Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

నవ్యాంధ్రకు 'పచ్చ'ల హారం!

నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రధాన పంటలైన వరి, అపరాలు, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న సుమారు 172 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రాష్ట్రంలో పంటల సాంద్రత కొన్ని దశాబ్దాల నుంచి నిలకడగా ఉంటోంది. సాగునీటి వనరులు, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నచోట దీనిలో పెరుగుదల చోటుచేసుకోవాలి. మరోవైపు ప్రధాన పంటల ఉత్పాదకతలో కూడా పెరుగుదల నమోదు కావడంలేదు. రాష్ట్ర ఆర్థిక గణాంకశాఖ లెక్కల ప్రకారం వరి సగటు ఉత్పాదకత ఎకరాకు 1.23 టన్నులు. అపరాలు నాలుగు క్వింటాళ్లు. నూనెగింజలు 6.2క్వింటాళ్లు. పత్తి 6.45క్వింటాళ్లు. పొగాకు 7.7క్వింటాళ్లు. తక్కువ విస్తీర్ణంలో పండించే సుగంధ ద్రవ్యపంటలైన పసుపు 3.4టన్నులు, ఎండుమిరప 1.83టన్నులు, ఉల్లి 7.8టన్నుల సగటు దిగుబడులు ఇస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల జనాభా 4.94కోట్లు. వారి ఆహార భద్రతకు, వ్యవసాయ పారిశ్రామిక అవసరాలకు ఈ ఉత్పాదకత రానున్న దశాబ్దాల్లో సరిపోదు. పంటల కింద విస్తీర్ణం పెంచే అవకాశాలు కూడా లేవు. అందువల్ల పంటల సాంద్రత, ఉత్పాదకతలు పెరగాలి. ఈ ప్రాంతానికి అనువైన పంటల విస్తీర్ణం పెంచుకోవటం మరో మార్గం. ఆహార ధాన్యాల్లో తక్కువ నీటి వినియోగంతో ఎకరా ఉత్పాదకత ఎక్కువగా ఉన్న మొక్కజొన్న (2.5 టన్నులు), అపరాల్లో ఎకరా ఉత్పాదకత అధికంగా ఉన్న శనగ (5.4 క్వింటాళ్లు) నూనెగింజల పంటల్లో, అధిక నూనె దిగుబడినిచ్చే ఆయిల్‌పాం విస్తీర్ణం పెరగకపోతే పప్పుధాన్యాలు, వంటనూనె కొరత వేధిస్తూనే ఉంటుంది.

వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా...

వ్యవసాయ ఖర్చులు అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి వరసలోనే ఉంది. పెట్టుబడి ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, రానురాను రాష్ట్రంలో వ్యవసాయం గిట్టుబాటుకాని దుస్థితి దాపురించింది. ముఖ్యంగా ఆహార పంటల రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉత్పాదక వ్యయం తగ్గి, ఉత్పాదకత పెరగనిదే వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపకంగా మార్చలేం. యువతను వ్యవసాయం దిశగా ఆకర్షించలేం. ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలనుంచి రైతులకు విముక్తి కల్పించాలి. ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోవాలి. సానుకూల మార్పులు తీసుకురావాలి. లేకపోతే, వ్యవసాయం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఈ పరిస్థితుల్ని సమర్థంగా అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు అనేకం ఉన్నాయి. ప్రాంతానికి అనువైన పంటలను ప్రోత్సహించడం, వాటికి అనువైన మార్కెటింగ్‌ సౌకర్యాల ఏర్పాట్లు చేయడం ఎంతో అవసరం. మార్కెటింగ్‌ సౌకర్యం లేని ఎంత గొప్ప పంటైనా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పతులకు మద్దతు ధరలు ప్రకటించినా ఆచరణలో అవి ఆదరణ పొందకపోవటం విదితమే. వ్యవసాయ వ్యయంలో ఎక్కువభాగం కూలీ ఖర్చులే ఉంటాయి. కాబట్టి, ఈ రంగంలో పెద్దయెత్తున యాంత్రీకరణ చోటుచేసుకోవాలి. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కసరత్తు చేసినా, అవి విస్తృత స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రాంతీయంగా తయారయ్యే చిన్న యంత్రాలను తక్కువ పెట్టుబడి, రాయితీలతో ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలిగే విధంగా తీసుకునే చర్యలకే ఆదరణ లభిస్తుంది. అవసరమైన పంటల్లో ఉత్పాదకత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.

వీటిలో ప్రథమంగా అధిక దిగుబడికి తోడ్పడే విత్తనాలు, ఎరువులు రైతులకు లభ్యమయ్యే ఏర్పాటు చేయాలి. నీటిపారుదల సౌకర్యాలు లేని, వర్షాధారపు సేద్యంలో అంతర పంటలు, మిశ్రమ పంటల సాగును ప్రోత్సహించాలి. ఆరుతడి పంటల కింద విస్తీర్ణం, దిగుబడులు పెరిగేందుకు వర్షాకాలంలో వృథాగా జాలువారిపోయే నీటిని చెరువులు, ఉర చెరువులు, ఫారం పాండ్లకు మళ్ళించి నీటిని కొన్ని మాసాలపాటు నిల్వచేసి అత్యవసర పరిస్థితుల్లో పంటల సంరక్షణకు ఉపయోగించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఆయా ప్రాంతాలకు అనువైన చిన్న నీటివనరులను నిర్మించి, వర్షపు నీటిని పట్టిఉంచి, భూగర్భజలాలను పెంపొందించుకోవాలి. ఆ నీటిని తోట పంటలకు సూక్ష్మనీటి సాగు పద్ధతుల ద్వారా వినియోగించుకొని పండ్లు, కూరగాయలు, పూల పెంపకం చేపట్టడం ద్వారా వీటి ఉత్పత్తులు, ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన ఫారం పాండ్స్‌ పథకం ఈ కోవలోనిదే. వ్యవసాయ అనుబంధ వ్యాపకాలైన పాడి పరిశ్రమ, జీవాల పెంపకం, కోళ్ల పెంపకానికి ప్రాధాన్యం పెంచాలి. దేశంలో అత్యధిక కోస్తా ప్రాంతంగల రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను మరింతగా అభివృద్ధిపరచడంపై పాలకులు దృష్టిసారించాలి. ఉపవృత్తులుగా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టుపురుగులు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం గ్రామస్తుల రాబడిని పెంచి, గ్రామాలు పరిఢవిల్లడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి.

పరిశోధనలతోనే ప్రగతి బాట

ఏ దేశం, రాష్ట్రంలోనైనా వ్యవసాయ ప్రగతికి బలమైన వ్యవసాయ పరిశోధన సంస్థలుగాని, జాతీయ పరిశోధన సంస్థలుగాని ఉండాలి. వీటి ద్వారా వ్యవసాయ ప్రగతికి మార్గాలు ఏర్పడతాయి. వ్యవసాయ పరిశోధనలు గుర్తింపు పొందాలంటే సంస్థ, భవనాలు, హంగులు కాదు కావాల్సింది... సంస్థలో శాస్త్రవేత్తలు ముఖ్యం. వారి శాస్త్రీయ విజ్ఞానం, మేధోసంపత్తులు ప్రధానం. అలాంటి శాస్త్రవేత్తల సేవలు అద్భుతాలు సృష్టించగలవు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. వ్యవసాయ పరిశోధనలను రైతుల పొలాల్లోనే చేపట్టవచ్చు. అవసరమైన సాంకేతిక పరిశోధనలకు మాత్రమే ప్రయోగశాలలు పరిమితం కావాలి. రైతుల పొలాల్లో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించడానికి 'అప్లయిడ్‌ రీసెర్చ్‌' విధానాన్ని పాటించాలి. రైతుల పొలాల్లోనే, వారి సహకారంతో తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో ఫలితాలను రాబట్టి రైతులకు అందించవచ్చు. ఖర్చుతో కూడుకున్న భవనాలు, ఆర్భాటాల కోసం కాలయాపన చేయకుండా పొలాల్లో పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చే కొత్త ఒరవడిని రాష్ట్రప్రభుత్వం సృష్టించగలగాలి. కొత్త రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎన్నో వసతులు, వ్యవస్థలను సమకూర్చుకుని, ఆటంకాలను అధిగమించి స్థిరత్వం సాధించవలసిన తరుణమిది. కాబట్టి, రాష్ట్ర స్థూల ఆదాయం పెంచగల కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలి. అప్పుడే అదనపు వ్యయ భారాన్ని, ద్రవ్య లోటును అధిగమించవచ్చు.

శాశ్వత పరిష్కారాలు

వివిధ రంగాల్లో ప్రభుత్వం చేకూర్చిన రాయితీలు ఆర్థిక లోటుకు దారితీయడం, పరోక్షంగా అది నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైందన్నది ఆర్థిక శాస్త్రవేత్తల విశ్లేషణ. ఎరువులు, విద్యుత్తుపై రాయితీలు, ప్రభుత్వం చేపట్టిన ఆహార ధాన్యాల 'బఫర్‌ స్టాక్‌', మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు, దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తున్నాయన్నది వారి వాదన. ఆర్థిక పురోగతికి తోడ్పడని రాయితీలు దేశాభివృద్ధికి అడ్డంకిగా మారాయనే విశ్లేషణలపై ప్రభుత్వ నేతలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు తాత్కాలిక ఉపశమనమేగాని, శాశ్వత పరిష్కారాలు కాలేవని విశ్లేషకులు చెబుతున్నారు. 2012-13లో జరిపిన జాతీయ నమూనా సర్వే కూడా వ్యవసాయదారుల పరిస్థితిలో పురోగతి లేకపోగా గత దశాబ్దంలో ప్రతిష్ఠంభన, వెనకబాటుతనం ఏర్పడినట్టు తెలిపింది.

గత సంవత్సరమంతా రాష్ట్ర విభజనతో ప్రభుత్వ యంత్రాంగంలో దిశానిర్దేశం లోపించి రాష్ట్ర అభివృద్ధి కుంటువడింది. ప్రస్తుతం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినందువల్ల క్రియాశీలంగా వ్యవహరించి రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధికి, గ్రామీణ వికాసానికి పాటుపడవలసి ఉంది. వ్యవసాయ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న మానవ వనరుల సద్వినియోగానికి వారి శక్తియుక్తులను ఉత్పాదక కార్యక్రమాలకు వినియోగించే దిశగా వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉద్యాన పంటలకు ఎంతో రాష్ట్రం ఎంతో అనువైనది. ఇక్కడ తోటల పెంపకానికి అవసరమైన అధిక దిగుబడి, నాణ్యతాప్రమాణాలు గల పండ్లమొక్కలు, కూరగాయలు, పూల విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకురాగలిగితే, ప్రభుత్వ రాయితీలకన్నా మిన్నగా ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే ప్రతి సంక్రాంతికి పాల పొంగూ పంటసిరులూ పరిఢవిల్లుతాయి. రైతుల జీవితాలు నిత్య సంక్రాతులతో శోభిల్లుతాయి.

(రచయిత - డాక్టర్‌ మొవ్వ రామారావు)
Posted on 16-01-2015