Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

అధినేత్రి వైఖరితో అధోగతేనా?

* సింధియా నిష్క్రమణ...సోనియా స్వయంకృతం

తనను కాంగ్రెస్‌ నుంచి వెళ్లగొట్టడానికి సంవత్సరం నుంచి కుట్రలు జరుగుతున్న సంగతి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలిసినా, వాటిని అడ్డుకోవడానికి ఆమె ప్రయత్నించలేదని జ్యోతిరాదిత్య సింధియా ఆవేదన వ్యక్తీకరించారు. సోనియాకు పంపిన రాజీనామా లేఖలో సింధియా ఈ విషయాన్ని సూటిగా పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌లు అడుగడుగునా సింధియాను అవమానిస్తూ వచ్చారు. ఆయన ఎదగకుండా ఎక్కడికక్కడ నొక్కుతూ వచ్చారు. సింధియాకు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ (పీసీసీ) అధ్యక్ష పదవి కానీ, రాజ్యసభ నామినేషన్‌ కానీ దక్కకుండా అడ్డుపడ్డారు. దిగ్విజయ్‌సింగ్‌ తాను మాత్రం మరో ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి ఏర్పాటు చేసుకుని, సింధియాకు సీటు దక్కకుండా చూడటానికి ప్రియాంకాగాంధీ పేరును ముందుకుతెచ్చారు. కానీ, ఇప్పుడు ఆ సీటు కూడా భారతీయ జనతా పార్టీకి దక్కి, దిగ్విజయ్‌ ఎత్తు చిత్తు కానుంది. రాజ్యసభ ఎన్నికలకు ముందు కొద్దిమంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు పార్టీకి రాజీనామా చేసినా లేక ఓటింగ్‌లో పాల్గొనకపోయినా, అది ఆ పార్టీకి నామర్దా అవుతుంది. సింధియా నిష్క్రమణతో భాజపా పని మహా సులువైంది. అదీకాకుండా రాష్ట్ర గవర్నర్‌ భాజపా అనుకూలుడే కాబట్టి, కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమే కాబట్టి మధ్యప్రదేశ్‌లో భాజపాకు ఎదురు ఉండకపోవచ్చు. ఇదంతా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ స్వయంకృతమే. కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌లకు ఒకరంటే ఒకరికి గిట్టకపోయినా సింధియాను తొక్కేయడానికి ఇద్దరూ ఉత్సాహంగా చేతులు కలిపారు. వారి పన్నాగాలను భరించలేకనే సింధియా తిరుగుబాటు చేసి పార్టీ నుంచి వైదొలిగి తన ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో కమల్‌, దిగ్విజయ్‌లకు ఎదురే ఉండకపోవచ్చు. వారిది ఆడింది ఆట పాడింది పాటగా చెలామణీ కావచ్చు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలకుండా వారు అడ్డుకోగలరా అంటే అనుమానమే. సింధియా తిరుగుబాటు ప్రకంపనలు హరియాణాలోనూ కనిపించాయి. అక్కడ సోనియాగాంధీకి ఇష్టులైన కుమారి సెల్జా, రణదీప్‌ సుర్జేవాలాలకు కాకుండా తన కుమారునికి రాజ్యసభ సీటు ఇచ్చేట్లు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకుడైన భూపిందర్‌ సింగ్‌ హూడా ఒత్తిడి చేయగలిగారు. అసలే మధ్యప్రదేశ్‌లో తల బొప్పి కట్టిన కాంగ్రెస్‌ నాయకత్వం హరియాణాలోనూ అదే గతి పట్టేలా చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే హూడా డిమాండ్‌కు తలొగ్గక తప్పలేదు.

పార్టీ భవిష్యత్తును పట్టించుకునేవారేరీ?
సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్‌ భవిష్యత్తు గురించి పార్టీలో అంతర్గత చర్చ జరగాల్సి ఉన్నా, ఇంతవరకు ఆ ఊసే లేదు. సింధియా షాక్‌ ఇచ్చిన తరవాత, దిల్లీ, కర్ణాటక పార్టీ శాఖలకు హడావిడిగా అధ్యక్షులను నియమించి చేతులు దులిపేసుకున్నారు తప్ప గుణపాఠాలు నేర్చిన దాఖలా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ అధినాయకత్వం దారీతెన్నూ తెలియక కొట్టుకుపోతున్నట్లుందే తప్ప పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపి, నాయకత్వ పటిమను నిరూపించుకోవాలనే దృఢ నిశ్చయాన్ని కనబరచడం లేదు. అధినాయకుల పద్ధతి మారకపోతే పార్టీ నాయకులు, కార్యకర్తలు వేరే దారి చూసుకోవలసి వస్తుంది. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే జీవచ్ఛవంలా మారింది. నెహ్రూ కుటుంబం పిడికిలి నుంచి బయట పడలేకపోతోంది. దీన్ని ప్రశ్నించగల నాయకుడెవరూ పార్టీలో కనిపించడం లేదు. అంతా భజనపరులదే రాజ్యం. అందరూ నెహ్రూ కుటుంబం చిటికెన వేలు పట్టుకుని నడిచేవారే. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఇందిరాగాంధీ సర్వం తానై నడిపించేవారు. ఇప్పుడు పార్టీని ముగ్గురు గాంధీలు నడిపిస్తున్నారు. వారిని ప్రసన్నులను చేసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు కిందా మీదా పడుతున్నారే తప్ప పార్టీ భవిష్యత్తును పట్టించుకోవడం లేదు. పార్టీ అంతా అస్తవ్యస్తంగా తయారైంది.

దెబ్బతింటున్న నేతల స్థైర్యం
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తల్లి, 73 ఏళ్ల సోనియా కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు తాను మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టేదీ లేనిదీ రాహుల్‌ తేల్చిచెప్పడం లేదు. అవుననో కాదనో చెప్పడానికి ఆయన ఎందుకు సందేహిస్తున్నారు, బహుశా తమ కుటుంబీకుడు తప్ప వేరెవరూ పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకూడదని సోనియా భావిస్తున్నారా, అందుకు రాహుల్‌ మొరాయిస్తున్నారా, ఆయన్ను ఒప్పించే వరకు పార్టీ అధ్యక్ష పదవిని ఖాళీగా అట్టిపెట్టాలని సోనియా భావిస్తున్నారా- అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో నలుగుతున్నాయి. వీటికి తోడు ప్రియాంకా గాంధీపై కూడా ఊహాగానాలు రేగుతున్నాయి. ఆమె రాహుల్‌కన్నా చురుకైనదనీ, రాజకీయాల్లో బాగా రాణించగలదనీ, కాలక్రమంలో పార్టీ పగ్గాలు ఆమెకే దత్తమవుతాయని కొన్ని వర్గాలు చెబుతూ ఉంటాయి. ఈ మాటలు నిజమో కాదో ఆవిడ స్పష్టం చేయవచ్చు కదా. అన్నాచెల్లెళ్లలో ఏ ఒక్కరూ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముందుకు రావడం లేదు. సోనియాను చూస్తే ఆమె అస్వస్థురాలిగా ఉన్నారు. నెహ్రూ కుటుంబం పరిస్థితి ఇలా ఉన్నప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీయే తీసుకోవాలి. కానీ, ఏఐసీసీ సభ్యులూ ఆ పని చేయడం లేదు. ఈ అనిశ్చిత స్థితి పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. అంకిత భావం కలిగిన కాంగ్రెస్‌ వాదుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.

జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఇప్పటికీ కీలక పాత్ర పోషించగలదనడంలో మరో మాట లేదు. పాలక ఎన్డీయేకి వ్యతిరేకంగా రేపు ఏదైనా అఖిల భారత కూటమి ఏర్పడితే దానికి ఇరుసుగా నిలిచే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉంది. ఈ పాత్రను ఏ ప్రాంతీయ పార్టీ కూడా పోషించలేదు. ప్రస్తుత ప్రభుత్వానికి నికరమైన ప్రత్యామ్నాయం చూపడంలో నెహ్రూ కుటుంబం విఫలమైంది. అసలు అలాంటి ప్రత్యామ్నాయం ఏర్పడకుండా తానే అడ్డు నిలుస్తోంది. ఆ విధంగా జాతికి హాని చేస్తోందని చెప్పాలి.

మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటే ఇప్పుడున్న స్థాయికి ఎదగగలిగేవారా? వారికి ఆ స్వేచ్ఛ లభించేదా? పార్టీని వీడిన తరవాతనే ఈ ముగ్గురూ సొంతంగా అధికారం చేపట్టగలిగారు. ఇలాంటివారిని దూరం చేసుకోవడంలో కాంగ్రెస్‌ పాలక కుటుంబం పాత్ర ఎంతైనా ఉంది. సమర్థుడైన నాయకుడు ప్రతిభావంతులను తనవైపు ఆకర్షిస్తాడే తప్ప దూరం చేసుకోడు. లోక్‌సభలో సమర్థులైన కాంగ్రెస్‌ సభ్యులెందరో ఉండగా, అధీర్‌ రంజన్‌ చౌధురి వంటి సాధారణ సభ్యుడిని పార్టీ ప్రతినిధిగా నియమించడంలోనే నెహ్రూ కుటుంబ అభద్రతా భావం బయటపడిపోయింది. పోనీ ద్వితీయ శ్రేణి నాయకులైనా నెహ్రూ కుటుంబానికి రాజకీయ వాస్తవాలను బోధపరచి దారికి తీసుకురాగలిగారా అంటే అదీ లేదు. ఇలా ఎవరికి వారు చేతులు ముడుచుకుని కూర్చుంటే మునిగే కాంగ్రెస్‌ నావలో తామూ మునిగిపోతారు. దాన్ని నివారించడానికి సంస్థాగత ఎన్నికలను నిర్వహించి కొత్త నాయకత్వానికి అవకాశమివ్వాలి. లేదంటే మరింతమంది సింధియాలు పుట్టుకొస్తారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తరవాత సింధియాకు వినూత్న ఆహ్వానం ఎదురైంది. విధాన సభ ఎన్నికల్లో భాజపా నినాదం- మాఫ్‌ కరో మహరాజ్‌, హమారా నేతా శివరాజ్‌ (మహారాజావారూ క్షమించండి, మా నాయకుడు శివరాజ్‌ చౌహాన్‌). తీరా సింధియా భాజపాలో చేరిన తరవాత ఆ నినాదం ఇలా మారిపోయింది- స్వాగత్‌ హై మహరాజ్‌, సాథ్‌ హై శివరాజ్‌ (మహారాజావారికి స్వాగతం, శివరాజ్‌ మీకు తోడు నిలుస్తారు). రాజకీయాల్లో అవసరాన్ని బట్టి నినాదాలు, విధానాలు మారిపోతాయనడానికి ఇది తాజా నిదర్శనం.

తండ్రి జ్ఞాపకానికి అవమానం
రాజీవ్‌ గాంధీ చిత్రపటాన్ని ఆయన కుమార్తె ప్రియాంకా గాంధీ యెస్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ రాణా కపూర్‌కు విక్రయించిన సంగతి ఇప్పుడూ ఊరూవాడా మార్మోగుతోంది. తనను రాజ్యసభకు నామినేట్‌ చేసినందుకు ప్రత్యుపకారంగా విఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్‌. హుసేన్‌ ఆ చిత్తరువును గీసి రాజీవ్‌ గాంధీకి బహూకరించారు. 1985లో ముంబయిలో కాంగ్రెస్‌ శతజయంత్యుత్సవాలు జరిగినప్పుడు ఆయన ఈ చిత్రపటాన్ని రాజీవ్‌కు అందించారు. కాబట్టి ఆ చిత్ర పటం ముంబయిలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో కానీ, దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కానీ ఉండాలి. రాజీవ్‌ కుటుంబం ఆ పని చేయకుండా చిత్రపటాన్ని నేరుగా తమ ఇంటికి తీసుకెళ్లింది. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని అనుకున్నా, తండ్రి చిత్రపటాన్ని అమ్ముకొన్న కుమార్తె ప్రియాంక గురించి ఏమనుకోవాలి? ఆ చిత్తరువును తండ్రికి ఘన స్మృతిగా తమ ఇంట శాశ్వతంగా అలంకరించుకోవలసింది పోయి, అమ్ముకోవడమేమిటి? అలా అమ్మగా వచ్చిన సొమ్ముతో వేరే ఆస్తిని కొనాలనుకోవడమేమిటి? ఆనాటి ప్రధాన మంత్రికి ఇచ్చిన కానుకను మార్కెట్‌లో పెట్టడమేమిటి? అసలు ఆ కుమార్తె ఈ అంశాలను తలచుకున్నారా?

Posted on 15.03.2020