Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

పంట నేలపాలు... రైతుకన్నీటిపాలు!

* కూరగాయల సాగు-‘ప్రాసెసింగ్‌’తోనే బాగు
నిత్యావసరాల ధరలు నియంత్రణలో ఉన్నంతవరకు ప్రజల జీవనానికి భరోసా ఉన్నట్లే లెక్క. అవి ఒక్కసారి అదుపుతప్పితే ప్రజల బతుకు గతుకుల బాట ఎక్కినట్లే! టమాటా, ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులు తలబొప్పి కట్టిస్తున్నాయి. ప్రభుత్వాలకూ చురకంటిస్తున్నాయి. మరోవంక అమాంతం పడిపోయిన ధరలు రైతన్నను దైన్యంలోకి నెడుతున్నాయి. ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం, నిత్యావసర ఉత్పత్తులపై పరిశోధనలు పడకేయడం, ఆహార శుద్ధి(ప్రాసెసింగ్‌) పరిశ్రమల అందుబాటు కొరవడటం వంటివి పరిస్థితికి ఆజ్యం పోస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో టమాటా, ఉల్లి రైతులకు దాదాపుగా ఎప్పుడూ కన్నీళ్లే మిగులుస్తున్నాయి.

తెలుగు రైతన్న కష్టం
రెండేళ్ల కరవు తరవాత తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో రైతులు భారీ విస్తీర్ణంలో టమాటా సాగు చేశారు. సంవత్సరమంతా టమాటా సాగు చేసుకోవడానికి వీలుంది. అయితే ఖరీఫ్‌లో వర్షాధారంగా నీటి సౌకర్యం ఉండటంతో అధిక విస్తీర్ణంలో రైతులు టమాటా సాగుచేస్తారు. నీటి పారుదల సౌకర్యం ఉన్నచోట రబీలో టమాటా సాగు ఎక్కువ ఉత్పాదకతను ఇస్తుంది. కానీ, అంతంత సాగునీటి సౌకర్యంతో రబీలో టమాటా విస్తీర్ణం తక్కువే. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దిగుబడులు తక్కువే వస్తాయి. మొత్తంగా ఖరీఫ్‌లో భారీ విస్తీర్ణంలో టమాటా సాగు జరగడంతో మార్కెట్లోకి ఉత్పత్తి ఉరకలెత్తింది. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, ప్రకాశం, విశాఖ, అనంతపురం జిల్లాల్లో; తెలంగాణలో నిజామాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పెద్దయెత్తున ఈ పంటను సాగు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు సాగు చేయాలని పిలుపివ్వడంతో టమాటా సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. కిలో టమాటా ఉత్పత్తికి ఎనిమిది రూపాయలు ఖర్చు అయితే- మార్కెట్లో ప్రస్తుతం దక్కుతోంది రూపాయి నుంచి రెండు రూపాయలు మాత్రమే! ఫలితంగా రైతుకు నికరంగా ఆరునుంచి ఏడు రూపాయల దాకా నష్టం వాటిల్లుతోంది. అందుకే కూలీలను, రవాణా ఖర్చులను సైతం భరించే శక్తిలేక ఎంతోమంది రైతులు నష్ట నివారణకు పంటను పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారు.
తెలంగాణాలో ఉద్యాన పంటల సాగుకు అత్యంత అనువైన వాతావరణం ఉంది. మొత్తం 10.86 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగయితే అందులో పండ్లు, కూరగాయలే 71 శాతం విస్తీర్ణంలో ఉన్నాయి. ఖరీఫ్‌ కూరగాయల సాగులో టమాటా విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. మిగతా పంటలతో పోలిస్తే టమాటా సహా కూరగాయల్లో ఉత్పాదకత ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరులో టమాటా సాగు ఎక్కువే. జాతీయ ఉద్యాన బోర్డు అంచనాల ప్రకారం 2015-16లో 1.82 కోట్ల టన్నుల టమాటా ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది 62 వేల ఎకరాల్లో; తెలంగాణలో 10 వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రబీ కాలంలో ఉల్లి ఎక్కువ మొత్తంలో సాగవుతుంది. తెలంగాణాలో జహీరాబాద్‌; ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, కడప జిల్లాల్లో దీని విస్తృతి అధికం. దేశంలో 2014-15లో కోటి 89 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయితే, 2015-16లో రెండు కోట్ల టన్నులు ఉత్పత్తి అయ్యింది. అంటే, ఈ ఏడాది 11 లక్షల టన్నుల ఉత్పత్తి అదనమన్నమాట. ధరల పతనానికీ అదే కారణమవుతోంది. 2012 తరవాత తాజాగా ఉల్లి ధర కిలో రూపాయికి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి టోకు కిలోకు ధర రెండు నుంచి ఎనిమిది రూపాయలవరకు పలుకుతోంది. కోత తరవాత పండ్లు, కూరగాయల వృథా అవుతుండటంవల్లా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ తరహా నష్టం పండ్లలో 4.6 శాతం, ధాన్యాల్లో ఆరు శాతం ఉండగా కూరగాయల్లో 15.9 శాతం పైమాటేనని లూథియానాలోని పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కేంద్రీయ సంస్థ అధ్యయనం తెలుపుతోంది. నిల్వ సౌకర్యాలు ఉంటే దేశంలో సాలీనా 40లక్షల టన్నుల ఉల్లి నష్టం తగ్గించవచ్చని కేంద్రీయ వాణిజ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేస్తోంది. శీతల గిడ్డంగుల నిల్వ సౌకర్యాలు మరింత మెరుగుపరిస్తే, 40 శాతం వ్యవసాయ ఉత్పత్తులు, 30 శాతం త్వరగా చెడిపోయే ఉద్యాన ఉత్పత్తులను నష్టాల నుంచి కాపాడుకోగలం. ప్రాసెసింగ్‌ పరిశ్రమల ద్వారా 48 లక్షల మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని 67వ జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సంస్థ విశదీకరించింది.
ఉద్యాన ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టి న్యూజిలాండ్‌ దశాబ్ద కాలావధిలో 140 శాతానికిపైగా ఎగుమతులు పెంచుకోగలిగింది. ప్రపంచ డెయిరీ సంబంధిత ఎగుమతుల్లో ఆ దేశం వాటా మూడొంతులకుపైగా ఉంది. ఆ స్ఫూర్తిని మన దేశమూ అందిపుచ్చుకోవాలి. శీతల గిడ్డంగుల విషయంలో భారత ప్రభుత్వం కొంతకాలంగా చెప్పుకోదగిన ముందడుగే వేస్తోంది. ప్యాక్‌హౌస్‌లు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ నిధులు అందిస్తుంది. తక్కువ వడ్డీకే ప్రైవేటుగా నిర్మించే శీతల గిడ్డంగులకు రుణాలు అందిస్తుంది. కోల్డ్‌ చైన్‌ గిడ్డంగుల రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తోంది. అయితే వీటిపై రైతులకు అవగాహన కలిగించాల్సిన అవసరముంది. ఉల్లి ధరల పతనంపై స్పందించిన కేంద్రం విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తిపై అయిదు శాతం పన్ను మినహాయింపునిచ్చింది. 2015-16లో పదకొండు నెలల కాలంలో ఎగుమతుల ద్వారా రూ.2,362 కోట్లు ఆర్జించింది. అదే వూపును కొనసాగించాల్సి ఉంది. నిల్వలు ఇప్పటికే భారీగా పోగుబడి ఉన్నాయి. మరోవంక పొలంలోని పంట త్వరలోనే విపణికి పెద్దయెత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎగుమతులకు చురుకు పుట్టించడమే ఏకైక మార్గం. ఆ దిశగా కేంద్రం సరైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
ఉద్యాన రంగాన్ని జీడీపీ వృద్ధికి కీలక వనరుగా ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో 15శాతం సాగుభూమిలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. భారత వ్యవసాయ ఆదాయంలో వీటి వాటా గణనీయం. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఉద్యాన రంగంలో ఉన్నారు. మెరుగైన శీతలీకరణ పద్ధతులతోనే ఉద్యాన ఉత్పత్తులను సద్వినియోగపరచాలి. మద్దతు ధర విషయంలో ప్రభుత్వాలు కొంతమేర విచక్షణ ప్రదర్శిస్తున్నాయనే చెప్పాలి. వినియోగదారులు అధికంగా ఉండే పట్టణాల్లో కూరగాయల ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం కల్పించిన ధరల స్థిరీకరణ నిధి వాడుతున్నారు. అమ్మకపు ధరలు పడిపోయి రైతులు నష్టపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించడం లేదు. త్వరగా పాడయ్యే వ్యవసాయ- ఉద్యాన ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అనువుగా 2016-17కుగాను రూ.500కోట్లు కేటాయించారు. అయితే ధరల స్థిరీకరణ నిధిని రైతుల ప్రయోజనాల పరిరక్షణకూ ఉపయోగిస్తే బాగుంటుంది.

ఆదుకోవాల్సిన తీరిది...
మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లికి ఉత్పత్తి ప్రోత్సాహకాలు అందజేస్తోంది. అదే పద్ధతిని టమాటాకూ వర్తింపజేయాలి. తెలంగాణ ప్రభుత్వమార్కెటింగ్‌ శాఖ రైతులనుంచి ఉల్లిని ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేసి వినియోగదారులకు నాలుగు రూపాయలకు విక్రయిస్తోంది. ఆహ్వానించదగిన పరిణామమిది. ఉల్లి, టమాటా కోతకు సంబంధించి కూలీలకే రోజూ రూ.200నుంచి రూ.300 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని వీటి కోతకు అనుసంధానిస్తే ఉత్పత్తి ఖర్చులు కొంతమేరకైనా తగ్గుతాయి. ప్రస్తుతం అతి తక్కువ పరిమాణంలో మాత్రమే టమాటాను పశ్చిమ, తూర్పు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐరోపాసహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి అవకాశాలను విస్తరించాలి. ఏపీఎంసీ నుంచి పండ్లు, కూరగాయలను తీసివేశారు. దాంతో ధరలు నియంత్రణలో ఉండటం లేదు. వీటిని దాని పరిధిలో చేరిస్తే కొంతమేరకైనా ఉపశమనం లభిస్తుంది. టమాటా కిలో అయిదు రూపాయలకు రైతుల వద్ద కొనుగోలు చేసి తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ రైతు బజార్లకు తరలిస్తోంది. టమాటాతోపాటు ఇతర కూరగాయలకూ దీర్ఘకాలంలో ఇదే తరహా మద్దతు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. పండ్లు, కూరగాయల వినియోగం భారీగా పెరుగుతోంది. ధరల్లో విపరీత హెచ్చుతగ్గుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రైతులకు మద్దతు కల్పించడం తక్షణావసరం. అలా కుదరని పక్షంలో తెలంగాణ తరహాలో రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులైనా గిట్టుబాటు అయ్యేలా ప్రభుత్వమే కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించాలి. చిత్తూరులో టమాటా సాగు దేశంలోనే అత్యంత ప్రసిద్ధి పొందింది. అధిక విస్తీర్ణంలో పంట సాగైతే నష్టాలు తలెత్తితే పంట అత్యధికంగా రోడ్లపాలయ్యేదీ ఇక్కడే! ఈ ప్రాంతంలో ‘ప్రాసెసింగ్‌’ పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు- టమాటా పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో దాదాపు అన్ని టమాటా రకాలూ కూరకు సంబంధించినవే. అయితే కొత్త రకాలను సాగుచేస్తే ‘ప్రాసెసింగ్‌’ పరిశ్రమలకు తరలించవచ్చు. ఆ రకంగా ధరల పతనాన్ని నిలువరించవచ్చు. ఎండబెట్టిన టమాటా, నీటి చెమ్మలేని ఉల్లికి ఇప్పటికే ఆదరణ పెరుగుతోంది. ఈ రకం ఉల్లి ఉత్పత్తి నిరుడు రెండింతలైంది. ఈ ఉల్లిని 50వేల టన్నులు ఎగుమతి చేశారు. అమెరికా, ఐరోపా, రష్యా, కొన్ని ఆఫ్రికా దేశాలకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఏకీకృత, ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ సాయంతో పల్లెలను జాతీయ విపణికి అనుసంధానిస్తే ఎంతో మేలు జరుగుతుంది. గిరాకీ ఉన్నచోటికి కూరగాయలను తక్షణం తరలించే వెసులుబాటు పెరుగుతుంది. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర కూడా దక్కుతుంది. అలాగే వర్షపాతంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉండే ఖరీఫ్‌లో కూరగాయలతో సహా అన్ని పంటలకూ బీమా చేయిస్తే- అన్నదాతకు కాస్తో కూస్తో నష్టపరిహారం దక్కుతుంది. ప్రభుత్వాలు కేవలం ప్రణాళికలు రూపొందించడంతో సరిపెట్టకుండా నిర్దిష్ట కార్యాచరణకు పూనుకొన్నప్పుడే రైతన్నకు సాంత్వన దక్కుతుంది.

Posted on 17-09-2016