Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

మిర్చి పంట... గుండె మంట!

* రైతుకు దక్కని గిట్టుబాటు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ విరివిగా సాగయ్యే లాభదాయక వాణిజ్య పంట మిరప- రైతులకు నేడు మంట పుట్టిస్తోంది! విస్తీర్ణం, దిగుబడి పెరిగినా ఎంతకీ గిట్టుబాటు ధర లభించని దుస్థితి వారి కంట నీరు తెప్పిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ్‌ బంగ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలోనూ ఈ పంట సాగు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు; తెలంగాణకు చెందిన వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలు మిరప పంటకు ప్రసిద్ధి. సాగు ఖర్చులోనూ ఈ జిల్లాలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. నీటిఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో, రైతులు ట్యాంకర్లను ఆశ్రయించి మరీ పంట పండించారు. పంట వేసినప్పుడు ఉన్న మార్కెట్‌ ధరకు, అది చేతికొచ్చే సమయానికి పలుకుతున్న ధరకు ఎక్కడా పొంతన లేదు. విపణిని చుట్టుముట్టిన పలు స్థితిగతులు, ఇతర ప్రభావాలు, మార్పుల వల్ల మిర్చి ధరలు విపరీతంగా పడిపోయాయి. బాధిత రైతులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగుతున్నారు. పంటకు ప్రభుత్వాలే బోనస్‌ ధరలివ్వాలని, విపణి శక్తుల్ని సమర్థంగా నియంత్రించాలని వారు కోరుతున్నారు. పంట నిల్వకు అనువుగా తగినన్ని శీతలీకరణ కేంద్రాలు స్థాపించాలని, మార్క్‌ఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు చేయాలని విన్నవిస్తున్నారు. విపణి మధ్యవర్తిత్వ పథకం కింద కేంద్రం ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అభ్యర్థించింది. ఆసియా ఖండంలోనే పేరొందిన అతిపెద్ద మార్కెట్‌యార్డు ప్రాంతం- గుంటూరు. ఇక్కడి నుంచే అమెరికా, రష్యా, జపాన్‌, ఇంగ్లాండ్‌, కెనడా, సింగపూర్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, శ్రీలంక, మలేసియా, జర్మనీ వంటి 90 దేశాలకు మిరప ఎగుమతి సాగుతోంది. దీని ద్వారా వందల కోట్ల రూపాయల విదేశమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు. గుంటూరును ‘అగ్రి ఎక్స్‌పోర్టు జోన్‌’గా గుర్తించడం వల్ల, మిరప ఎగుమతి అవకాశాలు ఎంతగానో పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, మిర్చి పైన కేంద్రం, రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముంది.

విపణి మాయాజాలం
అత్యధికంగా మిర్చిని పండించేది, వినియోగించేది, ఎగుమతి చేసేది తెలుగు రాష్ట్రాలే! మిరపకాయలకు ఘాటును కలిగించే పదార్థాన్ని శాస్త్రీయ పద్ధతిలో వేరు చేసి, వివిధ మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్‌ వ్యాధుల చికిత్సలో ఉపకరిస్తాయి. మిరపకాయల్లో లభ్యమయ్యే ఎర్రని రంగు పదార్థాన్ని ఆహారంగా ఉపయోగించినప్పుడు, అది శరీరంలోకి చేరి విటమిన్‌గా మారుతుంది. వేరు చేసిన రంగు పదార్థాన్ని ఆహార పదార్థాల తయారీలో స్వాభావిక రంగుగా వినియోగిస్తారు. ప్రకృతి సిద్ధమైన మిరప నుంచి వేరు చేసిన రంగుకు అంతర్జాతీయ విపణిలో గిరాకీ ఎక్కువగా ఉంది. ఎండు మిరపకాయల నుంచి వేరు చేసిన ద్రవ్యాన్ని బేకరీ ఆహార పదార్థాల తయారీకి సంబంధించి రంగు, వాసన కోసం వాడతారు. దీన్ని డబ్బాల్లో భద్రపరచి ఎగుమతి చేస్తుంటారు. ఇలా మిరప ఉత్పత్తుల వ్యాపారంలోని వారందరూ ఎంతగానో ఆర్జిస్తున్నారు. రైతులకు మాత్రం కనీస మద్దతు ధర సైతం లభించడం లేదు. గిట్టుబాటు కాని వ్యవసాయంతో వారు అప్పులపాలవుతుండటం బాధాకరం. వివిధ వర్గాలకు పలు రకాలుగా వచ్చే లాభాల్లో కొంత మేరకైనా రైతులకు చెందే విధంగా, ప్రభుత్వాలు విపణి ధరను నిర్ణయించాల్సి ఉంది. గుంటూరు పరిసరాలతో పాటు ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలు; తెలంగాణ జిల్లాల నుంచీ రైతులు మిరప విక్రయానికి జనవరి- మే నెలల మధ్య గుంటూరు మిర్చి యార్డుకు తరలి వెళుతుంటారు. లైసెన్సు కలిగిన కమిషన్‌ వ్యాపారుల ద్వారా క్రయ విక్రయాలు సాగుతుంటాయి. పలువురికి మార్కెట్‌ కమిటీ తరఫున అనుమతులు మంజూరు చేసి వ్యాపారాలు సాగిస్తుండటం ఇక్కడి స్థాయిని తెలియజేస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యక్ష క్రయ విక్రయాలు జరగడం ఆనవాయితీ. అధిక పోటీ ఉండటం వల్ల రైతుకు మంచి గిట్టుబాటు ధర రావాలి కానీ, ఆ విధంగా జరగడం లేదు. గత ఏడు సంవత్సరాల మిర్చి ధరల్ని గమనిస్తే, కేవలం 2015-16లోనే రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందని అర్థమవుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏవీ, రైతుకు బాసటగా నిలవడం లేదు. నియంత్రణ లేని విపణి మాయాజాలం రోజురోజుకూ ధరను దిగజారుస్తోంది. అనేక శీతల గిడ్డంగులు ఉన్నా, పంట నిల్వకు జాగా దొరకని స్థితి తాండవిస్తోంది. కొనేవారు లేక, తెచ్చిన మిరపకాయల్ని ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. సాగు ఖర్చుకు, రాబడికి పొంతన లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి, పంటకు మంచి విపణి అవకాశాలు కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో పారదర్శకతను ప్రోత్సహించాలి. రైతులందరికీ విపణి సమాచారం పూర్తిగా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే! వ్యవసాయదారులకు చెల్లించాల్సిన మొత్తం, నేరుగా వారి ఖాతాలోనే జమ అయ్యేలా చేస్తే బాగుంటుంది. వివిధ మార్కెట్‌ యార్డుల్లో ఇప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వాటిని ఇకనైనా వేగవంతం చేయాల్సి ఉంది. ప్రస్తుత విపణి విధానంలో కొంతమంది కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కై పంట ధరను నియంత్రిస్తున్నారు. కమిషన్‌తో పాటు విపణి రుసుములు, ఇతరత్రా తరుగులు అన్నీ కలిసి తడిసి మోపెడవుతున్నాయి. రైతులకు నికరంగా వచ్చే సొమ్ము తగ్గిపోతోంది. మరోవైపు వారికి చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. వీటన్నింటి నుంచి రైతును కాపాడాలంటే ‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌’ ఒక్కటే పరిష్కార మార్గం. ఈ విధానంలో వ్యాపారి లేదా కొనుగోలుదారు- దేశంలోని ఏ ప్రాంతంలో లైసెన్సుకు నమోదు చేసుకున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో ధరను తెలియజేయవచ్చు. ఏ మార్కెట్‌ యార్డు నుంచైనా సరకు కొనుగోలు చేయవచ్చు. డబ్బును రైతు ఖాతాకు ఆన్‌ లైన్‌ ద్వారా జమ చేయడమే ఉత్తమమైన పని. తరతరాలుగా వేళ్లూనుకొన్న దళారి వ్యవస్థను కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి. విపణి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేలా సాంకేతికత విస్తరించాలి. గుంటూరు యార్డులో రైతుల గుర్తింపు కోసం కంప్యూటర్లు నెలకొల్పి, వారు తెచ్చిన పంట వివరాలతో చీటీలు జారీచేస్తున్నారు. వాటి ఆధారంగా, కమిషన్‌ వర్తకులతో గిడ్డంగుల చీటీలు అందజేస్తున్నారు. ఆ తరవాత సరకు ధర నిర్ధారిస్తారు. దాన్ని తగ్గించకుండా అనుమతి గల కాటాదారుడి ద్వారా ఎలక్ట్రానిక్‌ కాటాపై తూకం వేసి, రైతుకు చీటీ ఇస్తారు. ఒకసారి నిర్ధారించింది మార్చకుండా, అదే ధరను చెల్లిస్తారు. రైతులెవ్వరూ మోసపోకుండా సరకు నగదు చెల్లింపు, ఇతర ఖర్చుల వివరాలతో చీటీ జారీచేస్తారు. సరకు అమ్మిన వెంటనే, అదే రోజు నగదు మొత్తం చెల్లించే ఏర్పాటు చేస్తారు. అయినా ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి.

కరవైన భద్రత
తెలంగాణలో కల్తీ కారంపై ప్రయోగశాలల నివేదికలు ఉన్నప్పటికీ, ఏ ఒక్క వ్యాపారిపైనా అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తోంది. నాణ్యతను పర్యవేక్షించాల్సినవారే, దాన్ని గాలికొదిలేస్తే ఎలా? పారేయాల్సిన వ్యర్థాలతో కలిపి విషపూరిత రసాయనాల్ని వాడితే, వాటితో కారంపొడి తయారు చేస్తుంటే రైతుకు గిట్టుబాటు ధర ఎలా వస్తుంది? రానే రాదు. వినియోగదారుడికి ఆరోగ్య భద్రత చేకూరదు. ప్రభుత్వాలు, పౌర సమాజం ఆలోచించాల్సిన విషయాలివి. మిర్చి ధరలు దిగజారుతున్నాయి. కనీస మద్దతు ధర కంటే విపణి ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రైతుల్ని ఆదుకునే విధంగా, మార్క్‌ఫెడ్‌ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. కానీ మిర్చికి కనీస మద్దతు ధరంటూ లేకపోవడమే విషాదం. మిరప పంట సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకొని, రైతుకు అందరూ మద్దతుగా నిలవాల్సిన తరుణమిది. రైతు క్షేమమే అందరి క్షేమం!

- డాక్టర్‌ ఈదర నారాయణ
(రచయిత- సంచాలకులు ప్రణాళిక, పర్యవేక్షణ; ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం)
Posted on 20-04-2017