Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

వాడుక భాషతోనే జ్ఞానవికాసం

* తెలుగు రాష్ట్రాల్లో విద్యాబోధనా మాధ్యమం

తెలుగు పిల్లలకు ఏ భాషలో పాఠాలు చెప్పాలన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని విధిగా అమలుపరచాలన్న ప్రభుత్వ నిర్ణయం (తెలంగాణలో తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాలు రెండింటికీ సమాన అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది) ఈ పరిణామానికి కారణం. గత ప్రభుత్వాల నిర్ణయాల వల్ల లాభాపేక్షతో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇంగ్లిషులో చదువుకున్నవారికి మహత్తర భవిష్యత్తు ఉంటుందన్న అభూతకల్పనల ప్రచారం ఈ విద్యావ్యాపారానికి సూత్రమైంది. దీంతో తల తాకట్టు పెట్టయినా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ పాఠశాలల్లో చేర్చడం దశాబ్దాలుగా జరుగుతోంది. ఇలాంటివారికి సులభంగా ఆంగ్ల మాధ్యమ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలన్నది ప్రభుత్వ ఆశయంగా చెబుతున్నారు. తెలుగు పిల్లలంతా ఇంగ్లిషులో పాఠాలు చదవడం మొదలుపెడితే తెలుగు భాష నశించిపోతుందన్న ఆందోళన అనేకమందిలో వ్యక్తమైంది. దీంతో ‘డబ్బున్నవాళ్ళ పిల్లలే ఇంగ్లిషులో చదవాలా, పేదలకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వకూడదు’ అన్న ప్రశ్నలు సహజంగానే వచ్చాయి. కానీ, ధనవంతుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక ముందు, తరవాతా ధనవంతులేనన్న సంగతి గమనించాలి. ఆంగ్ల మాధ్యమ చదువులే వారి ఆర్థిక స్థితిగతులకు కారణమైతే అమెరికా, ఇంగ్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కోట్ల సంఖ్యలో నిరుపేద ప్రజలు ఎందుకున్నారో ఆలోచించారా? ప్రజల కోరికమీదే ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నామనే ప్రభుత్వ వాదన దృష్ట్యా ప్రస్తుత విద్యావిధానానికి ఎవరు బాధ్యులో విడదీసి చెప్పడం కష్టం. అయితే భాష చావు బతుకుల మాట అటుంచి, ఇదంతా కేవలం ‘ఇంగ్లిషు మాధ్యమంలో చదువుకున్నవారికే ఉన్నత భవిష్యత్తు’ అనే అభిప్రాయం మీద ఆధారపడిన పేకమేడ అని పిల్లల తల్లిదండ్రులకు తట్టకపోవడం విచారకరం. బోధన మాధ్యమం గురించిన అపోహలను శాస్త్రీయ పరిశోధనలు ఏ విధంగా సవరించాయో వారు తెలుసుకోవాలి.

సృజనకు పట్టంకట్టే ‘మాట్లాడే భాష’
భాషను కాపాడుకోవాలన్న చర్చ, తపనలను కాసేపు పక్కనపెడదాం. అసలు భాష విషయానికొస్తే, అది ఆలోచనకు, భావ వ్యక్తీకరణకు, తద్వారా వ్యక్తి మనుగడకు అవసరం. ఏ భాషలోనైతే భావాలు సులభంగా అర్థమవుతాయో, జీర్ణించుకోగలమో, మనలోని సృజనాత్మకతను వృద్ధి చేసుకోగలమో ఆ భాషలోనే మన ఆలోచనలు కూడా ఉంటాయి. ఆ భాష కేవలం మనం నేర్చుకున్నదే కాదు, రోజూ ఉపయోగించేది. అది పుస్తకాలకు, బడి చదువులకు పరిమితం కాదు. ఎంత బట్టీయం పట్టినా, ఇంగ్లిషు ఎంత కష్టపడి నేర్చుకున్నా ఇండియాలో ఉన్నంతకాలం పుట్టినది మొదలు పెరిగిన వాతావరణంలోని భాషలోనే మా భావోద్వేగాలన్నీ నడిచాయి. అంటే వేరే భాషలో అసలు ఆలోచించలేదనీ కాదు, చదువుకోలేదనీ కాదు. కానీ ఒక పదమో, నిర్వచనమో తెలుగులో వివరించినప్పుడు హృదయానికి హత్తుకున్నంతగా వేరే భాషలో విన్నప్పుడు చేరువకాలేదు. అది సర్వత్రా ఇంగ్లిషు మాట్లాడే ఈ అమెరికా సమాజంలో చాలా కాలం బతికిన తరవాతే సాధ్యపడింది. సుమారు నలభైయ్యేళ్ళుగా అమెరికాలో ఉంటున్నా, ఒక ఇంగ్లీషు మాటతో మాకు కలిగే అనుభూతికి, మా పిల్లలకు కలిగే అనుభూతికి హస్తిమసికాంతర భేదం ఉంటుంది. అంటే, మనకు వ్యక్తిత్వం ఏర్పడే వయసులో కలిగిన/ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలు తరవాతి జీవితంమీద కొంత శాశ్వత ప్రభావం చూపిస్తాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనలో భావోద్రేకాలు రగిలించడానికి, ఉత్తేజితుల్ని చేసి సృజనాత్మకతను పెంపొందించడానికి, తద్వారా సమాజాన్ని ముందుకు నడిపించగలిగేది మనం పెరిగిన వాతావరణంలోని భాషేగాని, బతుకుతెరువుకో, భయపడో నేర్చుకున్న భాష కాదు. బతుకుతెరువుకు నేర్చుకున్న భాష ఉపయోగం కేవలం ఇతరుల ఆలోచనలను, సృజనాత్మకతను అమలుపరచడానికి ఉపయోగపడుతుందే గాని, సొంత ఆలోచనలకు అక్కరకు వచ్చేది అతి తక్కువ. మెకాలే గాని, మరొకరు గాని చేసిన ప్రయత్నం కేవలం ఇలా అమలుపరచే శాశ్వత కూలీలను తయారు చేయడానికే. ఈ మాట వినగానే ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన భారతీయుల పేర్లు ఏకరువు పెట్టేస్తారు. ఆంగ్ల భాష తయారు చేసిన కూలీల్లో అలా స్వతంత్ర ఆలోచనలతో ముందుకెళ్లినవారు ఎంత శాతం? మరి తెలుగు మాట్లాడే ప్రజల కంటే తక్కువ జనాభా మాట్లాడే భాషలు- జపనీస్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇటాలియన్‌ తదితర భాషల్లో చదువుకున్నవారిలో అలా గుర్తింపు పొందివారి శాతం ఎంత? ఈ రెండింటిని పోల్చుకుంటే చాలు- సొంత భాష మాధ్యమంలో చదువు విలువ ఇట్టే బోధపడుతుంది.

సొంత ఆలోచనతో ఆత్మవిశ్వాసం
పెరిగిన భాష కాకుండా వేరే భాషలో సొంత భావాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆ భాషా సమాజంలో మమేకమైతేనేగాని కుదరదు. అది అసాధ్యం కాదు గాని, అది సాధించగలవారు అతి తక్కువ శాతం ఉంటారు. సొంత ఆలోచనలు లేనివారికి ఆత్మవిశ్వాసమూ తక్కువే. తమ సమాజం నుంచి బయటపడిన తరవాతగానీ ఆ లోటు తెలియదు. అప్పుడిక చేసేదేమీ ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. అదీగాక, తెలుగు రాష్ట్రాల్లో జన భాష తెలుగు. పిల్లలందరూ పాఠాలు విధిగా ఇంగ్లిషులో మాత్రమే (లేకపోతే కొన్నాళ్ల తరవాత మాండరిన్‌లోనో స్పానిష్‌లోనో) చదువుకుంటే, ఆ చదువుకు ఉపయోగం ఎక్కడ? అలా చదువుకున్నవారిలో ఎంత శాతం ఇంగ్లిషు మాట్లాడే సమాజంలో జీవనం గడపగలిగే అవకాశం ఉంది? ఇంగ్లిషు మాధ్యమం గురించి కలలుగనేవారు- ఒకసారి ఇతరుల దృష్టిలో మన పరపతేమిటో గమనిస్తే మంచిది. ఐటీ సంస్థల్లో వినియోగదారులతో మాట్లాడడానికి ఎవరిని వాడుకుంటారో, ఒకవేళ ఫోన్‌లో మాట్లాడితే ఏ పేర్లు పెడతారో తెలుసుకుంటే చాలు. కాని ఇది మన యువతరం తెలిసి చేసిన పాపం కాదు. నాణ్యతగల విద్య అందించడానికి బదులు, భాషా మాధ్యమం పేరుతో పెడదారి పట్టిస్తున్న విద్యా విధానాలదే ఆ తప్పు. పాలకుల చెవి మెలిపెట్టి తమకు అనుకూలంగా విధానాలను ఏర్పాటు చేయించుకుంటున్న విద్యావ్యాపారులదే ఆ అపరాధం!

సమగ్రమైన విద్య అవసరం గుర్తించిన, విచక్షణా జ్ఞానం ఉన్న నాయకులు ఉన్నా- కాలక్రమంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే నాయకుల ముందు నిలవలేరు. పని చెయ్యకుండానే జీతాలిస్తామంటే ఓట్లు ఎలా వేస్తున్నారో, అన్ని పాఠ్యాంశాలు చదివే అవసరం లేకుండా మంచి ఉద్యోగం వస్తుందంటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాంటి చదువులకే ఎగబడుతున్నారు. అది ఎంతకాలం నిలుస్తుందో, మనిషి ఎదుగుదలకు ఎలాంటి అవరోధాలు కలిగిస్తుందో, చివరికి సమాజాన్ని ఏ రకంగా శాశ్వత బానిసత్వానికి గురిచేస్తుందో ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. ఇవి ఆలోచిస్తూ కూర్చుంటే పక్కవారు ఆర్థికంగా ముందుకు దూసుకుపోతారన్నది అసలు భయం. జ్ఞాన సముపార్జన, మానవ సంబంధాలు, శాంతియుత సహజీవనం తదితరాలన్నీ శుష్కప్రియాలవుతాయి. తల్లిదండ్రులు నాయకులను అడగవలసింది- తమ పిల్లల్లో స్వతంత్ర ఆలోచనల్ని మేల్కొలిపి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించగల నాణ్యమైన విద్యాబోధన అందజేయమని. అది ఏ భాషలో జరగాలని కాదు. ఏ భాషామాధ్యమం మంచిదో పరిశోధనల ద్వారా నిర్ణయించేలా నాయకులను ప్రోత్సహించాలి. అపోహలు, ఆవేశకావేషాలు, రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు చేయడం సరికాదు.

ద్వితీయశ్రేణి పౌరులు కావాలా?
అమెరికాలో స్పానిష్‌ మాట్లాడే కుటుంబాల్లోని పిల్లలకు బలవంతంగా ఇంగ్లిషులో బోధన మీద జరిగిన పరిశోధనల సారాంశాన్ని ‘అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ (ఏఏయూపీ) పత్రికలో పదేళ్ల క్రితమే ప్రచురించారు. వాటి ప్రకారం- తాము పెరుగుతున్న సమాజం భాషలో కాకుండా వేరే భాషలో చదువుకునే పిల్లలు స్వతంత్ర ఆలోచనలు కొరవడి, ద్వితీయశ్రేణి పౌరులుగా మిగిలిపోతారు. ఇంగ్లిషు మాట్లాడే అమెరికన్‌ సమాజంలో నివసించే తల్లిదండ్రుల వాడుక భాష ఇంగ్లిషు కానప్పుడు (స్పానిష్‌ మాట్లాడే అమెరికావాసుల ఉదాహరణగా), వారి పిల్లలకు ఏ భాషలో చదువు చెప్పాలన్న ప్రశ్నకు పరిశోధనల ఆధారంగా ఆ పత్రంలో చేసిన సూచనలు:
1. సాధ్యమైనంత వరకు పిల్లలను వారికి అలవాటైన ప్రాథమిక భాషలోనే చదివించాలి. దీనివల్ల వారికి ప్రాథమిక భాషలో పట్టు కలిగి, తద్వారా ఇంగ్లిషు నేర్చుకోవడం సులభమవుతుంది. ఆపై ఇంగ్లిషులో ఇతర పాఠ్యాంశాలు నేర్చుకోవడం తేలికవుతుంది.
2. విద్యార్థులు తమ ప్రాథమిక భాషలో నేర్చుకున్న అంశాలను ఇంగ్లిషులోకి అనువదించుకోవడానికి అవసరాన్నిబట్టి ఉపాధ్యాయులు సహాయం చెయ్యాలి. అంతేగానీ విద్యార్థులు తమంత తామే ఇంగ్లిషులోకి భావాలను అనువదించుకోగలరని ఊహించుకోకూడదు.
3. ప్రాథమిక భాషను, ఇంగ్లిషును నేర్పడంలో సమాన పద్ధతులు అవలంబించవచ్చు. ఇంగ్లిషు నేర్చుకోవడం ప్రాథమిక భాషతో సమానంగా జరుగుతుందని ఊహించుకోకూడదు. ఈ ప్రక్రియలో విద్యార్థులకు ఇంగ్లిషులో పాఠ్యాంశాలను జీర్ణించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చని గుర్తించాలి.
4. ఇంగ్లిషును పాఠశాలలో ఎంత జాగ్రత్తగా నేర్పినా, విద్యార్థులు తాము పెరిగే సమాజంలో నిత్యం జరిపే లావాదేవీలన్నీ ఇంగ్లిషులో చెయ్యగలిగితేనే ఆ భాషలో నేర్చే విద్య పూర్తిగా అవగాహనలోకి వస్తుంది.

చుట్టూ ఇంగ్లిషు మాట్లాడే సమాజంలో బతుకుతున్న స్పానిష్‌ మాట్లాడే కుటుంబాల్లో పిల్లల పరిస్థితే అలా ఉంటే- ఇక ప్రజల మధ్య ఇంగ్లిషులో సంభాషించే అవకాశంలేని తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆలోచించడం మంచిది.

- డాక్టర్‌ మద్దిపాటి కృష్ణారావు
(డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి తరఫున)
Posted on 11-01-2020