Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

రాజ్యాంగంపై రాజకీయ స్వారీ

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్టీల జయాపజయాలు జనాధీనం. భయపక్షపాతాలు, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామన్న పదవీ ప్రమాణాలకు పాలక పక్షాలు నిష్ఠగా కట్టుబడితే- సుపరిపాలన కోసం జనం దశాబ్దాల తరబడి మొహం వాచిపోయే దుస్థితి దాపురించేదా అన్నది ధర్మసందేహం. రాజ్యాంగబద్ధ పాలన పద్ధతిలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయపాలన వ్యవస్థల నడుమ విస్పష్ట పని విభజనలు, నియమనిబంధనలు, సంప్రదాయాల లక్ష్మణరేఖలు... ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్ని వ్యవస్థల్ని నిర్మించినా, కోర్టులెన్ని తీర్పులు వెలువరించినా, బ్యురాక్రసీపై నేతాగణాల రాజకీయ స్వారీ అడ్డగోలుగా సాగిపోతూనే ఉందనడానికి రుజువులెన్నో పోగుపడుతున్నాయి. ఆ వైనం చిత్తగించండి!

పారదర్శకత, జవాబుదారీతనాలనే జంటపదాలకు, మన నేతాగణాలకు చుక్కెదురు. అంతా పద్ధతి ప్రకారం చెయ్యాలంటే- పాలనపై తమవైన ముద్రవేసే మజా కోల్పోతామన్నది వాళ్ల బెదురు! తానిచ్చింది వరం పెట్టింది శాపంగా చలాయించుకోవడానికి ఆద్యురాలు ఇందిర అయితే, అనంతర కాలంలో ఎవరి స్థాయిలో వాళ్లు తమదైన ఒరవడి దిద్దుతున్నవారే. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికెలో వాసు అనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉన్నపళంగా తనను బదిలీ చేసి, తన స్థానంలో మరొకర్ని నియమించడం అన్యాయమంటూ కోర్టు గడప తొక్కారు. బదిలీ ఉత్తర్వులిచ్చింది మహానగర పాలిక కమిషనరే అయినా ఆయన నిర్ణయాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు వేరు! జీఆర్‌ దేవేంద్ర నాయక్‌ అనే అతణ్ని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా నియమించాలంటూ కేంద్రమంత్రి సదానంద గౌడ ముఖ్యమంత్రి యెడియూరప్పకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దాన్ని మన్నించిన ముఖ్యమంత్రి- పని జరిగేట్లు చూడమంటూ అదే లేఖపై రాసి కమిషనర్‌కు పంపించారు. అది సాదాసీదా ఉత్తరం కాదు... అసాధారణ ఉత్తర్వు అని కనిపెట్టేసిన కమిషనర్‌- అప్పటికే ఆ పదవిలో ఉన్న వాసును ఊడబెరికి, అతగాడి కుర్చీని సదానందంగా గౌడ గారు సూచించిన వ్యక్తికి కేటాయించారు. వాసు వేసిన వ్యాజ్య విచారణలో భాగంగా దస్త్రాల్ని క్షుణ్నంగా పరిశీలించిన కర్ణాటక హైకోర్టు కమిషనర్‌పై అక్షరాలా నిప్పులు చెరిగింది. మహా నగర పాలికలో సిబ్బంది నియామక క్రతువులో మంత్రుల ప్రమేయాన్ని అనుమతించే చట్టబద్ధ నిబంధనలేవీ లేవంటూ వెలుపలి శక్తుల ప్రోద్బలంతో చేసిన బదిలీని కొట్టేసింది. నిబంధనల మేరకు సహేతుకంగా, న్యాయబద్ధంగా చట్టబద్ధ విచక్షణతో వ్యవహరించాల్సిన కమిషనర్‌- పెద్దవాళ్లు, శక్తిమంతులు చెప్పారంటూ గుడ్డిగా తలూపడాన్ని ప్రశ్నించింది. ఆరేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉన్నప్పుడు ఇలాగే మహానగర పాలికలో నియామకాల్ని అడ్డగోలుగా కానిచ్చేసినప్పుడూ కోర్టు వాటిని కొట్టేసి- పని సామర్థ్యం, నిజాయతీ, నిష్కళంక వ్యక్తిత్వం గలవారినే ఎంపిక చేయాలని లక్ష్మణ రేఖలు గీసింది. తాజాగా ఇప్పుడు ఆ తీర్పును ప్రస్తావించిన ఉన్నత న్యాయస్థానం- ఇందులో ప్రమేయంగల అందర్నీ అభిశంసించి, భారీ జరిమానాలు విధించగల వీలున్నా, మున్ముందు ఇలాంటి అక్రమ బదిలీలు పునరావృతం కాబోవన్న విశ్వాసంతో విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది. గుట్టుచప్పుడు కాకుండా పని చక్కబెట్టుకుందామనుకొన్న పెద్దలకు ఎంత నామోషీ అది!

చట్టం తన పని తాను చేసుకుపోతుందనుకొంటాం గాని, ఎవరికి అనుకూలంగా... అన్న ప్రశ్నకు తగు సమాధానాన్ని ఆశించని సమాజం మనది. అదే కర్ణాటక హైకోర్టు మొన్న అక్టోబరులో మరో కీలక ఆదేశం వెలువరించింది. పోలీసు అధికారుల బదిలీలు, కొనసాగింపుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని పట్టించుకోబోమన్న హామీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ అక్కడి పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు (పీఈబీ) ఆదేశించింది. ఎప్పుడో 2006లోనే ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు పోలీసు శాఖలో సమగ్ర సంస్కరణల్ని లక్షించి మేలిమి మార్గదర్శకాలు అందించింది. వాటికి అనుగుణంగా 2012లో కర్ణాటకలో పీఈబీ చట్టబద్ధంగా ఏర్పాటైంది. రాజకీయ జోక్యం ఏమాత్రం లేకుండా సందర్భావసరాల్ని బట్టి పోలీసు అధికార శ్రేణుల స్థానచలనాన్ని నిర్ధారించడం పీఈబీ బాధ్యత అయినా సిఫార్సు లేఖల ఉరవడి యథాపూర్వం సాగుతూనే ఉందని సాక్షాత్తు అఖిల కర్ణాటక పోలీస్‌ మహాసంఘ అధ్యక్షుడే ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందంటే ఏమనుకోవాలి? బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి బదిలీ పరిశ్రమ (ట్రాన్స్‌ఫర్‌ ఇండస్ట్రీ) రాజకీయ నేతాగణాల చేజారిపోతే వారి పరువు, జేబుల బరువు ఏం కావాలి?

నిజాయతీ, నిష్పాక్షికత, ప్రతిభ- ఈ మూడూ పౌరసేవా గణానికి (సివిల్‌ సర్వీసెస్‌) మార్గదర్శక సూత్రాలు. చట్టబద్ధ పాలనకు కట్టుబడి నిజాయతీ, రుజువర్తనలతో శిరసెత్తుకు నిలిచే ఉన్నతాధికారులంటే ప్రభుత్వాల్లోని అవినీతి గద్దలకు ఎంతో వణుకు! బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జితేంద్ర గుప్తా కైనూర్‌ జిల్లా మొహానియా సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌గా ‘ట్రాన్స్‌పోర్ట్‌ మాఫియా’ మెడలు వంచారు. అక్రమ పార్కింగ్‌ దందాలు, భారీ వాహనాల ఓవర్‌ లోడింగ్‌పై ఉక్కుపాదం మోపిన గుప్తాపై కక్ష గట్టిన మాఫియా అతగాడిపై దొంగకేసులు బనాయిస్తే, బిహార్‌ ప్రభుత్వం కూడా వాళ్లకు వత్తాసుగా నిలిచింది! పట్నా హైకోర్టు ఆ కేసును తోసిపుచ్చాక తనకు తన కుటుంబానికీ ప్రాణహాని ఉందంటూ బిహార్‌ క్యాడర్‌ నుంచి బదిలీ చెయ్యాలని డాక్టర్‌ గుప్తా సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి అది కూడా నితీశ్‌ సర్కారుకు ఆ మేరకు సిఫార్సు చేసినా- పెడసరమే ఎదురైంది. మొన్న జులైలో దిల్లీ హైకోర్టు ఈ కేసును తీవ్రంగా పరిగణించి- నిజాయతీపరుడైన అధికారిని రక్షించాల్సిందిపోయి వేధించిన బిహార్‌ ప్రభుత్వానికి అయిదు లక్షల రూపాయల జరిమానా విధించి హరియాణా క్యాడర్‌కు డాక్టర్‌ గుప్తాను బదిలీ చెయ్యాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో, రాజకీయ కక్షతో ఎలా వెంటాడాలో అందరికీ తెలుసు’నంటూ ఇప్పుడదే సూత్రం వారికీ వర్తిస్తుందన్న వాదనలతో ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణ కిశోర్‌పై ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ‘క్యాట్‌’ తీవ్రంగా పరిగణిస్తూ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘హోదా మార్చి బదిలీ చేస్తారా... ఎంత ధైర్యం?’ అన్న క్యాట్‌ సర్కారీ దురుద్దేశాన్ని ఎండగట్టింది. కార్యనిర్వాహక వర్గాన్ని సుపరిపాలన సాధనంగా మార్చుకోవాల్సింది పోయి కక్ష కట్టి వేధించే ధోరణులు ఎక్కడికక్కడ పడగెత్తుతున్న తీరు ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది.

బ్రిటిషర్ల ఏలుబడిలో పాలనకు అర్థం ప్రజాపీడనగా ఉండేది. నల్లదొరల పాలనలో అది కొద్దోగొప్పో ఉన్న తులసి మొక్కల్లాంటి నిజాయతీపరుల ఏరివేతగా దిగజారిపోతోంది. ఈ దురవస్థ రూపుమాసిపోవాలనే 2013లో సుప్రీంకోర్టు- అన్ని రాష్ట్రాల్లో సివిల్‌ సర్వీసెస్‌ బోర్డు ఏర్పాటు కావాలంది. ఉన్నత అధికారులకు సంబంధించి అన్న రకాల బదిలీలు, పోస్టింగులు, క్రమశిక్షణ చర్యలు, శిక్షలు అన్నింటికీ అదే బాధ్యత వహించాలంది. నోటిమాట ఆదేశాల్ని పట్టించుకోనక్కర్లేదన్న న్యాయపాలిక- ప్రతి నియామకానికి నిర్దిష్ట కాలావధి ఉండాలంది. ఎవరెన్ని మార్గదర్శకాలిచ్చినా- సొంత అజెండాలతో రాజ్యాంగాన్ని భ్రష్టుపట్టించే పోకడలు ఊడలు దిగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కరి మింగిన వెలగపండు చేస్తూనే ఉన్నాయి. ఏమంటారు?

- పర్వతం మూర్తి
Posted on 29.12.2019