Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

జలపుష్పాలు వికసించేలా...

* ఆక్వా రంగం తీరుతెన్నులు

పౌష్టికాహారంలో చేపలూ ఓ భాగం. పోషక విలువలే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ వీటిలో అధికంగా ఉంటాయి. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెరగడం- ఆక్వారంగం ఊపందుకునేందుకు కొంతవరకు దోహదపడింది. దేశంలోని సుదీర్ఘ తీరప్రాంతం, మంచినీటి వనరులు, నైపుణ్యం గల మత్స్యకారులది ఆక్వా రంగం ప్రగతిలో కీలకపాత్ర. ఆక్వా ఉత్పత్తిలో భారత్‌ది ప్రపంచంలో రెండోస్థానం. ఆహార వినియోగంలో పదో స్థానం. దేశంలో చేపలు, రొయ్యల తలసరి వినియోగం 5-6 కిలోలు. ఈ విషయంలో మిగిలిన ఆసియా దేశాలతో పోల్చి చూస్తే భారత్‌ ఎంతో వెనకబడి ఉన్నదనే చెప్పాలి. తలసరి వినియోగం జపాన్‌లో 50, చైనాలో 35, శ్రీలంకలో 18 కిలోల చొప్పున ఉంది.

దేశవాళీకి చెందిన బొచ్చె, శీలావతి (రాగండి), మోసు (మిరగల్‌) తదితర రకాలు తక్కువ సమయంలో కిలో కంటే ఎక్కువ బరువు పెరిగే అనుకూల వాతావరణం తెలుగురాష్ట్రాల్లో ఉంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వివిధ దేశాల్లో విజయవంతమైన విధానాలను అనుసరించడం ద్వారా దిగుబడులు పెరిగాయి. చేపలు, రొయ్యల మేత, ఆహారశుద్ధి, మందుల పరిశ్రమలు విస్తరించాయి. శాస్త్రసాంకేతిక సలహాదారులకూ కొదవ లేదు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల ప్రోత్సాహకాలూ బాగానే ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తిలో భారత్‌ అగ్రశ్రేణిలో ఉండేందుకు తెలుగు రాష్ట్రాలు కీలకపాత్ర పోషించాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత మంచినీటి చేపల పెంపకం విస్తీర్ణం ప్రపంచంలో మరెక్కడా లేదు. దాదాపు రెండు లక్షల హెక్టార్లలో ఇక్కడ చేపల చెరువులు విస్తరించి ఉన్నాయి.

ఎగుమతులపైనే ఆధారం
ఆక్వారంగం మొదటి నుంచీ వ్యవస్థీకృతం కాలేదు. ఎంతమంది రైతులున్నా, మత్స్యకారులున్నా ఎవరిదారి వారిదే. మధ్యవర్తుల పాత్ర అధికంగా ఉంది. పరిశ్రమ ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడింది. ఈ ఉత్పత్తులకు త్వరగా పాడైపోయే లక్షణం ఉంది. ఒడుదొడుకులూ ఎక్కువే. పాడి, కోళ్ళ పరిశ్రమల తరహాలో ఈ రంగంలోనూ సహకార వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే సుస్థిరమైన ప్రగతికి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల చేపలు దేశవ్యాప్తంగా 130 మండీలలో అమ్ముడుపోతున్నాయి. చేపల కొనుగోలు కొందరు వర్తకుల చేతుల్లోనే ఉండటంవల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదు. ఏటా చేపల సరఫరా ద్వారా మార్కెటింగ్‌ శాఖకు కోట్ల రూపాయల ‘సెస్‌’ లభిస్తుంది. మత్స్య, మార్కెటింగ్‌ శాఖల సమన్వయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 130 చేపల మండీల్లోని రోజువారీ ధరలను ప్రసారమాధ్యమాల ద్వారా రైతులకు తెలియపరచే ఏర్పాట్లు చేయాలి. తద్వారా గిట్టుబాటు ధర దక్కడానికి ఆస్కారం ఉంటుంది. నిత్యం చేపల డిమాండును తెలియజేయడం ద్వారా రైతులు ‘పట్టుబడి’ ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది.

పాలకులు ఎక్కువగా దిగుబడి పెంచడంమీదే దృష్టి పెడుతున్నారు. పథకాలు, సబ్సిడీలను దిగుబడిని పెంచే విధానాలకే పరిమితం చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉత్పత్తయ్యే బొచ్చె, శీలావతి (రాగండి), మోసు (మిరగల్‌) చేపల రుచి వేరే ఏ చేపకూ ఉండదు. వీటిని వినియోగదారుకు వేగంగా చేరవేసే వ్యవస్థలను రూపొందించాలి. వాణిజ్య విలువ కలిగిన కొర్రమీను వంటి జాతుల చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మార్కెటింగ్‌ శాఖతో సమన్వయం చేసుకుని ప్రముఖ దుకాణాలకు, రైతు బజార్లకూ సరఫరా చేయవచ్చు. తరచూ ఆక్వా మేళాలు నిర్వహించడం వల్ల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్లో ఆర్డర్‌ ఇస్తే వండిన ఆహారాన్ని నేరుగా ఇళ్లకే సరఫరా చేస్తున్న యాప్‌లకు, మహిళా మత్స్యకార సంఘాలకూ మధ్య సానుకూల వ్యాపార ఒప్పందాలు కుదర్చవచ్చు. ఐటీ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్లు వంటి చోట్ల రాయితీ ధరకు ఆక్వా ఫుడ్‌స్టోర్స్‌ ఏర్పాటు చేయవచ్చు. నగరాల్లో వినియోగం పెంచేందుకు ‘నేరుగా వండుకునేందుకు వీలుగా (రెడీ టు కుక్‌)’ శీతలీకరణ స్థితిలో, పరిశుభ్ర వాతావరణంలో ఈ ఉత్పత్తులను ప్రజలకు అందించాలి. సృజనాత్మక విధానాల ద్వారా పరిశ్రమను ప్రోత్సహించాలి. అప్పుడే మత్స్యకారులు, ఆక్వారైతుల ఆదాయం పెరుగుతుంది. సముద్రంలో, మంచినీటిలో ఉత్పత్తయ్యే చేపలు, రొయ్యలు ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌లో జలాశయాలు, సాగునీటి చెరువుల్లో హెక్టారుకు వంద నుంచి 150 కిలోల చేప దిగుబడి లభిస్తోంది. ఆసియా దేశాల్లో హెక్టారుకు 300 నుంచి 1,100 కిలోల వరకు దిగుబడి వస్తోంది. దిగుబడి వృద్ధిచేయాలంటే జలాశయాల్లో విడుదల చేసే చేపపిల్లల సంఖ్యనూ పెంచాలి. ప్రస్తుతం హెక్టారుకు 500 చేపపిల్లలను విడుదల చేస్తున్నారు. చేపలకు అందుబాటులో ఉన్న ఆహార పరిమాణాన్ని (ప్లవకాల శాతం) బట్టి హెక్టారుకు తొలివిడతగా 500, మలి విడతగా 250 పిల్లలను విడుదల చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

తెలంగాణలో సాగునీటి, గ్రామ పంచాయతీ చెరువుల్లో, జలాశయాల్లో చేప, రొయ్య పిల్లలను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. వేసవిలో నీటి పరిమాణం తగ్గడంతో ఒకేసారి ‘పట్టుబడి’ చేయాల్సిన అగత్యం తలెత్తుతోంది. పారిశ్రామికీకరణ జరగని జిల్లాల్లోని మంచినీటి వనరుల్లో పెంచిన చేపలకు భారీ గిరాకీ కల్పించవచ్చు. వాటిలో ఎటువంటి భార లోహ అవశేషాలు ఉండవు. వాటిని సేంద్రీయ చేపలుగా మార్కెటింగ్‌ చేస్తే అధిక ధర రావడానికి ఆస్కారం ఉంటుంది. మత్స్యకారులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించేందుకు ప్రభుత్వాలు ఇలాంటి ఆచరణాత్మక ప్రణాళికలను రూపొందించడం అవసరం. రాష్ట్రంలో పంజరంలో చేపల పెంపకం (కేజ్‌ కల్చర్‌) కోసం చేస్తున్న ప్రయోగాలూ సత్ఫలితాలనిస్తున్నాయి.

విత్తన చట్టం లేక వెతలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికశాతం సాగులో ఉన్న రొయ్య వనామీ. దిగుబడిలో 90 శాతం ఎగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఎకరా రొయ్యల సాగుకు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. రొయ్యపిల్ల కొనుగోలుకే రూ.30 నుంచి రూ.40 వేలు వ్యయమవుతుంది. అత్యున్నత ప్రమాణాలు పాటించే ‘హ్యాచరీ’ల నుంచి రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలి. కానీ, కొన్ని సంస్థలు నాసిరకం రొయ్య పిల్లను తక్కువ ధరకు రైతులకు అంటగడుతున్నాయి. పకడ్బందీ విత్తన చట్టాన్ని ఇక్కడ అమలు చేయాలి. రొయ్యలకు ఇచ్చే ఆహారం, మందుల విషయంలోనూ నిపుణుల పర్యవేక్షణ అవసరం. ఈ జాగ్రత్తలను సరిగ్గా పాటించకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో కేంద్రీకృతమైన ఆక్వారంగం రాష్ట్రంలోని సగం జనాభా ఆర్థిక స్థితిని మార్చగలదనడంలో అతిశయోక్తి లేదు!- కరణం గంగాధర్‌
(రచయిత- ఆక్వా రంగ నిపుణులు)
Posted on 15-08-2019