Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

సమగ్ర ప్రగతికి సరైన పంథా!

ఒమర్‌ అబ్దుల్లా ఉన్నమాటే చెప్పారు- 2019 ఎన్నికల్లో గెలుస్తామనే ఆశను ప్రతిపక్షం ఇక వదులుకోవలసిందే! విపక్షం ఆశించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమ్మోహనశక్తి సడలకపోగా, మరింత ఇనుమడించిందని ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ విధాన సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అద్భుత విజయాలు చాటిచెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలప్పుడు యూపీలో భాజపా సాధించిన విజయం కాకతాళీయం కాదని నిరూపితమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వెంటనే నరేంద్ర మోదీ, భారతదేశాన్ని 21వ శతాబ్దంలో ఉరకలు తీయించడానికి పదేళ్ల వ్యవధి కావాలన్నారు. ఆయన కోరిన వ్యవధి లభించబోతున్నదని యూపీ ఎన్నికలతో స్పష్టమైంది. తమ జీవితాలను మెరుగుపరచడానికి మోదీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే వారు విధాన సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి పట్టం కట్టారు. ప్రజలిచ్చిన ఈ వూతంతో అన్ని అడ్డుగోడలను ఛేదించి 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలవడానికి మోదీ ఉత్సాహంగా ముందుకెళ్లబోతున్నారు. ఆయన నాయకత్వంలో భాజపా సమీప భవిష్యత్తులోనూ దేశ రాజకీయాల్లో అగ్రపాత్ర పోషించనుంది. ప్రతిపక్షాలు కిందా మీదా పడినా మోదీ రెండోసారి గెలవకుండా ఆపలేరని తేలిపోయింది. యూపీ ఎన్నికలకు ముందు ఇంత భరోసా ఉండేది కాదు. మోదీ 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచినా మెజారిటీ మాత్రం కాస్త తగ్గవచ్చునని పండితులు అంచనా వేసేవారు. అలాంటి పరిస్థితే వస్తే భాజపా చిన్నాచితకా పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని వారు లెక్క కట్టేవారు. యూపీ ఎన్నికల ఫలితాలతో ఈ అంచనాలన్నీ బుట్టదాఖలైపోయాయి.

అన్ని వర్గాల మద్దతు
ఈసారి ఉత్తర్‌ ప్రదేశ్‌లో కులాలు, మతాల లెక్కలు పనిచేయలేదు. నరేంద్ర మోదీ వ్యక్తిగత సమ్మోహక శక్తి తారక మంత్రంగా పనిచేసి, ప్రతిపక్షాలు వూసులో లేకుండా పోయాయి. ఇప్పుడు లఖ్‌నవూలో భాజపా ప్రభుత్వమే కొలువుతీరి ఉంది కాబట్టి, 2014లో గెలిచిన 73 స్థానాలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ నిలబెట్టుకోగల వీలుంది. 2019 ఎన్నికల్లో మోదీ హవా బలంగా ఉంటుంది కనుక ప్రాంతీయ పార్టీల నాయకులు భాజపాతో పొత్తు పెట్టుకోవడం అనివార్యం. ఉదాహరణకు తమిళనాడులో జయలలిత మరణం తరవాత ఏఐఏడీఎంకేకు పెద్దదిక్కు లేకుండా పోయింది. భవిష్యత్తు కోసం భాజపాతో చేతులు కలపడమే ఆ పార్టీకి శరణ్యం కావచ్చు. డీఎంకే అధినాయకుడు కరుణానిధి వృద్ధాప్యం వల్ల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించలేకపోతున్నారు. ఆయన కుమారులు స్టాలిన్‌, అళగిరిల మధ్య ఆధిపత్య సమరం నెలకొనవచ్చు. దాంతో ఉభయులకూ మోదీ మార్గదర్శకత్వం అవసరపడే అవకాశం ఉంది. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ మూడోసారి ప్రభుత్వం నడుపుతున్నా, ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆయన ప్రభ తగ్గినట్లు సూచిస్తున్నాయి. అక్కడ పంచాయతీ ఎన్నికల్లో భాజపా గొప్ప విజయాలు సొంతం చేసుకుంది. వచ్చే విధాన సభ ఎన్నికల్లో గెలవడం కోసం పట్నాయక్‌ భాజపాతో పొత్తు కుదుర్చుకోవచ్చు. కేంద్రంలో మోదీ సర్కారు బలంగా ఉంది కనుక, ఆయన మద్దతు పట్నాయక్‌కు ఎంతో అవసరమవుతుంది. యూపీ ఫలితాలను చూశాక పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దూకుడు తగ్గించి, కేంద్రంతో సహకారం గురించి మాట్లాడసాగారు. ఇక కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో మోదీని ధిక్కరించి నిలవగల నాయకులే కనిపించడం లేదు. నేడు దేశ రాజకీయాల్లో మోదీకి ఎదురులేదు కాబట్టి, పాత మిత్రులు ఆయన్ను అంటిపెట్టుకుని ఉంటే కొత్త మిత్రులు ఆయన స్నేహం కోసం అర్రులు సాచవచ్చు. అయితే తనకు తోచినవారితో స్నేహం చేసే సౌలభ్యం మోదీకి ఎటూ ఉంటుంది. చివరకు రాజకీయ పొత్తులకన్నా మించిన అంశం- మోదీ విస్తృత ప్రజా వర్గాల మద్దతు చూరగొనడం! కొంతకాలం క్రితం వరకు కాంగ్రెస్‌కు పెట్టని కోటల్లా నిలిచిన వ్యవసాయ కూలీలు, పేద రైతులు, చేతివృత్తులవారు, రోజువారీ కూలీలు, పారిశ్రామిక కార్మికులు, నిరుద్యోగ యువత, ఇంకా ఇతర బడుగు, బలహీన వర్గాలను తనవైపు తిప్పుకోవడంలో మోదీ సఫలుడయ్యారు. పూర్వం జనసంఘ్‌కు మద్దతిచ్చిన సంప్రదాయ వర్గాలు, పట్టణ మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు ఎటూ భాజపానే సమర్థించారు. ఇలా సమాజంలో అన్ని వర్గాల ఆదరణను సాధించడమే- మోదీ విజయ రహస్యం!

పాఠాలు నేర్వని ప్రతిపక్షాలు
విధానసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి ప్రతిపక్షం పాఠాలు నేర్చుకునే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌ దేశాభివృద్ధి సాధనకు కొత్త భావాలు, కార్యక్రమాలను ప్రతిపాదించలేకపోతోంది. దాని సంస్థాగత యంత్రాంగం దాదాపుగా శిథిలమైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వ స్థానాలను భజనపరులతో నింపేస్తున్నారే తప్ప, ప్రతిభావంతులకు చోటివ్వడం లేదు. ఇంత జరుగుతున్నా ఇందిర కుటుంబం తన పద్ధతులు మార్చుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దిల్లీ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ‘ఆప్‌’ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సాగించిన ప్రచార హోరు- పంజాబ్‌, గోవా ఓటర్లకు రుచించలేదు. ఇప్పుడున్న పార్టీలకన్నా తాము ఎంతెంతో మేలని కేజ్రీవాల్‌ చెప్పుకొన్నా, ఓటర్లు దాన్ని విశ్వసించలేదు. కేంద్ర ప్రభుత్వంతో చీటికి మాటికి ఘర్షణకు దిగడం, దిల్లీలో అధికారంలో ఉన్న రెండేళ్లలో ఏమీ సాధించలేకపోవడం ‘ఆప్‌’కు తీవ్ర ప్రతికూలాంశాలు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో మాయావతికి ఘోర పరాభవం జరిగింది. జాతవ దళితులు-ముస్లిముల పొత్తుతో, ధనబలంతో అధికారంలోకి రావాలని ప్రయత్నించి భంగపడిన ఈ దళిత నాయకురాలు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దళిత, ముస్లిం మహిళలు ఉభయులూ రాయితీ మీద మోదీ ఇచ్చే వంటగ్యాస్‌ సిలిండర్లతోనే పొయ్యి వెలిగిస్తారని ఆమె గ్రహించలేదు. మోదీ ప్రభుత్వం యూపీలో కోటి పేద కుటుంబాలకు రాయితీ సిలిండర్లు అందజేసింది. ఉన్నత వర్గీయులకు లభించే కనీస సౌకర్యాలు తమకూ అందాలని పేదలూ కోరుకుంటారు. కులమతాలతో నిమిత్తం లేకుండా అందరికీ ఈ ఆకాంక్ష ఉంటుంది. తమ ఆశలను నెరవేర్చగల సర్కారునే వారు ఎన్నుకుంటారని మాయావతి ఇప్పటికైనా గుర్తించాలి. మార్చి 11కన్నా ముందువరకు మాయావతి ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒక వర్గానికి మాత్రమే నాయకురాలు. యూపీకి వెలుపల ఆమె ప్రభావం శూన్యం. మార్చి 11 తరవాత యూపీలోనూ మాయావతి ఒంటరిగా చలాయించుకొచ్చే పరిస్థితి లేకుండాపోయింది. అదే పొరుగు రాష్ట్రం బిహార్‌కు వస్తే పెద్దనోట్ల రద్దుకు మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తెగనాడని ఏకైక భాజపాయేతర నాయకుడు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే! ఆయన వైఖరి సరైనదని యూపీ ఎన్నికలతో రూఢి అయినా, బిహార్‌లో తన భాగస్వామి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తెస్తున్న ఒత్తిళ్లు నితీశ్‌కు చికాకు కలిగిస్తున్నాయి.

కుటుంబ పెత్తనానికి కాలం చెల్లు!
పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించినా, దాన్ని రాహుల్‌గాంధీ ఖాతాలో వేయడం పొరపాటు. రాహుల్‌ ఉన్నా లేకున్నా అక్కడ కాంగ్రెస్‌కే పట్టం కట్టేవారు. ఎన్నికల పోరాటంలో తనకు స్వేచ్ఛ ఇవ్వకపోతే పక్కకు తప్పుకొంటానని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ విజయ సారథి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ హెచ్చరించిన సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందువరకు అమరీందర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా రాహుల్‌గాంధీ నానుస్తూ వచ్చారు. ఏతావతా అకాలీల పాలనపై విసిగిపోయిన పంజాబ్‌ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారే తప్ప, అందులో రాహుల్‌ గొప్పేమీ లేదు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌ ఓటర్లను ఆకట్టుకోలేకపోవడం కూడా కాంగ్రెస్‌కు లాభించింది. అయినా యూపీ, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోవడం ఆ పార్టీకి ఏర్పడిన నాయకత్వ లోటును బయటపెట్టింది. రాహుల్‌ గాంధీకి కనీస నాయకత్వ లక్షణాలు కాని, జన సమ్మోహకశక్తి కాని లేనేలేవని తేలిపోయింది. యూపీ ఎన్నికల ప్రచారసభల్లో అఖిలేశ్‌ యాదవ్‌ ప్రసంగం ముగిసిన వెంటనే జనం వెళ్లిపోయేవారు. అఖిలేశ్‌ తరవాత ప్రసంగించడానికి లేచిన రాహుల్‌ను ఏమాత్రం పట్టించుకునేవారు కారు. కాంగ్రెస్‌పై ఇందిర కుటుంబ పెత్తనం కొనసాగినంతకాలం ఆ పార్టీ తిరిగి జవసత్వాలు సమకూర్చుకొనే అవకాశం కనిపించడం లేదు.
ఏతావతా 2019 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఎదురు నిలవగల సత్తా ప్రతిపక్షానికి లేదని అవగతమవుతోంది. మోదీ ప్రభుత్వం సమర్థ ఫలితాలు చూపుతుందా లేదా అన్నదే ఆయన సర్కారు భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన విధానాలు తమ జీవితాలను మెరుగుపరచాయని సామాన్య ఓటర్లు భావించకపోతే, అది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ప్రసరిస్తుంది. ఈ సంగతి నరేంద్ర మోదీకి బాగా తెలుసు. సొంత పనులంటూ ఏమీ లేకుండా 24 గంటలూ పరిపాలనా వ్యవహారాల్లోనే నిమగ్నమై ఉండే మోదీ, 2019లో మళ్ళీ ఎన్నికవడానికి గణనీయ విజయాలు సాధించడం మీదే సర్వశక్తులూ కేంద్రీకరిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు!

Posted on 22.03.2017