Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

భవితకు బాసటగా ఘన చరిత

* బౌద్ధ క్షేత్రంగా అమరావతికి అంతర్జాతీయ ఖ్యాతి

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి ఉన్నట్లయితే దౌత్యపరంగా భారతదేశం ప్రపంచంలో చైనాతో సహా పలు దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొదించుకోవచ్ఛు అమరావతి ప్రాంతాన్ని సాక్షాత్తు బుద్ధుడే నడయాడిన నేలగా పలు దేశాల్లోని బౌద్ధులు విశ్వసిస్తుంటారు. అమరావతి శిల్ప సంపద ప్రపంచ ఖ్యాతి గాంచింది. అమరావతిని ఎప్పటికీ గుర్తుచేసేలా ఇక్కడి కొన్ని అద్భుత శిల్పాలు లండన్‌తో సహా కొన్ని దేశాల్లో పదిలపరచి ఉన్నాయి. బుద్ధుడు నేపాల్‌లో జన్మించినా- జ్ఞానిగా మారింది, శిష్య గణాన్ని సంపాదించింది, నిర్యాణం చెందింది- భారత్‌లోనే! బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధం ఆచరించే దేశాలతో దౌత్యపరమైన అంశాలకు వినియోగించుకోవడం ఎప్పటినుంచో ఉంది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని కాగానే, తొలి విదేశీ పర్యటనను బౌద్ధ దేశమైన భూటాన్‌తోనే మొదలుపెట్టారు. అమరావతిలో శంకుస్థాపన అనగానే భక్తితో ఆయన విచ్చేశారు. బుద్ధుడు పాదాలను మోపడంతో పునీతమైన నేలపై దిల్లీ నుంచి తెచ్చిన మట్టిని జల్లి తన్మయం చెందారు. అమరావతి రాజధానిగా ఉన్నట్లైతే ఆర్థిక సాయం చేయడానికి వివిధ దేశాలు ముందుకొస్తాయి. రాజధానిని కనుక వేరేచోటుకు మారిస్తే దేశ, రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసుకొన్నట్లే!

బౌద్ధంతో అనుబంధం
జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో బౌద్ధులు 0.8 శాతం (92 లక్షలు) మాత్రమే ఉండొచ్ఛు బుద్ధుడిని హిందువులంతా దైవంగా ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేకమంది ఇళ్లల్లో బుద్ధ ప్రతిమలు కొలువుతీరి ఉంటాయి. తరచూ ఏదో ఒకచోట పురాతన తవ్వకాల్లో బుద్ధుడి ప్రతిమలు, బౌద్ధం ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని రాజధానిగా 2015లో ప్రకటించగానే దేశవిదేశాల్లోని బౌద్ధ ప్రేమికులంతా ఎంతగానో సంతోషించారు. 2,500 ఏళ్ల క్రితం సాక్షాత్తు బుద్ధ భగవానుడే అమరావతి సమీపంలోని ధరణికోటలో ‘కాలచక్ర’ను బోధించినట్లు బౌద్ధులంతా నమ్ముతుంటారు. బుద్ధుడి ధారణలను నిక్షిప్తం చేసినందునే ధారణికోట అనే పేరు వచ్చిందని, కాలక్రమేణా ధరణికోటగా మారిందని చెబుతుంటారు. బుద్ధుడు ‘కాలచక్ర’ క్రతువును నిర్వహించినందువల్లే ఆ ప్రాంతం మౌర్యులకంటే పూర్వమే ఎనలేని విశిష్టతను సంపాదించుకుంది. సమీపంలోని అమరావతిలో మహాస్తూపం నిర్మితమయింది. దీన్ని అశోకుడు నిర్మించినట్లు చెబుతారు. అమరావతి అసలు పేరు ధాన్యకటకం. క్రీ.పూ.మూడో శతాబ్దంలోని శాసనంలో ధనకట అని పేర్కొన్నారు. అదే ధనకటక, ధాన్యకటకగా మారిపోయింది. టిబెట్‌ సాహిత్యం దాన్ని శ్రీధాన్యంగా వర్ణించింది. 18వ శతాబ్దంలో చింతపల్లి జమిందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దాన్ని తన రాజధానిగా చేసుకొని రాజప్రాసాదం నిర్మించారు. దానికి అమరావతి అని పేరు పెట్టారు. ఆంగ్లేయ చరిత్రకారులు అమరావతి పేరును తమ గ్రంథాల్లో రాయడంతో ప్రపంచవ్యాప్తంగా అది ప్రాచుర్యం పొందింది. మెగస్తనీసు ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయని రాశాడు. ఒక్కో ఆంధ్ర తెగ ఒక్కో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, రాజధాని చుట్టూ కోట కట్టుకొని గణతంత్ర వ్యవస్థగా పాలించుకొన్నారు. అటువంటి 30 కోటల్లో అమరావతి ఒకటి అని పండితులు భావించారు. ధాన్యకటకం, తూర్పు కోస్తా కళింగం నుంచి మగధకు మార్గం ఉన్నట్లు కౌటిల్యుడి అర్థశాస్త్రం ద్వారా గ్రహించవచ్ఛు అమరావతిలోని స్థూపానికి అమర్చిన శిల్పాలు అత్యంత నాజుకుతనంతో ప్రపంచంలో ఒక ప్రత్యేకత సంతరించుకొన్నాయి. అమరావతి రాజధానిగా ఉంటే భవిష్యత్తులో అది ప్రముఖ బౌద్ధ ప్రాంతాలైన బుద్ధగయ, సారనాథ్‌, కుశినగర్‌ వంటి ప్రాంతాలకు దీటుగా అలరారే అవకాశాలున్నాయి. విశాఖ సమీపంలోనూ కొన్ని బౌద్ధ కేంద్రాలు ఉన్నప్పటికీ అవి అమరావతి అంతటి ప్రాచుర్యం కలిగినవి కావు. అమరావతి శిల్పకళ శ్రీలంక సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపించగలిగింది.

దలైలామా శుభకామనలు
‘కాలచక్ర’ను 2006, జనవరిలో అమరావతిలో నిర్వహించినప్పుడు టిబెట్‌ తదితర దేశాలవారితో సహా దాదాపు లక్ష మంది హాజరయ్యారు. బుద్ధుడు నడయాడినచోట తాము ఊపిరి పీల్చుకుంటున్నామనే అలౌకిక ఆనందంతో వారంతా పరవశించిపోయారు. ఆధ్యాత్మిక గురువు దలైలామా ‘కాలచక్ర’ను నిర్వహించారు. బుద్ధుడు అక్కడ స్వయంగా ‘కాలచక్ర’ను బోధించినట్లు ఆయనా వెల్లడించారు. ‘కాలచక్ర’కు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. అమరావతిని అంతర్జాతీయ బుద్ధిస్టు బోధన కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరవాత దలైలామా మరోసారి అక్కడికి వచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావడం స్వాగతించదగింది. రాజధాని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వారసత్వ నగరం అనేక ఏళ్లుగా ఎన్నో మార్పులకు లోనవుతూ వచ్చింది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంపద వృద్ధి చెందుతుంది’ అని శుభాకాంక్ష పలికారు.

బౌద్ధాన్ని చైనా తన దౌత్యానికి బాగా వినియోగించుకోగలుగుతోంది. నేపాల్‌లోని బుద్ధుడి జన్మ స్థలమైన లుంబినిని అభివృద్ధిపరచే ప్రాజెక్టు పేరిట ఆ దేశం నేపాల్‌లో ప్రాబల్యం పెంచుకొంది. జనాభా లెక్కల ప్రకారం చైనాలో 18 శాతం బౌద్ధులు ఉన్నారు. బౌద్ధం పరిఢవిల్లిన భారత్‌, తన విదేశీ సంబంధాలకు బుద్ధుడి సాంస్కృతిక వారసత్వాన్ని వినియోగించుకోవడం నెహ్రూ హయాములోనే మొదలైంది. అయినప్పటికీ అది సదస్సులు, విదేశీ బౌద్ధ ప్రతినిధుల ఆహ్వానాలకే పరిమితమవుతూ వచ్చింది. 1952లో నాటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో నిర్వహించిన ప్రపంచ బౌద్ధుల సదస్సుకు వివిధ దేశాల నుంచి మూడు వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు. చైనాతో పోల్చుకొంటే మన దౌత్య ప్రయత్నాలు తక్కువే. ప్రపంచ జనాభాలో ఇప్పుడు 7.1 శాతం (48.75 కోట్లమంది) బౌద్ధులు ఉన్నారు. కాంబోడియా, జపాన్‌, దక్షిణ కొరియా, లావోస్‌, మలేసియా, మంగోలియా, మియన్మార్‌, చైనా, నేపాల్‌, సింగపూర్‌, శ్రీలంక, తైవాన్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం, భూటాన్‌ వంటి దేశాల్లో బౌద్ధులే అధికంగా ఉంటారు. ఆయా దేశాల్లోని ప్రజలు బుద్ధుడు నడయాడిన ప్రాంతాలను తలచుకుని భక్తి పారవశ్యంతో పులకిస్తుంటారు. భారతదేశం పట్ల ప్రత్యేక ఆరాధన భావం వారికి ఉంటుంది. ఈ దేశాల అండదండలను భారత్‌ సులువుగా సంపాదించుకోవచ్ఛు అందుకు కావల్సింది కొంత ప్రయత్నం. పొరుగుదేశం నేపాల్‌తో భారత్‌ సరైన దౌత్యనీతిని నిర్వర్తించలేకపోతోంది. కనుకనే భారత సరిహద్దుకు కూతవేటు దూరంలోగల నేపాల్‌ ప్రాంతంలో చైనా తిష్ఠ వేయగలిగింది. బౌద్ధులు 80 శాతం మేర ఉన్న మియన్మార్‌లోనూ చైనా సాంస్కృతిక చర్యల ద్వారా దూసుకెళ్తోంది. బుద్ధుడి దంతాన్ని సంచార ప్రదర్శన ద్వారా ఆ దేశ ప్రజలకు చూపి, వారి అభిమానం చూరగొంటోంది. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారత్‌ ఆశ్రయం ఇవ్వడం వల్ల కూడా భారత్‌ అంటే చైనా మినహా మిగతా బౌద్ధ దేశాలకు అభిమానం ఉంది. మోదీ ప్రధాని అయ్యాక భూటాన్‌ సహా నేపాల్‌, చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాలకు వెళ్ళి బోధివృక్షం నమూనాలను బహుమతులుగా అందజేశారు. జపాన్‌లోని ప్రముఖ స్తూపాలను సందర్శించారు. చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్‌ వచ్చినప్పుడు చైనా, భారత్‌ మధ్య బౌద్ధ సంబంధాలను తెలియజేసే శిల్పాలతో ఒక ప్రదర్శన నిర్వహించారు. చైనా ఇప్పుడు పక్కలో బల్లెంలా, పాకిస్థాన్‌ను దువ్వే దేశంగా ఉన్న నేపథ్యంలో భారత్‌ బౌద్ధ దౌత్య మంత్రాంగాన్ని ఉద్ధృతం చేసుకోవాలి. దేశంలోని బౌద్ధ ప్రాంతాలను అభివృద్ధిపరచి, వాటికి ఆయా దేశాల ప్రతినిధులను తరచూ ఆహ్వానిస్తుండాలి. అలనాటి నలంద విశ్వవిద్యాలయాన్ని బౌద్ధ దేశాల సాయంతో పునరుద్ధరించుకొన్నట్లే, మరిన్ని ప్రాంతాల అభివృద్ధిలోనూ వాటి సాయం తీసుకోవాలి. బుద్ధుడు అందించిన వారసత్వ సంపదను ఇప్పుడు వినియోగించుకోవాలి.

దౌత్యపరంగానూ మేలే
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి ఉన్నట్లైతే భారత్‌ విదేశాలతో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం మరింత సులువవుతుంది. దేశంలో బౌద్ధ కేంద్రాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో సాక్షాత్తు బుద్ధుడు నడయాడినవాటిగా చెప్పేవి చాలావరకు బిహార్‌కే పరిమితమయ్యాయి. అమరావతిలోనూ బుద్ధుడు నడయాడినట్లుగా, ఆపై అశోకుడు అక్కడ స్తూప నిర్మాణం చేపట్టినట్లుగా బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కనుక భారత్‌ బౌద్ధ దౌత్యంలో అమరావతి ప్రాశస్త్యం కీలకం అవుతుంది. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే నిధుల్లో కొంతమేర ఆయా దేశాలనుంచీ పొందవచ్ఛు అమరావతికి విశిష్టత ఉండబట్టే రాజధాని నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపివ్వగానే ప్రజలు దాదాపు 58 లక్షల ఇటుకలను ఇచ్చారు. రాష్ట్రానికి సరిగ్గా మధ్యలో అమరావతి ఉంది కాబట్టి రాజధానిగా కొనసాగించడం ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అమరావతి బ్రహ్మాండమైన చారిత్రక సంపదను కలిగిఉంది. కాబట్టి దాన్ని చూపించి బౌద్ధ దేశాలతో దృఢమైన బంధాలను ఏర్పరచుకోవడం భారత్‌కు అవసరం. మామూలు అమరావతిని చూపిస్తే అప్పుడప్పుడు ఏ బౌద్ధ సన్యాసుల బృందమో వచ్చిపోవడం మినహా ప్రయోజనం ఉండదు. ఒక రాష్ట్రానికి రాజధానిగా పేర్కొంటూ ఆహ్వానించినప్పుడు ఆయా దేశాధినేతలు సైతం ఇక్కడికి రాగలుగుతారు. ఇక్కడి మౌలిక వసతులను చూశాక కేవలం బౌద్ధ విహారాలకు విరాళాలతో సరిపెట్టకుండా పెట్టుబడులకూ ఆసక్తి చూపించవచ్ఛు అన్నింటినీమించి, భారత్‌ ఏదైనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు తామంతా ఉన్నామనే భరోసా, మనో ధైర్యం ఆయా దేశాల నుంచి లభిస్తాయి. అమరావతిని కాదని రాజధానిని తరలిస్తే భారత ప్రయోజనాలను, అందివస్తున్న అవకాశాలను కాలరాసుకొన్నట్లవుతుంది. ఇదేమీ మత కోణం కానేకాదు. చైనాతో సహా కొన్ని దేశాలు అనుసరిస్తున్న దౌత్య నీతి. పాలకులు అనేవారు అన్ని కోణాల్లో యోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొనే నిర్ణయాలు భావితరాలకు చుక్కానిగా నిలవాలేతప్ప- దారితెన్నూలేని ముళ్లబాటలుగా ఉండరాదు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే భవిష్యత్‌ తరాలకు ఓ మంచిమార్గం ఏర్పరచినట్లవుతుంది. అటువంటి సన్మార్గానికి బౌద్ధం దారిదీపంగానూ నిలుస్తుంది.

- పిళ్లా సాయికుమార్‌
Posted on 18-01-2020