Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

కొలువుల కూత మారనున్న రాత!

* నిరుద్యోగుల కలలు సాకారం
నడి ఎడారిలో ఒయాసిస్సును తలపిస్తోంది తెలంగాణలో కొలువుల జాతర. ఉద్యోగాల కోసం ఎన్నేళ్లనుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో తియ్యని కబురు, గొప్ప వూరట. ఈ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సత్ప్రమాణాలు నెలకొల్పేదిగా నిర్వహించడమే కీలకమిప్పుడు....

తెలంగాణ ఆవిర్భావం తరవాత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ దిశలో తొలి అడుగుపడింది. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడింది. దాదాపు 15ఏళ్ల అనంతరం మొదలవుతున్న కొలువుల మేళా అభ్యర్థులపాలిట ఆశాకిరణమే. 'తెలంగాణలోని యువత ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారికి మా ప్రభుత్వం రుణపడి ఉంది. వచ్చే నెల నుంచే వారి కోసం నియామకాలు చేపడుతున్నాం.... ' అని గత జూన్‌ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా జులైలో తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడింది. తొలిదశలో 15,522 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒకే దఫా ఇన్నివేల ఉద్యోగాల భర్తీ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదు. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖాళీలతో పనిభారం మోస్తున్న ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు, ఇన్నేళ్లు కొరతలతో సరైన సేవలందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వూరట లభించనుంది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ చేపట్టే భర్తీ ప్రక్రియ సకాలంలో, సజావుగా, పారదర్శకంగా సాగేలా చర్యలు చేపట్టడం ప్రభుత్వం ముందున్న కర్తవ్యం.

యువతకు సాంత్వన

జనాభాలో సింహభాగం యువతే. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, అందుకు అవసరమైన అర్హతలున్నా అవకాశాలు లభించకపోవడం దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రధాన సమస్య. విద్యావకాశాల వృద్ధి వల్ల ఎంతో మంది కష్టపడి చదివి, పట్టభద్రులైనా- ఉద్యోగాలు, ఉపాధి లభించక చివరికి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇది వారిని అశాంతికి, ఆందోళనకు గురి చేస్తోంది. మొదట్లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు క్రమేపీ ప్రైవేటు రంగానికి విస్తరించాయి. ఉద్యోగాల సంఖ్య పెరిగే కొద్దీ నిరుద్యోగం రెట్టింపు స్థాయికి చేరింది. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ పాత్ర కీలకమైంది. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ప్రైవేటు రంగానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు పూనుకోవాల్సి ఉంది. చైనా, జపాన్‌ వంటి దేశాలు ప్రాథమిక విద్యాస్థాయి నుంచి ఉద్యోగాల కల్పన వరకు పూర్తిస్థాయి బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మాత్రం ఉద్యోగితను అనేక సమస్యలతో ముడిపెట్టి క్లిష్టంగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2000 సంవత్సరం నుంచి ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ పేరిట ఖాళీల భర్తీని నిలిపివేశారు. అత్యవసర శాఖల్లో శాశ్వత ఉద్యోగాలకు బదులు ఒప్పంద, పొరుగు సేవల విధానాలను అవలంభించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై యువత పూర్తిగా ఆశలు వదులుకున్నారు. గత 15ఏళ్లలో ఉపాధి కల్పన కార్యాలయాలకు దాదాపు 15లక్షల మంది యువత దూరంగా ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగాలను ఆశ్రయించడం, విదేశీ ఉద్యోగాల కోసం వలస వెళ్లడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వ శాఖల్లో ప్రతీయేటా పదవీ విరమణల వల్ల వేల ఉద్యోగాలు ఖాళీ అయినా, వాటిని భర్తీ చేసేందుకు యత్నించలేదు. ఫలితంగా తెలంగాణలో రెండున్నర లక్షల మేరకు ఉద్యోగాలు ఖాళీగా మిగిలాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు పదివేలకు పైగా ఖాళీగా ఉన్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు.

నిరుద్యోగం అనేక సామాజిక, ఆర్థిక సమస్యలకు మూలంగా మారినా- ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు దానిని పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. దీంతో యువత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. వారి ఆశలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రసమితి ఉద్యోగాలను రెండేళ్లలోగా భర్తీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మేధావులు, నిపుణులతో కార్యాచరణ కమిటీని నియమించింది. ఉద్యోగుల విభజన ప్రక్రియలో జాప్యం వల్ల ఏడాది కాలం గడిచింది. న్యాయపరమైన ప్రతిబంధకాలు, జోన్ల గుర్తింపు తదితర సమస్యలు పరిష్కారమయ్యాయి. జూన్‌ రెండో తేదీన సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నియామకాల ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన శాఖల వారిగా ఖాళీల వివరాలను సేకరించి, తొలి జాబితాను సిద్ధం చేసి తాజాగా నియామకాల ప్రకటన జారీ చేశారు. ఉద్యోగాల భర్తీలో గతంలో జరిగిన జాప్యం, ఉద్యమంలో యువత త్యాగాలను గుర్తుంచుకొని ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంత వయోపరిమితి దేశంలో గతంలో ఎక్కడా లేదు.

తెలంగాణ కొత్త రాష్ట్రం. తొలిసారిగా చేపట్టిన ఉద్యోగ నియామకాలు ప్రభుత్వ పనితీరుకు సవాలుగా నిలుస్తాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు జోన్లు మిగిలాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జోనల్‌ విధానంలో స్థానిక, స్థానికేతర రిజర్వేషన్లు, రోస్టర్‌ విధానాలను అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌, రాష్ట్రస్థాయి నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఎంపిక కమిటీల ద్వారా నియామకాలు జరగనున్నాయి. విభజన అనంతరం ఇవన్నీ కొత్తగా రూపుదిద్దుకున్నాయి.

నిరుద్యోగులందరి దృష్టి కేంద్రీకృతమైన తరుణంలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ తొలి పరీక్షకు సిద్ధమైంది. ఆవిర్భవించిన ఏడాదికి కమిషన్‌కు ఒక స్వరూపం ఏర్పడింది. కొన్ని సమస్యలు ఉన్నా కమిషన్‌ ముందడుగు వేస్తోంది. కొత్త పరీక్ష విధానం, గ్రూపుల వర్గీకరణ చేపట్టిన కమిషన్‌కు అందుకు అనుగుణంగా పరీక్షల షెడ్యూలు విడుదల, అమలు, రాత పరీక్షలు, మౌఖిక పరీక్షల నిర్వహణ వంటివి గురుతర బాధ్యతలుగా మారాయి. ఉద్యోగాల భర్తీ అంటే పరీక్షల నిర్వహణ మాత్రమే కాదు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసే అంశం. 15,222 ఉద్యోగాలతో తొలి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మరో పదివేల పోస్టులను పదిరోజుల వ్యవధిలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు, వాటి భర్తీకి అనుసరించాల్సిన విధానం, ఆర్థిక వనరులు తదితర అంశాలను సరిచూసుకొని ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఉద్యోగాల భర్తీలో గతంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నోటిఫికేషన్‌ తరవాత రాత పరీక్షలకు ఏళ్లతరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రిజర్వేషన్ల అమలు, రాతపరీక్షలు, మౌఖిక పరీక్షల సమయంలో వివక్షల కారణంగా ప్రతిభావంతులైన వారు, బలహీనవర్గాల వారు నష్టపోయారు. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి. రాష్ట్రస్థాయి నియామక సంస్థల్లోనూ ఎంపిక ప్రక్రియ సరిగా లేదు. ఎస్సైలు, కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు అభ్యర్థులు అన్ని అర్హతలు సాధించి ఎన్నికైన తరవాత వారిపై గతంలో నమోదైన, కొట్టివేసిన పోలీసు కేసుల సమాచారం ఇవ్వలేదనే చిన్నచిన్న కారణాలతో చాలా మందిని నిరాకరించారు. ఈ నిబంధనల వల్ల వందల మంది నష్టపోయారు. చాలా మంది సచివాలయం, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాటికి పరిష్కారం కనుగొనాలి. ఎంపిక కమిటీల ద్వారా జరిగే నియామకాలు నిర్ణీత కాలపరిమితిలో పూర్తి కావడం లేదు. అవరోధాలన్నీ అధిగమించి, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాలి. ప్రతీశాఖకు నిర్ణీత గడువును నిర్దేశించాలి.

ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. ఇన్నేళ్లుగా నిరుద్యోగులుగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు చదువులు మాని, మరికొందరు పరీక్షలను వదులుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి వారు ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రభుత్వం వారికి అండగా నిలవాలి. పోటీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వపరంగా అవసరమైన మేరకు స్టడీ సర్కిళ్లు లేవు. ప్రైవేటు స్టడీ సర్కిళ్లలో వేల రూపాయల రుసుములు చెల్లిస్తేనే చేర్చుకుంటున్నారు. వారందరి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ నియామకాల సందర్భంగా అభ్యర్థుల కోసం ఉచిత ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర శాఖల ఉన్నతాధికారులు అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం పోటీ పరీక్షల నిర్వహణకు బ్లాక్‌ స్థాయిలో శిబిరాలను నడుపుతోంది. తెలంగాణ ప్రభుత్వమూ ఇలాంటి చొరవ తీసుకోవాలి.

నిరంతర ప్రక్రియగా...

ప్రభుత్వం ఇప్పటికే పాతికవేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టింది. మరో 2.25 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నందున, వాటి భర్తీ ప్రయత్నాలూ కొనసాగించాలి. ఒకే నెలలో అన్ని పోస్టుల భర్తీ వల్ల పదోన్నతులు, సీనియారిటీ సమస్యలతో పాటు ఒకే నెలలో అంతా పదవీ విరమణ పొందే అవకాశం ఉన్నందున, క్రమ పద్ధతిలో నియామకాలు జరపాలి. అన్ని ప్రభుత్వ శాఖలకు ఖాళీల గుర్తింపు, నోటిఫికేషన్ల సన్నద్ధతను ప్రాధాన్యాంశంగా మార్చాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉంది. పాతికవేల ప్రభుత్వ ఉద్యోగాలకు దాదాపు 30 లక్షల మంది దరఖాస్తు చేసుకోవచ్చునని అంచనా. కొంతమందికే అవకాశం దక్కుతుంది. కేవలం సర్కారు కొలువులే ఆధారం అనే భావన రాకుండా, ప్రైవేటు ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధి వనరులపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. అందరికీ ఉపాధి కల్పించడానికి బహుముఖ వ్యూహం అవసరం. ప్రైవేటు ఉద్యోగాల కోసం వారిని నైపుణ్యశిక్షణతో తీర్చిదిద్దేందుకు పూనుకోవాలి. పరిశ్రమలు, వృత్తివిద్యాసంస్థలను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయడం అభినందనీయం. చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు భారీయెత్తున ప్రోత్సాహకాలు కల్పించాలి. పూచీకత్తు లేకుండా, పావలా వడ్డీ కింద రుణ సాయం అందించాలి. ఉపాధి కల్పన ద్వారా రాష్ట్ర యువతకు అభివృద్ధిలో భాగం కల్పించే దిశగా ప్రభుత్వ కార్యాచరణ మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.

(రచయిత - ఆకారపు మల్లేశం)
Posted on 21-08-2015