Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

హస్తినబరిలో హోరాహోరీ

* దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నేడు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీల ప్రజాదరణకు గీటురాయిగా పరిగణిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జాతీయ స్థాయిలో తమ పనితీరు ప్రాతిపదికగా ఇవాళ్టి ఎన్నికల్లో గెలుపు తీరం చేరుకోవాలని భాజపా ఉవ్విళ్లూరుతుండగా, దిల్లీలో మూలమూలకూ చేరే విధంగా తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయం సిద్ధింపజేస్తాయన్న నమ్మకం ఆమ్‌ ఆద్మీ పార్టీది. 2013వరకు వరసగా పదిహేనేళ్లపాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ దఫా ఊసులో కూడా లేకపోవడమే వైచిత్రి. జాతీయ స్థాయిలో భాజపా, దిల్లీలో ‘ఆప్‌’ తాము చేసిన మంచి పనులు చెప్పుకొని ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమం ఓ దశవరకు సాఫీగానే సాగినా- ఆ తరవాత అంతా ఉద్వేగభరిత అంశాలు, వ్యాఖ్యానాలతోనే ఇరు పార్టీల ప్రచారం సాగింది. పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకిస్తూ దిల్లీలోని షహీన్‌భాగ్‌లో గడచిన 55 రోజులుగా ఎడతెగని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. షహీన్‌భాగ్‌ నిరసనల నేపథ్యంలో పెల్లుబుకిన ఉద్వేగాలను ఎన్నికల అస్త్రాలుగా మార్చుకునేందుకు భాజపా ప్రయత్నిస్తుంటే- వారం రోజుల క్రితం దాకా అన్నీ తానై అన్నట్లుగా ఆ ప్రదర్శనలను ముందుండి నడిపి, సంఘీభావం తెలిపిన ‘ఆప్‌’ కొన్ని రోజులుగా ఆ విషయంలో పూర్తిగా మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ‘షహీన్‌భాగ్‌’ను మరీ ఎక్కువగా నెత్తికెత్తుకుంటే మైనారిటీ ఓట్ల మాటేమోగానీ- మెజారిటీ వర్గం ఓట్లకు గండిపడుతుందేమోనన్న స్పృహే ‘ఆప్‌’ వైఖరి మారడానికి కారణం.

మునుపెన్నడూ లేని స్థాయిలో కేంద్ర మంత్రులను, ఎంపీలను పెద్దయెత్తున దిల్లీ ఎన్నికల ప్రచారంలో దింపిన భాజపా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ఉట్టి కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. భాజపా తరఫున ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒకింత దూకుడుగానే దూసుకువెళ్ళారు. ‘పరమశివుడి భక్తులకు అడ్డుతగిలేందుకు ఎవరు ప్రయత్నించినా, వారికి బుల్లెట్లతోనే జవాబు చెప్పాలి’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం దేశవ్యాప్త చర్చనీయాంశమైంది. షహీన్‌భాగ్‌ నిరసనలు భాజపాకు రాజకీయ అస్త్రంగా మారకుండా ‘ఆప్‌’ అధినేత కేజ్రీవాల్‌ అన్ని ప్రయత్నాలూ కావించారు. ‘దిల్లీలో శాంతి భద్రతలు పూర్తిగా కేంద్రం చేతిలో ఉన్నాయి. ఒకవేళ నిరసన ప్రదర్శనను నిలిపివేయడానికి కేంద్రంలోని భాజపాకు మా అంగీకారం కావలసి వస్తే- అందుకు ఇప్పుడే అనుమతి ఇస్తున్నాను. కానీ, అసలు వాస్తవమేమిటంటే షహీన్‌భాగ్‌ నిరసనలను చెదరగొట్టడం భాజపాకే ఇష్టం లేదు’- అని కేజ్రీవాల్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

దిల్లీ ఎన్నికల పోరును భారత్‌-పాకిస్థాన్‌ సమరంగా భాజపా నాయకుడు కపిల్‌ మిశ్రా అభివర్ణించారు. పాకిస్థాన్‌ మంత్రి ఫవద్‌ హుస్సేన్‌ ఇందుకు ప్రతిస్పందిస్తూ దిల్లీలో భాజపా ఓడిపోవడానికి సిద్ధంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలను కమలనాథులు బలంగా తిప్పికొట్టారు. ‘దిల్లీ సీఎంకు దేశంలోని చిన్నాచితకా పార్టీలనుంచే కాకుండా పాకిస్థాన్‌ నుంచి కూడా మద్దతు లభిస్తోంది’ అంటూ భాజపా తాజాగా వ్యాఖ్యానించింది. దిల్లీ ఎన్నికలను భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధంగా అభివర్ణించే ప్రయత్నాలు ఊపందుకోవడంతో ‘ఆప్‌’ అధినేత రంగంలోకి దిగి నష్టనివారణ ప్రయత్నాలు చేశారు. ‘మోదీ భారతావనికి ప్రధానమంత్రి, నాకూ ఆయనే ప్రధాని. దిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారం. ఉగ్రవాదాన్ని పెద్దయెత్తున పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు’ అంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక నాయకుడిగా గతంతో పోలిస్తే కేజ్రీవాల్‌ పరిణతి సాధిస్తున్నారనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. ఉచిత విద్యుత్తు, మంచినీరు, మొహల్లా క్లినిక్కులు, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడం, మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి ప్రభుత్వ కార్యక్రమాలు దిల్లీ వాసులను బాగా ఆకర్షించాయి. ఈ పథకాల ద్వారా ఎన్నికల్లో ఒనగూడనున్న లబ్ధిని- షహీన్‌భాగ్‌, భారత్‌-పాక్‌ వంటి ఉద్వేగాంశాలకు లోబడి చేజార్చుకోరాదన్నదే ‘ఆప్‌’ వ్యూహం. కేజ్రీవాల్‌ కేంద్రంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో- ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకుండా ‘ఆప్‌’ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. హిందూ యాత్రికులకు ‘ఆప్‌’ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయాణ రాయితీల విషయాన్ని కొంతకాలంగా కేజ్రీవాల్‌ పలు సభల్లో పదేపదే పునరుద్ఘాటించారు. మరోవంక కొన్ని సభల్లో హనుమాన్‌ చాలీసాను చిన్నపాటి తప్పులేకుండా గడగడా చదివి వినిపించి హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇటీవలి వరకూ కాంగ్రెస్‌ పక్షాన నిలిచిన ముస్లిం ఓటర్లు- క్రమంగా ‘ఆప్‌’ వైపు మరలుతుండటమూ కేజ్రీవాల్‌కు కలిసివచ్చే అంశం. మొత్తం ఓటర్లలో మైనారిటీలు 13శాతంగా ఉన్నారు. దిల్లీలోని 20 నియోజకవర్గాల్లో ముస్లిములు సగటున 20శాతానికిపైగానే ఉన్నారు. ఇంకోవంక దిల్లీలోని 18 స్థానాల్లో హిందుత్వ నినాదం దూకుడుగా విస్తరించింది. ఇటీవలి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఆదాయ పన్ను శ్లాబుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు; అయిదు లక్షల రూపాయలు, రూ.15 లక్షల ఆదాయ వర్గాలకు కల్పించిన పన్ను మినహాయింపులు తమకు ఎన్నికల్లో లాభం చేకూరుస్తాయన్న నమ్మకంతో భాజపా ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కేజ్రీవాల్‌ వైఫల్యాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పదేపదే ప్రస్తావించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లనుంచి వచ్చి దిల్లీలో స్థిరపడిన పూర్వాంచల్‌ జనాభా పట్ల కేజ్రీవాల్‌ ప్రభుత్వం దుర్విచక్షణ కనబరుస్తోందని మోదీ విమర్శించారు. దిల్లీ జనాభాలో 20 శాతాని(38 లక్షల మంది)కి ప్రాతినిధ్యం వహిస్తున్న పూర్వాంచల్‌ వాసులు కనీసం 25 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరని అంచనా. మత, కుల సమీకరణలతో ముడివడి సంక్లిష్టంగా మారిన దిల్లీ ఎన్నికల ముఖచిత్రం దేశ రాజకీయాలకే దిక్సూచిగా నిలవనుందనడంలో సందేహం లేదు.

- రాజీవ్‌ రాజన్‌
Posted on 08.02.2020