Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

బాధ్యత లేని అధికారం ప్రమాదకరం

* వ్యవస్థల మధ్య అవాంఛనీయ పోరు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించిన విధానంలో స్పష్టంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రమేయం కనిపిస్తోంది. ఒక చిన్న కార్యాలయంగా ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన ఆఫీసు... ఈరోజు పలువురు ఉన్నతాధికారులు, సలహాదారులతో ఒక సమాంతర అధికార వ్యవస్థగా తయారైంది. విచిత్రం ఏమిటంటే- సచివాలయ ‘బిజినెస్‌ రూల్స్‌’ ఈ కార్యాలయానికి వర్తించవు. దీన్ని అదనుగా తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయాలు ఎవరు సీఎమ్‌గా ఉన్నా, ఎటువంటి బాధ్యతా లేని అధికారాలను చలాయిస్తూ పాలన వ్యవస్థలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

సమస్యకు మూలం
సాధారణంగా ప్రభుత్వ కార్యాయాల్లో ఎక్కడైనా అధికారులు తమ అభిప్రాయాలను తెలియజేసే ‘నోట్‌’ తయారుచేసి సంతకం పెడతారు. ఆ సలహాలు, సూచనలకు వారి అభిప్రాయాలకు ఆ ‘నోట్‌’లోని సంతకమే ఆధారం. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. సచివాలయ ‘బిజినెస్‌ రూల్స్‌’నందు ముఖ్యమంత్రి కార్యాలయం గురించి ప్రస్తావించ లేదు. కాబట్టి ఈ సాధారణ విధి విధానాలు వారికి వర్తించవు. దస్త్రం మీద కేవలం ముఖ్యమంత్రి సంతకం ఉంటుంది కానీ, సీఎం కార్యాలయంలో అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలు... వాటికి సంబంధించిన రికార్డు ఏదీ ఉండదు. కొన్ని ప్రచ్ఛన్న దస్త్రాల (షాడో ఫైల్స్‌) ద్వారా తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేసి వారి సంతకం అయిన వెంటనే తమ రికార్డును తొలగిస్తారు. ఈ విధానాల వల్ల ‘బాధ్యత లేని’ అధికారాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంక్రమించాయి. వ్యవస్థను అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రధాన కార్యదర్శితో కలిసి సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసినంత కాలం ఈ విధానంలో పెద్ద సమస్యలేవీ ఉత్పన్నం కాలేదు. ఆ విధంగా కాకుండా ప్రధాన కార్యదర్శిని విస్మరించి ప్రభుత్వ యంత్రాంగంలోని కిందివారితో మాట్లాడి దస్త్రాలు తెప్పించుకొని ఉత్తర్వులు జారీ చేస్తూ... తాము చెప్పిన విధంగానే ప్రభుత్వం నడవాలనే వైఖరితో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రవర్తించడం మొదలుపెట్టినప్పటి నుంచి పాలన వ్యవస్థలో తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించడానికి సంబంధిత శాఖల కార్యదర్శులు, వారినందరినీ సమన్వయం చేస్తూ విధి విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించడానికి ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మంత్రివర్గ పరిశీలనకు వచ్చే అన్ని అంశాలపై సరైన విధివిధానాలను పాటించారా లేదా అనే విషయాన్ని పరిశీలించి... ఏ అంశాన్ని క్యాబినెట్‌కు తీసుకురావాలో నిర్ణయించే అధికారం కూడా క్యాబినెట్‌ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శికి ఉంది. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ‘ఈ అంశాన్ని పెట్టండి... ఇది వద్దు’ అంటూ సిఫార్సులు సలహాలు రావడం రానురాను పరిపాటి అయిపోయింది. దీంతో ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయానికి మనస్పర్ధలు రావడం, ఆ ప్రభావం ప్రభుత్వ పాలన మీద పడటం... ఒకటిన్నర దశాబ్దంగా ఎక్కువైంది.
జలగం వెంగళరావు హయాములో ఒక జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారి బీవీఎస్‌ ప్రకాశరావు మంత్రి కార్యాలయంలో ప్రధాన పాత్ర పోషించేవారు. నాడు ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించడానికి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులుగా ఉన్నవారు విధివిధానాల వరకే పరిమితమయ్యేవారు. మిగిలిన అంశాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఎన్టీ రామారావు సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం బలోపేతమైనా ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేసుకుంటూ పాలన సాగేది. తానే కేంద్రంగా చంద్రబాబునాయుడు పాలన సాగించడం మొదలుపెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. రాజశేఖర్‌ రెడ్డి హయాములోనూ ఇదే విధానాన్ని కొనసాగించారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు సంబంధించని ఇతర సర్వీసుల వ్యక్తులనూ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకుని రావడంతో పరిపాలనలో ముఖ్యమంత్రి కార్యాలయ జోక్యం, ఉన్నతాధికారులతో పరుషంగా ప్రవర్తించడం సాధారణమైపోయింది. క్రమక్రమంగా ముఖ్యమంత్రి కార్యాలయం పరిపాలనకు కేంద్ర బిందువుగా తయారైంది. తదనంతర కాలంలో వచ్చిన విచారణల్లో నిర్ణయాలు తీసుకున్న అధికారులు బలైపోయారు కానీ, వారి వెంట పడి పరుషంగా మాట్లాడి ఒత్తిళ్లు తెచ్చిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు- ఎక్కడా వారి సంతకాలు లేకపోవడంతో విచారణ నుంచి క్షేమంగా బయటపడ్డారు. అవగాహన, సమయస్ఫూర్తి గల అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నంతకాలం ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయాల మధ్య సంబంధాలు సరిగ్గా ఉంటూ పరిపాలన సజావుగా నడిచింది. 2004 తరవాత అటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కార్యాలయంలో లేకపోవడంతో అక్కడివారి అత్యుత్సాహం, స్వామిభక్తికి ఇతర అధికారులు బలైపోయారు. చంద్రబాబు నాయుడు రెండో పాలన సమయంలోనూ ఇదే పోకడ కొనసాగింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.

లోపిస్తున్న విజ్ఞత
‘మా మాటే శాసనం’ అన్న ధోరణిలో ముఖ్యమంత్రులు ఉండి, దాన్ని అమలు చేయడమే తమ కర్తవ్యమన్న విధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రవర్తించినంత కాలం కిందిస్థాయి అధికారులకు సమస్యలు తప్పవు. ఎప్పుడూ ముఖ్యమంత్రి చుట్టూ ఉంటారు కాబట్టి ఇతర అధికారులపై పితూరీలు చెప్పడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. విజ్ఞత కలిగిన అధికారులు ఉన్నంతకాలం ఈ సమస్యలు లేకుండా చూసుకున్నారు. దురదృష్టం కొద్దీ ఒకటిన్నర దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులు ఆ విజ్ఞతను ప్రదర్శించక పోవడం గమనార్హం. ఇదే విధివిధానాలను ప్రధానమంత్రి కార్యాలయంతో పోల్చి చూస్తే... అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ శాఖలకు విధులు కేటాయించే ఉత్తర్వుల్లో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఓ ప్రత్యేకమైన వ్యవస్థగా చూపిస్తున్నారు. మిగిలిన శాఖలకు వర్తించే విధివిధానాలు ప్రధానమంత్రి కార్యాలయానికీ వర్తిస్తాయి. ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైళ్లను పరిశీలించిన అధికారులు తమ ‘నోటింగ్‌’తో పాటు సంతకమూ చేస్తారు. ఆ విధంగా రికార్డు ప్రధానమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి భిన్నంగా ఉంటుంది. ఇదే అంశంపై నేను 2018లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు వారు ముఖ్యమంత్రికి ఇచ్చే సలహాలను రికార్డు చేసి సంతకం పెట్టే విధంగా ‘బిజినెస్‌ రూల్స్‌’ మార్చాలని హైకోర్టును అభ్యర్థించాం. కేవలం ఫైలు తెప్పించుకొని సీఎం సంతకం పెట్టించి, వెనక్కు పంపించే దానికి ఇంత పెద్ద వ్యవస్థ, అధికారులు అవసరం లేదని; ప్రభుత్వ జీతం తీసుకున్న ఉన్నతాధికారులు తప్పక తమ అభిప్రాయాలను ఫైల్‌ మీద తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ కేసులో నా వాదన. ఆ కేసు ఇంకా హైకోర్టులో పెండింగులో ఉంది.

స్పర్ధలకు కారణం
ఇక ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రధాన కార్యదర్శికి మధ్య అపోహలకు దారితీసిన రెండు అంశాలను పరిశీలిద్దాం. ఒక జీఓలో- కార్యదర్శులు ఉత్తర్వులు ఇచ్చేముందు ఏవైనా ప్రధానమని భావిస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉత్తర్వు ప్రతులను తిరిగి పంపించాలని పేర్కొన్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం తమ బాధ్యతలను కార్యదర్శుల పైన నెట్టడమే. ముఖ్యమంత్రి అనుమతి తరవాత దస్త్రాన్ని తిరిగి పంపించేటప్పుడు ఏదైనా ముఖ్యమని భావిస్తే ‘ముసాయిదా (డ్రాఫ్టు) ఉత్తర్వులను మళ్ళీ పరిశీలనకు పంపించండి’ అని సూచించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కార్యాలయానిది. ఈ బాధ్యత కార్యదర్శులకు వదిలేస్తే, ఎందుకైనా మంచిదని వారు అన్ని ఫైళ్లను ముసాయిదా ఉత్తర్వుతో వెనక్కి పంపిస్తారు. ఇది అనవసరమైన జాప్యానికి దారితీస్తుంది. ఇక రెండో ముఖ్యమైన ఉత్తర్వు- రూ.40 వేలకన్నా ఎక్కువ జీతం తీసుకునే కాంట్రాక్టు అధికారులందరినీ తొలగించడం. ఆ ఫైళ్లనీ ముఖ్యమంత్రి అనుమతికి పంపించాలనడం. విధి విధానాలు లేకుండా నియమితులైన సిబ్బందిని తొలగించడం మంచిదే అయినా మూకుమ్మడిగా అందరిని తీసేసే బదులు పరిశీలించి తప్పించే విధానం అనుసరిస్తే బాగుండేది. ఈ ఉత్తర్వుల వల్ల కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఈరోజు సిబ్బంది లేకుండాపోయారు. ఫైలు ముఖ్యమంత్రి దగ్గరకు పోయి, అనుమతి పొందిన తరవాత రావడమంటే కొన్నికొన్ని సందర్భాల్లో నెలలు పట్టవచ్చు. రెండు ఉత్తర్వులు క్షేత్రస్థాయిపై సరైన అవగాహన లేకుండా విడుదల చేసినట్లుగా ఉన్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసేవారు కార్యదర్శులుగా విధి నిర్వహణ చేయరు. అందులోనూ సాధారణ పరిపాలన శాఖలో విధి నిర్వహణ అంటే ఒకవైపు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి అజమాయిషీలో పని చేస్తూ, మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి పని పర్యవేక్షించే అసాధారణ పరిస్థితి! ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే కార్యదర్శికి ప్రధాన కార్యదర్శి కింద పనిచేసే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బాధ్యతలను అప్పజెప్పడం అవివేకం. ఇదే నేడు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ప్రధాన కార్యదర్శి మధ్య అపోహలకు కారణమైంది.

సచివాలయ ‘బిజినెస్‌ రూల్స్‌’ను మార్చి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులు కూడా తమ అభిప్రాయాలను రికార్డు చేసి, సంతకం పెట్టే విధానం లేనంతవరకు ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యతారహిత అధికారానికి కేంద్ర బిందువుగా కొనసాగుతుంది. దీని దుష్పరిణామాలు కేవలం ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయాల సంబంధాల మీదే కాకుండా మొత్తం పరిపాలన వ్యవస్థ పైనా ఉన్నాయి. బాధ్యతాయుత సుపరిపాలన ఆశించే ఏ రాజకీయ వ్యవస్థ అయినా హైకోర్టు ఉత్తర్వులకు ఎదురుచూడకుండా సచివాలయ ‘బిజినెస్‌ రూల్స్‌’ను మార్చి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా జవాబుదారీతనంతో వారి అభిప్రాయాలను రికార్డు చేసే విధానాన్ని ప్రవేశపెట్టడం ఉత్తమం.

Posted on 06-11-2019