Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

రాజకీయాతీత రాజముద్ర!

రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఎన్‌డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ సునాయాసంగా విజయం సాధిస్తారనడంలో అనుమానం లేదు. కాంగ్రెస్‌ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కాదని ఇందిరాగాంధీ వీవీ గిరిని రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టినప్పుడుతప్ప, రాష్ట్రపతి ఎన్నిక ఎన్నడూ వూహాతీతంగా లేదు. మనం అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని నడిపేది ప్రధానమంత్రి కనుక రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైందన్న అభిప్రాయం బలంగానే ఉన్నా- అనేక సందర్భాల్లో నిర్ణాయక పాత్ర నిర్వహించిన రాష్ట్రపతులూ లేకపోలేదు. ప్రధాని ప్రభుత్వాధినేత అయితే రాష్ట్రపతి దేశాధినేత. ఈ రెండు పదవుల్లో ఉన్నవారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను రాజ్యాంగంలో స్పష్టంగానే నిర్దేశించారు.

స్పష్టమైన విధివిధానాలు
రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని నిర్దిష్ట బాధ్యతలు అప్పగించింది. ప్రధాన బాధ్యత రాజ్యాంగ పరిరక్షణ! కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం (ప్రధాని నియామకం) రెండో బాధ్యత. పార్లమెంటులో ఏదో ఒక రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు ఈ బాధ్యత రాష్ట్రపతి సునాయాసంగా నిర్వర్తించగలరు. 1980ల తరవాత ఏ పక్షానికీ మెజారిటీ లేనప్పుడు మూడు దశాబ్దాలపాటు ప్రధానమంత్రిని నియమించేటప్పుడు రాష్ట్రపతులు విచక్షణాయుతంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఈ విషయంలో ప్రశంసనీయమైన ఆనవాయితీలను నెలకొల్పిన రాష్ట్రపతులూ ఉన్నారు. కొత్త ఒరవడి పెట్టినవారూ ఉన్నారు. లోక్‌సభ మద్దతు ఉన్నవారినే ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించాలన్నది రాజ్యాంగ నిర్దేశం. మనది రాజకీయ పార్టీలకు ప్రధానపాత్ర ఉన్న వ్యవస్థ కూడా. ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత అప్పగించాలన్న విషయంలో రాష్ట్రపతి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ‘ఈ విషయంలో రాష్ట్రపతికి విచక్షణాధికారం ఇవ్వకుండా ఉండలేం’ అని రాజ్యాంగ నిర్ణాయక సభలోనే డాక్టర్‌ అంబేడ్కర్‌ స్పష్టీకరించారు. అనేక కీలక పదవులకు నియామకాలు చేసేదీ రాష్ట్రపతే! పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకం చేస్తే తప్ప చట్టాలు కావు. భారత రాష్ట్రపతికి కార్యనిర్వాహక, న్యాయపరమైన, శాసనపరమైన అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మినహా, రాష్ట్రపతి తన అధికారాలను స్వతంత్రంగా వినియోగించే అవకాశం లేదు. మంత్రివర్గ సలహా మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. 1967 దాకా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యం కొనసాగినప్పుడు మంత్రివర్గ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నడచుకోవాలన్న సూత్రం ఏ ఆటంకం లేకుండా కొనసాగాల్సింది. అప్పుడూ రాష్ట్రపతికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. రాష్ట్రపతి అనేక విషయాల్లో ప్రభుత్వ సలహా మేరకు నడుచుకోవాలన్నది రాజ్యాంగ నిర్దేశం. కనుక ఆ పదవిలో ఉన్నవారు ‘రబ్బర్‌ స్టాంప్‌’ లాంటివారేనని, రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైందన్న అభిప్రాయం బలంగా ప్రచారంలో ఉండేది. దీనికి భిన్నంగా వ్యవహరించిన రాష్ట్రపతులూ ఉన్నారు. 30 ఏళ్ల తరవాత ప్రస్తుతం కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. కనుక రాష్ట్రపతి, ప్రభుత్వానికి అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం లేదని భావించవచ్చు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి ప్రధాని తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి గుడ్డిగా ఆమోదిస్తారనుకోలేం. అందువల్ల రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎలా వ్యవహరిస్తారన్న ఆసక్తి ప్రజల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు.
ప్రథమ రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌కు, అప్పటి ప్రధాని నెహ్రూకు మధ్య హిందూ కోడ్‌ బిల్లుకు సంబంధించి అభిప్రాయభేదాలు తలెత్తాయి. నిజానికి ఆ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించకముందే రాజేంద్రప్రసాద్‌ అభ్యంతరాలు లేవదీశారు. రాష్ట్రపతికి, ప్రధానికి మధ్య లేఖల యుద్ధం నడిచింది. పార్లమెంటు హిందూ కోడ్‌ బిల్లును ఆమోదించిన తరవాత దాని మంచిచెడ్డలను పరిశీలించి ఆమోదిస్తానని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రాజేంద్ర ప్రసాద్‌ స్పష్టీకరించారు. ఒకవేళ తాను తీసుకునే నిర్ణయంవల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి వస్తే, అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకుంటాననీ ప్రసాద్‌ తెలియజేశారు. తన అభిప్రాయాలను పార్లమెంటుకూ వివరిస్తానన్నారు. పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించే అధికారం రాష్ట్రపతికి ఉన్నమాట వాస్తవమే. అదే జరిగిఉంటే, రాష్ట్రపతికి ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉండేది. ప్రభుత్వం, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి నిరాకరించవచ్చా అనే ప్రశ్నా ఉత్పన్నమయ్యేది. పార్లమెంటు ఆమోదించిన బిల్లు మంచి చెడ్డలను వివేచించే అధికారం రాష్ట్రపతికి ఉన్నా, పార్లమెంటరీ సంప్రదాయాలను గమనంలో ఉంచుకుంటే రాష్ట్రపతికి, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండదని నెహ్రూ వాదించారు. రాష్ట్రపతి ఏం చేసినా మంత్రివర్గ సలహా మేరకేనన్నది నెహ్రూ అభిప్రాయం. రాష్ట్రపతి అలా నడచుకోవాల్సి ఉన్నప్పటికీ, అవసరమైతే రాజ్యాంగంలోని 143వ అధికరణం ప్రకారం ఒక విషయంపై సుప్రీంకోర్టు అభిప్రాయం తెలుసుకునే హక్కు తనకు ఉందని ప్రసాద్‌ వాదించారు. ఇద్దరూ రాజ్యాంగ వ్యవహారాల్లో నిష్ణాతులైనందువల్ల ఘర్షణకు అవకాశం ఇవ్వలేదు. తరుణ గణతంత్రాన్ని గాడి తప్పేలా చేయకూడదన్న పట్టుదల కూడా ఇద్దరికీ ప్రబలంగా ఉండేది. రాష్ట్రపతిగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ హయాములో నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల్లో 75 శాతం తనకు తెలియజేసేవారని, శాస్త్రి హయాములో అది 50 శాతానికి తగ్గిందని, ఇందిర పాలనలో 25 శాతానికి పడిపోయిందంటూ మారుతున్న ధోరణిపై నేరుగా నిరసన తెలియజేయకపోయినా... తన భావాలను సూటిగానే వివరించారు. 1962లో చైనాతో యుద్ధం తరవాత నెహ్రూకు ఇష్టం లేకపోయినా, అప్పటి రక్షణశాఖ మంత్రి వీకే కృష్ణమీనన్‌ రాజీనామా చేసేలా చూడటంలో రాధాకృష్ణన్‌ ఎన్నదగిన పాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సిన బాధ్యతను ఘర్షణకు తావులేకుండా నిర్వర్తించారు. రాధాకృష్ణన్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారత్‌ రెండు యుద్ధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి హఠాత్తుగా మరణించిన సందర్భాల్లో ప్రధాని ఎవరనే విషయంలో వివాదాలకు తావులేకుండా సముచిత సలహాలిచ్చారు.

సవరణయత్నాలు
మంత్రివర్గ సలహా ప్రకారమే రాష్ట్రపతి నడుచుకునేట్లు చేయడానికి ఇందిరాగాంధీ హయాములో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని సవరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది కాని, పునఃపరిశీలన తరవాత రాష్ట్రపతి ఆమోదించాల్సిందేనన్న సూత్రం ప్రవేశపెట్టారు. దీని సారాంశం సైతం మంత్రివర్గ సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలన్నదే! కానీ, 44వ రాజ్యాంగ సవరణ అనుకున్నట్లు కాకుండా రాష్ట్రపతులు క్రియాశీలంగా వ్యవహరించడానికి దోహదం చేసింది. మూడు సందర్భాల్లో తప్ప రాష్ట్రపతి మంత్రివర్గం సలహా మేరకే నడచుకోవాలని షమ్షేర్‌సింగ్‌-భారత ప్రభుత్వానికి మధ్య నడచిన కేసులో న్యాయమూర్తి కృష్ణఅయ్యర్‌ తీర్పు చెప్పారు. లోక్‌సభ మద్దతు ఉన్నవారినే ప్రధానమంత్రిగా నియమించడం, సభ మద్దతు కోల్పోయిన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయడం, తాజాగా ప్రజల మద్దతు కోరాల్సిన అవసరం వచ్చినప్పుడు సభను రద్దు చేయవలసి రావడం అనే సందర్భాల్లో రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యవహరించవచ్చునన్నది తీర్పు సారాంశం. అంటే రాష్ట్రపతికి ఈ తీర్పు ద్వారా కొన్ని విచక్షణాధికారాలు దక్కాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజ్యాంగానికి భంగం కలగకుండా నిరోధించడానికి రాష్ట్రపతి ఈ విచక్షణాధికారాలను వినియోగించుకోవచ్చు. ఆర్‌.వెంకట్రామన్‌ రాష్ట్రపతిగా ఉన్న ఆఖరి సంవత్సరంలో మెజారిటీ లేకపోయినా ముగ్గురిని ప్రధానమంత్రులుగా నియమించాల్సి వచ్చింది. 1989లో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌కు, తరవాత చంద్రశేఖర్‌, 1991లో పీవీ నరసింహారావుకు సంపూర్ణ మెజారిటీ లేకపోయినా వెంకట్రామన్‌ వారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇచ్చారు. అప్పుడు అతి పెద్దపక్షమన్న సూత్రం ప్రాతిపదికన అవకాశం ఇచ్చారు. కానీ, ఆ రెండు సందర్భాల్లో ప్రధానమంత్రి పదవికి మరెవరూ పోటీలో లేనందువల్ల వెంకట్రామన్‌ నిర్ణయం వివాదానికి దారి తీయలేదు. వీపీ సింగ్‌ మంత్రివర్గం పతనమైన తరవాత చంద్రశేఖర్‌కు కాంగ్రెస్‌ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది కనుక ఆయనకూ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు చిక్కింది.

అనిశ్చిత పరిస్థితుల్లో ఆచితూచి
1996 సార్వత్రిక ఎన్నికల అనంతరం వరసగా మూడోసారి లోక్‌సభలో ఏ పక్షానికీ మెజారిటీ రాలేదు. అప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ అతిపెద్ద రాజకీయపక్షమైన భారతీయ జనతాపార్టీ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. ఆ ప్రభుత్వం 13 రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. శంకర్‌దయాళ్‌ శర్మ హయాములోనే యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పడి, దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ చెరో ఏడాదికన్నా తక్కువ కాలం ప్రధానమంత్రులుగా ఉన్నారు. అప్పుడు వివిధ పక్షాలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడినప్పుడు, శంకర్‌దయాళ్‌ శర్మ దానికి అవకాశం ఇచ్చారు. 1979లో జనతాపార్టీ చీలికవల్ల మొరార్జీ దేశాయి ప్రభుత్వం పతనమైతే అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చీలిక వర్గం నాయకుడు చరణ్‌సింగ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల బలాబలాలను రాష్ట్రపతి బేరీజు వేసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది సంజీవరెడ్డే! ప్రభుత్వ సుస్థిరత దృష్టితో చూస్తే సంజీవరెడ్డి, శంకర్‌దయాళ్‌ శర్మ ప్రయోగాలు ఫలించలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలు, అత్యవసరాదేశాలను (ఆర్డినెన్సులను) అడ్డుకున్న రాష్ట్రపతులూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం సముచితం కాదని భావించినందువల్ల 1997లో ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ను బర్తరఫ్‌ చేయాలన్న ఐకే గుజ్రాల్‌ ప్రభుత్వ ప్రతిపాదనను, 1998లో వాజ్‌పేయీ ప్రభుత్వం బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయడానికి సంకల్పించినప్పుడు అప్పటి రాష్ట్రపతి నారాయణన్‌ వాటిని పునఃపరిశీలించాలని కోరి, ఫెడరల్‌ వ్యవస్థ పరిరక్షణకు దోహదం చేశారు. ఐకే గుజ్రాల్‌, వాజ్‌పేయీ కూడా పునరాలోచనలో పడి పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్తపడ్డారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మెజారిటీ పక్షం ఆధిపత్యం కొనసాగుతోందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్న సందర్భంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్యాపదేశంగా హితవచనాలు పలికారు. కాని, మోదీ ప్రభుత్వం ఏడాపెడా అత్యవసరాదేశాలు (ఆర్డినెన్సులు) జారీ చేస్తోందన్న విమర్శలున్నా ప్రణబ్‌ వాటి మీద సంతకాలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రాల శాసనసభ్యులకూ ఓటు వేసే అవకాశం కల్పించడంలో రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం- రాష్ట్రపతి దేశానికంతటికీ ప్రతినిధిగా ఉండాలనే! క్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి విచక్షణతో రాజ్యాంగానికి సృజనాత్మకంగా భాష్యం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రపతి మీదే ఉంది. రాజ్యాంగాన్ని ఆయన పరిరక్షించాలనడంలో అంతస్సారం ఇదే!

- ఆర్వీ రామారావ్‌
Posted on 16.07.2017