Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాజికీయం

గుజరాత్‌లో కురుక్షేత్రం

* ప్రతిష్ఠాత్మక పోరుకు రంగం సిద్ధం
గుజరాత్‌ ఎన్నికల పోరాటం అత్యంత ఆసక్తిదాయకమైన మలుపు తిరిగింది. రిజర్వేషన్లు, జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు వంటివి ప్రచారంలో వెనక్కి వెళ్లిపోయి, హిందుత్వ ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చింది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు శరాఘాతంగా పరిణమించవచ్చు. గుజరాత్‌ను ‘హిందుత్వ ప్రయోగశాల’గా భావిస్తుంటారు. ఈసారి అక్కడ హిందూ ఓట్లు సంఘటితం కాకుండా నివారించే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన బృందం అత్యంత జాగ్రత్తతో ఎన్నికల వ్యూహాన్ని రూపొందించారు. రాహుల్‌ గాంధీ స్వయంగా ఆలయ సందర్శనలు మొదలుపెట్టడంతో ఆ వ్యూహానికి ఆదిలోనే తూట్లు పడ్డాయి. సోమ్‌నాథ్‌ మందిర సందర్శన సందర్భంగా రాహుల్‌ పేరు హిందూయేతరుల రిజిష్టరులో నమోదుకావడంతో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఇరకాటంలో పడిపోయింది. హిందుత్వ పార్టీ అంటూ భాజపా మీద ముద్రవేస్తున్న కాంగ్రెస్‌, తానే హిందూ ఓట్ల కోసం ఎందుకు వెంపర్లాడుతోందన్న విమర్శలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘భాజపాను హిందుత్వ అనుకూల పార్టీ అని అంటున్నారు. మూలం అందుబాటులో ఉన్నప్పుడు నకలు ఎందుకు?’ అంటూ రాహుల్‌ ఆలయ సందర్శనల మీద ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తమ్మీద గుజరాత్‌ ఎన్నికల రంగంలో భాజపా, కాంగ్రెస్‌లు హోరాహోరీ పోరాటం సాగిస్తున్నాయనడంలో సందేహం లేదు.

తెరపైకి ‘హిందుత్వ’
అయోధ్య రామమందిర సమస్య గుజరాత్‌ ఎన్నికల్లో ప్రస్తావనకు రాకుండా చూడటానికి కాంగ్రెస్‌ పార్టీ శతథా ప్రయత్నించింది. కానీ, కపిల్‌ సిబల్‌ కారణంగా పరిస్థితి మొదటికొచ్చింది. ఆ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అయిన కపిల్‌ సిబల్‌, రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల హక్కు వివాద పరిష్కారాన్ని 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో వాదించడంతో దుమారం రేగింది. సిబల్‌ సుప్రీంకోర్టులో సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున వాదనలు వినిపించారు. ఈ అంశాన్ని ఎన్నికలతో ముడిపెట్టాలని తాము కోరలేదని, సత్వర పరిష్కారాన్నే అభిలషిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు స్పష్టం చేయడంతో- కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పార్టీ వాదనను వినిపించారా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అసలు కపిల్‌ సిబల్‌ తమ న్యాయవాదే కాదని సున్నీ వక్ఫ్‌ బోర్డు ఇప్పుడు అంటోంది. ఈ కేసులో ఒక ప్రైవేటు పార్టీ తరఫున వాదించానంటున్నారు కపిల్‌ సిబల్‌. అంతా గందరగోళంగా తయారైంది. మొత్తానికి ఈ సమస్య కాంగ్రెస్‌కే ఇబ్బందికరంగా మారింది. ‘మీరేమో గుజరాత్‌లో వరసవెంబడి ఆలయాలు సందర్శిస్తున్నారు. రామజన్మభూమి కేసు వాయిదా వేయాలని మరోవైపు మీ పార్టీ నాయకుడు కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. అసలు, ఈ అంశంపై మీ వైఖరి ఏమిటి?’ అని ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ గాంధీని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిలదీస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం గుజరాత్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తూ ఈ అంశాన్నే ప్రస్తావించారు. రామ మందిరంపై కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. ఈ పరిణామాలతో మిగతా అంశాలన్నీ మరుగునపడి- రామమందిరం, హిందుత్వం ప్రధాన ఎన్నికల అంశాలుగా మారాయి.

గుజరాత్‌లో కాంగ్రెస్‌, భాజపాల మధ్య జరుగుతున్న పోస్టర్ల యుద్ధం సైతం ఆసక్తి రేపుతోంది. రాహుల్‌ వైపు ‘హజ్‌’ (హార్దిక్‌, అల్పేశ్‌, జిగ్నేశ్‌), తమ వైపు రామ్‌ (రూపానీ, అమిత్‌ షా, మోదీ) ఉన్నారంటూ భాజపా ముద్రించిన పోస్టర్లు ప్రచారస్థాయి తీవ్రతను తెలియజెబుతున్నాయి. గుజరాత్‌ ఈ దేశానికి ప్రధానమంత్రితో పాటు భాజపాకు జాతీయ అధ్యక్షుడినీ అందజేసిందని, అందువల్ల గుజరాత్‌ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమకు మద్దతుగా నిలబడాలనీ ఓటర్లకు భాజపా విజ్ఞప్తి చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలకు గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్‌ పరాజయం పాలైతే, ఆ పార్టీ అధ్యక్షుడిగా పట్టాభిషిక్తుడు కానున్న రాహుల్‌ గాంధీకి అది అపశకునమే అవుతుంది. గుజరాత్‌ అభివృద్ధి నమూనా అంటూ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసుకొని లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ భాజపా. దేశ ప్రధాని, పాలకపక్ష అధ్యక్షుడు గుజరాత్‌కు చెందినవారే. ఇలాంటప్పుడు ఆ రాష్ట్రంలో ఏ మాత్రం ఎదురుదెబ్బ తగిలినా- భాజపాకు మున్ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు. 22 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో అది అధికారంలో ఉంది కనుక, కొంత ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అది ఎంతమేర అన్నదే ప్రశ్న. గుజరాత్‌ ఎన్నికలను రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయనడంలో మరోమాట లేదు. యావత్‌ శక్తియుక్తులు, సకల శస్త్రాస్త్రాలతో అవి హోరాహోరీగా తలపడుతున్నందువల్లే ఈ ఎన్నికలు దేశంలోపలే కాదు, వెలుపలా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

గుజరాత్‌ విధానసభలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. 2007 శాసనసభ ఎన్నికల సందర్భంగా 20 స్థానాలను షెడ్యూల్డు తెగలకు కేటాయించారు. అందులో కాంగ్రెస్‌ 11, భాజపా 8 గెలవగా, మిగిలిన ఒక స్థానాన్ని జేడీ (యు) కైవసం చేసుకొంది. 2008లో నియోజకవర్గాల పునర్‌విభజన జరిగాక, ఎస్టీలకు కేటాయించిన సీట్ల సంఖ్య 26కు పెరిగింది. 2012 ఎన్నికల్లో భాజపాకు 10, కాంగ్రెస్‌కు 15, జేడీ(యు)కు ఒక స్థానం దక్కాయి. ఎస్టీ సీట్ల విషయంలో తన స్థితిని మెరుగుపరచుకొనేందుకు ఈసారి భాజపా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇదివరకు ఆదివాసులు, ముస్లిములు కాంగ్రెస్‌ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉండేవారు. 2012 ఎన్నికల్లో భాజపా వారి మద్దతును చాలావరకూ పొందగలిగింది. పటీదారుల ఉద్యమం కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పటికీ, ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని ఆదివాసి ప్రాంతంలో తనకు గట్టి మద్దతు లభించగలదని భాజపా ఆశిస్తోంది. భిల్లులు, వాసవాలు, గమితుల వంటి షెడ్యూల్డు తెగలకు చెందినవారు గుజరాత్‌ జనాభాలో 14 శాతందాకా ఉన్నారు. వారిని పార్టీ విస్మరించజాలదు. ఆదివాసులు ఇదివరకు కాంగ్రెస్‌కు మద్దతుదారులే అయినప్పటికీ- నాణ్యమైన రహదారులు, నిరంతర విద్యుత్‌ సరఫరాతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న పాలక భాజపాకు వారు ఇప్పుడు అండగా నిలబడే అవకాశాలు దండిగా ఉన్నాయి.

అభివృద్ధే భాజపా అస్త్రం
రెండు దశాబ్దాల భాజపా పరిపాలన కాలంలో గుజరాత్‌ చెప్పుకోదగ్గ స్థాయి అభివృద్ధి సాధించిందనడంలో సందేహం లేదు. 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో రహదారులు వేశారు. సంక్షేమ పథకాలు విజయవంతమై, సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నర్మద నీరు చేరుతోంది. రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూ విధించిన సందర్భం లేదు. సుదీర్ఘపాలన కారణంగా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ సానుకూల అంశాలు తమకు 150 దాకా సీట్లు సాధించిపెడతాయని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమాగా చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ హార్దిక్‌ పటేల్‌, అల్పేశ్‌ ఠాకుర్‌, జిగ్నేశ్‌ మేవానీలను అక్కున చేర్చుకొని కులరాజకీయాలకు పాల్పడుతోంది. ఇదివరకు ఇదేవిధంగా ఖామ్‌ (క్షత్రియ, హరిజన, ఆదివాసి, ముస్లిం) వేదికను ఏర్పరచి ఏదో సాధించాలనుకున్న కాంగ్రెస్‌, చివరకు చతికిలపడింది. అభివృద్ధే కీలకాంశంగా భాజపా జోరుగా దూసుకెళుతుండటంతో ఈసారీ కాంగ్రెస్‌కు భంగపాటు తప్పకపోవచ్చు.

కమలంవైపే మొగ్గు...
దేశంలో అత్యధిక పట్టణ ప్రాంత జనాభా కలిగిన నాలుగో రాష్ట్రం గుజరాత్‌. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ది సాధించిన మూడో రాష్ట్రమిది. ఇక్కడ పట్టణ ప్రాంత జనాభా 1991లో 34.5 శాతం, 2001లో 37.4 శాతం నుంచి 2011 నాటికి 42.6 శాతానికి పెరిగింది. 2001-2011 మధ్యకాలంలోనే పట్టణ ప్రాంత జనాభాలో భారీ పెరుగుదల నమోదైంది. అదేకాలంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత జనాభా మాత్రం తొమ్మిది శాతమే పెరిగింది. గుజరాత్‌లో మొత్తం పట్టణ ప్రాంత జనాభా 1.47 కోట్లు. అందులో దాదాపు 75 శాతం ఎనిమిది మునిసిపల్‌ కార్పొరేషన్లలోనే పోగుపడి ఉండటం గమనార్హం. అవి: అహమ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌, జామ్‌ నగర్‌, జునాగఢ్‌, భావనగర్‌, గాంధీనగర్‌. భాజపా 2012 ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాల్లో సగానికిపైగా ఈ ఎనిమిది కార్పొరేషన్ల నుంచి సాధించినవే. ఆ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో భాజపా విజయఢంకా మోగించింది. అందుకే, రాష్ట్రంలో వరసగా మూడోసారి మంచి మెజారిటీ సాధించగలిగింది. ఈసారీ పట్టణ ప్రాంతాల్లోని శాసనసభ నియోజక వర్గాల్లో భాజపా ఘన విజయంపై అంచనాలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలోని కొన్ని నియోజక వర్గాల్లో మాత్రం భాజపా వెనకబడినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ఉన్నప్పటికీ, తమ అసలు సిసలు పరిపాలకుడు నరేంద్ర మోదీయేనని గుజరాత్‌లోని నయా మధ్య తరగతి ప్రజానీకం భావిస్తోంది. అందుకే అటు పట్టణ ప్రాంతాలతోపాటు ఇటు గ్రామీణ గుజరాత్‌లోనూ ఓటర్లు చాలావరకు భాజపావైపే మొగ్గుచూపుతారన్న విశ్లేషణలున్నాయి. అదే సమయంలో సౌరాష్ట్రలో మాత్రం భాజపా పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కారణంగా తమకు సమస్యలు ఎదురవుతున్నాయని భావిస్తున్న సౌరాష్ట్ర ప్రాంతంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కొంతవరకు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడవచ్చు.

గుజరాత్‌లో ప్రాంతీయంగా చూసినప్పుడు మొత్తమ్మీద భాజపా విజయానికి చేరువలో ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రత్యేకించి దక్షిణ గుజరాత్‌లో ఆ పార్టీకి మంచి ఆధిక్యత లభించనున్నదని వివిధ సర్వేలు తేల్చిచెప్పాయి. దక్షిణ గుజరాత్‌లో 35 సీట్లు ఉన్నాయి. 2012 ఎన్నికల్లో సూరత్‌లోని మొత్తం 12 స్థానాలు సహా దక్షిణ గుజరాత్‌లో 28 సీట్లను భాజపా గెలుచుకుంది. మధ్య గుజరాత్‌లోని 40 సీట్లలో అత్యధికం భాజపా వశమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేశూభాయ్‌ పటేల్‌కు చెందిన గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ ఈసారి రంగంలో లేకపోవడంలో సౌరాష్ట్రలో భాజపా సీట్లసంఖ్య పెరగవచ్చు. దిగువ మధ్యాదాయ వర్గాలతోపాటు పటీదారులలోని మహిళా ఓటర్లూ భాజపావైపే మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా పాత, కొత్త అభ్యర్థులతో జాబితాలను భాజపా జాగ్రత్తగా వెలువరించింది. ఈ వ్యూహం ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. మొట్టమొదటి సారిగా కాంగ్రెస్‌ పార్టీ గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ గుజరాత్‌లో వరసగా ఆరోసారి విజయం సాధించకుండా భాజపాను అది నిలువరించగలదా అన్నదే అతిపెద్ద ప్రశ్న.

- దుర్గాప్రసాద్‌ సైబేవార్‌
Posted on 08.12.2017