Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ఝార్ఖండ్‌లో హోరాహోరీ

* తుదిదశ పోలింగ్‌ ఎల్లుండి

రాష్ట్రంగా ఏర్పాటై రెండు దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ ఆర్థికంగా సొంత అస్తిత్వాన్ని సంతరించుకోలేక ఝార్ఖండ్‌ సతమతమవుతోంది. గడచిన అయిదు సంవత్సరాలు మినహా- పద్నాలుగేళ్లపాటు రాజకీయ అస్థిరత్వం ఝార్ఖండ్‌ను ఒడుదొడుకుల పాలుచేసింది. ఝార్ఖండ్‌లో అయిదు విడతలుగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఎల్లుండి తుది దశ పోలింగ్‌ జరగనుంది. బ్రహ్మాండమైన సహజ వనరులు ఉన్నప్పటికీ తీవ్రమైన పేదరికంతో ఇబ్బందిపడుతున్న ఆ రాష్ట్రానికి రాజకీయ సుస్థిరత లేకపోవడమే శాపంగా మారింది. ఈ పరిస్థితుల్లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జేడీ ఒకవైపు; భాజపా ఒంటరిగా మరోవైపు పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో ప్రజాభీష్టం ఎటువైపు మొగ్గనుందన్నది ఆసక్తికరంగా మారింది. కూటమిగా ఏర్పడి జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్‌ 31, ఆర్‌జేడీ ఏడు సీట్లకు పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో జేఎంఎంకు చెందిన హేమంత్‌ సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలు తెరపైకి తీసుకువచ్చాయి. రఘుబర్‌ దాస్‌ సారథ్యంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వెనకబడిన వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా ఆ వర్గం ఓట్లపై భాజపా భారీ ఆశలతో ఉంది.

‘వివాదాస్పద భూ సమీకరణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా భాజపా గిరిజనులకు శత్రుపక్షంగా మారిపోయింది. అడవిబిడ్డల హక్కుభుక్తమైన స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకోవడానికి కార్పొరేట్లకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల అటవీ హక్కుల చట్టం(2006) నిర్వీర్యమవుతోంది. ఫలితంగా 10నుంచి 12 లక్షలమంది గిరిజనులు భూములు కోల్పోయే ప్రమాదముంది’- జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ వ్యాఖ్యలివి. గిరిజన, గిరిజనేతర ఉద్వేగాలను రెచ్చగొట్టి భాజపాకు ముకుతాడు వేయాలన్న ఈ వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి. బిహార్‌ నుంచి విడివడి ప్రధానంగా గిరిజన ప్రాంతమైన ఝార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది మొదలు అడవిబిడ్డలందరూ చాలావరకు జేఎంఎంకే మద్దతు పలుకుతున్నారన్న విశ్లేషణలున్నాయి. గిరిజనులతోపాటు ముస్లిముల ఓట్లను ఆకట్టుకునేందుకు విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గడచిన అయిదేళ్ల కాలంలో గోరక్షణ పేరిట జరిగిన మూకదాడుల కారణంగా అత్యధికంగా ముస్లిములు ఈసారి తమవైపు తిరిగారన్నది జేఎంఎం సారథ్యంలోని విపక్షాల అభిప్రాయం. మత మార్పిడులకు వ్యతిరేకంగా భాజపా తీసుకువచ్చిన కఠిన చట్టాల కారణంగా క్రైస్తవ వర్గం కూడా పెద్దయెత్తున తమకు అనుకూలంగా మోహరించినట్లు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవంక ఆర్థిక మాంద్యం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల కారణంగా అయిదేళ్ల భాజపా పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రామేశ్వర్‌ ఒరాన్‌ చెబుతున్నారు.

అన్ని వర్గాల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని రఘుబర్‌ దాస్‌ సారథ్యంలో అయిదేళ్ల భాజపా పాలన సాగిందని, నిబద్ధ పాలనే నినాదంగా ఎన్నికల బరిలో దిగిన తమకు ప్రజలు బ్రహ్మరథం పడతారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ గిలు ధీమాగా ఉన్నారు. బిహార్‌నుంచి విడివడి ఝార్ఖండ్‌ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న డిమాండును పందొమ్మిదేళ్ల క్రితం కాంగ్రెస్‌, ఆర్‌జేడీలు వ్యతిరేకించాయి. ఈ పరిస్థితుల్లో జేఎంఎం ఆ రెండు పార్టీలతో జట్టుకట్టడం విపక్షాల గిరిజన ఓటు బ్యాంకుకు తూట్లు పొడుస్తుందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. మరోవంక గిరిజనం మద్దతు కూడగట్టుకునే క్రమంలో రఘుబర్‌ దాస్‌ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 2014లో గిరిజన సంక్షేమ నిధిని రూ.12వేల కోట్లనుంచి రూ.21వేల కోట్లకు పెంచడం; ఝార్ఖండ్‌ సంస్కృతి పరిరక్షణలో భాగంగా సంప్రదాయ గిరిజన గ్రామాల్లోని పెద్దలకు గౌరవ వేతనం చెల్లించడం, ఆయా ప్రాంతాల్లో గిరిజన అభ్యుదయం కోసం అయిదు లక్షల రూపాయలతో ఆదివాసీ గ్రామ్‌ వికాస్‌ సమితి ఏర్పాటు వంటివన్నీ తమ పార్టీని అడవి బిడ్డలకు సన్నిహితంగా మార్చాయని భాజపా నాయకత్వం భావిస్తోంది. భూ యాజమాన్య చట్టాల్లో భాజపా తలపెట్టిన మార్పులు గిరిజనులకు కోపకారణమయ్యాయన్నది నిజం. అయితే గిరిజనుల ఆగ్రహాన్ని గమనించిన రాష్ట్ర సర్కారు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అయినప్పటికీ ఏదో ఒకనాడు భాజపా పాత చట్టాలను తిరగతోడవచ్చునన్న భయం గిరిజనంలో ఎక్కువగా ఉంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే భాజపా ప్రధానంగా ఓబీసీలు, అగ్రవర్ణాల ఓట్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించింది.

ఝార్ఖండ్‌ రాజకీయాల్లో మొదటినుంచీ గిరిజనుల ఆధిపత్యాన్ని నిరసిస్తున్న వర్గాలివి. జేఎంఎంతో కాంగ్రెస్‌ చేతులు కలపడంతో అగ్రవర్ణాలు క్రమంగా భాజపావైపు మొగ్గుచూపుతున్న సూచనలున్నాయి. ఓబీసీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని నియమించినప్పటికీ ఆ వర్గాన్ని ఎంతవరకు భాజపా పట్టి ఉంచగలదన్న విషయంలో అనుమానాలున్నాయి. ఎందుకంటే ఝార్ఖండ్‌లో 11శాతం జనాభా గల కుర్మీ కులంలో పట్టు ఉన్న ఏజేఎస్‌యూ పార్టీ ఎన్డీయేనుంచి బయటకు రావడం భాజపాకు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఓబీసీగా ఉన్న కుర్మీ కులాన్ని ఎస్‌టీల్లో చేర్చాలన్నది ఏజేఎస్‌యూ డిమాండ్‌. మొన్నటిదాకా కలిసి ఉన్న ఆ పార్టీ తమను వీడటంతో ఓబీసీ ఓట్లలో కోతపడే ప్రమాదం భాజపాను కలవరపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్‌ యోజన వంటి పథకాలతోపాటు రాష్ట్రంలో రైతులకు ఎకరాకు అయిదువేల రూపాయలు చెల్లిస్తూ తీసుకువచ్చిన కార్యక్రమాలు ఎలాగోలా తమను గట్టెక్కిస్తాయన్న నమ్మకం భాజపాది. విపక్షాలు గిరిజనులు, ముస్లిములు, క్రైస్తవుల ఓట్లపై; అధికార పక్షం ఓబీసీలు, అగ్రవర్ణాల మద్దతుపై ఆధారపడి పోటీపడుతున్న ఈ ఎన్నికల్లో మరో వారం రోజులు వేచి చూస్తే తప్ప విజయం ఎవరిని వరించనుందన్న విషయంలో స్పష్టత రాదు.

- రాజీవ్‌ రాజన్‌
Posted on 18.12.2019