Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

మోసగాళ్లపై శాసనాస్త్రం!

* అక్రమ వడ్డీవ్యాపారుల నియంత్రణకు ‘చట్టం’
అధిక వడ్డీల పేరిట మనిషి ధన, మాన, ప్రాణాలు దోచేస్తున్న వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేసే దిశగా చెప్పుకోదగిన అడుగు పడింది. ఈ తరహా అక్రమ వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన ‘ఏపీ మనీ లెండర్స్‌ బిల్లు-2015’ ఉభయసభల ఆమోదం పొందింది. అంతకుముందు 1999, 2000 సంవత్సరాల్లో ఈ బిల్లు సభ ముందుకువచ్చినా అది ఆమోదానికి నోచుకోలేదు. ‘కాల్‌మనీ’ పరిణామాల నేపథ్యంలో అది ఇప్పుడు చట్టంగా మారనుంది. కొత్త ‘చట్టం’ అక్రమవడ్డీ వ్యాపారుల కోరలు పీకుతుందా, ‘కాల్‌మనీ’ తరహా విషపోకడలు విస్తరించకుండా నియంత్రించగలుగుతుందా వంటివి ప్రస్తుతం చర్చనీయాంశాలవుతున్నాయి. ఈ తరహా వ్యాపారాన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రత్యేకంగా గట్టి చట్టాలు లేని నేపథ్యంలో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభం కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

రక్షణ... నియంత్రణ

‘మనీ లెండర్స్‌’ బిల్లులో పొందుపరచిన నిబంధనల ప్రకారం- వడ్డీ వ్యాపారం నిర్వహించే సంస్థ తన ఖాతాల్లో చూపిన దానికన్నా అదనంగా వడ్డీరేట్లు వసూళ్లు చేస్తే ఏడాదికి తక్కువ కాకుండా మూడేళ్లవరకు కారాగార శిక్ష- లక్ష రూపాయల మేర జరిమానా విధించవచ్చు. హామీగల, హామీలేని అప్పులకు సంబంధించి వసూలు చేయాల్సిన వడ్డీరేట్లను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన వడ్డీరేట్లు అమలవుతాయి. ఫలితంగా వ్యాపారులు తమ ఇష్టానుసారం అధిక వడ్డీలు వసూలు చేయడాన్ని నియంత్రించవచ్చు. అప్పు చెల్లించలేదంటూ మహిళలను లైంగికంగా వేధించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కానున్నాయి. సంబంధిత కేసులను ఆరు నెలల్లోగా పరిష్కరించాలి. కేసుల విచారణ త్వరితగతిన పూర్తికావడానికి, నేరం రుజువైతే దోషులకు సకాలంలో శిక్షలు విధించడానికి ఈ నిబంధన ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘కాల్‌మనీ’ వంటి అక్రమ వ్యాపారాలకు కళ్లెం వేసేందుకు, వారినుంచి బాధిత మహిళలకు రక్షణ కల్పించేందుకు ఈ చర్య దోహదపడుతుంది. అదే విధంగా రుణగ్రహీత కుటుంబ సభ్యులను ఆటంకపరచడం, హింసించడం లేదా భయపెట్టడం, నిరంతరం వెంటాడటం, ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తదితర చర్యలన్నీ నేరం కిందకే వస్తాయి. ఈ ఆరోపణలు నిరూపణ అయితే చట్టప్రకారం వారు శిక్షకు గురవుతారు. వ్యాపారుల అకృత్యాలు, దౌర్జన్యాల నుంచి బాధితులకు రక్షణ కల్పించేందుకూ ఇవి ఉపయోగపడతాయి. ఈ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపారం చేయాలంటే, ఇకపై వ్యాపార స్థాయిని బట్టి అయిదువేల రూపాయలనుంచి, రూ.2.50లక్షల వరకూ నిర్దేశిత రుసుము చెల్లించి, సంబంధిత అధీకృత అధికారి నుంచి లైసెన్సు పొందాలి. దానివల్ల చట్టబద్ధంగా వ్యాపారం చేసేవేమిటో, అనుమతులు లేకుండా వ్యాపారం సాగించే సంస్థలేమిటో సులువుగా గుర్తించవచ్చు. అనుమతులు లేకుండా కొనసాగే సంస్థలకు ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయవచ్చు. లైసెన్సులతో వ్యాపారం సాగించే సంస్థలకు సంబంధించిన ఖాతా పుస్తకాలను ఏడాదికి ఒకసారి ‘ఆడిట్‌’ చేయించడం; రెవిన్యూ, పోలీసు అధికారులతో కలిసి తనిఖీలు చేయడం, దస్త్రాలు పరిశీలించే అధికారాన్ని అనుమతులు జారీచేసే అధీకృత అధికారికి కట్టబెట్టడంవల్ల వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ కొంతవరకు సాధ్యమవుతుంది. ఒకే లైసెన్సుతో వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారం చేయడాన్ని నియంత్రించేందుకుగాను ఎన్ని ప్రాంతాల్లో సంస్థ దుకాణాలు ఏర్పాటు చేస్తే, అన్ని ప్రాంతాల్లోనూ లైసెన్సు పొందాలన్న నిబంధన తీసుకొచ్చారు. వడ్డీ అనేది అసలుకు మించరాదు. అసలుకు సమానంగాగానీ లేదా దానికి రెండింతలు ఎక్కువగాగానీ వ్యాపారి వడ్డీ వసూలు చేసినట్లయితే ఇక అంతటితో ఆ అప్పు తీరినట్లే లెక్క! దానితోపాటు అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీ వ్యాపారి రుణగ్రస్తుడికి తిరిగి చెల్లించాలి. ఈ నిబంధనవల్ల ‘కాల్‌మనీ’ పేరిట జరిగే దోపిడిని చాలావరకు నియంత్రింవచ్చు. అప్పు తీసుకున్నవారి ఆస్తులు కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. అసలుకు అనేక రెట్లు సొమ్ము చెల్లిస్తున్నా, అప్పు తీరక అల్లాడిపోతూ ఓ రకమైన వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న రుణగ్రహీతలకు దీనివల్ల ఎంతో వూరట లభిస్తుంది. రుణం ఇచ్చేటప్పుడు అప్పు తేదీ, అసలు మొత్తం, విధించిన వడ్డీరేటు వంటివాటిని లిఖితపూర్వకంగా పేర్కొనాలి. ఎప్పటికప్పుడు చెల్లించిన ప్రతి రూపాయికీ సంతకంచేసి, స్టాంపువేసిన రసీదును వ్యాపారి రుణగ్రహీతకు ఇవ్వాలి. అప్పుడే ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకుని- వాస్తవానికి ఇచ్చిన అప్పుకంటే అధికంగా రాసుకొని వేధించే పద్ధతులను నియంత్రించడం సాధ్యపడుతుంది. చెల్లించిన ప్రతి రూపాయికి సంబంధించి రసీదు ఉంటుంది కనుక వడ్డీవ్యాపారి వేధిస్తే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రుణగ్రహీతకు అవకాశం ఉంటుంది.

బాధితులకు రక్షణ, వడ్డీ వ్యాపార నియంత్రణ దిశగా కొంత ప్రయత్నం జరిగినా మరింత పటిష్ఠంగా బిల్లు రూపొందించి ఉంటే అధిక ప్రయోజనం ఉండేది. ప్రభుత్వమే వడ్డీరేట్లు నిర్ణయిస్తుందని చెబుతున్నా, ఎంత నిర్దిష్ట కాలానికి నిర్ణయిస్తుందన్న దానిపై స్పష్టత లేదు. అధిక వడ్డీ అంటే ఎంత మొత్తమనే అంశాలూ ప్రస్తావించలేదు. లైసెన్సు పొందిన వడ్డీవ్యాపార సంస్థ రుణగ్రహీతలకు ఇచ్చే అప్పు, రుణగ్రహీతల తిరిగి చెల్లింపు పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిగేలా చట్టంలో పొందుపరచి ఉంటే, బాధితులకు మరింత ప్రయోజనం చేకూరేది. పరోక్షంగా నల్లధనాన్ని నియంత్రించడానికి, లావాదేవీలన్నీ సవ్యంగా జరగడానికి ఉపకరించేది. ఆ దిశగా బిల్లులో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. వ్యాపారానికి సంబంధించి లైసెన్సులు జారీచేసే అధీకృత అధికారి ఎవరన్నదానిపైనా చట్టంలో స్పష్టత లేదు. అక్రమ వ్యాపారాన్ని నియంత్రించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ఎంతో ఉపయోగపడేది. పదే పదే ఈ తరహా నేరాలకు పాల్పడేవారిపై ‘పీడీ చట్టం’ కింద కేసుల నమోదుకు అవకాశం కల్పించి ఉంటే ఈ తరహా నేరగాళ్లను చాలావరకు నియంత్రించేందుకు అవకాశం ఉండేది. రాష్ట్రంలో జరుగుతున్న అనేకానేక ఆర్థిక నేరాల్లో అక్రమ వడ్డీవ్యాపారం కేవలం ఒక పార్శ్వమే! ఈ నేరాల బారినపడి నిత్యం వేలమంది సర్వం కోల్పోయి బాధితులుగా మారుతున్నారు. కాల్‌మనీ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో ‘మనీ లెండర్స్‌ బిల్లు’ ఆమోదం పొందగలిగింది. మిగతా ఆర్థిక నేరాలను ఇదే రీతిలో నియంత్రించడానికి ప్రభుత్వంవద్ద సమగ్ర వ్యూహం ఉందా అంటే అనుమానమే! ప్రధానంగా ద్రవ్య చలామణీ పథకాలు, భూ సంబంధిత పెట్టుబడులు, పెట్టుబడి ఆధారిత సంస్థల మోసాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువయ్యాయి. ఏపీ సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం గణాంకాల ప్రకారం చూస్తే, గడచిన కొన్నేళ్లలో రాష్ట్రంలో ఈ తరహా ఆర్థిక నేరాల్లో 66,20,439మంది బాధితులుగా మారారు. ఈ మోసాల మొత్తం విలువ రూ.10,220కోట్లుగా ఉంది. ఈ కేసుల్లో సంబంధిత మోసకారి సంస్థలు, వాటి యజమానులు, భాగస్వాములు ముందుగానే అక్రమ సంపాదనంతా బినామీల పేరిట మళ్లించేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆస్తులను గుర్తించి ‘అటాచ్‌’ చేసినా, వాటిని విక్రయించి బాధితులకు చెల్లింపులు చేసేసరికి ఏళ్లూపూళ్లూ గడిచిపోతున్నాయి.

మార్కెట్‌పై నిఘా కరవు

‘కాల్‌మనీ’ తరహా ఆర్థిక నేరాలనుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. మోసకారి సంస్థల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థలు, యంత్రాంగమూ కొరవడింది. కొన్ని సందర్భాల్లో తాము మోసపోయినట్లు బాధితులు ఆరంభంలోనే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా, వారు చురుగ్గా వ్యవహరించడం లేదు. మోసాల తీవ్రత, బాధితుల సంఖ్య పెరిగి పోలీసులు, ఇతర వ్యవస్థలు రంగంలోకి దిగేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, వాటి తీరుతెన్నులు, వ్యవహారాలపై సమాచారం సేకరించి; ప్రభుత్వానికి, సంబంధిత విభాగాలకు చేరవేసేందుకు వీలుగా ప్రత్యేకంగా మార్కెట్‌ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా, ఆ దిశగా నామమాత్రపు చర్యలూ లేవు. కఠిన చట్టాలు లేకపోవడం, నిఘా పర్యవేక్షణ వ్యవస్థలు కొరవడటంవల్ల ఆర్థిక నేరగాళ్లకు పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. ఈ తరహా ఆర్థిక సంస్థలకు ముకుతాడు బిగించేందుకు నిబంధనలు కఠినతరం చేయాలి. వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి. జప్తుచేసిన ఆస్తులను విక్రయించి బాధితులకు సత్వరం సొమ్ములు చెల్లించడానికి ప్రత్యేక వ్యవస్థలు సిద్ధం చేయాలి. మోసకారి సంస్థలపట్ల ప్రజలూ అప్రమత్తంగా వ్యవహరించాలి. అప్పుడే వీటి ఆగడాలకు కొంతమేరకైనా కళ్లెం పడుతుంది. రాష్ట్రంలో నకిలీ ఆర్థిక సంస్థలకు ముకుతాడు వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సర్కారు 1999లోనే ఏపీ ఆర్థిక సంస్థల మదుపుదారుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చింది. పేరుకు చట్టం ఉన్నప్పటికీ గడచిన పదిహేనేళ్లుగా ఆర్థిక నేరాలను నిలువరించడంలో ఈ చట్టం విజయం సాధించలేదు. అందుకు కారణం చట్ట నిబంధనలను పక్కాగా అమలు చేయడంపై సర్కారుకు శ్రద్ధ లేకపోవడమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శాసనసభ వర్షకాల సమావేశాల్లో 1999నాటి ఆర్థిక సంస్థల మదుపుదారుల పరిరక్షణ చట్టానికి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. అందులో భాగంగా ఆర్థిక సంస్థలపై- జిల్లా కలెక్టర్‌, ఎస్పీల పర్యవేక్షణ తీసుకువచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి పదేళ్ల జైలు శిక్ష, అయిదు లక్షల జరిమానా, ‘నాన్‌బెయిల్‌బుల్‌’ కేసుల నమోదు వంటి అంశాలు పొందుపరిచారు. ఏదైనా ఆర్థిక సంస్థ ప్రజల డిపాజిట్లు తిరిగి చెల్లించలేని స్థితిలో ఉందని తెలిస్తే... ఆ సంస్థ ఆస్తులతో పాటు డిపాజిట్ల ద్వారా లబ్ధిపొందిన వారు, వారి దగ్గర అప్పులు తీసుకున్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కల్పించారు. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తులను సంబంధిత న్యాయస్థానాలు ఏడాదిలోగా విక్రయించి బాధితులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా ‘మనీ లెండర్స్‌ బిల్లు’నూ అక్రమ వడ్డీ వ్యాపారం నియంత్రించే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరితేనే చట్టానికి సార్థక్యం.

(రచయిత - గేదెల భరత్‌కుమార్‌)
Posted on 26-12-2015