Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

నేర రాజకీయానికి సమగ్ర చికిత్స

‘వీర గంధము తెచ్చినాము నేరగాళ్లెవరో తెల్పుడీ’ అంటూ నేరగ్రస్త రాజకీయాలకు పార్టీలే మహరాజ పోషకులుగా మారబట్టే భారత ప్రజాస్వామ్యం అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోతోంది. ఈ విషయంలో తరతమ భేదాలతో అన్ని పార్టీలూ ఆ తాను ముక్కలే కాగా, నేరగ్రస్త రాజకీయాల ప్రక్షాళనకు తనవంతుగా న్యాయపాలిక చూపుతున్న చొరవ ఒంటిచేతి చప్పట్లనే తలపిస్తోంది. స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాజ్యాంగంలోని 324 అధికరణ నిర్వాచన్‌ సదన్‌కు విస్తృతాధికారాలు దఖలుపరచినా, నేర రాజకీయ కాళియ మర్దనానికి అవి సరిపోవంటూ సవిస్తృత ఎన్నికల సంస్కరణల ప్రతిపాదనలకే ఈసీ పరిమితం కావడం తెలిసిందే. వాటంగా వాటిని అటకెక్కించేసిన ప్రభుత్వాల ఉపేక్షాభావం పెను ప్రమాదకరంగా పరిణమిస్తున్న వేళ- నేరగాళ్లను అక్కునజేర్చుకోకుండా పార్టీలను కట్టడి చెయ్యాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దానిపై విచారణ సందర్భంగా క్రిమినల్‌ నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల మీద, వాళ్లను పోటీకి నిలబెట్టిన రాజకీయ పక్షాలపైనా చర్యలు తీసుకోవాలన్న ఎలెక్షన్‌ కమిషన్‌ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- నేర చరితుణ్ని ఎన్నికల బరిలోకి దింపిన పార్టీ తన నిర్ణయంలోని హేతుబద్ధత ఏమిటో తప్పనిసరిగా వెల్లడించాలన్న సూచనను సమర్థించింది. అభ్యర్థుల గుణ దోషాలు, ఘనతలతోపాటు వారి నేరచరితపైనా వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలతోపాటు పార్టీ వెబ్‌సైట్లోనూ వివరించడంతోపాటు క్రిమినల్‌ కేసులున్నవారిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో కూడా స్పష్టీకరించాలన్నదానికి ‘సుప్రీం’ ఓటేసింది. ‘నేరం రుజువయ్యేదాకా అంతా నిరపరాధులే’ అన్న సూత్రాన్ని పరిగణిస్తూ చిన్నాపెద్దా కేసుల మధ్య తారతమ్యం చూపడం భిన్న సమస్యలకు అంటుకట్టే ప్రమాదాన్నీ ప్రస్తావించింది. రాజకీయ ప్రత్యర్థులపై జాతి వ్యతిరేకులన్న ఆరోపణలతో నామినేషన్ల ఘట్టం చివరి రోజున దేశద్రోహ అభియోగాలు నమోదు చేస్తే పరిస్థితేమిటన్న న్యాయపాలిక ప్రశ్నా సహేతుకమైనదే. అదే సమయంలో, సమగ్ర సంస్కరణల్లేకుండా నేరగ్రస్త రాజకీయాల భల్లూకం పట్టునుంచి దేశాన్ని బయటపడేయడం, ఒక్కముక్కలో- అసాధ్యమే!

‘సాధారణ కేసుల్లోనూ నేరాభియోగాలు నమోదు అయిన వారెవరైనా డాక్టరో, ఇంజినీరో, జిల్లా మేజిస్ట్రేట్‌, పోలీస్‌ సూపరింటెండెంట్‌, జడ్జీలో అయ్యే అవకాశమే లేనప్పుడు- అలాంటివాళ్లను ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అనుమతించడం అహేతుకం, అసంబద్ధం’- అంటూ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ ప్రజా ప్రయోజనకర వ్యాజ్యం దాఖలు చేశారు. కొన్ని వ్యాజ్యాల పరిష్కరణకు 20 ఏళ్ల దాకా నిరీక్షించాల్సి వస్తోందని, ఆరోపణలకు గురైన వ్యక్తి ఆ లోపు ప్రజాప్రతినిధిగా నాలుగు పర్యాయాలు చక్రం తిప్పగల వీలుందంటూ లోగడ సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అవ్యవస్థను సూటిగా వేలెత్తి చూపారు. నేరం రాజకీయం అద్వైత సిద్ధి పొంది, చట్టబద్ధ పాలనపై ఎంతగా స్వారీ చేస్తున్నదీ ఈసీ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. పద్నాలుగో లోక్‌సభలో 24శాతంగా ఉన్న నేరచరితుల సంఖ్య, పదిహేనో లోక్‌సభలో 30శాతానికి, పదహారో సభలో 34 శాతానికి, ప్రస్తుత లోక్‌సభలో 43 శాతానికీ విస్తరించింది. హత్యలు, అత్యాచారాల వంటి హేయ నేరాల అభియోగాలు ఎదుర్కొంటున్నవారే ఇప్పటి లోక్‌సభలో 29శాతంగా ఉండటం బాధాకర వాస్తవమైతే- తీవ్ర నేరాభియోగాలున్న నేతల విజయావకాశాలు ఇనుమడిస్తున్న సమాచారం మరింత వేదన కలిగించేదే! కాబట్టే, 1968నాటి ఎన్నికల గుర్తు ఆదేశాల్లో, పార్టీ గుర్తింపు షరతుల కింద నేర చరితుల్ని అభ్యర్థులుగా నిలబెట్టరాదన్న అంశాన్ని పొందుపరచాలని అశ్వనీ ఉపాధ్యాయ అర్థిస్తున్నారు. అయిదేళ్లు, ఆపై శిక్షపడగల నేరాలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన గడువుకు ఏడాది ముందు అభియోగాలు నమోదైన వ్యక్తినే నేరచరితుడిగా పరిగణించాలనీ కోరుతున్నారు. ఎందరెందరో ఆలోచనాపరుల వ్యధ వ్యాజ్యంలో ప్రతిఫలిస్తున్నా- ఈపాటి చొరవకే నేరగ్రస్త రాజకీయాల కంచుకోటలు బద్దలైపోతాయనుకొనే వీల్లేదు!

ముంబయిని వణికించిన పన్నెండు వరస బాంబు పేలుళ్ల ఉత్పాతం- నేరగాళ్లు, పోలీసులు, కస్టమ్స్‌ అధికారులు, రాజకీయ నేతాగణాల అక్రమ బాంధవ్యాన్ని 1993లోనే దేశ ప్రజల కళ్లకు కట్టింది. దానిపై నియుక్తమైన వోరా కమిటీ- పెద్ద నగరాల్లో భూ కబ్జాలతో తెగబలిసిన నేర తిమింగిలాలు- అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలతో కుమ్మక్కు కావడం ద్వారా తమకు ఎదురే లేకుండా చూసుకొన్నాయని, ఎన్నికల్లో భుజ మదబలుల నెట్‌వర్క్‌ విస్తరణకు వాళ్ల ధన బలమే ఇంధనమైందని స్పష్టీకరించింది! వ్యక్తి స్థాయి నేరాల కట్టడికే రూపొందిన నేర న్యాయ వ్యవస్థ ఈ మాఫియాను నిలువరించలేక పోతోందని రెండు పుష్కరాల నాడే అది కుండ బద్దలు కొట్టింది. ఎన్నికల్లో నల్లధనం ఉరవళ్లు నేరగ్రస్త రాజకీయాలకు దారులు పరచాయన్న నిష్ఠుర సత్యాన్ని బయటపెట్టిన వోరా కమిటీ నివేదికను ప్రభుత్వాలు మూసిపెట్టినా, రాజకీయం ముసుగులో నేరం ఎంతలా బుసలు కొడుతున్నదీ జాతి హితాన్ని మరెంతగా కబళిస్తున్నదీ నడుస్తున్న చరిత్రే చాటుతోంది! 1999, 2014 సంవత్సరాల్లో న్యాయ సంఘం నివేదికలు, 2004లో ఈసీ ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణలు, 2002నాటి రాజ్యాంగ సమీక్షా సంఘం సూచనలు, 2009నాటి రెండో పరిపాలన సంఘం సిఫార్సులు- నేరగ్రస్త రాజకీయాల విష పరిష్వంగంనుంచి దేశాన్ని రక్షించే విధివిధానాల్ని ఏకరువు పెట్టాయి. వాటిని పెడచెవిన పెట్టి కరడుగట్టిన నేరగాళ్లనూ చట్టసభలకు నెగ్గించి, నేరగ్రస్త రాజకీయ భస్మాసుర హస్తంతో పార్టీలు చెలగాటమాడుతున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం దేశ విశాల హితాన్నే బలిపీఠం మీదకు నెడుతున్న పార్టీల్లో ప్రాప్తకాలజ్ఞత రహించినప్పుడే- స్వచ్ఛభారత్‌ సాక్షాత్కరించేది!

Posted on 04.02.2020