Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ఆగడాల పాక్‌ ఆటకట్టు!

* మోదీ ‘బలూచ్‌’ వ్యూహం
భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాలు మరింతగా క్షీణించే అవకాశం ఉందని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శక్తిమంతమైన ఆర్థిక, ప్రజాస్వామ్య వ్యవస్థలతోపాటు అణ్వస్త్రాలతోనూ పరిపుష్టమైన దేశం భారత్‌. నిరంతరం ఘర్షణ వాతావరణంతో భారత్‌ను ఇబ్బందులకు గురిచేసి అంతిమంగా కశ్మీర్‌ను చేజిక్కించుకోవాలన్నది పాక్‌ వ్యూహం. అంటే కశ్మీర్‌లోను, కశ్మీర్‌ కోసం మొత్తం భారత దేశంలోనూ ఎప్పుడూ రావణ కాష్ఠాలను రాజేస్తూ ఉండటమే లక్ష్యంగా అది ముందుకెళుతోందన్నమాట. పాకిస్థాన్‌ సైతం అణ్వస్త్ర రాజ్యమే అయినప్పటికీ ఆర్థికంగా బలహీనమైన, రాజకీయంగా అస్థిరమైన దేశం. ఇదివరకటి భారత ప్రభుత్వాలు పాక్‌ విషయంలో దూకుడు వ్యూహాన్ని ఏనాడూ అనుసరించలేదు. మోదీ ప్రభుత్వం మాత్రం పాకిస్థాన్‌కు సంబంధించి సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో కీలకాంశమే- బలూచిస్థాన్‌!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న ఆగస్టు 15న, స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో బలూచిస్థాన్‌, గిల్గిట్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజల గురించి ప్రస్తావించారు. ఇవన్నీ పాక్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతాలు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో మాత్రమే పాకిస్థాన్‌ అన్న పదాన్ని ఆయన ఉపయోగించారు. బలూచిస్థాన్‌లో తిరుగుబాటు కొనసాగుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాక్‌ ప్రభుత్వంపై పోరాడుతున్న ఆ ప్రాంతాల ప్రజలకు సంఘీభావం తెలపడానికే ప్రధాని తన ప్రసంగంలో వారి గురించి ప్రస్తావించారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. భారత్‌లోని కశ్మీర్‌లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద తండాలకు పాకిస్థాన్‌ అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోంది. అందుకు ప్రతిగానే బలూచిస్థాన్‌ అంశాన్ని ప్రధాని మోదీ తెరమీదకు తెచ్చారు.

విలక్షణ విదేశాంగ విధానం
ప్రధానమంత్రి వ్యాఖ్యలు నాలుగు విధాలా ప్రభావాన్ని ప్రసరించే అవకాశం ఉంది. మొదటిది: మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పుడు ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే- అనుభవలేమి అంటూ తేలిగ్గా కొట్టిపారేయడానికి వీలయ్యేది. పైగా, అవన్నీ ఉత్తుత్తి మాటలేనని, వాటిని బట్టి విధానం రూపుదిద్దుకొనే పరిస్థితే లేదని అనుకొనేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రధానమంత్రిగా ఆయన రెండేళ్ల అనుభవం గడించారు. విశిష్ట విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నట్లు పేరు పొందారు. ఇప్పుడు ఆయన బలూచిస్థాన్‌ గురించి ప్రస్తావించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది తీవ్రంగా తీసుకోవలసిన విషయమే. రెండోది: పాకిస్థాన్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని దేశీయ రాజకీయ పక్షాలకు స్పష్టం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమైతే, సీనియర్‌ క్యాబినెట్‌ మంత్రి ఎవరిచేతనైనా బలూచిస్థాన్‌ మీద ప్రకటన ఇప్పించవచ్చు. ఇక్కడ జరిగింది అది కాదు. ప్రధానమంత్రి మోదీ కేవలం ఒక్క వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బలూచిస్థాన్‌ గురించి ప్రస్తావించారు. ఆగస్టు 12న జమ్ము కశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ- ‘బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజానీకంపై అకృత్యాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌, దీనిపై ప్రపంచానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదేపదే చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు, ప్రకటనలు అపార ప్రభావం చూపేవే. ప్రపంచ యవనికపై అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవిస్తున్న భారత్‌కు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి- పొరుగుదేశాల్లోని అల్పసంఖ్యాల వర్గాల మానవహక్కుల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారంటే- ఇది చిన్నాచితకా విషయం కాదు. దీన్ని యథాలాపంగా తీసివేయడానికి ఎంతమాత్రం వీల్లేదు. బలూచిస్థాన్‌ ప్రజానీకం మీద పాకిస్థాన్‌ కొనసాగిస్తున్న అణచివేత చర్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలను ప్రపంచం ముందు బట్టబయలు చేయడానికి తగిన ఏర్పాట్లు, సన్నాహాలు చేయాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. మరి, ఆ ఏర్పాట్లు ఎలా ఉండవచ్చు? విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని నిఘా సంస్థల అధికారులతో ఏర్పాటు చేయవచ్చు. బలూచిస్థాన్‌ పరిణామాలను అది నిరంతరం గమనిస్తూ ఉంటుంది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సకల సమాచారాన్ని ప్రపంచం వివిధ ప్రాంతాల్లో ఉన్న భారత దౌత్యవేత్తలకు అది చేరవేస్తుంది. తద్వారా అక్కడ పాక్‌ కొనసాగిస్తున్న దౌర్జన్యకాండను విశ్వవేదికమీద ఎండగట్టడానికి వీలవుతుంది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా అక్కడి విద్యావేత్తలు, మేధావులు, మానవహక్కుల కార్యకర్తలతో అనుసంధానం ఏర్పరచుకోవలసి ఉంటుంది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి సారించాల్సిందిగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థలను కోరాల్సి ఉంటుంది.
మూడోది- భారత్‌లోని కశ్మీర్‌లోయలో జరుగుతున్న నిరసన ప్రదర్శనల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడానికే ప్రధానమంత్రి మోదీ ప్రయత్నిస్తున్నారని ఎవరైనా అనుకొంటే- పొరపడినట్టే. వాస్తవంలో ఈ సమస్య విస్తృత స్వభావాన్నే ఆయన కళ్లకు కట్టదలిచారు. బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, గిల్గిట్‌లలో జరుగుతున్న ప్రజాందోళనలు, రాజకీయ ఉద్యమాలను ఆయన ప్రస్తావించడం వెనక పెద్ద మతలబు ఉంది. యావత్‌ దక్షిణాసియా ప్రాంతమంతటా విభిన్న జాతిపరమైన వేర్పాటు ఉద్యమాలు కొనసాగుతున్నాయని, ఏదో ఒక ప్రాంతంలో స్వయంపాలనకు సంబంధించి చెలరేగే డిమాండ్లు, మొత్తం ఉపఖండం మీదే తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన బలంగా చెప్పదలిచారు. ఈ విషయంలో ఆయన కృతకృత్యులయ్యారు.
నాలుగోది- పాకిస్థాన్‌కు సంబంధించి భారత్‌ ఇప్పటివరకు అనుసరిస్తూ వస్తున్న విధానంలో మార్పు వచ్చిందని మోదీ ప్రసంగం ద్వారా స్పష్టమైంది. పాక్‌ ప్రేరేపిత సాయుధ ఉగ్రవాద వర్గాలు నిరంతరం తీవ్రస్థాయి దాడులకు తెగబడుతున్నప్పటికీ భారత్‌ గడిచిన మూడు దశాబ్దాలుగా అత్యంత సహనంతో వ్యవహరించింది. దేశీయంగా ఉగ్రవాద సంస్థల దూకుడుకు ముకుతాడు వేయడం, ప్రచ్ఛన్న యుద్ధాన్ని విడనాడవలసిందిగా పాకిస్థాన్‌ మీద అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడమన్నది భారత్‌ నేటిదాకా అనుసరిస్తూ వచ్చిన వ్యూహం. 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు భారత పార్లమెంటు మీద దాడి చేశాక భారత్‌ మొట్టమొదటిసారిగా తీవ్రంగా స్పందించింది. ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ పేరుతో సైనిక దళాలను పెద్దయెత్తున పాకిస్థాన్‌ సరిహద్దులకు తరలించింది. పూర్తిస్థాయి యుద్ధానికీ సిద్ధమేనని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. భారత్‌ మీద అనూహ్యంగా భారీయెత్తున ఉగ్రవాద దాడి జరిగిన పక్షంలో, పాకిస్థాన్‌పై మెరుపుదాడి జరపడానికి వీలుగా ఆ దేశ సరిహద్దులకు పెద్దసంఖ్యలో సైనిక దళాలను తరలించి, మోహరించేందుకు ఉద్దేశించిన, ‘కోల్డ్‌ స్టార్ట్‌ డాక్ట్రిన్‌’కు ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’తో నాంది పలికినట్లయింది. సైనికపరమైన ఎత్తుగడలతోపాటు ఆర్థిక శస్త్రాస్త్రాలకూ భారత్‌ పదును పెట్టింది. వేగవంతంగా వృద్ధి సాధించి, గొప్ప ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రబల శక్తిగా అవతరించాలని సంకల్పించిన భారత్‌, దీని వల్ల పాకిస్థాన్‌ తన వ్యూహాలు మార్చుకొని, దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించింది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ, మానవహక్కుల పరిరక్షణ అంశాన్ని జోడించడం ద్వారా పాకిస్థాన్‌కు సంబంధించి భారత విధానాన్ని కొత్తపుంతలు తొక్కించారు. దీనివల్ల పాకిస్థాన్‌ ఆత్మరక్షణ స్థితిలోకి పడిపోక తప్పదని, భారత ఆర్థిక అభివృద్ధికి విఘాతం కలుగకుండా ఉంటుందని భావిస్తున్నారు.
భారత ప్రధానమంత్రి ప్రకటనలపై పాకిస్థాన్‌ స్పందన అనుకొన్న విధంగానే ఉంది. బలూచిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని భారతదేశమే ఎగదోస్తోందన్న తమ ఆరోపణలను మోదీ వ్యాఖ్యలు బలపరుస్తున్నాయని పాకిస్థాన్‌ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న సర్తాజ్‌ అజీజ్‌ వ్యాఖ్యానించారు. బలూచిస్థాన్‌లో భారీయెత్తున ఉగ్రవాద దాడి జరిగి, పెద్ద సంఖ్యలో పౌరులు మరణిస్తే, పాక్‌ ప్రభుత్వం ఆ నెపాన్ని భారత్‌ మీదే వేస్తుందనడంలో సందేహం లేదు. అది ఇదివరకు అలాగే చేసింది. కాకపోతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనల రూపంలో ఇప్పుడు దానికొక సాకు దొరికింది. ఉగ్రవాదాన్ని భారతే ప్రేరేపిస్తోందంటూ ఆ దేశం ఇప్పుడిక సులభంగా నిందారోపణలు చేయగలుగుతుంది. ఈ దృష్ట్యా భారత ప్రభుత్వం ఆచితూచి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. బలూచిస్థాన్‌లో మానవహక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ వేదికల మీద బలంగా చాటి చెప్పాలి. అదే సమయంలో, ఆ ప్రాంతంలో సాయుధ మూకల హింస, విధ్వంసకాండతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ స్పష్టం చేయాలి.

గట్టి కృషితోనే ఫలితాలు
బలూచిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ఉద్యమాలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ముందుకు నడిపించడానికి కావలసిన సాధన సంపత్తి ప్రస్తుతం భారత్‌ వద్ద లేవు. 1971లో బంగ్లా విముక్తి పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన భారత్‌, తూర్పు పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్‌గా ఏర్పరచడంలో కీలకపాత్ర పోషించింది. బంగ్లాదేశ్‌ తరహా ప్రయోగం ఇప్పుడు కష్టమే. బలూచిస్థాన్‌ భారత్‌కు దూరంగా ఉంది. ఆ ప్రాంతంతో భారత్‌కు భౌగోళిక సంబంధాలు లేవు. ఇలాంటప్పుడు బలూచిస్థాన్‌ విషయంలో ఆ ప్రాంత దేశాలే గణనీయ పాత్ర పోషించాల్సి ఉంటుంది. బలూచిస్థాన్‌లో అస్థిరతను ఇరాన్‌ కోరుకోవడం లేదు. దానివల్ల తమ దేశ తూర్పు ప్రాంత రాష్ట్రాల మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుందని ఇరాన్‌ భావిస్తోంది. షియా ముస్లిములు అత్యధికంగా కలిగి ఉన్న దేశం ఇరాన్‌. ఇరాన్‌-పాక్‌ సరిహద్దులో నివసించే బలూచీలు చాలావరకు సున్నీలు. అందువల్ల బలూచిస్థాన్‌ రాజకీయ ఉద్యమాన్ని ఇరాన్‌ బలపరచకపోవచ్చు. అఫ్గానిస్థాన్‌లోని పాక్‌ వ్యతిరేకశక్తులు బలూచిస్థాన్‌లో పాక్‌ దమనకాండను బలంగా ఎండగట్టగలవేమో కానీ, వాటి సామర్థ్యాలు చాలా పరిమితమైనవి. చుట్టూతా భూభాగం మాత్రమే ఉన్న దేశం అఫ్గానిస్థాన్‌. పాకిస్థాన్‌, ఇరాన్‌ లేదా మధ్య ఆసియా నుంచి మాత్రమే అక్కడికి చేరడానికి వీలవుతుంది. ఇలాంటప్పుడు అఫ్గానిస్థాన్‌ ద్వారా బలూచిస్థాన్‌కు సహాయ సహకారాలు అందించడమన్నది భారత్‌కు కష్టమే. అమెరికా నుంచి మద్దతూ అనుమానమే. పాక్‌ విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, అల్‌ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలతో పోరాడాలంటే పాకిస్థానీ సైన్యాన్ని కలుపుకొని వెళ్లాల్సిందేనని అమెరికా భావిస్తోంది. అందువల్ల పాక్‌ సైనిక ప్రయోజనాలకు భంగకరమైన చర్యలేవీ అమెరికా చేపట్టకపోవచ్చు. బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోనే చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా ఏర్పాటవుతోంది. ఈ దృష్ట్యా ఆ ప్రాంతాల్లో అస్థిరత పెరగడమన్నది చైనాకు ఇష్టం ఉండదు. పైపెచ్చు, భారత్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా పాక్‌ను పావుగా వాడుకుంటున్న చైనా, ఇటీవలి కాలంలో ఆ దేశాన్ని మరింతగా బలోపేతం చేస్తోంది. ఇలాంటప్పుడు భారత్‌ ముందున్న అవకాశాలు చాలా తక్కువ. ఏదో అద్భుతం జరగాలి లేదా అల్పసంఖ్యాక వర్గాలవారిని పాకిస్థాన్‌ అణచివేస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీయాలి. అలాంటిదేదీ జరగకపోతే బలూచిస్థాన్‌ వేదనను, రోదనను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకురావడానికి భారతదేశం భారీగానే శక్తి సామర్థ్యాలను వెచ్చించాల్సి ఉంటుంది.

Posted on 23.08.2016