Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

‘నవ జాత’క చక్రం!

బాలల్ని భద్రంగా కాపాడుకొంటేనే భవితకు భరోసా ఏర్పడుతుందని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది(2016)ని నవజాత శిశు సంరక్షణ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వ్యవస్థీకృత లోపాల్ని అధిగమించి నిర్దిష్ట లక్ష్యసాధన దిశలో సర్కారు వేగంగా సాగిపోతేనే బాలలకు, భవితకు భద్రత!

‘తెలంగాణలోని మహిళలు, పిల్లలకు పౌష్టికాహార లోపం ప్రధాన సమస్యగా మారింది. గర్భిణుల్లో రక్తహీనత, పుట్టబోయే బిడ్డలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. సరైన ఎత్తు, బరువు లేకపోవడం చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. వేలమంది పురిట్లోనే కన్నుమూస్తున్నారు...’ రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల స్థితిగతులపై స్త్రీశిశు సంక్షేమ శాఖ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలివి. సమాజంలో మహిళలు, పిల్లలు ముఖ్యమైన భాగం. సామాజిక అభివృద్ధికి తోడ్పాటునిచ్చేవారు మహిళలైతే, పిల్లలు- భవిష్యత్తు ఆశాదీపాలు. అలాంటివారికి సమస్యలు ఆందోళనకర పరిణామం. వ్యవస్థీకృత లోపాలను అధిగమించి, వారిని పరిరక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత.

ఏ రాష్ట్రంలోనైనా మాతా శిశు మరణాల రేటు, పౌష్టికాహార లోపాలు, బరువు తక్కువ పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత, పిల్లల ఎదుగుదల, జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలను రాష్ట్ర అభివృద్ధికి సూచీలుగా తీసుకుంటారు. తెలంగాణ కొత్త రాష్ట్రం. ఏడాదిన్నర క్రితం ఆవిర్భవించిన రాష్ట్రంలో ఆరోగ్యం, పౌష్టికాహారం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. తినే ఆహారంలో పోషకాల కొరత మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తాజా అధ్యయన నివేదిక ప్రకారం, తెలంగాణలోని 58శాతం మహిళల్లో రక్తహీనత ఉంది. గర్భిణులైనవారిలో 62శాతం ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది ప్రసూతి సమయంలో వారిపై, పుట్టబోయే బిడ్డలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రసవాల సమయంలో ప్రతి లక్షలో 92మంది గర్భిణులు, బాలింతలు చనిపోతున్నారు. జాతీయస్థాయిలో నవజాత శిశు మరణాలు ప్రతి వెయ్యికి 28. తెలంగాణలో తొలి నెల రోజుల్లోపు కన్నుమూస్తున్న శిశువుల సంఖ్య వెయ్యికి 25గా నమోదైంది. జాతీయ స్థాయితో పోల్చితే ఇది తక్కువే అయినా, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే కొద్దిగా ఎక్కువే. తల్లుల్లో అనారోగ్యం, నెలలు నిండకముందే పుట్టడం, పుట్టిన వెంటనే వూపిరి అందకపోవడం, ఇన్‌ఫెక్షన్లు... ఈ మూడు ప్రధాన కారణాలతో నవజాత శిశువులు ఎక్కువగా మృతి చెందుతున్నారు. ప్రతి వెయ్యి మందిలో 39మంది చిన్నారులు సంవత్సరం లోపే మరణిస్తున్నారు. 19శాతం శిశువులు 2.5కిలోల కన్నా తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. ఆరు నెలల లోపు వయస్సు గలవారిలో 80శాతం పిల్లలు, ఆరు నెలల నుంచి 59 నెలల వయస్సుగలవారిలో 71శాతం రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నారు.

వ్యవస్థీకృత సమస్యలు

విద్య, అభ్యున్నతి, జీవన విధానాలు, పరిసరాలు, ఆహారపు అలవాట్ల వంటివి పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక వనరుల లోపం, అవగాహన రాహిత్యాల వంటివి పోషణకు ప్రతిబంధకాలు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల్లో 37శాతానికి సరైన పౌష్టికాహారం లేదు. గిరిజన ప్రాంతాల్లో అయితే 83శాతానికి ఇదే ప్రధాన సమస్య. మహబూబ్‌నగర్‌ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులు, ఆదిలాబాద్‌ అరణ్యాల్లోని గోండులు, లంబాడీల పిల్లలు జొన్న అన్నంలో నీళ్లు కలిపి జావ తాగుతున్నారు. గ్రామాల్లోనే కాదు, నగరాల్లోని మురికివాడల్లోని పిల్లలకూ సరైన తిండి లేదు. సరైన ఆహారం అందకపోవడం బాలికల్లో రక్తహీనతకు దారితీస్తోంది. దానివల్ల చిన్ననాటి నుంచే అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆడపిల్లల పట్ల విచక్షణ కొనసాగుతోంది. మగపిల్లల తరహా ఆహారం వారికి అందడం లేదు. చాలామంది అర్ధాకలితోనే బతుకుతున్నారు. మరోవైపు బాల్య వివాహాలు బాలికల పాలిట శాపంగా మారుతున్నాయి. దేశంలో ఇప్పటికీ 46శాతం బాలికలకు 18ఏళ్ల లోపే వివాహాలు జరుగుతున్నాయని ఇటీవల కేంద్ర అధ్యయనంలో తేలింది. తెలంగాణలో 56శాతం మేరకు బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 18ఏళ్లకు ముందే పెళ్లి కారణంగా బాలికలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడంతోపాటు నానారకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 15నుంచి 19 సంవత్సరాల బాలికల్లో 56శాతం రక్తహీనతతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. రక్తహీనతతోనే వారు గర్భం దాలుస్తున్నారు. సరైన టీకాలు, ఆహారం పొందడం అనివార్యమైనా, అవి అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండటం, వైద్యఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయకపోవడం వల్ల ఇప్పటికీ 27శాతం మందికి టీకాలు అందడం లేదు. సమగ్ర శిశు అభివృద్ధి సేవాపథకం(ఐసీడీఎస్‌) కింద అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నప్పటికీ, వాటి ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం లభించడం లేదు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో మూడుసార్లు పరీక్షలు చేయించుకున్న గర్భిణులు 46.2శాతమే కావడం ఆందోళనకర పరిణామం. సుఖప్రసవాల వల్ల తల్లిబిడ్డలు సురక్షితంగా ఉంటారు. ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యశాఖ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలున్నా, ఇప్పటికీ 28శాతం ఇళ్ల వద్దే ప్రసవాలు జరుగుతున్నాయి. ఆరోగ్యకేంద్రాలు, ఆసుపత్రుల్లో సరైన వసతులు ఉండవని, రవాణా సౌకర్యం లేదని, ఆస్పత్రుల్లో ప్రసవాలకు ఎక్కువ మొత్తంలో వ్యయం అవుతుందని, బిడ్డలను తారుమారు చేస్తారని, లంచాల కోసం వేధిస్తారనే భయం వెన్నాడుతోంది. ఇళ్ల వద్ద సరైన వసతుల్లేక, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తల్లులు, పిల్లలకు ముప్పు ఏర్పడుతోంది. పుట్టిన మొదటి గంటలోపు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాల్సిఉన్నా, చాలామంది దీన్ని పాటించడం లేదు. నవజాత శిశువులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తక్కువ బరువు, తొమ్మిది నెలల కంటే ముందు జన్మించినవారిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి. ఇందుకోసం అవసరమైన నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అవి కొన్ని ఆస్పత్రులకే పరిమితమయ్యాయి. ఈ కేంద్రాల్లోనూ సరైన వసతుల్లేవు. హైదరాబాద్‌లోని నిలోఫర్‌ లాంటి ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. స్త్రీ శిశు వైద్య నిపుణుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. భ్రూణహత్యలూ మాతాశిశురక్షణ పాలిట సవాలుగా మారాయి.

ఆరోగ్య సంరక్షణపై కేరళ రాష్ట్రం ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించింది. తద్వారా ప్రసవ సమయంలో గర్భిణుల మరణాలను ప్రతి లక్ష మందికి 81కి, శిశువుల్లో ప్రతి 1000 మందికి 13మందికి తగ్గించగలిగారు. గర్భ నిర్ధారణ అయిన తరవాత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాతాశిశు సంరక్షణ కార్డులు జారీ చేయాలి. గర్భవతులందరికీ కనీసం నాలుగుసార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆరోగ్య పరీక్షల్లో బీపీ, హీమోగ్లోబిన్‌, బరువు, మూత్రపరీక్ష, ధనుర్వాతం రాకుండా టీకా, రక్తలేమి నివారణకు ఐరన్‌ఫోలిక్‌ మందుబిళ్లల పంపిణీ ముఖ్యం. పౌష్టికాహార లోపాలుంటే గ్రామ ఆరోగ్య, పారిశుధ్య కమిటీల అధ్వర్యంలో ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలను వివరించాలి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యామ్నాయ ఆహారం అందించాలి. ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లో చేసుకునే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలి. ఆస్పత్రులకు వెళ్లడానికి ఎల్లవేళలా ఆంబులెన్సులు అందుబాటులో ఉంచాలి. ప్రసవానంతరం 48గంటలు ఆస్పత్రుల్లో ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. పిల్లలకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలి. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు పట్టేలే చేయాలి. శిశు ఆరోగ్య సంరక్షణకు ఆస్పత్రుల్లో ప్రత్యేక సదుపాయాల కల్పించాలి. పిల్లలకు పూర్తిస్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి. మనరాష్ట్రం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల సంరక్షణను ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా గుర్తించాలి. అవగాహన, ప్రజాచైతన్య కార్యక్రమాల ద్వారా పౌష్టికాహార లోప సమస్యలను అధిగమించాల్సి ఉంటుందని స్త్రీశిశు సంక్షేమ శాఖ తమ అధ్యయన నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలో సమగ్ర శిశు అభివృద్ధి సేవాపథకం, దాని పరిధిలోని ఆరోగ్య లక్ష్మి, బాలామృతం, సబల, కిశోర శక్తి వంటి పథకాల ద్వారా పౌష్టికాహార సమస్యలను అధిగమించేందుకు కృషి జరుగుతోంది. ఈ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాచ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. కుటుంబ సంక్షేమశాఖ టీకాల కోసమే ఏటా రూ.150కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 90నుంచి 95శాతం మందికి టీకాలు వేస్తున్నట్లు రికార్డుల్లో నమోదవుతున్నా వాస్తవంలో 32శాతం పిల్లలకూ అన్ని రకాల టీకాలు చేరడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికీ 26శాతం మందికి టీకాల గురించి తెలియదని ఇటీవల ‘యూనిసెఫ్‌’ సర్వే వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తే, పిల్లలను మృత్యుపాశం నుంచి తప్పించవచ్చు.

నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు

తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది(2016)ని ‘నవజాత శిశు సంరక్షణ సంవత్సరం’గా నిర్వహించాలని నిర్ణయించడం ఈ సందర్భంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు(ఎస్‌ఎన్‌సీయూ) విజయవంతంగా సేవలందిస్తున్నాయి. త్వరలోనే మరో 10 ఎస్‌ఎన్‌సీయూలను ప్రారంభిస్తామని, అన్ని జిల్లాల్లోనూ రూ.25కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. నవజాత శిశు సంరక్షణపై ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి. అమ్మాయిల్లో రక్తహీనతను నివారించడం, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించడం, సురక్షిత ప్రసవాలు, కాన్పు అనంతరం తల్లీబిడ్డల సంరక్షణ, పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి, చికిత్స ద్వారా కాపాడుకోవడం వంటివాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి ఆరోగ్యకేంద్రాలు, ఆస్పత్రుల్లో వసతులు కల్పించడమే కాకుండా, అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులతోపాటు ముఖ్యమైన ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో చిన్నపిల్లల వైద్య నిపుణులతో మెరుగైన సేవలు అందుబాటులోకి తేవాలి. ‘స్త్రీశిశు సంరక్షణకు పెద్దగా నిధులు అవసరంలేదు. వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నాణ్యమైన సేవలు అందించాలి’ అని యునిసెఫ్‌ అభిప్రాయపడింది. అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తే మాతాశిశువులకు అదే శ్రీరామరక్షగా నిలుస్తుందని పాలకులు గుర్తించాలి.

(రచయిత - ఆకారపు మల్లేశం)
Posted on 26-12-2015