Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ప్రలోభస్వామ్యం వెర్రితలలు!

అసంతృప్తిని అసమ్మతిగా ప్రజ్వరిల్లజేసి, ఫిరాయింపుల పొగపెట్టి పాలక పార్టీల పుట్టి ముంచే వికృత కళాకేళి నయా రాజకీయంగా గజ్జెకట్టి ఆడుతోంది. సాధారణ మెజారిటీతో అధికారానికి వచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమూ స్థిమితంగా అయిదేళ్లూ మనలేని దుస్థితి- భారతావనిలో ప్రజాతంత్రం అక్షరాలా మేడిపండు చందమేనని పదేపదే నిర్ధారిస్తోంది. నిరుడు కర్ణాటకలో కుమార స్వామి సర్కారును కూల్చేసిన అసమ్మతి జ్వలనం, నేడు మధ్యప్రదేశ్‌లో కమలనాథ్‌ ప్రభుత్వంపై కోరసాచింది. ‘మానుంచి ఒక్క వికెట్‌ తీస్తే- మీ దగ్గర మూడు వికెట్లు పడగొడతా’మంటూ కాంగ్రెస్‌, భాజపా సవాళ్లు రువ్వుకొంటుండగానే, తన సహచర గణాలతో జ్యోతిరాదిత్య సింధియా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడం- పెను రాజకీయ భూకంపమే సృష్టించింది. పదిహేనేళ్ల ఎదురుచూపులు ఫలించి 2018 డిసెంబరులో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ హస్తగతం అయినప్పుడు- ముఖ్యమంత్రిత్వానికి పోటీపడిన కమలనాథ్‌, జ్యోతిరాదిత్యల్లో సీనియారిటీకే పడ్డ సోనియా ఓటు, సహజంగానే సింధియాను కుపితుణ్ని చేసింది. పీసీసీ పీఠమూ దక్కక, రాజ్యసభ సీటూ చిక్కని పరిస్థితుల్లో జ్యోతిరాదిత్యలో ఎగదన్నిన అసమ్మతి, కమలనాథులకు కోరని వరమైంది. మారిన సమీకరణల్లో అధికారం నిలబెట్టుకోవడానికి కమలనాథ్‌, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కమలనాథులు గిరిగీసి నిలిచిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాల జోరు ముమ్మరించింది. పాలక ప్రత్యర్థి పార్టీల సభ్యులంతా మధ్యప్రదేశ్‌ విడిచి వేరే రాష్ట్రాల్లో సంబంధిత పార్టీ క్యాంపుల్లో విడిది చెయ్యడం- ఆయా పక్షాలకు, మాన్య సభ్యులకు మధ్య సంబంధాలు ఎంత పెళుసో విశదీకరిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రలోభస్వామ్యంగా ఏనాడో దిగజార్చేసిన పార్టీల పంథా పుణికి పుచ్చుకొన్న శాసన సభ్యుల్లో- సైద్ధాంతిక నిబద్ధత, మాతృ సంస్థ పట్ల విశ్వాసం వంటి చాదస్తాలు కనిపిస్తేనే వింత. తరతమ భేదాలతో అన్నీ ఆ తాను ముక్కలమేనని రుజువు చేసుకోవడంలో పోటీపడుతున్న పార్టీల దివాలాకోరుతనం సాక్షిగా, రాష్ట్రాలన్నింటినీ చుట్టేస్తోంది ఫిరాయింపుల సంత! రాజ్యాంగ విలువల్ని పరిమారుస్తూ, చట్టబద్ధ పాలనను ఎద్దేవా చేస్తూ పగలబడుతున్న ఈ ఫిరాయింపుల కంపు ఇంకెన్నాళ్లు?

‘స్వేచ్ఛాసమాజంలో అసమ్మతి అంతర్భాగం... అది నిజాయతీగా నిష్కపటంగా ఉండాలి. అత్యాశ, అధికార లాలసకు పుట్టిన అసమ్మతి సహించరానిది’- లోక్‌సభాపతిగా లోగడ రబీరే చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అర్థవంతమైనవి. ఫిరాయింపులన్నవి రోగ లక్షణమేగాని దానికదే జాడ్యం కాదని, అసలు వ్యాధి సమకాలీన రాజకీయ పక్షాల నడత నిర్వహణల్లోనే ఉందనడం సరైనది! ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో ఏ పార్టీ అయినా గుణవంతుల్ని, ప్రజాసేవానురక్తుల్ని, సైద్ధాంతిక నిబద్ధుల్ని ఎంచుకొంటున్నాయా? కులమత ప్రాంతాలనే సాధారణ పడిగట్టురాళ్లకు అదనంగా, ధన భుజ మదబలుల్ని, ఏ రకంగానైనా నెగ్గుకురాగల నేరగాళ్లకే కదా- అవి ఏరికోరి అభ్యర్థిత్వాలు కట్టబెడుతున్నది! సొంత బలంతో అలా ఎన్నికై వచ్చినవాళ్లు- మంత్రి పదవులు దక్కక అసమ్మతులుగా మారడం, అవకాశం వస్తే చాలు గోడదూకుళ్లకు సిద్ధంగా ఉండటం- ఎప్పటి కథే! అసమ్మతి వాదులతో రాజీనామాలు చేయించడం ద్వారా పాలక సంకీర్ణాలను సాగనంపి తాను అధికారం చేపట్టాక ఉప ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన ఫిరాయింపుదారులకు అమాత్యగిరీ అంబారీలు కట్టి రుణం తీర్చుకొనేలా భాజపా అమలు చేస్తున్న వ్యూహం- ప్రజాస్వామ్యాన్ని పరిహాస భాజనం చేసేదే! 1981నాటి ముచ్చట... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నగర పాలక సంస్థలో ఓ భాజపా కౌన్సిలర్‌ కాంగ్రెస్‌లోకి ఫిరాయించినప్పుడు కమలం పార్టీ సీనియర్‌ నేత చిమన్‌ శుక్లా 19 రోజులపాటు చేసిన నిరశన దీక్ష- ఫిరాయింపుదారుడు హస్తం పార్టీని వీడి రాజకీయ సన్యాసం తీసుకొనేలా చేసింది. 1998లో కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని కూలదోసి యూపీ గవర్నర్‌ రమేశ్‌ భండారీ ఫిరాయింపుదారుల ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాజ్‌పేయీ చేసిన దీక్ష- ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దోహదపడింది. కాలక్రమంలో ఆ ‘విలక్షణత’ చెదిరిపోగా, కిందపడ్డా పైచేయి సాధించాలన్న కమలనాథుల తపన- ఫిరాయింపు రాజకీయాలకు కొత్త ఆసరాగా నిలుస్తోంది!

ఫిరాయింపుల జాడ్యాన్ని పరిహరించకపోతే, అది దేశ ప్రజాస్వామ్య పునాదుల్నే కాదు, మౌలిక సూత్రాల్నీ దెబ్బతీస్తుందని 1985 నాటి చట్టం సరిగ్గానే సూత్రీకరించింది. 1957-‘67 మధ్యకాలంలో దేశంలో 542 ఫిరాయింపులు నమోదైతే, వారిలో 419 మందిని అక్కునజేర్చుకొని కాంగ్రెస్‌ లబ్ధి పొందింది. 1967-‘83 నడుమ 2700 గోడదూకుళ్లు సాగాయని, 212మంది మంత్రి పదవుల్ని ఒడిసిపట్టగా, ఏకంగా 15మంది ముఖ్యమంత్రులై చక్రం తిప్పారనీ చరిత్ర చెబుతోంది. రాజీవ్‌ జమానా నాటి చట్టం వ్యక్తిస్థాయి గోడ దూకుళ్లను నియంత్రించి టోకు ఫిరాయింపులకు లాకులెత్తింది. 2004లో తెచ్చిన 91వ రాజ్యాంగ సవరణ- పార్టీనుంచి మూడోవంతు మంది సభ్యుల వేరుకుంపటిని ‘చీలిక’గా గుర్తించేది లేదన్నా, కీలక నిర్ణయాధికారం సభాపతి చేతిలో ఉండటంతో- అదీ కొరగానిదవుతోంది. రాజీనామా చెయ్యడం, సమస్త ఖర్చులూ భరించే కొత్త పార్టీ గుర్తుతో మళ్ళీ బరిలోకి దిగడం, ఎన్నికై మంత్రిపదవీ పగ్గాలు చేపట్టడం- తాజా ఫిరాయింపు రాజకీయ మౌలిక సూత్రంగా స్థిరపడి ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. పార్టీ వ్యవస్థలు పటిష్ఠంగా ఉన్న అమెరికా బ్రిటన్లలో ఫిరాయింపుల నిషేధ చట్టమన్నదే లేదు. బ్రిటన్‌లో జాన్‌ మేజర్‌ ప్రభుత్వం ఒక్క ఓటు మెజారిటీతో దీర్ఘకాలం మనగలిగిందంటే- వ్యవస్థలకు దక్కుతున్న మన్నన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటక ఫిరాయింపుల కేసును పరిష్కరిస్తూ ప్రత్యేకంగా వివాద పరిష్కార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పార్టీల్లో ప్రాప్తకాలజ్ఞత రహించనంతకాలం ఫిరాయింపుల భస్మాసుర హస్తం ప్రజాస్వామ్యాన్నిలా సంక్షుభితం చేస్తూనే ఉంటుంది!

Posted on 12.03.2020