబరు 30నాటికి ఆరు నెలల కాలం పూర్తి చేసుకొంది.

ఈ ఆరు మాసాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రక, పరివర్తనాత్మక నిర్ణయాలు తీసుకుంది. పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, మహిళలు, యువత, మధ్య తరగతి ప్రజలు, షెడ్యూల్డు కులాలు-తెగల సమస్యలపట్ల సంపూర్ణ సహానుభూతితో- సానుకూల దృష్టితో మోదీ సర్కారు ఈ నిర్ణయాలు వెలువరించడం విశేషం. ‘భారతదేశానికే మొదటి ప్రాధాన్యం’ అన్న విధానానికి అడుగడుగున కట్టుబాటు చాటుతూ మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రధానిగా మోదీ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకూ ఇదే సూత్రం స్ఫూర్తిగా నిలిచింది. దేశ ప్రజ తిరుగులేని తీర్పుతో భాజపా సారథ్యంలోని సర్కారుపట్ల ఆరు నెలల క్రితం తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని నిలుపుకొంటూ భాజపా తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు ప్రస్థానిస్తోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిమగ్నమైంది. తదనుగుణంగా ‘అందరి తోడ్పాటుతో అందరి ప్రగతి’పై విస్తృత దృష్టితో మరోసారి ‘అందరి విశ్వాసం’ చూరగొనేలా ముందడుగు వేస్తోంది!

సాహసోపేత గమనం
భాజపా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక వాగ్దానాల్లో అధికశాతాన్ని ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. ‘రాజ్యాంగంలోని ‘370, 35-ఎ’ నిబంధనల రద్దు చేశారు. దానితోపాటు ముమ్మార్లు తలాక్‌ను చట్టబద్ధంగా నిషేధించడం ద్వారా ముస్లిం మహిళలపట్ల దుర్విచక్షణను అంతం చేసి వారికి లింగపరమైన సమానత్వం కల్పించేందుకు ప్రయత్నించడం అన్నిటికన్నా ప్రధానమైనది. ఈ నిర్ణయాలను ప్రజలంతా సహర్షంగా స్వాగతించారు. అలాగే మోదీ రెండోధఫా ఆరు నెలల పాలనలో అయోధ్య భూ వివాదంపై గౌరవ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునివ్వడాన్నీ దేశం చూసింది. ఆ తీర్పుతో ‘రామ జన్మభూమి’లో అత్యద్భుత రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. కాగా, అయోధ్యపై తీర్పును ఆలస్యం చేయడానికి రాజకీయంగా కీలకంగా వ్యవహరిస్తున్న కొన్ని పత్యర్థి పక్షాలు శతవిధాలా ప్రయత్నించాయి. అయినప్పటికీ సత్వర తీర్పు వెలువడేలా ముఖ్యంగా భాజపా, దాని అనుబంధ సంస్థలు నిర్మాణాత్మక పాత్ర పోషించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రస్తావించినట్లుగా- అయోధ్యపై తీర్పు తరవాత దేశంలో శాంతి, సద్భావనల స్ఫూర్తి ప్రస్ఫుటమై అది ‘భారత ప్రజాస్వామ్య’ దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.

‘ఒకే దేశం... ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’ భావన మోదీ నాయకత్వంలో వాస్తవ రూపం దాల్చింది. రాజ్యాంగంలోని 370 నిబంధన రద్దుకు భాజపా అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఆమోదించిన చరిత్రాత్మక క్షణంలో ఆ భావన సాకారమెంiది. సత్వరం దేశాన్ని అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సాక్షాత్కరింపజేసే లక్ష్యం వైపు భారత్‌ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఆ మేరకు ప్రభుత్వరంగ సంస్థల నుంచి వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణసహా పన్ను, కార్మిక, బ్యాంకింగ్‌ రంగాల్లో విస్తృత సంస్కరణలు అమలు చేస్తోంది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటయ్యే సంస్థలపై కార్పొరేట్‌ పన్నును 22శాతం నుంచి 15శాతానికి తగ్గించింది. తద్వారా అత్యంత తక్కువ పన్నులు విధించే దేశంగా ఆవిర్భవించిన భారత్‌ నేడు ప్రపంచంలోని అత్యంత సమర్థ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. అలాగే బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే క్రమంలో భారీ విలీనాలను ప్రభుత్వం చేపట్టింది. ఆ మేరకు 10 బ్యాంకులను విలీనం చేయడంతోపాటు వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల దాకా నిధులు అందిస్తోంది.

దివాలా స్మృతి మేరకు వివాదాల పరిష్కార ప్రక్రియకు మోదీ ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిచ్చింది. దాంతో ఇప్పుడు కేవలం 374 రోజుల వ్యవధిలో వివాదాల పరిష్కారం, వ్యవస్థ ప్రక్షాళన పూర్తయ్యే వెసులుబాటు లభించింది. మరోవైపు అంతర్జాతీయ వేదికపై భారత్‌ తనదైన ముద్ర వేస్తోంది. ‘వాణిజ్య సౌలభ్యం, అంతర్జాతీయ ఆవిష్కరణలు’ వంటి వివిధ అంతర్జాతీయ సూచీల ప్రాతిపదికన భారత్‌ తార స్థాయికి దూసుకెళ్లడం ఇందుకు తిరుగులేని ఉదాహరణ. అంతర్జాతీయంగా 190 దేశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ‘వాణిజ్య సౌలభ్య నివేదిక (డీబీఆర్‌)-2019’లో భారత్‌ 63వ స్థానంలో నిలవడం గమనార్హం. అంటే మూడేళ్ల వ్యవధిలోనే వాణిజ్య సౌలభ్యంలో 67 స్థానాల మేర ఎగువకు దూసుకెళ్లిందన్న మాట! ప్రపంచంలో 2011 నుంచి ఇప్పటివరకూ ఏ పెద్ద దేశమూ ఈ స్థాయిలో అత్యధిక స్థానాలు ముందుకెళ్లిన సందర్భం లేదు.

అభివృద్ధి పథంలో...
అంకుర సంస్థల విషయంలో అంతర్జాతీయంగా భారత్‌ మూడో అతిపెద్ద దేశంగా ఉంది. అంటే- అంతర్జాతీయ ఆవిష్కరణ సూచీపరంగా 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్‌ 2019 నాటికి 52వ స్థానానికి చేరింది. అలాగే అంతర్జాతీయ నిర్వహణాభివృద్ధి సంస్థ (ఐఎండీ) ప్రకటించే ప్రపంచ డిజిటల్‌ పోటీతత్వ సూచీలో 2018 నాటికి 48వ స్థానంలో ఉన్న భారత్‌ 2019 నాటికి 44వ స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో చివరగా చెబుతున్నప్పటికీ ప్రాధాన్యంగల అంశం మరొకటుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ప్రకటించే ‘ప్రయాణ-పర్యాటక’ పోటీతత్వ సూచీలోనూ 2015లో 52వ స్థానంలో ఉన్న భారతావని 2019 నాటికి 52వ స్థానంలోకి దూసుకెళ్లింది. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. ఆ దిశగా మోదీ రెండో దఫా ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్‌’ పేరిట వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద రైతులందరికీ పెట్టుబడి సాయంగా ఏటా రూ.6,000 అందిస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని మొత్తం 14.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అలాగే రక్షణ రంగంలోనూ మోదీ ప్రభుత్వం నిజాయతీ, పారదర్శకతలకు పెద్దపీట వేస్తోంది. దేశ రక్షణావసరాల దృష్ట్యా ‘రఫేల్‌’ యుద్ధ విమానాలను సమకూర్చింది. యుద్ధ విమానాలు దేశానికి రావడంతో ప్రభుత్వంపై వెల్లువెత్తిన అవాస్తవ ఆరోపణలు, విమర్శలకు తెరపడింది. జాతి నడవడిని మార్చే ప్రజా భాగస్వామ్య పాలనపై ప్రధాని మోదీకి అచంచల విశ్వాసం ఉంది. స్వచ్ఛభారత్‌ అభియాన్‌, మరుగుదొడ్ల వినియోగంపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు. ‘ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులకు స్వస్తి’ చెప్పేందుకు ఆయన దేశ ప్రజలకు పిలుపిచ్చారు. ఈ కార్యక్రమం చేపట్టిన 15 రోజుల్లోనే దేశవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో 13,000 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించడం విశేషం. ఇదే క్రమంలో ‘ఫ్లాగింగ్‌’ పేరిట ప్రజలకు ప్రధాని ఒక విలక్షణ విజ్ఞప్తి చేశారు. ఉదయపు వేళ నడకకు వెళ్ళే ప్రతి ఒక్కరూ వీధుల్లో లేదా దారి పక్కన చెల్లాచెదురుగా ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సరైనచోట వేసేలా చొరవ చూపాలని ఆయన సూచించారు. అయిదేళ్ల పాలనలో ఆరు నెలల కాలం స్వల్పమే అయినప్పటికీ ఒకసారి వెనక్కి చూసుకుంటే- మోదీ రెండో దఫా ప్రభుత్వం అసాధారణ విజయాలు సాధించిందనడంలో సందేహం లేదు!

Posted on 02.12.2019