Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

పరిశ్రమిస్తేనే వెలుగురేఖ!

'మూడేళ్ల తరవాత కనురెప్పపాటు సైతం కరెంటు పోకుండా సరఫరా చేస్తాం'- ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు శాసనసభలో ఇచ్చిన మాట ఇది. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్‌ కొరత అన్ని వర్గాలకూ ఆందోళన కలిగిస్తోంది. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక కొంతకాలం ఈ కష్టాలు తప్పవని ఆయన ఎన్నికల ప్రచార సభల్లోనే ప్రజలకు స్పష్టంచేశారు. ప్రజలూ ఇది అర్థం చేసుకుని, కరెంటు కష్టం నుంచి గట్టెక్కిస్తారన్న గట్టి నమ్మకంతో తొలి సీఎం పీఠంపై కేసీఆర్‌ను కూర్చోబెట్టారు. ఇక్కడితో ప్రజల బాధ్యత పూర్తయింది. ఇక వారికి బదులు తీర్చుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపైనే ఉంది. గడచిన జూన్‌ రెండోతేదీన తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి విద్యుత్‌ కష్టాలు పెరిగాయి. ఖరీఫ్‌లో తొలకరి నుంచే వరుణుడి పగ, భానుడి సెగ కారణంగా ఆగస్టుదాకా పంటలు సాగుచేయలేక రైతులు నానా అగచాట్లు పడ్డారు. గత అక్టోబరు నుంచి వర్షపాతంలోటు మరింత దారుణంగా 60 శాతానికి పెరగడంతో రబీ పంటల సాగు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ జిల్లాల్లో ఇలా వరసగా ఖరీఫ్‌, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావంతో పంటల సాగు తగ్గడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. నిజానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కొన్ని జిల్లాల్లో ఇలా వర్షాభావ పరిస్థితులున్నా- మిగతా ప్రాంతాల్లో కరెంటు కోతలు విధించి, తెలంగాణలో బోర్ల కింద వరి సాగుకు కరెంటు సరఫరా చేసేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు విద్యుత్‌ కష్టాలు అధికమయ్యాయని అధికార తెరాస పార్టీ నేతలు నిరసిస్తున్నారు.

ఇప్పట్లో సాధ్యమేనా?

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉన్నందున, ఇప్పటికిప్పుడు తీర్చాలంటే ఎవరికీ సాధ్యమయ్యే పనికాదు. గత సెప్టెంబరులో నిండు వర్షాకాలంలోనే విద్యుత్‌ డిమాండు ఒకరోజు గరిష్ఠంగా 155 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ)ను తాకింది. తెలంగాణ జిల్లాల్లో ఈ స్థాయి కరెంటు డిమాండు వర్షాకాలంలో గతంలో ఎన్నడూ నమోదు కాలేదని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల లెక్కలే చెపుతున్నాయి. ఇక మార్చి నుంచి మొదలుకానున్న వేసవి సీజన్‌లో విద్యుత్‌ కష్టాలు పెరగనున్నాయి. వేసవిలో రోజూవారీ డిమాండు 160 ఎంయూలను దాటే అవకాశం ఉందని, ఎంత కష్టపడినా ఇందులో 20 నుంచి 30 ఎంయూల లోటు తప్పదని డిస్కంలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి మొత్తం సరఫరా 120 ఎంయూలకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. ఈ లోటు తీర్చడానికి వేసవి అవసరాల కోసం బయటి మార్కెట్‌లో కొందామన్నా కరెంటు దొరికే పరిస్థితి లేదు. గడచిన పదేళ్లుగా ప్రధానంగా తెలంగాణలో కొత్త విద్యుత్కేంద్రాల స్థాపన పనుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిందన్న మాట అక్షర సత్యం. సింగరేణి బొనుల్లో అపారంగా బొగ్గు నిల్వలున్నా తెలంగాణలో థర్మల్‌ విద్యుత్కేంద్రాలను ఎందుకు అధికంగా స్థాపించలేదన్న తెరాస నేతల ప్రశ్నలకు కాంగ్రెస్‌ వద్ద సరైన సమాధానాలే లేవు. రాష్ట్రంలో ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్కేంద్రాల స్థాపిత ఉత్పాదక సామర్థ్యం 2744.35 మెగావాట్లు. ఇంకా జల విద్యుత్కేంద్రాల ఉత్పాదక సామర్థ్యం 2068.25 మెగావాట్లుండగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సౌరవిద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం ఒకే ఒక మెగావాట్‌ ఉంది. కేంద్రం నుంచి వచ్చేది, ప్రైవేటు విద్యుత్కేంద్రాలన్నింటినీ కలుపుకొంటే తెలంగాణలో మొత్తం ఉత్పాదక సామర్థ్యం 8778.48 మెగావాట్లు అని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తెలిపింది. కానీ ఇందులో ప్రస్తుతం సరఫరా అవుతోంది అయిదువేల మెగావాట్లకు మించడం లేదు. రాష్ట్రానికి తక్షణం వెయ్యి మెగావాట్లను అదనంగా సరఫరా చేస్తే కరెంటు కష్టాలు దాదాపు తీరిపోతాయి. కానీ ఇందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇక్కడ నిర్మిస్తున్న కొత్త విద్యుత్కేంద్రాలతో వచ్చే డిసెంబరు ఆఖరునాటికి కనీసం 1800 మెగావాట్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.

విభజన చట్టంలోనే లొసుగులు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చొరవ చూపిన అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను అమితంగా వేధించే తక్షణ సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై కనీసం దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్‌ నేతల నిర్లక్ష్యం నేడు తెలంగాణ వాసుల కరెంటు కష్టాలను ఎగదోసింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్రం తరపున నాలుగువేల మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల కొత్త థర్మల్‌ విద్యుత్కేంద్రాలను ఏర్పాటుచేస్తామని విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలియజేసింది. ఇది దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి మేలు చేసే ప్రతిపాదనే అయినా, కరెంటు సమస్యలకు తక్షణ పరిష్కారం కాదు. నిజానికి యూపీఏ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రస్తుతమున్న కేంద్ర విద్యుత్కేంద్రాల నుంచి 500 నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కనీసం మూడేళ్లపాటు సరఫరా చేయాలనే నిబంధనను విభజన చట్టంలో పెట్టి ఉండాలి. అదే జరిగిఉంటే ఈరోజు ఇక్కడి ప్రజలకు ఇన్ని కష్టాలే ఉండేవి కావు. కేంద్రం నుంచి అదనంగా వెయ్యి మెగావాట్లు లేదా కనీసం 500 మెగవాట్లయినా ఇవ్వడం పెద్ద కష్టమైన అంశమేమీ కాదు. రాష్ట్రం ఏర్పాటైన తరవాత ఇక్కడ తొలుత ఏర్పడే అతిపెద్ద సమస్య కరెంటు కొరతేనని ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. ఆయనా కాంగ్రెస్‌కు చెందినవారే. కనీసం తమ పార్టీ సీఎం చెపుతున్న సమస్యను సైతం కాంగ్రెస్‌ పెద్దలు పట్టించుకోకపోవడంతో విభజన చట్టంలో ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపలేదు.

పైగా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 53.89 శాతం తెలంగాణకు ఇవ్వాలనే షరతు పెట్టారు. ఇప్పుడు ఆ నిష్పత్తి ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇవ్వడంలేదని తెరాస ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్‌ కష్టాల వల్ల ప్రభుత్వానికి పలు సమస్యలు తప్పడం లేదు. నిజానికి ఏపీలోనూ మిగులు విద్యుత్‌ లేదని, అక్కడి ప్రభుత్వం కూడా బయటి మార్కెట్‌లో కొంటోందని తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్‌ అప్పట్లోనే చెప్పారు. ఎంత నిష్పత్తిలో ఏపీ ప్రభుత్వం ఇవ్వాలనే నిబంధనను వదిలేసి, ఆ రాష్ట్రంలోని ఏదైనా విద్యుత్కేంద్రం నుంచి గానీ, లేదా కేంద్రప్రభుత్వ విద్యుత్కేంద్రాల నుంచి గానీ నేరుగా 500 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు ఇస్తే... ప్రస్తుత కొరత నుంచి ఇక్కడి ప్రజలు గట్టెక్కుతారని ఉమ్మడి రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఇటీవల చెప్పింది. ఇది మంచి సూచన. దీని అమలుకు కేంద్రం నుంచి చొరవ చాలా ముఖ్యం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీర్చేందుకు కొత్త విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వపరంగా కసరత్తులు మొదలయ్యాయి. రాబోయే 48 నెలల్లో పది కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మించాలని తెలంగాణ జెన్‌కో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కొత్త కేంద్రాల్లో 8600 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ లక్ష్యసాధనకు దాదాపు రూ.51,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని జెన్‌కో తాజాగా సర్కారుకిచ్చిన నివేదికలో వెల్లడించింది. ఈ సొమ్ములో 70 శాతం బయటినుంచి అప్పులు తెచ్చుకోవాలి.

జెన్‌కో ఈక్విటీ కింద మిగతా 30 శాతం పెట్టుబడిగా పెట్టాలి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2018 మార్చిలోగా ఈ నిధులన్నీ ఖర్చుచేసి చకచకా పనులు పూర్తిచేస్తేనే కొత్త విద్యుత్కేంద్రాల నుంచి 8600 మెగావాట్ల అదనపు ఉత్పత్తి సాధ్యం. కొత్త ప్లాంట్లకు బయటి నుంచి 70 శాతం సొమ్మును అప్పుల రూపంలో తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదని, కానీ టీజెన్‌కో వాటాను సమకూర్చడమే ప్రస్తుతం పెద్దసవాలనీ భావిస్తున్నారు. గతంలో విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్ర జెన్‌కో ఈక్విటీ పెట్టుబడులకింద ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం అందలేదు. కేవలం కృష్ణపట్నం విద్యుత్కేంద్రం నిర్మాణానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసాయం చేసింది. కానీ ఇప్పుడు ఒకేసారి పది విద్యుత్కేంద్రాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నందున, టీజెన్‌కో సైతం నేరుగా దాదాపు రూ.15,000కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంది.

గట్టి పట్టుదలతో లక్ష్య సాధన

కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఇదే పట్టుదల ఆయన మూడేళ్ల పాటు చూపితే కనురెప్పపాటు సైతం కరెంటు సరఫరా ఆపకుండా చూస్తామని ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చడం కష్టమేం కాదు. కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణానికి కావాల్సిన స్థలాల కోసం ఇటీవల ఆయన నల్గొండ జిల్లాకు హెలీకాప్టర్‌లో వెళ్లి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఆసక్తికరమైన పరిణామంగా భావించాలి. కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణానికి భూసేకరణే పెద్ద సమస్యగా మారనుందని కొద్దిరోజులుగా విద్యుత్‌ రంగ నిపుణులు భావించారు. కానీ సీఎం శరవేగంగా స్థలాలు గుర్తించడం మంచిదైంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రత్యేకంగా నాలుగువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తామని కేంద్రప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా తొలిదశలో 1600 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి రామగుండంలో స్థలం ఎన్టీపీసీ అడిగింది. తొలి ప్రాధాన్యంగా ఎన్టీపీసీకి స్థలం సైతం కేటాయించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. తెలంగాణ విద్యుదుత్పాదక సంస్థ(జెన్‌కో) ఆధ్వర్యంలో రాష్ట్రప్రభుత్వం నేరుగా నిర్మించే 8600 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్కేంద్రాల పనులను నేరుగా బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించాలని తీసుకున్న నిర్ణయమూ కీలకమే.

ఒక్కో విద్యుత్కేంద్రానికి గ్లోబల్‌ టెండర్లు పిలవడం, వాటి ఖరారు ప్రక్రియలో కాలాహరణం వంటి సమస్యలను తీర్చడానికి ఏకమొత్తంగా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు ఈ కాంట్రాక్టును అప్పగించాలని ఆయన నిర్ణయించడం విశేషంగానే చెప్పాలి. టెండర్ల ఖరారులో అవినీతి జరిగిందనే ఆరోపణలు రాకుండా ఏకంగా బీహెచ్‌ఈఎల్‌కు పనులు అప్పగించడం ద్వారా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని ప్రతిపక్షాల నోళ్లకు సీఎం తాళాలు వేశారన్న వాదనలో నిజం లేకపోలేదు. ఇదేవిధంగా బీహెచ్‌ఈఎల్‌తో వేగంగా పనుల చేయించడంలోనూ ఆయన మొదలుకొని అధికారయంత్రాంగమంతా కష్టపడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల కొత్త విద్యుత్కేంద్రాల పనులే ముందుగా నిర్దేశించుకున్న గడువులో పూర్తికావడం లేదు. ఈ పనులను ఇటీవల పరిశీలించిన కేసీఆర్‌ వేగంగా పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని సూచించారు. కొత్త విద్యుత్కేంద్రాల పనులపైనే కాకుండా విద్యుత్‌ సరఫరాలో నష్టాలను సైతం తగ్గించడంపైనా దృష్టిపెట్టాలి.

ప్రస్తుతం తెలంగాణ ఉత్తర డిస్కంలో 11.45 శాతం, దక్షిణ డిస్కం పరిధిలో 13.68 శాతం విద్యుత్‌ను- సరఫరా, పంపిణీ వ్యవస్థల్లో లొసుగుల వల్ల నష్టపోతున్నారు. వీటిని మరో నాలుగేళ్లలో వరసగా 10.46కు, 12.50 శాతాలకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యాలు పెట్టింది. ఇది జరగాలంటే మౌలిక సదుపాయాల పనులు వేగంగా సాగాలి. డిస్కంల అంతర్గత సామర్థ్యమూ పెరగాలి. విద్యుత్‌ను వాడుకోవడంపైనే కాకుండా పొదుపుపైనా ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇవన్నీ జరిగితేనే మరో నాలుగేళ్లలో పెరగనున్న డిమాండును తట్టుకుని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ అవతరించే వీలుంటుంది.

(రచయిత - మంగమూరి శ్రీనివాస్‌)
Posted on 12-01-2015