Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

ఎంపీసీట్లు... దక్షిణాదికి పాట్లు!

* జనాభా ప్రాతిపదిక అహేతుకం

కొత్త రెమ్మలు, కొమ్మలు తొడిగి ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విస్తరించాలంటే చట్టసభలు క్రియాశీలంగా వ్యవహరించాలి. శాసన వ్యవస్థల చైతన్యమే భారత ప్రజాస్వామ్య సౌధాన్ని పటిష్ఠ పునాదులపై నిలబెడుతుందనడంలో మరోమాట లేదు. దేశవ్యాప్తంగా ఇనుమడిస్తున్న ప్రజల ఆకాంక్షలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని- జనాభా ప్రాతిపదికగా లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచాలన్న రాష్ట్రపతి ప్రణబ్‌ దా సూచన సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రజాభిప్రాయానికి పట్టం కట్టాలంటే లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచక తప్పదన్న ప్రణబ్‌ ముఖర్జీ అందుకు సమర్థనగా బ్రిటన్‌ ఉదాహరణ ప్రస్తావించారు. జనాభాపరంగా భారత్‌తో పోలిస్తే సుమారు ఇరవయ్యో వంతైనా లేని బ్రిటన్‌లో 600 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాంటప్పుడు 128 కోట్ల జనాభా గల భారత్‌లో ఎంపీ స్థానాలు పెంచడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటు వేదికపై ప్రజాభిప్రాయానికి మరింత అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం లభించాలన్న ఆయన ఆకాంక్ష స్వాగతించదగినదే! అయితే ఆ పేరిట జనాభాను బట్టి ఎంపీ స్థానాలను ఆయా రాష్ట్రాల్లో యాంత్రికంగా పెంచుకుంటూ పోవడం అనేక రాజకీయ సమస్యలను రాజేస్తుందనడంలో సందేహం లేదు. ఎంపీ స్థానాల పెంపుదలవల్ల దక్షిణాది రాష్ట్రాలకు; కొన్ని పశ్చిమ, తూర్పు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటు బాగా తక్కువ. కుటుంబ నియంత్రణ లక్ష్యాలు గాలికొదిలేసిన ఉత్తరాది(ముఖ్యంగా ‘బిమారు’ రాష్ట్రాలు- బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌) రాష్ట్రాల్లో గడచిన రెండు దశాబ్దాల కాలంలో జనాభా శరవేగంగా పెరిగింది. బాధ్యతారహితంగా వ్యవహరించి జనాభా నియంత్రణ లక్ష్యాలను గాలికొదిలేసిన ‘బిమారు’ రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల పెంపు వరం ప్రసాదించి- జనాభా కట్టడిపై గట్టి దృష్టిపెట్టి ముందుకు సాగిన దక్షిణాది రాష్ట్రాలను ఎండగట్టడం దారుణం!

‘బిమారు’ రాష్ట్రాలతో చిక్కు సమస్య
‘రాష్ట్రాల జనాభాను బట్టి వాటికి లోక్‌సభలో సీట్లు కేటాయించాలి. అన్ని రాష్ట్రాలకూ ఇదే సూత్రీకరణ వర్తింపజేయాలి’ రాజ్యాంగంలోని 81(2) అధికరణంలోని మాటలివి. పదేళ్లకోమారు జరిగే జనగణన తరవాత ఒక్కో రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు కేటాయించాలన్న విషయంపై విపులంగా సమీక్షించి నిర్ణయం తీసుకునేందుకు అవసరమైతే పార్లమెంటు ఓ కమిటీని నియమించవచ్చునని రాజ్యాంగంలోని 82వ అధికరణ స్పష్టం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పథకాలను పెద్దయెత్తున అందిపుచ్చుకొని, వాటిని నిష్ఠగా అమలు చేయడంతో జనాభా వృద్ధిరేటు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చినప్పుడు అక్కడ చాలా తక్కువగా కనిపిస్తుంది. ‘బిమారు’ రాష్ట్రాలు జనాభాను నియంత్రించాల్సిన ఆవశ్యకతను ఏ దశలోనూ పట్టించుకోకుండా మొండిగా ముందుకువెళ్ళాయి. అలాంటప్పుడు కేవలం జన సంఖ్య ఆధారంగానే లోక్‌సభ సీట్ల వాటా పెంచితే- కొన్ని రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.

కుటుంబ నియంత్రణకు పెద్దపీట
దక్షిణాదితో పోలిస్తే ‘బిమారు’ రాష్ట్రాల్లో జనాభా విస్తరణ అంతూపొంతూ లేకుండా సాగింది. 1981-’91 మధ్యకాలంలో బిహార్‌లో జనాభా వృద్ధిరేటు బిహార్‌లో 23.54 శాతం, మధ్యప్రదేశ్‌లో 26.84 శాతం, రాజస్థాన్‌లో 28.44 శాతం, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 25.85 శాతంగా ఉంది. మరోవంక ఇదే కాలంలో కేరళలో జనాభా వృద్ధిరేటు 14.32 శాతం, తమిళనాడులో 15.39 శాతం, కర్ణాటకలో 21.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 24.20 శాతంగా ఉంది. కాలం గడిచే కొద్దీ జనాభాపరంగా ‘బిమారు’ రాష్ట్రాలకు దక్షిణాదికి మధ్య అగాధం అనూహ్యంగా విస్తరించింది. 1991-’2001 మధ్యకాలంలో బిహార్‌లో వృద్ధి 28.62 శాతం, మధ్యప్రదేశ్‌ 24.26 శాతం, రాజస్థాన్‌ 28.41 శాతం, ఉత్తర్‌ ప్రదేశ్‌ 25.84 శాతంగా ఉంది. ఇదే కాలానికి కేరళ 9.43 శాతం, తమిళనాడు 11.72 శాతం, కర్ణాటక 17.51 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 14.59 శాతంతో జనాభా వృద్ధిపరంగా వెనక నిలిచాయి. ‘బిమారు’ రాష్ట్రాలతో పోల్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల జనసంఖ్య వృద్ధి సగం కన్నా తక్కువ. కొన్ని సందర్భాల్లో ఇది మూడింట ఒకవంతుగా ఉండటమూ గమనార్హం. ఇక 2001-’2011 గణాంకాలను పరిశీలిస్తే దేశంలోని ఉత్తర, దక్షిణ భాగాల మధ్య అగాధం అనూహ్యంగా విస్తరించినట్లు అవగతమవుతుంది. బిహార్‌ 25.07 శాతం, మధ్యప్రదేశ్‌ 20.30 శాతం, రాజస్థాన్‌ 21.44 శాతం, ఉత్తర్‌ ప్రదేశ్‌ 20.09 శాతంతో జనాభా వృద్ధి పథంలో దూసుకుపోగా- కేరళ 4.86 శాతం, తమిళనాడు 15.60 శాతం, కర్ణాటక 15.67 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 11.10 శాతంతో మందగమనంలో సాగాయి. ఈ గణాంకాలు విస్మయకర వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. 1991-’2001 మధ్య బిహార్‌ జనాభా 28.62 శాతం ఇనుమడించగా, కేరళ జనాభా 9.43 శాతంగా పెరిగింది. ఆ తరవాత 2001-2011 మధ్య బిహార్‌ జనాభా పాతిక శాతం పెరగ్గా- కేరళ 4.86 శాతానికే పరిమితమైంది. బిహార్‌లో జనాభా వృద్ధి అడ్డూఆపూ లేకుండా సాగగా, తమిళనాడు వంటి రాష్ట్రం మాత్రం 1991-’2001లో 11.72 శాతం, 2001-’2011లో 15.60 శాతం దగ్గరే నిలిచిపోయింది. కఠినమైన కుటుంబ నియంత్రణ చర్యలతో ఇతర దక్షిణాది రాష్ట్రాలూ జనాభా పెరుగుదలను చెప్పుకోదగిన స్థాయిలో కట్టడి చేశాయి. గడచిన ఇరవయ్యేళ్ల జనాభా వృద్ధి తీరుతెన్నులు పరిశీలిస్తే ‘బిమారు’ రాష్ట్రాలకు- దేశంలోని తూర్పు, పశ్చిమ దిక్కున ఉన్న కొన్ని రాష్ట్రాలకు మధ్య తేడా స్పష్టమవుతుంది. ఉదాహరణకు తూర్పు రాష్ట్రమైన ఒడిశాలో 1991-’2001లో జనాభా వృద్ధి 16.25 శాతం కాగా, అది 2001-’2011నాటికి 13.97 శాతానికి పడిపోయింది. దేశ పశ్చిమ రాష్ట్రమైన గోవాలో 1991-’2001లో జనాభా వృద్ధి 15.21 శాతం. 2001-’2011 నాటికి అది మరీ కోసుకుపోయి 8.17 శాతానికి పరిమితమైంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి జనాభా పెరుగుదలను అరికట్టిన రాష్ట్రాలివి! వీటిని ‘బిమారు’ వంటి రాష్ట్రాలతో పోల్చడం ఏ రకంగా సహేతుకం? జాతీయ లక్ష్యమైన జనాభా నియంత్రణకు తుచ తప్పకుండా కట్టుబడి, దేశ నిర్మాణంలో ఎనలేని బాధ్యత కనబరచిన దక్షిణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల పనితనానికి ఏమాత్రం విలువ కట్టకుండా, అన్నింటినీ ఒకేగాటన కట్టిపడేసి లోక్‌సభ సీట్ల సంఖ్యను పునఃసమీక్షించడం ఏ రకంగానూ న్యాయం కాదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను 2000లో జనాభా గణాంకాలు వెలువడే వరకూ పెంచేందుకు వీలు పడకుండా 1976లో భారత పార్లమెంటు రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. ఈ సవరణను పునఃసమీక్షించాలన్న ప్రతిపాదనను 2003లో వాజ్‌పేయీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అయితే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల చొరవకు విలువ కట్టాలన్న వాదన గట్టిగా వినిపించడంతో రాజ్యాంగ సవరణ సమీక్ష అంశం అటకెక్కింది. దాంతో లోక్‌సభ సీట్ల పెంపు వ్యవహారాన్ని 2026వరకూ నిలిపివేయాలని ప్రభుత్వం (అంటే 2031 జనాభా గణాంకాలు వెలువడే వరకూ) నిర్ణయం తీసుకుంది.

ప్రత్యామ్నాయం చూపాలి
జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని లోక్‌సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలతోపాటు, మరికొన్నింటికీ తీవ్ర అన్యాయం జరుగుతుంది.కనీసం పదిలక్షల మంది ప్రజలకు ఒక ఎంపీ ఉండాలని, అప్పుడే ప్రజలందరికీ పార్లమెంటులో సరైన ప్రాతినిధ్యం దక్కుతుందని కొందరు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సూత్రాన్ని అనువర్తింపజేస్తే లోక్‌సభ సభ్యుల సంఖ్య 1,300కు చేరుతుంది. అంటే ఇప్పుడున్న దానితో పోలిస్తే సభ్యుల సంఖ్య రెండున్నర రెట్లు పెరుగుతుందన్న మాట! ఇంత భారీసంఖ్యలో సభ్యులున్న సభ ఎంత మేరకు అర్థవంతంగా కార్యకలాపాలు నిర్వహించగలదన్నది ప్రశ్నార్థకం! ప్రస్తుతం 545మంది ఉన్న సభలో సభ్యుల భావోద్వేగాలు అదుపు తప్పితే నియంత్రించేందుకు స్పీకర్‌ నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఒకవేళ ఆ సంఖ్య 1,300కు చేరితే ఆ పరిస్థితిని స్పీకర్‌ ఎలా ఎదుర్కొంటారు? ‘బిమారు’ రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధుల సంఖ్యను పెంచాలంటే- అక్కడి శాసనసభలు, మండళ్లలో సీట్ల సంఖ్యకు చురుకుపుట్టించడం ఓ ప్రత్యామ్నాయం. దక్షిణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక ప్రాతిపదికను నిర్ణయించకుండా- లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. గడచిన యాభయ్యేళ్లలో కట్టుదిట్టమైన చర్యలతో జనాభాను నియంత్రిస్తున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాతిపదికలను వర్తింపజేయాలి. నాలుగు దక్షిణాది రాష్ట్రాలతోపాటు; ఒడిశా, గోవా వంటి రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూర్చే ప్రతిపాదనకు ‘బిమారు’ రాష్ట్రాలు ఒకవేళ అడ్డుచెబితే- లోక్‌సభ సభ్యుల సంఖ్యను ఎప్పటికీ మార్చకుండా యథాతథంగా ఉంచడం తప్ప మరో మార్గం లేదు!

Posted on 28.04.2017