Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

ప్రభుత్వ అప్రమత్తత అత్యవసరం

అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు, మహిళలకు పోషకాహారం అందించే దిశగా... తెలంగాణ మరో ముందడుగు వేసింది. 'సన్నబియ్యం'తో వసతి గృహాల బాలబాలికలకు; 'ఆరోగ్యలక్ష్మి' పేరిట గర్భిణులు, బాలింతలకు ఆకలితీర్చి ఆదుకుంటోంది. ఇదే క్రియాశీలత అక్రమార్కుల ఆటలు కట్టించడంపైనా ప్రసరిస్తేనే ప్రభుత్వ లక్ష్యానికి సాకారం, సార్థకత!

బాలబాలికలు, బాలింతలు, ఇతర మహిళలకు సంపూర్ణ ఆరోగ్యకల్పన లక్ష్యంతో రెండు ప్రత్యేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. సన్న బియ్యం పంపిణీ, ఆరోగ్యలక్ష్మి అనే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలో పోషకాహార సమస్యకు కొంత పరిష్కారం లభించనుంది. పలు సవాళ్లతో కూడిన వీటిని సరైన పంథాలో నడిపించడం ఏలికలకు ఓ పరీక్షవంటిదే. దీటైన ప్రణాళిక, సమర్థ ఆచరణతో ముందుకు సాగితేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

కుటుంబ ప్రాథమిక అవసరాలైనా తీరని స్థితిలో పిల్లల పోషణ, చదువు చెప్పించడం పేదలకు మరింత భారంగా మారాయి. ఫలితంగా పిల్లలు ప్రభుత్వ వసతిగృహాలకు చేరుతున్నారు. అక్కడి వసతులు అంతంతమాత్రమే. పేద కుటుంబాల మహిళలకూ తగినంత ఆహారం అందడం లేదు. పిల్లలతో పాటు వారికి పోషకాహారమిచ్చే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. చాలా చోట్ల వాటి నిర్వహణ దయనీయంగా ఉంటోంది. వాస్తవ అవసరాల ప్రాతిపదికన కాకుండా, తోచిన రీతిలో ఆహార సరఫరా చేస్తున్నారు. పోషకాహార పరంగా ప్రమాణాలు పాటించడం లేదు. బలహీనవర్గాలకు చెందిన పేద విద్యార్థినీ విద్యార్థులకు భోజనం, నివాసం కల్పించేందుకు ఏర్పాటైన సంక్షేమ వసతిగృహాలు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇళ్లనుంచి వచ్చిన వారికి ఏ లోటూ తెలియనివ్వకుండా వసతిగృహాల నిర్వహణ ఉండాలి. కానీ అలాంటి స్థితి కనిపించడం లేదు. శిథిల భవనాల్లోని ఇరుకు గదుల్లో ఏ సౌకర్యాలూ లేని చోట పిల్లలు ఉండాల్సి వస్తోంది. వారికి దుస్తులు, దుప్పట్లు, పుస్తకాల పెట్టెలు ఏవీ సరిగా లేవు. అందుతున్న ఆహారం సరేసరి! వసతిగృహాలకు పంపిణీ అవుతున్న చౌకబియ్యంలో నాణ్యత లేదు. ఉడికీ ఉడకని బియ్యం, కూరలు, నీళ్ల చారుతో భోజనాలు నాసిరకంగా మారాయి. కొన్ని హాస్టళ్లలో అన్నం వాసన రావడం, కూరలు రుచీపచీ లేకపోవడం గమనార్హం. చాలామంది బాలలు అజీర్తి, ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు. భోజనం సరిగా లేదని పలువురు వసతిగృహాల నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కొత్తగా చేరడానికి పలువురు వెనకాడుతున్నారు.

నాణ్యత లోపించి... అశుభ్రత వ్యాపించి...

ఎదిగే వయసులోని పిల్లలకు ప్రతిరోజూ కనీసం 2600 కేలరీల శక్తిని అందించాలని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) చెబుతోంది. కానీ అనేక వసతిగృహాల్లో నాణ్యతా లోపాలు తాండవిస్తున్నాయి. నిర్దేశించిన ప్రమాణాల్లో ఆహారం అందక కొందరు మరీ బలహీనంగా కనిపిస్తున్నారు. మరికొందరు తరచూ వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు. హాస్టళ్ల పరిసరాలు కాలుష్యమయంగా మారుతున్నాయి. శుభ్రత లోపించిన స్థితిలో పిల్లలకు చర్మవ్యాధులు విస్తరిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండేళ్లకిందట నిర్వహించిన ఒక సర్వే ప్రకారం- 10నుంచి 14ఏళ్లలోపు వసతిగృహ విద్యార్థుల్లో 61.4శాతం మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాధుల పాలవుతున్నారని తేలింది. గిరిజన ప్రాంతాలను పోషకాహార లోపం మరింతగా వేధిస్తోంది. పిల్లలతో పాటు మహిళల్లోనూ ఈ సమస్య తీవ్రతరమవడం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. ఏడాది నుంచి అయిదేళ్ల వయసు పిల్లల్లో 64శాతంమంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. మహిళల్లో ఆ శాతం 49గా ఉంది. పోషకాహార విలువలు ఉన్న కూరగాయలు, పాలు, పండ్లువంటివి అనేకులకు అందడం లేదు. వారిలో విటమిన్‌ 'ఎ', ఐరన్‌ కొరత తీవ్రంగా ఉంటున్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని వసతిగృహాల్లో భోజనాలు బాగుంటున్నాయి. అక్కడ అధ్యయనం సాగించిన అధికారుల బృందం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. వాటిని ఆధారం చేసుకొని అయిదేళ్లకిందట 'ఆహార విధానం' ఖరారుచేశారు. ఆ మేరకు పిల్లలకు ఉదయాన్నే రాగి జావ అందించాలి. తరవాత అల్పాహారం ఇవ్వాలి. గ్లాసుడు పాలు అందించాలి. మధ్యాహ్నం అన్నంలోకి ఆకుకూర పప్పు, రసం, గుడ్డు, మజ్జిగ ఉండాలి. సాయంత్రం నాలుగు గంటలకు అల్పాహారం ఇవ్వాలి. రాత్రి అన్నంలోకి కూర, సాంబారుతో పాటు పండు అందివ్వాలి. ఇవేవీ ఇప్పటివరకు అమలు కాలేదు. వసతిగృహాల్లో రాగి జావ జాడే లేదు. ఉదయం అల్పాహారంగా కిచిడీ మాత్రమే ఇస్తున్నారు. పాలు అసలే ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనంలో ఆకుకూర పప్పు కాకుండా ఉప్పూ కారంతో చేసిన పప్పు మాత్రమే వడ్డిస్తున్నారు. అదీ చారులా ఉంటోంది! గుడ్డును రోజూ ఇవ్వడంలేదు. రెండ్రోజులకు ఓసారి మాత్రమే గుడ్డు లేదా పండు ఇస్తున్నారు. రాత్రి భోజనంలో సాంబారుగానీ రసంగానీ అసలే లేదు. కూరతోనే సరిపెడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 'సంక్షేమ వసతి గృహాలపై సమీక్ష సమావేశం' నిర్వహించారు. ఆహార సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. వీటిని పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల ఆహార విధానాలు మార్చాలని అప్పట్లోనే నిర్ణయించారు. పిల్లలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. దీనిపై శాసనసభలోనూ ప్రకటన చేశారు. కార్యాచరణ చేపట్టారు. భాగంగానే దళిత, గిరిజన, వెనకబడిన తరగతులు, వికలాంగులు, అల్పసంఖ్యాకవర్గాలవారికి చెందిన సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలకు మేలిమిరకం బియ్యం సరఫరా మొదలైంది. ఇళ్లలో వాడే సన్నబియ్యం ఇప్పుడు వసతిగృహాల్లో కనిపించడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అన్నంపై వచ్చే ఫిర్యాదులకు అడ్డుకట్ట పడింది. సన్నబియ్యం ద్వారా వసతిగృహాల్లో పిల్లల హాజరు పెరుగుతోంది. అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయేవారి సంఖ్య తగ్గుతోంది. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలు స్త్రీ-శిశు సంక్షేమానికి కీలకమైనవి. అయినా పిల్లలకు, గర్భిణులకు సరైన ఆహారం అందకపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. పోషకాహారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.

అందువల్ల ఆరోగ్యలక్ష్మి పేరిట కొత్త పథకం వచ్చింది. రాష్ట్రంలోని 5,90,414 మంది గర్భిణులు, బాలింతలతో పాటు; 18,20,901 మంది పిల్లలకు రోజూ ఒక పూట పోషక విలువలతో కూడిన సంపూర్ణ భోజనం అందిస్తారు. మొత్తం 31897 అంగన్‌వాడీ కేంద్రాలు, 4076 మినీ కేంద్రాల్లో ఇప్పటికే దీన్ని ప్రారంభించారు. ఏడునెలల నుంచి మూడేళ్లలోపు వయసు పిల్లలకు 16 చొప్పున కోడిగుడ్లు ఇస్తున్నారు. గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ అందిస్తున్నారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డుతో పాటు అన్నం, పప్పు, కూరగాయలు, ఇతర తినుబండారాలు ఇస్తున్నారు. ఈ పథకం కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త కళ వచ్చింది. అక్కడ రద్దీ పెరిగింది. మధ్యాహ్న భోజన పథకానికి చౌకబియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టడంతో, పాఠశాలలకు ఆదరణ పెరిగింది.

లోపాలు పరిహరిస్తే మేలు

రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో ఆరులక్షల మంది పైగా విద్యార్థులున్నారు. ఏటా వీరికి 1.20 లక్షల టన్నుల బియ్యం అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇవిగాక అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని భావిస్తోంది. బియ్యం పరిమాణం తగ్గినందున సరఫరా చేయాల్సిన కోటా పెరిగే అవకాశం ఉంది. బియ్యం అత్యంత విలువైందిగా మారింది. మార్కెట్లో ధర కిలో 30 రూపాయలకు పైగానే ఉంది. గతంలో దొడ్డు బియ్యం ఉన్నా ఫలితం లేకపోయింది. వసతిగృహాల్లో నిల్వలను మిగుల్చుకొని వాటిని వ్యాపారులకు పంపిణీ చేసేవారు. తాజాగా విలువైన సన్నబియ్యం పంపిణీ చేపట్టాక అక్రమాలు తలెత్తే ప్రమాదం ఉంది. బియ్యం సరఫరా, పంపిణీ, నిల్వ, వినియోగంపై ప్రభుత్వం దృఢమైన నిఘా ఏర్పాటు చేయాలి. సామాజిక తనిఖీ విధానాన్ని వసతిగృహాలవారీగా అమలుచేయాలి. వసతిగృహంలో మొత్తం విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం ఉన్నవారు, చదువు మధ్యలో మానేసినవారు, గైరుహాజరు అవుతున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ పోషకాహార వినియోగంపై పటిష్ఠమైన నిఘా ఉండాలి.

ఒక్క బియ్యం సరఫరాతోనే వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల సమస్యలన్నింటికీ పరిష్కారం లభించదు. వాటి నిర్వహణ, కూరగాయల కొనుగోలు, ఇతర అవసరాలకు లోటు రానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటికి సొంతభవనాలు నిర్మించాలి. రక్షిత నీటిని అందించాలి. దుస్తులు, దుప్పట్లు ఇప్పటికీ అందకపోవడంతో పిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు వసతిగృహాల్లో నిద్ర చేయాలన్న ఆలోచన ఇప్పటికీ అమలు కావడం లేదు. అక్కడ మధ్యాహ్న భోజన పథకం అమలును మరింత పటిష్ఠం చేయాలి. విధాన పరమైన లోపాలను ప్రభుత్వం పరిహరించగలగాలి. అప్పుడే సంక్షేమ పథకాలు ప్రగతికి మార్గదర్శకాలుగా మారతాయి!

(రచయిత - ఆకారపు మల్లేశం)
Posted on 09-01-2015